వ్యవసాయ పనులు - వరి బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఆగస్టులో పోసిన నారుమడులు సెప్టెంబర్ లో ఊడ్పుకు వస్తాయి. ముందుగా జూన్-జులైలో వేసిన పొలాలు చిరుపొట్ట దశలో ఉంటాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో జులైలో వర్షాభావ పరిస్థితుల వల్ల ముదరు నారు ఉడ్చటం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కింది సూచనలు పాటించుకోవాలి. సాధ్యమయినంత వరకు లేత వయస్సు ఉన్న నారును (25– 35 రోజులు) నాటుకోవాలి. ముదురు నారు (40-55 రోజులు) నాటుకోవాల్సివచ్చి నపుడు నాట్లు దగ్గర దగ్గరగా, ఒత్తుగా వేసుకోవాలి. సిఫారసు చేసిన ఎరువులను రెండు దఫాలలో చిరు పొట్ట దశలోపు పూర్తి చేసుకోవాలి. వరి రైతులు సిఫారసు చేసిన మేరకే (పిలకల దశలో ఒక అంగుళం, చిరుపొట్ట దశలో రెండు అంగుళాలు) నీటిని వినియోగించుకుని మెరుగైన దిగుబడులు పొందాలని సూచన. విత్తిన లేదా నాటిన 15-20 రోజులకు ఎకరానికి బిస్ పైరిబాక్ సోడియం 10% ఎస్.ఎల్ 100 మి.లీ. లేదా టిరియాఫామెన్ + ఇథాక్సీసల్ఫ్యూరాన్ 30% డబ్ల్యు.జి 90 గ్రా. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే గడ్డి. వెడల్పాకు కలుపు మొక్కలను సమర్ధవంతంగా నివారించవచ్చు. సిఫారసు మేరకు మాత్రమే ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. అధిక నత్రజని ఎరువులు వేసిన ఎడల పురుగులు, తెగుళ్ళ ఉధృతి పెరగడానికి అవకాశం ఉన్నది. నాటిన తరువాత పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేయరాదు. చిరుపొట్ట దశలో ఉన్న వరి కి తప్పని సరిగా సిఫారసుచేసిన నత్రజనితో పాటు సిఫారసు మేరకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని తప్పక వాడాలి. తక్కువ నత్రజనితో పండించే ఎం.టి.యు 1318, స్వర్ణ రకాలు ఎకరానికి 24:24:24 కిలోల నత్రజని, భాస్వరం పొటాష్‌ను ఇచ్చే ఎరువులను మాత్రమే వేసుకోవాలి. జీవన ఎరువులైన అజటోబ్యాక్టర్, పాస్పోబ్యాక్టీరియా, పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియా ఎకరానికి 500మి.లీ. వాడితే 20% రసాయనిక ఎరువుల వాడకం తగ్గించవచ్చు. అధిక ఎరువులు, ఎక్కువ నీరు పెట్టడం వలన పంట కోత సమయంలో తుఫాను సమయంలో చేలు పడిపోయే అవకాశం ఉన్నందున రైతులు ఎరువులు సమతుల్యంగా వేసుకోవాలి, నీరు అవసరానికి మించి వాడరాదు. ఈ మాసంలో సామూహిక ఎలుకల యాజమాన్యం చేపట్టడం వలన ఎలుకల నుంచి వరి పంటను కాపాడుకొనవచ్చు. ఎలుకల నివారణకు ఎలుక కన్నాలలో పొగబారించుకోవాలి. ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలు పెట్టుకోవాలి. బ్రోమోడయోలిన్ ఎలుకల మందు 10-15 గ్రా. ఒక కన్నానికి చొప్పున (96 పాళ్ళు నూకలు, 2 పాళ్ళు నూనె, 2 పాళ్ళు మందు) పొట్లాలుగా కట్టి కన్నానికి ఒకటి చొప్పున వేసుకోవాలి. ఈ మందును రైతులు సామూహికంగా 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పైరు చిరుపొట్ట దశకు వచ్చే లోపే ఎలుక కన్నాలలో పెట్టుకోవడం వల్ల ఎలుకలను సమర్ధవంతంగా అరికట్టవచ్చు. సార్వాలో ముందుగా ఊడ్చిన పొలాలలో కాండం తొలుచు పురుగు, ఆకుముడత ఆశించే అవకాశం ఉన్నది. నివారణకు లీటరు నీటికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2గ్రా. లేదా క్లోరాంత్రనిలి ప్రోల్ 0.3 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. చిరు పొట్ట దశలో ఎకరానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8 కి. లేదా కార్బోఫ్యురాన్ 3జి గుళికలు 10 కిలోలు లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 0.4 జి. గుళికలు 4 కిలోలు వేసుకో వాలి. దోమ ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో సింథటిక్ పైరిత్రాయిడ్ మందులను పిచికారీ చేయరాదు. డా.ఎం.గిరిజారాణి ప్రధాన శాస్త్రవేత్త (వరి) ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మార్టేరు, పశ్చిమ గోదావరి. ఆధారం: పాడి పంటలు మాస పత్రిక