రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం కర్నూలు, నంద్యాల, అనంతపురం, వై.ఎస్.ఆర్. కడప, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో దాదాపు 4-4.5 లక్షల హెక్టార్లలో శనగ పంట సాగవుతోంది. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైన నూతన శనగ రకాలు రైతుల ఆదరణ పొంది, అధిక దిగుబడులు నమోదు చేస్తున్నాయి. శనగ పంట సాగు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. విత్తు సమయం : అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు అనువైనది. విత్తన శుద్ధి : కిలో విత్తనానికి 2.5 గ్రా. కార్బండిజమ్ లేదా 1.5 గ్రా. టెబుకోనజోల్ లేదా 1.5 గ్రా. కార్బాక్సిన్ 37.5% + థైరమ్ 37.5% డి.ఎస్., 10గ్రా. ట్రైకోడెర్మా విరిడి పొడి మందును కలుపుకొని విత్తన శుద్ధి చేస్తే నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళను నివారించుకోవచ్చు. తెగుళ్ళ యాజమాన్యం ఎండు తెగులు ఈ తెగులు ఆశించిన మొక్కలు ఒక్కసారిగా కాడలతో పాటు. ముడుచుకుపోయి చనిపోతాయి. వేరు, కాండాన్ని చీల్చి చూసినపుడు గోధుమ లేదా నలుపు రంగులో చార కనిపిస్తుంది. ఈ తెగులు కలుగజేసే శిలీంద్రం, విత్తనం, మట్టి ద్వారా వ్యాపిస్తుంది. శనగపంట లేకున్నా పొలంలో ఈ శిలీంద్రం ఆరేళ్లు బతికి ఉండగలదు. నివారణ : ఎండు తెగులును తట్టుకొనే రకాలను సాగుచేయడం. వేసవిలో లోతుదుక్కులు, పంట అవశేషాల తొలగింపు తెగులు తీవ్రత తగ్గించవచ్చు. జొన్న లేదా ధాన్యపు పంటలతో పంటమార్పిడి. విత్తనశుద్ధి చేసి పంట విత్తుకోవడం. మొదలు కుళ్ళు తెగులు కాండం మొదలులో ఒక నొక్కు ఏర్పడి మొక్క చనిపో తుంది. తెగులు సోకిన తొలిదశలో తెల్లని శిలీంద్ర బీజాలు ఆవగింజల మాదిరి కాండం మీద కనిపిస్తాయి. నేలలో ఎక్కువ తేమ ఉండడం, అంతగా కుళ్ళని సేంద్రియ పదార్థం ఉండడం, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ తెగులు వ్యాప్తికి తోడ్పడతాయి. నివారణ : విత్తనశుద్ధి చేసిన విత్తనం వాడడం. జొన్న, ఇతర ధాన్యపు పంటలతో పంటమార్పిడి. విత్తడానికి ముందు కుళ్ళని చెత్తను తీసేసి పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. విత్తిన 10-15 రోజుల తరువాత పొలంలో మొదలు కుళ్లు గమనించినపుడు, ఎకరాకు 200గ్రా. కార్బండిజమ్, 600 గ్రాముల మాంకోజెబ్ 200 లీటర్ల నీటిలో కలుపుకొని మొక్కల మొదలు భాగం తడిచేటట్టు పిచికారీ చేయాలి. వేరుకుళ్ళు తెగులు నీటి ఎద్దటి వున్న పరిస్థితులలో, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నపుడు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. పూత, కాయ దశల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వేర్లు నల్లగా మారి పూర్తిగా కుళ్ళిపోతా యి. తల్లివేరు తేలికగా ఊడిపోతుంది. నివారణ : పంట మార్పిడి. శిలీంద్ర నాశినులతో విత్తన శుద్ధి. సకాలంలో విత్తుకోవడం వల్ల పంట చివరిదశలో బెట్టకు, అధిక ఉష్ణోగ్రతలకు గురికాకుండా చూసుకోవడం వల్ల తెగులు తీవ్రత తగ్గించవచ్చు. తెగులును అదుపులో ఉంచడానికి ఎకరాకు 2 కిలోల ట్రైకోడెర్మా పొడి, 4 కిలోల వేప చెక్కతో కలిపి 90-100 కిలోల పశువుల ఎరువులో 10-15 రోజులు వృద్ధి చేసి పొలంలో కలియదున్నాలి. ఆకుమాడు తెగులు ఈ తెగులు పంటకాలంలో ఎప్పుడైనా ఆశించవచ్చు. ఈ తెగులు ఆశించిన పొలంలో అక్కడక్కడా పూర్తిగా ఎండి పోయిన మొక్కలు, పాక్షి, కంగా ఎండిపోయిన కొమ్మలు కనిపిస్తాయి. కొమ్మల పై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కొన భాగం నుంచి కింది వరకు. ఎండిపోతుంది. ఆకులు, కాయలపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కొన భాగం నుంచి కింది వరకు ఎండిపోతుంది. ఈ తెగులు విత్తనం,నేల ద్వారా వ్యాప్తి చెందు తుంది. అకాల వర్షాలు కురిసినపుడు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. నివారణ : ఎకరానికి హెక్సాకొనజోల్ 400 మి.లీ. లేదా ప్రొపికొనజోల్ 200 మి.లీ. లేదా క్లోరోథలోనిల్ 400 గ్రా. చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పొలంలో అధిక మొక్కల సాంద్రత ఉండకుండా చూసుకోవాలి. సిఫారసు చేసిన విత్తన మోతాదు మాత్రమే వాడాలి. తుప్పు తెగులు శనగ పైరు పక్వానికి వచ్చే దశలో ఆకులపై గుండ్రని, చిన్న గోధుమరంగు పొక్కులు ఏర్పడతాయి. ఈ పొక్కులు ఆకుల అడుగు భాగంలో ఎక్కువగా ఏర్పడతాయి. కొమ్మలపై పొక్కులు అరుదుగా ఏర్పడతాయి. తెగులు తీవ్రమైనపుడు మొక్కలు పక్వానికి రాకముందే ఎండిపోతాయి. చల్లని, తడి వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి దోహ దపడుతుంది. నివారణ : రెండు మూడేళ్లకోసారి పంట మార్పిడి చేయాలి. హెక్సకొనజోల్ 400 మి.లీ. లేదా ప్రోపికొనజోల్ 200 మి.లీ లేదా 160 గ్రా. ట్రెప్టోక్సీస్ట్రోబిన్ + టెబుకోనజోల్ 200 లీటర్ల నీటిలో కలుపుకొని వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. తెగుళ్ళ సమర్దవంత నియంత్రణతో శనగలో అధిక దిగుబడులు పొందవచ్చు ఆధారం: పాడి పంటలు డా.ఇ.శిరీష, శాస్త్రవేత్త, (కీటక విభాగం), కృషి విజ్ఞాన కేంద్రం, కళ్యాణదుర్గం, అనంతపురం