మొక్కజొన్న - జాగ్రత్తలే దిగుబడి రహస్యం ఎకరానికి 8-10 కిలోల విత్తనం వాడాలి. సరైన విత్తన మోతాదు, నేల స్వభావం, ఎన్నుకునే రకం, రుతువును బట్టి మొక్కల సాంద్రత ఆధారపడి ఉంటుంది. ఎకరానికి 26,666 నుంచి 33,333 మొక్కల సాంద్రత ఉంటే ఆశించిన దిగుబడులు వస్తాయి. దుక్కి చేసిన నేలలో 60 * 20 సెం.మీ. ఎడం ఉండునట్లు బోదెలు చేసుకోవాలి. విత్తనాన్ని బోదెకు ఒక వైపున పై నుంచి మూడోవంతు ఎత్తులో విత్తితే నీటి పారుదలకు సులభంగా ఉండడమే కాక, నీరు ఎక్కువైనప్పుడు బయటకు పోవడానికి వీలుంటుంది. విత్తిన పది రోజుల తరువాత కుదురుకు ఒక మొక్కను మాత్రమే ఉంచి మిగతా మొక్కలను తీసివేయాలి. ఎరువుల యాజమాన్యం భూసార పరీక్షను అనుసరించి నిర్దేశించిన, మోతాదులో ఎరువులు వేసుకోవడం వల్ల రైతులు ఎరువుల పై పెట్టే అనవసర ఖర్చు తగ్గించు కోవచ్చు. ఎకరానికి 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ను ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజని ఎరువును నాలుగో వంతు విత్తేటప్పుడు, నాలుగో వంతు 45-50 రోజుల మధ్య, మిగిలిన నాలుగో వంతు 60-65 రోజుల మధ్య వేయాలి. మొత్తం భాస్వరం ఎరువును విత్తే సమయంలో వేయాలి. పొటాష్ ఎరువును సగం విత్తే సమయంలో, మిగతా సగం పూత సమయంలో వేసుకోవాలి. ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ పంటల కొకసారి దుక్కిలో వేయాలి. కలుపు నివారణ విత్తిన తరువాత అట్రాజిన్ కలుపు మందును తేలిక నేలలో ఎకరానికి 800గ్రా లేక బరువు నేలల్లో 1200 గ్రా 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 2-3 రోజులలోపు నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వల్ల వెడల్పాటి ఆకులుగల కలుపు మొక్కలను దాదాపు ఒక నెల వరకు మొలవకుండా అదుపు చేయవచ్చు. ఒక వేళ పప్పుజాతి పంటలను మొక్క జొన్నతో అంతరపంటలుగా విత్తుకున్నప్పుడు రెండింటికి సరిపడే పెండిమిథాలిన్ కలుపు మందును ఎకరానికి 1 లీ. 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అధిక వర్షాల వల్ల కలుపు తీయడం సాధ్య పడనప్పుడు వివిధ రకాల కలుపు మొక్కల నివారణకు పంట 15-18 రోజుల ( కలుపు 2-4 ఆకుల దశలో) మధ్య టెంబోట్రయోన్ 115 మి.లీ. లేక తుంగ ఇతర కలుపు నివారణకు పంట 15-20 (కలుపు 2-4 ఆకుల దశలో) రోజుల మధ్య హాలోసల్ఫ్యూరాన్ ఇథైల్ 36 గ్రా. లేక టోఫ్రామిజోన్ 36 మి.లీ. ఎకరాకు 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 30 నుంచి 35 రోజులకు కల్టివేటర్ తో అంతర కృషి చేసి కలుపు మొక్కలను పూర్తిగా నివారించ వచ్చు. నీటి యాజమాన్యం మొక్కజొన్నకు ఖరీఫ్ లో హెక్టారుకు 350-500 మి.మీ. నీరు అవసరం ఉంటుంది. మొక్కజొన్న లేత దశలో నీటి ముంపును, పూత దశలో నీటి ఎద్దడిని తట్టుకో లేక పోవడం వల్ల విపరీతంగా నష్టానికి గురవుతుంది. పంట విత్తిన వెంటనే నీటి ముంపునకు గురైతే అంకురోత్పత్తి శాతం తగ్గుతుంది. పైరు లేత దశలో (విత్తిన తరువాత 30 రోజులవరకు) నేలలో నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి ముంపు ఉండే భూముల్లో మొక్కజొన్న లేత పసుపు పచ్చగా మారి, పెరుగుదల తగ్గి పంటఅంతా ఒకే ఎత్తులో ఉండక దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. అందువల్ల నేలలో మురుగు నీరు పోయే వసతి ఉండాలి లేదా బోదె సాళ్ళ పద్ధతిలో సాగు చేయాలి. మొక్కజొన్న పంటలో ముఖ్యంగా పూత, గింజ పాలుపోసుకునే దశలలో వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు నీటి సదుపాయం ఉంటే 1 లేక 2 తడులు ఇవ్వడం ద్వారా దిగుబడిని పెంచుకోవచ్చు. వర్షాభావ పరిస్థితులను తట్టుకోవడానికి పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు విత్తనం వేసేటప్పుడు ప్రతి 3-4 పంట సాళ్ళకు నాగలితో లోతుగా గొడ్డు సాళ్ళను వేయడం వల్ల వర్షపు నీరు ఇంకి 5 నుంచి 12 శాతం వరకు దిగుబడి పెరిగే వీలుంది. 40 రోజులలోపు పంటలో అదనపు అంతరకృషి చేయడం వల్ల భూమిలోని తేమను త్వరగా ఆవిరి కాకుండా అదుపు చేయవచ్చు. నీటి ఎద్దడి ఉంటే యూరియా 2% ద్రావణాన్ని (20 గ్రా లీటరు నీటికి) పంటపై పిచికారీ చేస్తే బెట్ట పరిస్థి తులను కొంత వరకు తట్టుకుంటుంది. వర్షాభావ పరిస్థితుల అనంతరం వచ్చిన వర్షాలకు ఎకరాకు 25 కిలోల యురియాను అదనంగా వేసుకుని 20% దిగుబడిని పెంచవచ్చు. మొక్కజొన్న పై కత్తెర పురుగు ఈ పురుగు ఆకులు, కాండం భాగాలను తినడం వల్ల అపార నష్టం కలుగుతుంది పురుగు ఉదృతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ సమర్థవంతమైన, సిఫారసు చేసిన రసాయనిక మందులతో నివారణ చర్యలు చేపట్టటం అత్యవసరం. 31-50 రోజులలోపు మొక్కజొన్న పైరులో పురుగు ఎక్కువగా ఉండి నష్టం కలుగ జేస్తుంది. ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లీటరు నీటికి లేదా స్పైనోసాడ్ 45 ఎస్.సి. 0.3 మి.లీ. లీటరు నీటికి లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3మి.లీ. లేదా సైనిటోరం 11.7 ఎస్.సి. 0.5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి ఆకుల సుడులు బాగా తడిచేటట్టు పిచికారీ చేయాలి. పురుగు తీవ్రతను ప్రతి 10-12 రోజులకు గమనిస్తూ పైన తెలిపిన మందులను మార్చిమార్చి పిచికారీ చేయాలి. పొడతెగులు ఆశిస్తే నేలకు దగ్గరగా ఉన్న తెగులు సోకిన ఆకులను తీసివేయాలి. కలుపు లేకుండా శుభ్రమైన పంటసాగు అవలంబించాలి. నివారణకు ప్రోపికొనజోల్ 1 మి.లీ. లేదా కార్బండిజమ్ 1 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమాడు /ఆకుఎండు తెగుళ్ల నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రా. లీ కలిపి పిచికారీ చేయాలి. ఆధారం: పాడి పంటలు మాస పత్రిక డా. ఐ. సుధీర్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త (సస్యప్రజననం), వ్యవసాయ పరిశోధనా స్థానం, పెద్దాపురం, కాకినాడ.