వేరుశనగ మన రాష్ట్రంలో ఎక్కువ పండించే ప్రధాన నూనెగింజ పంట. ఖరీఫ్, రబీ, వేసవి మూడు కాలాల్లోనూ సాగుచేసుకోగలిగే ఈ పంట మంచి ఆదాయాన్ని ఇవ్వడంతో పాటు, వేరు ద్వారా గాలిలోని నత్రజనిని నేలకు అందించి నేల సారాన్ని కూడా పెంచుతుంది. అయితే నాణ్యమైన విత్తనం వాడక పోవడం, విత్తన శుద్ధి చేయకపోవడం, పంట మార్పిడి పాటించక పోవడం, ఎరువులు సమతుల్యంగా వేయకపోవడం, కలుపు నివారణ ఆలస్యం చేయడం, పురుగులు- తెగుళ్లను మొదట్లోనే గుర్తించకపోవడం వంటివి చేస్తే దిగుబడి బాగా తగ్గే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆకుమచ్చ, తుప్పు, వైరస్ తెగుళ్లు, ఆకులు తినే గొంగళి పురుగులు ఎక్కువైతే 50 నుండి 70 శాతం వరకు నష్టం రావచ్చు. కాబట్టి నివారణ చర్యలు, సాగు పద్ధతులు, జీవ నియంత్రణ, యాంత్రిక పద్ధతులతో పాటు అవసరమైనప్పుడు మాత్రమే మందులు వాడే సమగ్ర యాజమాన్యం పాటించడం ముఖ్యం. ప్రధాన పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చే పురుగులు ఎక్కువైతే మొక్క ఎదుగుదల తగ్గడంతో పాటు వైరస్ తెగుళ్లను కూడా వ్యాప్తి చేస్తాయి. పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, ఎర్ర వెంట్రుకల గొంగళి పురుగు ఆకులు, పూతలు, లేత కాయలను తినేసి తీవ్ర నష్టం కలిగిస్తాయి. చెదలు నేలలో ఉండి వేర్లను, కాయలను తినేసి మొక్క ఎండిపోయేలా చేస్తాయి. ముందు జాగ్రత్త చర్యలు పొలాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి, పంట మార్పిడి తప్పనిసరిగా పాటించండి. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసేయండి, వేసవిలో లోతు దుక్కులు చేయండి. ఎరువులను సమతుల్యంగా వేయండి. ఎక్కువ నత్రజని వేస్తే పురుగుల ఉధృతి పెరుగుతుంది. పంటను వారానికి కనీసం రెండుసార్లు తప్పకుండా పరిశీలించండి. 7 ఎకరాకు 20 పక్షి స్థావరాలు, 4-5 ఫెరమోన్ ట్రాప్లు పెట్టుకుంటే పురుగుల ఉధృతిని ముందుగానే గమనించవచ్చు. పొగాకు లద్దె పురుగు గుడ్ల గుంపులను, చిన్న లార్వాలను కంటికి కనిపించగానే చేతితో ఏరి నాశనం చేయండి. పురుగుల ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు వేపగింజల సారం (5%) లేదా వేప ఆధారిత మందులు వాడితే రసాయన మందుల అవసరం తగ్గుతుంది. రసాయనిక నివారణ : (ఆర్థిక నష్టస్థాయి దాటినప్పుడు మాత్రమే) విత్తే ముందు విత్తన శుద్ధి. రసం పీల్చే పురుగులకు: ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్.ఎల్. 60 మి.లీ. / ఎకరా, లేదా అసిటామిప్రిడ్ 20 ఎస్.పి. 40 గ్రా. / ఎకరా, 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయండి. ఆకు తొలచుపురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే: ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 ఎస్.జి. 80 గ్రా. / ఎకరా, లేదా స్పైనోసాడ్ 45ఎస్. సి , 75మి.లీ. / ఎకరా పొగాకులద్దె పురుగు, శనగపచ్చ పురుగుకు: క్లోరాంట్రా నిలిప్రోల్ 18.5 ఎస్.సి. 60మి.లీ. / ఎకరా, లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 ఎస్.జి. 80 గ్రా. / ఎకరా, లేదా స్పైనోసాడ్ 45 ఎస్.సి. 75 మి.లీ. / ఎకరా, లేదా ఇండొక్సాకార్బ్ 14.5 ఎస్.సి.200మి.లీ. / ఎకరా 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పెద్ద గొంగళి పురుగులు ఎక్కువైతే వరి తవుడు 10 కిలోలు + బెల్లం 1 కిలో + క్లోరిపైరిఫాస్ 20 ఈసీ + 500 మి.లీ. కలిపి తయారు చేసిన విషపు ఎరను సాయంత్రం వేళ పొలంలో చల్లాలి. ఒకే మందును పదేపదే వాడకూడదు. వేర్వేరు రకాల మందులను మార్చి వాడితే పురుగుల్లో నిరోధకత రాకుండా చూడవచ్చు. ప్రధాన తెగుళ్లు టిక్కా ఆకుమచ్చ, తుప్పు తెగుళ్లు ఆకులపై మచ్చలు ఏర్పడి ఆకులు ముందుగానే రాలిపోయేలా చేస్తాయి. దీనివల్ల కాయలు సరిగా నిండక దిగుబడి తగ్గుతుంది. కాలర్ రాట్, కాండం కుళ్లు, వేరు కుళ్లు మొక్కలు వాడిపోయి చనిపో తాయి. బడ్ నెక్రోసిస్, స్టెమ్ నెక్రోసిస్ (వైరస్ తెగుళ్లు) త్రిప్స్ పురుగుల ద్వారా వ్యాపించి మొక్క ఎదుగుదలను తీవ్రంగా దెబ్బతీస్తాయి.. తెగుళ్ల నివారణ ధృవీకరించిన, ఆరోగ్యకరమైన విత్తనాలను మాత్రమే వాడాలి. పంట మార్పిడి పాటించాలి. పంట అవశేషాలను తీసేయాలి, మొక్కల మధ్య సరైన దూరం పాటించాలి. పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి, ఎరువులను సమతుల్యంగా వేయాలి. విత్తన శుద్ధి : ట్రైకోడెర్మా విరిడి 4 గ్రా. / కిలో విత్తనం, లేదా టెబ్యుకొనజోల్ 2 డి.ఎస్. 1.5 గ్రా. / కిలో విత్తనం. నేల ద్వారా వ్యాపించే తెగుళ్ల నివారణ ట్రైకోడెర్మా విరిడి 2.5 కిలోలను 100 కిలోల బాగా కుళ్లిన పశువుల ఎరువుతో కలిపి ఎకరాకు వేయాలి. టిక్కా ఆకుమచ్చ, తుప్పు లక్షణాలు మొదట కనిపించగానే మాంకోజెబ్ 75 డబ్ల్యుపి 2.5 గ్రా./లీ. లేదా హెక్సాకొనజోల్ 5 ఈసీ 2 మి.లీ. / లీ. లేదా టెబ్యుకొనజోల్ 25.9 ఈసీ 1 మి.లీ. / లీటరు నీరు కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే 10-15 రోజుల తేడాతో మరో రెండుసార్లు పిచికారీ చేయాలి. కాలర్ రాట్, కాండం కుళ్లు, వేరుకుళ్లు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో జీవ శిలీంధ్రనాశకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వైరస్ తెగుళ్లకు నేరుగా మందులు లేవు కాబట్టి, త్రిప్స్ పురుగులను మొదట్లోనే అదుపు చేయడం, కలుపు మొక్కలను తీసేయడం, తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి నాశనం చేయడం, ఆరోగ్యకరమైన విత్తనాలు వాడటమే ఉత్తమ మార్గం. వేరుశనగలో మంచి దిగుబడి రావాలంటే కేవలం రసాయన మందులపైనే ఆధారపడకూడదు. ముందు జాగ్రత్త చర్యలు, సాగు పద్ధతులు, జీవ నియంత్రణ, యాంత్రిక పద్ధతులతో పాటు, అవసరమైనప్పుడు మాత్రమే రసాయన మందులు వాడే సమగ్ర యాజమాన్యాన్ని పాటించాలి. పంటను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పురుగులు మరియు తెగుళ్లను మొదటి దశలోనే గుర్తిస్తే పెట్టుబడి ఖర్చు తగ్గి, నాణ్యమైన దిగుబడితో పాటు మంచి ఆదాయం కూడా పొందవచ్చు. ఆధారం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ