వర్షాకాల మొక్కజొన్న సాగులో ఎదుర్కొనే సమస్యలు - నివారణ చర్యలు తెలంగాణలో వర్షాధారంగా పండించే పంటలలో అతిముఖ్యమైనది మొక్కజొన్న. ఈ పంటను వర్షాకాలంలో సుమారు 6.44 లక్షల ఎకరాలలో సాగుచేస్తున్నారు. వర్షాకాలంలో కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తారు. ఇథనాల్ ఉత్పత్తి, కోళ్ళదానాల పౌల్ట్రీ పరిశ్రమలలో డిమాండ్ ఎక్కువగా ఉండటం వలన, జాతీయ, అంతర్జాతీయ అవసరాల రీత్యా మంచి మార్కెట్ ఉండటం వలన, అధిక దిగుబడి నిచ్చే పంట కావడం వలన రైతులు మొక్కజొన్న సాగుపై మొగ్గు చూపుతున్నారు. మొక్కజొన్నను ఖరీఫ్, రబీలో సాగు చేస్తున్నప్పటికీ ఖరీఫ్ మొక్కజొన్న సాగులో ఎదురయ్యే సమస్యల వలన అధిక దిగుబడి సాధించలేక పోతున్నారు.. మొలకశాతం తగ్గడం, చేను సరిగ్గా పెరుగుదల లేకపోవడం, పైరు ఎదుగుదలలో తేడాలు, మొక్కలు, పడి పోవడం, పిలకలు రావడం, గింజ కట్టక పోవడం, ఒక కనుపు నుండి అనేక పిలకలు రావడం, చిన్న కంకులు ఏర్పడటం మొదలైనవి ఖరీఫ్ మొక్కజొన్న సాగులో సమస్యలు. సాగులో పై సమస్యలకు మెళుకువలు తెలుసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చు. మొలకశాతం తగ్గడం నేలలో తగినంత తేమ లేకపోవడం వలన, విత్తనాన్ని లోతుగా విత్తడం వలన, వర్షం తర్వాత వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు, అధిక వర్షాలకు గింజ కుళ్ళిపోవడం లేదా విత్తనాలు కొట్టుకుపోవడం వలన మొలక శాతం తగ్గుతుంది. నివారణ చర్యలు: విత్తనం విత్తిన తర్వాత తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి లేదా భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే విత్తుకోవాలి. విత్తనాన్ని విత్తేటప్పుడు మరి లోతుగా కాకుండా విత్తుకోవాలి. అధిక వర్షాలకు విత్తనం కొట్టుకు పోకుండా భూమి ఎత్తు పల్లాలు లేకుండా సమంగా ఉండేటట్లు చూసుకోవాలి. పైరు సరిగ్గా ఎదగకపోవడం, పైరు ఎదుగుదలలో తేడాలు నేల ఆరోగ్యం సరిగ్గా లేక పోవడం, నీటి వసతి లేక పోవడం, పంట చేనులో నీరు నిలువ ఉండటం, పైరుకు ఎరువులు తగినంతగా ఇవ్వక పోవడం, సూక్ష్మ ధాతు లోపాల వల్ల కూడా పైరు సరిగ్గా ఎదగదు. పొలం వాలు సమాంతరంగా లేక పోవడం వలన, పూర్వపు మొక్కజొన్నపంట మొక్కలు కలవడం వలన, పైపాటుగా చేసిన ఎరువులు మొక్కలకు సమానంగా వేయక పోవడం వలన పైరు ఎదుగుదలలో తేడాలు వస్తాయి. నివారణ చర్యలు: పొలం ఎత్తు పల్లాలు లేకుండా చూసుకోవడం, చేసే పైపాటు ఎరువులు అన్ని మొక్కలకు సమానంగా అందేటట్టు చూసుకోవడం, పాత పైరు మొక్కలను తీసివేయడం. మొక్కజొన్న వంట ఎదుగుదలలో అధిక వర్షాల వలన నీటి ముంపుకు గురైతే 19:19:19 మందును లీటరు నీటికి 10 గ్రా. చొప్పున ఎకరాకు 2 కిలోల చొప్పున వారం రోజులవ్యవధిలో రెండు సార్లు ఆకులు తడిచే విధంగా పిచికారీ చేసి మొక్క ఎదుగుదల ఆగకుండా చూడాలి. మొక్కలు పడిపోవడం విత్తనాలు దగ్గర దగ్గరగా విత్తుకోవడం, మోతాదుకు మించిన విత్తనాన్ని వాడడం వల్ల కాండం బలహీనంగా మారి, సారవంతం కాని, నేలలో వేయడం వల్ల కూడా, సరైన పోషకాలు అందక కూడా మొక్కలు పడిపోతాయి. నివారణ చర్యలు: సారవంతమైన భూముల్లో మొక్కజొన్న పంటను సాగుచేయాలి. సిఫారసు చేసిన దూరంలోనే విత్తాలి 60 సెం.మీ., మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ. దూరం ఉండాలి. పిలకలు రావడం కొన్నిరకాల మొక్కజొన్న పైరులో కుదుళ్ళ నుంచి పిలకలువస్తుంటాయి. ఇది అసాధారణమైన ప్రక్రియ విత్తనాలను దూరంగా విత్తుకోవడం వలన మొక్కల బలం పుంజుకొని పిలకలు వస్తాయి అలాగే సారవంతమైన భూముల్లో సిఫారసు చేసిన ఎరువుల కంటే ఎక్కువగా వేయడం వలస కూడా పిలకలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. భూమిలో ఎక్కువగా భాస్వరం వాతావరణ పరిస్థితుల వలన / ఉండటం లేదా జన్యులోపాల వలన కూడా పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది. నివారణ చర్యలు: విత్తనం విత్తేటప్పుడు సిఫారసు చేసిన దూరం పాటించడం (60 × 20 సెం.మీ.), సిఫారసు చేసిన ఎరువులు వాడడం (ఒక ఎకరానికి 72-80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్‌ను ఇచ్చే ఎరువులు వేయాలి. ఒకే కనుపు నుంచి అనేక కంకులు రావడం మొక్క జొన్న పూత దశలో ఉన్నప్పుడు అధిక వర్షాల వలన పరాగసంపర్కం సక్రమంగా జరగక ఒకే కనుపు నుంచి అనేక కంకులు వస్తాయి. అంతే కాకుండా సారవంతమైన నేలల్లో, ఎరువులను సిఫారసు చేసిన దానికంటే అధికంగా వాడటం వాళ్ళు కూడా ఈ లక్షణాలు కనపడతాయి. నివారణ చర్యలు: పీచు, జల్లులు ఏకాలంలో పక్వానికి వచ్చే రకాలను ఎంచుకోవాలి. సిఫారసు చేసిన ఎరువులు వాడడం (ఒక ఎకరానికి 72-80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ను ఇచ్చే ఎరువులు వేయాలి. చిన్నకంకులు ఏర్పడటం మోతాదుకి మించి అధిక విత్తనం వాడటం, మొక్కలను దగ్గరగా విత్తుకోవడం, సిఫారసు చేసిన పోషకాలను అందించకపోవడం వలన చిన్న కంకులు ఏర్పడతాయి. నివారణ చర్యలు: సిఫారసు చేసిన విత్తనాన్ని వాడడం (8 కిలోలు ఎకరాకు) సూచించిన మాదిరిగా మొక్కల మధ్య, మొక్కల సాళ్ళ మధ్య దూరం పాటించడం (60 × 20 సెం.మీ.), నీరు, పోషకాలను సరైన సమయానికి సిఫారసు చేసిన మోతాదులో వాడటం. గింజ సరిగ్గా కట్టక పోవడం పూత దశలో తేమ తగ్గడం లేక తేమ లేకపోవడం, పోషకలోపాలు, వర్షాల వలన పుప్పొడి కొట్టుకొని పోవడం, ఆడ, మగ పుష్పులు సరైన సమయంలో పుష్పించక పోవడం. నివారణ చర్యలు: పూత దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవడం, ఆడ, మగ పుష్పాలు పూత సమన్వయం ఉన్న సంకర రకాలను ఎంచుకోవడం. కంకె కొసలలో గింజ కట్టకపోవడం పొటాష్ ఎరువులు వాడుకోకపోవడం, జింక్ ధాతులోపం, పూత సమయంలో తేమ లేకపోవడం. నివారణ చర్యలు: సిఫారసు చేసిన పొటాష్ ఎరువు పంట ఆడుగులో, పూత సమయంలో తీసుకోవడం. ప్రతి రెండు సీజన్ లకు జింక్ సల్ఫేట్ 10 కి/ఎకరాకు వేయడం. ఆధారం : తెలంగాణ వ్యవసాయ మరియు సహకార శాఖ