వరిలో పురుగుల నివారణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పంటల్లో ప్రధాన మైనది వరి పంట. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో వరి నాట్లు నుండి పిలకలదశకు చేరుకుంది. ఈ దశలో అనేక రకాల చీడపీడలు పంటను ఆశించి అధిక నష్టాన్ని కలుగచేస్తాయి. తగిన సమయానుకూల సమర్థయాజమాన్య పద్ధతులు పాటించడం వలన నష్టాన్ని అధిగమించవచ్చు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. వరిని ఆశించు పురుగులు కాండము తొలుచు పురుగు రెక్కల పురుగు పసుపు రంగులో ఉండి పై రెక్కల మధ్యలో నల్లటి మచ్చ కలిగి ఉంటుంది. గొంగళి పురుగు నారుమడిలోను, నాటిన తరువాత పిలక దశలోనూ కాండములోనికి చేరి కణజాలాన్ని తినివేయుట వలన మొవ్వుఆకుకు పోషకాలు అందక ఎండి పోతుంది. దీనినే మొవ్వు చనిపోవుట అంటారు. చిరుపొట్ట దశ తరువాత ఈ పురుగు ఆశిస్తే వెన్నులోని గింజలు తాలుగా మారతాయి. దీనిని తెల్ల కంకి అంటారు. నారుమడిలో చదరపు మీటరుకు ఒక తల్లిపురుగు లేదా ఒక గుడ్ల సముదాయము కనబడినా, పిలకదశలో 5% మొవ్వులు చనిపోయిన, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. యాజమాన్యము : వేసవి లోతు దుక్కులు చేసుకోవాలి. నారు కొనలను త్రుంచి నాట్లు వేసుకోవాలి. లింగాకర్షక బుట్టలు ఎకరానికి 8 చొప్పున అమర్చుకుని పురుగు ఉనికి మరియు ఉధృతిని గమనించుకోవాలి. ట్రైకోగ్రామా పరాన్నజీవులు ఎకరాకు 20000 చొప్పున నాటిన 30-45 రోజులలో మూడు ధఫాలుగా పొలంలో వదలాలి. పిలక దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2.0 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. చిరు పొట్ట దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4 జి గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ గుళికలు 4 కిలోలు లేదా కార్బోఫ్యురాన్ 3జి గుళికలు 10 కిలోలు ఎకరానికి వాడాలి. ఆకుముడత పురుగు తల్లి రెక్కల పురుగు పసుపు రంగులో ఉండి రెక్కలపై అలల వంటి ఊదారంగుచారలను కలిగి ఉంటుంది. గొంగళి పురుగు లేత అకుపచ్చరంగులో ఉండి ఆకుల రెండు అంచులను నిలువుగా మడిచి లోపలి నుండి పత్రహరితాన్ని గోకి తినుట వలన ఆకులు తెల్లబడ తాయి. పోటాకు దశలో ఈ పురుగు ఆశిస్తే నష్టము ఎక్కువగా ఉంటుంది. దుబ్బుకు ఒక లార్వా లేదా రెండు పురుగు సోకిన ఆకులు ఉంటే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. యాజమాన్యం : ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2.0 గ్రా. లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సుడిదోమ గోధుమ రంగు మరియు తెల్ల వీపు దోమల పిల్ల మరియు పెద్ద పురుగులు వరి దుబ్బుల మొదళ్ళ వద్ద చేరి రసాన్ని పీల్చడం వలన తొలుత మొక్కలు పసుపు రంగులోనికి మారి క్రమేణా సుడులు సుడులుగా ఎండిపోతాయి. దీనిని హాపర్ బర్న్ అని అంటారు. యాజమాన్య పద్ధతులలోని లోపాల వలన దోమ ఉధృతి పెరుగుతుంది, ఉధృతి ఎక్కువుగా వున్నప్పుడు పొలంలో దోమ నీటి పై తెట్టలాగా కనబడుతుంది, తాలు గింజలు ఏర్పడతాయి లేదా పంట నూర్చినప్పుడు గింజలు నూక అవుతాయి. ఉధృతికి ముఖ్య కారణాలు అధిక నత్రజని ఎరువుల వాడకం నేరుగా విత్తే పద్ధతిలో ఎక్కువ విత్తన మోతాదు వాడుట వలన మొక్కలు దగ్గరగా ఉండుట, సక్రమ నీటి యాజమాన్యమును పాటించకపోవడం (పొలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండుట), దోమను తట్టుకోలేని రకాలను సాగుచేయడం, పగటి మరియు రాత్రి ఉష్ణోగ్రతలలో తేడా తక్కువగా ఉండుట. పైరు తొలి దశలో పురుగు మందులను ఎక్కువగా వాడుట వలన మిత్రకీటకాల సంఖ్య బాగా తగ్గిపోవడం. దోమ ఉధృతిని పెంచే పురుగు మందులైన ప్రొఫెనోఫాస్, క్వినాల్ ఫాస్, ట్రైజోఫాస్, సింథటిక్ పైరిత్రాయిడ్స్, వంటివి వాడటం. యాజమాన్యం : పిలకల దశలో దుబ్బుకు 10-15 దోమలు, ఈనిక దశలో 20-25 దోమలు ఉన్నట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దోమను తట్టుకునే వంగడాలను సాగు చేసుకోవాలి. నత్రజని ఎరువులను సిఫారసు మేరకు వాడాలి. పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి. ప్రతీ రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలిబాటలను వదలాలి. దోమలు పిల్ల దశలో ఉన్నట్లయితే బుప్రోఫెజిన్ - 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిల్ల, పెద్ద పురుగులు దుబ్బుకు 25 కి పైగా ఉన్నప్పుడు పైమెట్రోజెన్ 0.6 గ్రా./లీ. లేదా డైనోటెఫ్యూరాన్ 0.4గ్రా./లీ. నీటికి కలిపి దుబ్బులు బాగా తడిచేటట్టు పిచికారీ చేసుకోవాలి లేదా ట్రైఫుమిజో పైరిమ్ 10 ఎస్.సి. 84 మి.లీ ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. కంకినల్లి ఇవి సూక్ష్మ సాలీడు వర్గానికి చెందిన కంటికి కనిపించని జీవులు. ఇవి ఆశించిన ఆకులపై పసుపు రంగులో చారలు ఏర్పడి ఆకు తొడిమల పైన మరియు ఈనెల పైన నల్లటి మచ్చలు ఏర్పడతాయి. గింజలపైన నల్లటి మచ్చలు ఏర్పడతాయి.యాజమాన్యం : ప్రొఫెనోఫాస్ 2.0 మి.లీ. లేదా స్పైరోమెసిఫెన్ 1.0 మి.లీ లీటరు నీటికి చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. దోమ ఉధృతి గమనించినప్పుడు ప్రొఫెనోఫాస్ మందును పిచికారీ చేయకూడదు. ఆధారం: పాడి పంటలు మాస పత్రిక డా.డి. సుధారాణి సీనియర్ శాస్త్రవేత్త (సేద్య విభాగం) కె.వి.కె, ఘంటసాల, కృష్ణా