పత్తి గులాబి రంగు పురుగు నివారణకు చేయాల్సిన ముందస్తు చర్యలు తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంటను ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. తెల్లబంగారంగా పిలువబడే ఈ పత్తి ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల్లో ప్రధానమైనది. గత సంవత్సరం అంటే 2025-26లో పత్తిని దాదాపు 45 లక్షల ఎకరాలలో సాగు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, అసిఫాబాద్, వికారాబాద్ జిల్లాల్లో పత్తి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. బి.టి. సాంకేతిక పరిజ్ఞానం వచ్చినప్పటి నుండి రైతులందరూ బి.టి. కాటన్ హైబ్రిడ్స్ ను సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం పత్తి పంటను అనేక రకాల చీడపీడలు ఆశించడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. అయితే ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న ఈ బి.టి. పత్తిని 2015 నుండి గులాబి రంగు కాయతొలిచే పురుగు ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఈ పురుగు ఉధృతి ప్రతి సంవత్సరం మారుతున్న వాతావరణానికి అనుకూలంగా పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా గులాబి రంగు పురుగును తట్టుకునే హైబ్రిడ్స్ అందుబాటులో లేవు. ఈ పురుగు ఆశించడం వలన 20-30 శాతం వరకు దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. అందువలన సమగ్ర సస్యరక్షణ చర్యలలో భాగంగా పత్తి పంట వేసే ముందు కొన్ని ముందస్తు చర్యలను చేపట్టడం వలన గులాబి రంగు పురుగు నష్టాన్ని తగ్గించుకోవచ్చు. గులాబి రంగు పురుగు ఉధృతి పెరగడానికి గల అంశాలు: బి.టి. పత్తి చుట్టూ నాన్.బి.టి. (రెఫ్యూజియా) వెయ్యక పోవడం. పంట మోళ్లను ఆలస్యంగా తీసివేయడం. పంట మోళ్లను ఇంటి దగ్గర నిల్వ చేయడం. పంట కాలాన్ని పొడిగించడం అయితే కొన్ని ముందస్తు చర్యలు పత్తి పంట వెయ్యడానికి ముందు పాటించినట్లయితే గులాబి రంగు పురుగు వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. పత్తి తీసిన తర్వాత పత్తి కట్టెను రోటవేటర్ లేదా ష్రెడ్డర్ తో భూమిలో కలియదున్నాలి. దీని వలన నేలకు పోషకాలు అందడమే కాకుండా పురుగు కోశస్థ దశ నాశనం అవుతుంది. ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకోవాలి. గులాబి రంగు పురుగు ఆశించిన పత్తిని జిన్నింగ్ మిల్లుల వద్ద, రైతుల ఇంటి దగ్గర నిల్వ చేయరాదు. లింగాకర్షక బుట్టలు, దీపపు ఎరలను జిన్నింగ్ మిల్లుల వద్ద అమర్చి పురుగు ఉధృతిని తగ్గించుకోవాలి. పత్తి తీసిన తర్వాత ఎండిన మోళ్లను విచ్చుకొని కాయలను పొలం పక్కనే ఉంచరాదు. రైతులు తమ ప్రాంతానికి అనువైన స్వల్పకాలిక, మధ్య కాలిక వంగడాలను ఎన్నుకొని సాగు చేసుకోవాలి. రైతులు తమ ప్రాంతాల్లో ఒకేసారి విత్తుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. పత్తి పంటను సాగు చేసే ముందు తుత్తుర బెండ, బెండలాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. పత్తి పంటను సాధ్యమైనంత వరకు జూన్ మాసంలో విత్తుకోవాలి. పత్తి పంట మొలకెత్తిన తర్వాత పంట తొలి దశలో లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ విధంగా రైతులు పత్తి సాగు చేసే ముందు కొన్ని జాగ్రత్త చర్యలు చేపట్టి పత్తిలో గులాబి రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఆధారం :పాడిపంటలు మాసపత్రిక డా.ఎస్.ఓంప్రకాశ్, డా.వి.రమ్య, డా.జి.వీరన్న, డా.వై.ప్రశాంత్, డా.వెంకన్న, డా.ఆర్.ఉమారెడ్డి,ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, వరంగల్