వంగ సాగులో పురుగుల యాజమాన్యం కూరగాయల రాజుగా పిలిచే వంగ శాఖాహార, మాంసాహార రెండు వంటకాలలో కూడా ఎక్కువగా వాడతారు. బి6, ఐరన్, డైటరీ ఫైబర్, ఆస్కార్బిక్ యాసిడ్, విటమిన్ -కె, ఫోలేట్, నియాసిన్, విటమిన్ పాంటోథినిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, కాపర్ వంటి పోషకాలు వంగలో పుష్కలంగా ఉంటాయి. ఖరీఫ్, రబీ, వేసవిలలో ఏ సీజన్లో లో అయినా సాగు చేయవచ్చు. కాయ తొలుచు పురుగు అక్టోబర్, నవంబర్ లో ఎక్కువగా చూడవచ్చు. చిన్న లార్వా లేత కొమ్మల లోపలికి ప్రవేశించి లోపలి భాగాలని తినేస్తుంది. కాయలు రాగానే కాయకు కూడా రంధ్రం చేసి లోపలికి వెళ్ళి కాయలో ఆహారాన్ని తినేస్తుంది. గుండ్రని రకాలలో వీటి ఎద్దడి ఎక్కువ. లింగాకర్షక బుట్టలు వాడి ఎరను 20 రోజులకు ఒకసారి తప్పని సరిగా మార్చి మగ తల్లి పురుగుల సంఖ్య తగ్గించటం వలన ఆడ తల్లి పురుగు గుడ్లు తక్కువ పెడతాయి. జొన్న, మొక్కజొన్న, అపరాలు వంటి ఇతర పంటలతో 1– 2 సంవత్సరాలు పంట మార్పిడి చేసుకోవాలి. కొమ్మ లేదా కాయ నష్టం 5 % కంటే మించితే అంతర్వాహిగా పనిచేసే రసాయన మండులనే వాడాలి. వంగ పంటను చాలా రకాల పురుగులు, తెగుళ్లు, నులి పురుగులు ఆశించి దిగుబడిని గణనీయంగా తగ్గిస్తున్నాయి. వంగ రైతులకు కొమ్మ, కాయ తొలుచు పురుగు ప్రధాన ఆటంకంగా మారింది. సుమారు 6-10 సార్లు పురుగు మందు పిచికారీ చేసినా పురుగు వలన జరిగే నష్టం తగ్గట్లేదు. కొమ్మ, కాయ తొలుచు పురుగు నష్ట లక్షణాలు కొమ్మ, కాయ తొలుచు పురుగు గుడ్డు, లార్వా, ప్యూపా, తల్లి పురుగులతో కూడిన తన జీవిత చక్రాన్ని 27-32 రోజుల్లో పూర్తి చేస్తుంది. ఈ పురుగు 5-6 తరాలను పూర్తి చేసుకొని, ప్రధానంగా వంగ పంటను ఆశిస్తుంది. పురుగు దశలో లార్వా మాత్రమే హాని చేస్తుంది. ఇది మొక్కలో కొమ్మలు, పువ్వులు, పువ్వు మొగ్గలు, కాయలను ఆశించి నష్ట పరుస్తుంది. రైతులు ఖరీఫ్ లో పంట వేస్తే ఎక్కువ ఈ పురుగు కొమ్మ వద్ద ఆగస్ట్ సెప్టెంబర్ లో, కాయ వద్ద అక్టోబర్ నవంబర్లో గమనించ వచ్చు. నష్ట లక్షణాలు తల్లి పురుగు సుమారు 250 తెల్లని రంగులో ఉండే గుడ్లను, ఆకుల వెనుక భాగాన, పచ్చని కాండం పైన, పూమొగ్గల పైన లేదా కాయ కాడ దగ్గర పెడుతుంది. ఈ గుడ్లు 3-5 రోజుల్లో పొదిగి దాని నుండి వచ్చిన లార్వా పింక్ రంగులో ఉంటాయి. ఈ చిన్న లార్వా లేత కొమ్మల లోపలికి ప్రవేశించి, కొమ్మలో లోపలి భాగాలని తినేస్తుంది. దీనివలన కొమ్మ పై భాగాలకి నీరు, పోషకాలు అందక అవి వాడిపోయి తర్వాత చనిపోతాయి. ఇలా కొమ్మ వాడి ఉండడం ఈ పురుగు వలన కనిపించే మొట్టమొదటి లక్షణం. వాడిన కొమ్మల మొదళ్ళలో లార్వా చేసిన చిన్న రంధ్రాన్ని చూడవచ్చు. తర్వాత దశలో లార్వా పువ్వులు, పూమొగ్గలు, కాండాలను కూడా ఆశించి వాటిని ఆహారంగా తినేస్తుంది. కాయలు రాగానే కాయకు కూడా రంధ్రం చేసి లోపలికి కాయలో ఆహారాన్ని తినేస్తుంది, ఒక్కోసారి చేసిన రంధ్రాలను ఎండిన మలంతో మూసివేస్తుంది. పురుగు ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు కొమ్మలు వాడిపోయి, మొక్కలు బలహీనపడి దిగుబడి నష్టానికి దారి తీస్తుంది. పురుగు ఆశించిన పువ్వు మొగ్గలు కూడా వాడి రాలిపోతాయి. లార్వా తొలిచిన కాయలు మార్కెట్ లో అమ్మడానికి పనికి రాకపోవచ్చు. యాజమాన్యం పురుగు ఎద్దడిని తట్టుకునే పూస పర్పుల్ లాంగ్, పూస పర్పుల్ క్లస్టర్, అర్క కేశవ్, అర్క కుసుమకర్ రకాలను వాడాలి. పొడవుగా, సన్నగా ఉండే రకాలలో గుండ్రని రకాల కంటే తక్కువ ఎద్దడి ఉంటుంది. పురుగు ఎద్దడి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో జొన్న, మొక్కజొన్న, అపరాలు వంటి ఇతర పంటలను 1-2 సంవత్సరాలు వేస్తే మంచిది. వంగలో బంతి, కొత్తిమీర లేదా ఉల్లి ను అంతర పంటగా వేసినా కొంతవరకు పురుగు హాని తగ్గుతుంది. పంట తొలి దశలో 15-20 రోజులకు ఎకరానికి 10-12 లింగాకర్షక బుట్టలు వాడి మగ తల్లి పురుగుల సంఖ్యను తగ్గించవచ్చు. ఎరను 20 రోజులకు ఒకసారి తప్పని సరిగామార్చాలి. ట్రైకోగ్రామా ఖిలోనిస్ పరాన్నజీవి (ట్రైకోకార్డ్) ని వారానికి 20,000 చొప్పున 3-4 సార్లు వాడాలి. 25-30 రోజుల సమయంలో గుడ్లను, చిన్న లార్వాలను చంపే వేప నూనె ( 3000 లేదా 5000 పి.పి.ఎం) 5 మి.లీ ను ఒక లీటరుకు చొప్పున పిచికారీ చేయాలి. పురుగు ఆశించి కొమ్మలు వాడినట్లు అయితే ఒక అంగుళం క్రిందికి ఆ కొమ్మను తుంచి నాశనం చేయాలి. దూరంగా పడేయాలి. లార్వా ఆశించిన కాయలను కూడా చిన్న కాయల దశలోనే ఏరి దూరంగా పడేయాలి. నష్టం 5% కంటే మించితే సిఫారసు చేసిన రసాయన పురుగు మందులను మాత్రమే వాడాలి. ప్రొఫినోఫాస్ 50 ఇ.సి 2 మి.లీ (ఎకరాకు 400 మి.లీ) లేదా థయోడికార్బ్ 75 డబ్ల్యు.పి. 2.0 గ్రా. (ఎకరాకు 400 గ్రా.) లేదా క్లోరాంట్రానిలిప్రోల్18.5% ఎస్.సి 0.3 మి.లీ (ఎకరాకు 60 మి. లీ) లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 5 % ఎస్.జి 0.4 గ్రా. (ఎకరాకు 80 గ్రా) చొప్పున పిచికారీ చేయాలి. వాడిన మందును ఎక్కువ సార్లు వాడకుండా వేరే మందులతో మార్చి వాడితే మంచిది. లార్వా మొక్క లోపలి భాగాలలో నివాసం ఉండి తినే స్వభావం కలది కాబట్టి పురుగు మందు దాని శరీరంలోకి వెళ్ళడానికి చాలా ఆటంకాలు ఉన్నాయి. అందువలన రైతులు ఈ విషయం గుర్తుపెట్టుకొని విచక్షణా రహితంగా మందుల పిచికారీ చేయడం ఆపాలి. అదేవిధంగా ముందునుండే పైన తెలిపిన సమగ్ర సస్య రక్షణ పద్దతులను పాటించి, పంటను, పర్యావరణాన్ని కాపాడు కోవాలి. ఆధారం : పాడిపంటలు ,డా.బి.కె.కిశోర్ రెడ్డి, శాస్త్రవేత్త ( ఉద్యాన విభాగం ) కృషి విజ్ఞాన కేంద్రం, రెడ్డిపల్లి, అనంతపురం.