వేరుశనగ దిగుబడికి సమతుల పోషణే మూలం వేరుశనగ పంట ఆశించిన దిగుబడి రావాలంటే, పంటకు సరిపడా పోషకాలను అందించాల్సి వుంటుంది. ఇతర పంటల లాగానే ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరము, పొటాషియంతో పాటు, ద్వితీయ పోషకాలు అయిన కాల్షియం, గంధకము కూడా చాలా అవసరం. ఏదైనా పోషకాన్ని ఎక్కువ, తక్కువగా వాడుకున్నప్పుడు అవి ఇతర పోషకాల లభ్యతను ప్రభావితం చేస్తాయి. తద్వారా పోషకాల వినియోగ సామర్థ్యం తగ్గి ఆశించిన దిగుబడి రాదు. ఖర్చు పెరిగి, నేల రసాయనిక స్థితి కూడా మారుతుంది. నేల యొక్క ఆరోగ్యం దెబ్బ తింటుంది. ప్రధాన పోషకాల యాజమాన్యం వర్షాధార వేరుశనగకు ఎకరాకు 8 కిలోల నత్రజని అవసరం అవుతుంది. దీనిని ఎకరాకు 18 కిలోలు యూరియా రూపంలో గాని, 100 కిలోల డి.ఏ.పి. రూపంలో గాని విత్తనం విత్తుకునేటప్పుడు వేసుకోవాలి. నత్రజని లోపించినప్పుడు ముదురు ఆకులు పసుపు పచ్చగా మారి, మొక్క బలహీనంగా మారి ఎదుగుదల ఆగిపోతుంది. ముదురు ఆకులు పసుపు రంగుకు మారినప్పటికీ, రాలిపోవు.పరిపక్వ దశకు వచ్చినప్పు డు రాలిపోతాయి. కాబట్టి నత్రజనిని క్రమం తప్పకుండా ప్రతీ పంటకు సిఫారసు మేరకు వెయ్యాలి. ఖరీఫ్ పంటకు ఎకరాకు 16 కిలోల భాస్వరం అవసరం అవుతుంది. 16 కిలోల భాస్వరాన్ని 100 కిలోల సింగల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో గాని, 35 కిలోల డి.ఏ.పి.రూపంలో గాని ఆఖరి దుక్కిలో వెయ్యాలి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లో భాస్వరంతో బాటు 18-21% కాల్షియం, 11–12% గంధకము కూడా వుంటాయి. ఇవి వేరుశనగకు చాలా మేలు చేస్తాయి. అందువల్ల వేరుశనగకు భాస్వరాన్ని సింగల్ సూపర్ ఫాస్పేట్ రూపంలో వేసుకో వడం మంచిది. భాస్వరం లోపం సాధారణంగా వేరుశనగ విత్తిన 4 వారాలలో కనిపిస్తుంది. మొదట ముదురు ఆకులమీద కనిపించి తరువాత ఇతర ఆకులకు వ్యాపిస్తాయి. మొక్కల ఆకులు, కాండం, కాడలు మొదట నీలం పచ్చగా, తరువాత ముదురు ఆకు పచ్చగా మారి, ఎర్రగా తిరుగుతాయి. మొక్కలు గిడసబారి, ఆకులు చిన్నవిగా వుంటాయి. చలి వాతావరణం వున్నప్పుడు ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది.కాబట్టి భాస్వరాన్ని క్రమం తప్పకుండా ప్రతీ పంటకు సిఫారసు మేరకు వెయ్యాలి. పొటాష్ ఎకరాకు 20 కిలోలు చొప్పున, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఎకరాకు 35 కిలోలు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. పొటాష్ లోపం సున్నం ఎక్కువగా వున్న నేలల్లో కనిపిస్తుంది. ముదురు ఆకుల అంచులు, చివరి భాగం పసుపు రంగుకు తిరుగుతాయి. ఈనెల మధ్య ఆకుపచ్చ రంగు వివర్ణమవు తుంది. ఆకు పచ్చ రంగు వివర్ణమవడం ఆకు అంచుల దగ్గర ప్రారంభమై క్రమంగా లోపలకు విస్తరిస్తుంది. ఆకు ఈనెల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. చివరకు రాలిపోతుంది. కాబట్టి పొటాష్ ను కూడా క్రమం తప్పకుండా సిఫారసు మేరకు ప్రతి పంటకు వేసుకోవాలి. యూరియా ను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్లతో కలిపి వాడరాదు. భూసార పరీక్షలో భాస్వరం, పొటాష్ లు ఎక్కువగా వున్నట్టు తెలిస్తే, సిఫారసు చేసిన భాస్వరం, పొటాష్ ఎరువులను సగం తగ్గించి వేసుకున్నా కూడా దిగుబడులు తగ్గవు. తగ్గించి వాడుకున్నందు వల్ల ఖర్చు తగ్గుతుంది. నిలువలు మధ్యస్తంగా, తక్కువగా వున్నప్పుడు సిఫారసు చేసిన మొత్తాన్ని వేసుకోవాలి. ఎరువులను దుక్కిలో విత్తనం కంటే 2 అంగుళాలు కింద పడేలా విత్తుకోవాలి. ద్వితీయ పోషకాల యాజమాన్యం వేరుశనగకు నత్రజని, భాస్వరం, పొటాష్ లు కాకుండా ఇంకా కాల్షియం, గంధకం, మెగ్నీషియం, జింక్, ఇనుము, బోరాన్ అవసరం అవుతాయి. కాల్షియం అందించడం వలన కాయలలో గింజ నిండుగా ఊరుతుంది. పప్పు శాతం పెరుగుతుంది. నేల గట్టిపడకుండా గుల్లబారి మొక్క ఎదుగుదలకు పనికి వస్తుంది. వేర్లు బాగా వృద్ధి చెంది, బెట్ట పరిస్థితులను తట్టుకునేందుకు కాల్షియం చాలా అవసరం.వేరుశనగకు కాల్షియంను జిప్సం ఎరువు రూపంలో ఎకరాకు 200 కిలోలు వేసుకోవాలి. వేరుశనగకు ఎకరాకు 40 కిలోల సున్నం అవసరం. ఊడలు దిగిన 30 రోజులకు దీని ఆవశ్యకత ఎక్కువగా వుంటుంది.జిప్సం ఊడలు దిగే సమయంలో అంటే 40 రోజుల వయసులో చాళ్ల మధ్య చల్లి మట్టిలో కలిసేట్టు చెయ్యాలి. వేరుశనగలో నూనె శాతం పెరగడానికి గంధకం తప్పనిసరి. కాయ రంగుకు, కాయ బరువు పెరగడానికి గంధకం తప్పనిసరి. పప్పు దిగుబడి శాతానికి ఈ పోషకం ఎంతో అవసరం. మొక్కకు కావాల్సిన ఎంజైముల తయారీకి, కిరణజన్య సంయోగక్రియ జరగడానికి గంధకం తోడ్పడు తుంది. వేరుశనగ పంటకు హెక్టారుకు 10-15 కిలోల గంధకము అవసరం అవుతుంది. దీని కొరకు జిప్సం ఎరువును ఎకరాకు 200 కిలోలు వేసుకోవాలి. కాల్షియం మరియు గంధకం రెండింటి కోసం జిప్సం ఎకరాకు 200 కిలోలు వేసుకుంటే సరిపోతుంది. జిప్సంలో కాల్షియం 23% మరియు గంధకం 19 % వుంటాయి. ఊడలు దిగే సమయంలో 40 రోజుల వయసులో చాళ్ల మధ్య చల్లి మట్టిలో కలిసేటట్టు చెయ్యాలి. జిప్సం అందుబాటులో లేనప్పుడు ప్రత్యామ్నాయంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువును వాడవచ్చును. ఆధారం: పాడి పంటలు మాస పత్రిక డా. వి.సంపత్ కుమార్ సీనియర్ ప్రొఫెసర్ ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు.