దూడలలో వచ్చే అతిసార వ్యాధి నివారణలో పాటించాల్సిన ముఖ్య చర్యలు పాడి పశుసంపద అభివృద్ధిలో ఆరోగ్యం అత్యంత కీలకమైనది. ఆరోగ్యంగా పెరిగిన దూడలు భవిష్యత్తులో అధిక పాల ఉత్పత్తి చేసే ఆవులు గేదెలుగా ఎదిగి రైతుకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. అయితే పుట్టిన దూడలలో అధికంగా కనిపించే వ్యాధులలో అతిసారం ఒకటి. ఈ వ్యాధి వల్ల దూడ శరీరంలో నీరు, ఖనిజలవణాలు వేగంగా కోల్పోయి నిర్జలీకరణకు గురవుతుంది. సకాలంలో చికిత్స అందించకపోతే కొద్దీ గంటలలోనే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి పాడి రైతు ఈ వ్యాధి కారకాలు, లక్షణాలు, నివారణ గురించి అవగాహనా కలిగి ఉండటం చాలా అవసరం. అతిసారం అంటే ఏమిటి ? దూడలు తరుచుగా నీటి వంటి లేదా పలుచటి మలాన్ని విసర్జించడం, సాధారణం కంటే ఎక్కువసార్లు మలం చేయడం, శరీరం నుంచి నీరు, లవణాలు అధికంగా కోల్పోవడం వంటి పరిస్థితిని అతిసారం అంటారు. ఈ వ్యాధి స్వతంత్ర వ్యాధి కాకుండా బాక్టీరియా, వైరస్, పరాన్సజీవులు లేదా పోషకాహార లోపం వల్ల కలుగుతుంది. ముఖ్యంగా పుట్టిన 5-30 రోజుల మధ్య ఈ వ్యాధి ఎక్కువగా సంక్రమిస్తుంది. అతిసారం కారణాలు ముఖ్యంగా రెండు రకాలు ఇన్ఫెక్షియస్ కారణాలు (సంక్రామక కారణాలు) నాన్ ఇన్ఫెక్షియస్ కారణాలు (అసంక్రామక కారణాలు) దూడలలో అతిసారం కలిగించే సంక్రమిక కారణాలు సూక్ష్మజీవుల వలన కలిగే అతిసారన్ని సంక్రమిక అతిసారం అంటారు. ఇది ఒక దూడ నుండి మరొక దూడకు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది.వైరస్ కారణాలు : రోటా వైరస్, కరోనా వైరస్బాక్టీరియా: ఇ. కోలి, స్థాల్మెనెల్లా ఎస్.ఎస్.పి., క్లోస్తీడియంపరాన్నజీవులు: క్రిప్టోస్పోరిడేయం, కాక్సిడియా దూడలలో అతిసారం కలిగించే అసంక్రామక కారణాలు ఇవి ఒక దూడ నుండి మరొక దూడకి వ్యాపించవు. ప్రధానంగా పోషణ, నిర్వహణ, పర్యావరణ కారణాల వలన ఏర్పడుతాయి. వీటిలో ముఖ్య కారణాలు పుట్టిన వెంటనే తగిన పరిమాణంలో ముర్రుపాలు ఇవ్వకపోవడం అధికంగా లేదా తక్కువ పాలు ఇవ్వడం. అపరిశుభ్రమైన పాలని ఇవ్వడం. కలుషితమైన నీరు లేదా దాణా ఇవ్వడం. పోషకాహార లోపాలు. అప్పుడే పుట్టిన దూడకి సరిపోని వాతావరణం, అపరిశుభ్రమైన పాకలో ఉంచడం, భారీ వర్షాలు, తుఫాన్లు మొదలైనవి. అపుడే పుట్టిన 'దూడలకి రోగనిరోధకశక్తి తక్కువగా ఉండడం వల్ల సులభంగా వ్యాధికారక క్రిముల బారిన పడే అవకాశం ఉంటుంది. దూడలలో అతిసార వ్యాధి ముఖ్య లక్షణాలు తరుచుగా పలుచటి లేదా నీళ్ల లాంటి విరేచనాలు రావడం. మలం రంగు పసుపు, తెలుపు, ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో ఉండవచ్చు. విరేచనాల వలన శరీరంలో నీటి శతం తగ్గి కళ్ళు లోపలికి పోవడం, చర్మాన్ని పైకి లాగితే ఆలస్యంగా మామూలు స్థితికి రావడం. పాలు తాగడం తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం గమనించవచ్చు. దూడలు తరుచుగా బలహీనంగా కనిపిస్తాయి, శరీర బరువు తగ్గుతుంది. ముఖ్యంగా బాక్టీరియా లేదా వైరస్ సంక్రమణలో జ్వరం ఉండవచ్చు. కళ్ళలో మెరుపు తగ్గి, చెవులు చల్లగా అనిపించడం. పొట్ట నొప్పి, అపుడప్పుడు పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తుంది. మూత్రవిసర్జన తగ్గడం, శరీరం పూర్తిగా ఎండిపోయినట్లు కనిపిస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే మరణం కూడా సంభవించవచ్చు. దూడలలో అతిసార వ్యాధి చికిత్స నివారణోపాయాలు పుట్టిన దూడలకి మొదటి 2 గంటలలోపు తగిన మోతాదులో ముర్రుపాలు ఇవ్వాలి. ఇది రోగనిరోధకశక్తి పెంచి అతిసారాన్ని తగ్గిస్తుంది. దూడలను శుభ్రమైన, పొడి గాలి వెలుతురు ఉండే ప్రదేశంలో ఉంచాలి. కలుషితమైన నీరు, మేత ఇవ్వకూడదు. అనారోగ్య దూడలను ఆరోగ్యవంతమైన దూడల నుండి వేరుగా ఉంచాలి. దూడ నాభిని అయోడిన్ ద్రావణంతో శుభ్రపరచాలి. నాభి ద్వారా సంక్రమణలు జరగకుండా జాగ్రత్తపడాలి. పాలను నిర్ణీత సమయంలో తగిన మోతాదులో ఇవ్వాలి. దూడలకు సకాలంలో టీకాలు, నట్టల మందులు ఇవ్వాలి. వ్యాధి సోకిన దూడలకి అజాగ్రత్త చేయకుండా వెంటనే చికిత్స చేయించాలి. ఆంటీబయోటిక్స్ ఇంజెక్షన్లు లేదా సల్ఫేనిలమైడ్ మందులు ఇప్పించాలి. ద్రవాలు, ఎలెక్ట్రోలైట్ంప్ చికిత్సలో అత్యంత ముఖ్యమైనది. దూడకి తీవ్రమైన నీరసం, కళ్ళ లోతు, నిలబలేకపోవడం లేదా 24 గంటలలకు మించి తీవ్ర అతిసారం ఉంటే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి. ఆధారం: వ్యవసాయ పాడిపంటలు , పశు జన్యు శాస్త్ర, ప్రజనన విభాగం, పశు వైద్య కళాశాల, కోరుట్ల,