సెప్టెంబర్ మాసంలో వరిలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు జూన్ - జులై మాసాల్లో విత్తిన పొలాలు ప్రస్తుతం చిరుపొట్ట దశలో ఉంటాయి. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయల సీమ జిల్లాల్లో ఆలస్యంగా ఆగస్టులో పోసిన నారుమడులు సెప్టెంబర్లో ఊడ్పుకు సిద్ధమవుతాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఉత్తర కోస్తా, కృష్ణా మండలంలో ముదురు నారు ఊడ్చటం జరిగింది. అలాగే వెద పద్ధతిలో విత్తిన వరి బెట్టకు గురవుతోంది. ఈ నేపథ్యంలో కింద సూచనలు పాటించాలి. వర్షాభావ పరిస్థితులలో నీరు నిలబడని మెరక ప్రాంతాల్లో బోర్ల కింద వరి సాగుకు ప్రత్యామ్నాయంగా అపరాలు, చిరు ధాన్య పంటలు వేసుకోవాలి. నేరుగా దుక్కి దున్ని వెద పెట్టిన పొలాల్లో (ఉత్తర కోస్తా, కృష్ణా మండలం) వర్షాభావ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటిని పారించి వ్యర్థం చేయకుండా జీవ తడులకు వాడుకోవాలి, వర్షాభావాన్ని తట్టుకోవడానికి పొటాషియం నైట్రేట్ లేదా మల్టీ కే (13:0:45) లీటరు నీటికి 10గ్రా. వంతున 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నపుడు సాయంత్రం వేళలో నీరు పెట్టాలి. సల్ఫర్ ఉన్న ఎరువులను పై పాటుగా వేయరాదు. అధిక ఉష్ణోగ్రతల వల్ల చౌడు తీవ్రత పెరిగి వరి పంట దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి తరచూ మంచి నీరు మార్చుకోవటం వల్ల చౌడు తీవ్రతను కొంతమేర తగ్గించుకోవచ్చు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు దుక్కి దున్ని వెద పెట్టిన పొలాలు లేక మెరక ప్రాంతాలలో ఇనుప ధాతు లోప నివారణకు లీటరు నీటికి 10 గ్రాముల అన్నభేది, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. తక్కువ నీరు అందుబాటులో ఉన్నపుడు మూన తిరిగిన దశ నుండి పిలకల దశ వరకు ఆరుతడిగా పెట్టుకుంటూ, పొలం గట్టును దృఢంగా చేసుకొని నీరు బయటకు పోకుండా చూసుకోవాలి. పిలక దశలో పొలాన్ని ఒకసారి ఆరకడితే వేరు వ్యవస్థకు గాలి సోకి దిగుబడి పెరగడమే కాక గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించవచ్చు. పల్లపు ప్రాంతాలలో సల్ఫైడ్ ఇంజురీని తగ్గించవచ్చు. నీటి లభ్యత తక్కువగా ఉంటే, మురుగు నీటి నాణ్యతను పరీక్షించుకొని లవణ సాంద్రత 2 డెసిసిమేన్స్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు సాగునీరుగా ఉపయోగించుకోవచ్చు.నేలలో తగినంత తేమ ఉన్నపుడే పైపాటు ఎరువులు వేసుకోవాలి నేరుగా దుక్కి దున్ని వెదజల్లిన పొలాల్లో నీటి ఎద్దడి వలన పొలం అంతటా మొక్కలు సమానంగా లేనప్పుడు, కాలువ నీరు వచ్చిన్నపుడు ఒత్తుగా ఉన్న చోట నుండి 25-30 రోజుల వయస్సు గల మొక్కలను తీసి పల్చగా ఉన్న చోట నాటుకోవాలి. లేదా అదే వయస్సు గల నారు దొరికితే మనేద మొక్కలు వేసుకోవాలి. ముదురు నారు (40-55 రోజులు) నాటుకొవలసి వచ్చినపుడు నాట్లు దగ్గర దగ్గరగా, ఒత్తుగా వేసుకోవాలి. సిఫారసు చేసిన ఎరువులను రెండు దఫాలలో చిరు పొట్ట దశలోపు పూర్తి చేసుకోవాలి. చౌడు భూములలో, మురుగు నీరు బయటకు పోవటానికి వీలు లేని భూముల్లో సల్ఫైడ్ ఇంజురీ వలన అడుగు ఆకుల మీద తుప్పు మచ్చలు ఏర్పడినప్పుడు జింకు లోపంగా గుర్తించి జింకు సల్ఫేట్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి 5 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. ఆధారం: పాడిపంటలు మాసపత్రిక డా.ఎం.గిరిజారాణి ప్రధాన శాస్త్రవేత్త (వరి) ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మార్టేరు, పశ్చిమ గోదావరి