మన దేశంలో పశువులను శాస్త్రీయ పద్ధతిలో మేపడానికి కావాల్సిన మేత వనరులు, దాణా లభ్యత చాలా తక్కువగా ఉంది. సమీకృత దాణాల ధరలు కూడా రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్న కారణంగా పాడి రైతులు తమ పశువులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించలేక తక్కువ దిగుబడులను పొందుతున్నారు. రైతులు కొంచం వినూత్నంగా ఆలోచించి ప్రత్యామ్నాయ దాణా దినుసులు, వ్యవసాయ ఉప ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఉప ఉత్పత్తులను ఉపయోగించి సమీకృత దాణాను తయారు చేసుకున్నట్లయితే లేదా పశువులకు సాధారణంగా ఇచ్చే మేతకు వీటిని అదనంగా ఇచ్చినట్లయితే పశువులకు కావాల్సిన పోషకాలన్నీ తక్కువ ఖర్చుతో అందించి ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. పశువుల మేతలో వాడే వివిధ రకాల ప్రత్యామ్నాయ మేత వనరులలో ఆల్కహాల్ తయారీ పరిశప్రమల నుండి వచ్చే ఉప ఉత్పత్తుల వాడకం క్రమేపి పెరుగుతోంది. మన దేశంలో ఆల్కహాల్ తయారు చేసే పరిశ్రమల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. కాబట్టి భవిష్యత్తులో ఆల్కహాల్ ఉప ఉత్పత్తుల లభ్యత ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొక్కజొన్న వరి, గోధుమ, బార్లీ వంటి ధాన్యపు గింజల నుండి పిండి పదార్ధాన్ని వేరుచేసి, దాన్ని ఈస్ట్‌లను ఉపయోగించి పులియబెట్టి ఆల్కహాల్ / బీరు తయారు చేస్తారు. మన దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువగా వెుక్కజొన్నను వాడుతున్నారు. ఈ పరిశ్రమలలో పిండి పదార్ధం పోగా మిగిలిన పోషకాలన్నీ ఉప ఉత్పత్తులుగా లభిస్తాయి. బీరు తయారీకి వాడిన ధాన్యపు గింజలతో పోలిస్తే వీటి నుండి వచ్చే ప్రక్రియలో వచ్చే ఉప ఉత్పత్తులలో మూడు రెట్లు ఎక్కువ పోషకాలు (పిండి పదార్థం మినహా) లభిస్తాయి. ఆల్కహాల్ తయారీ పరిశ్రమ నుండి వచ్చే ఉప ఉత్పత్తులు ముఖ్యంగా మూడు రకాలు తడి బీరు పొట్టు ఎండు బీరు పొట్టు డిస్టిల్లరీ ద్రవరూప పదార్థం ఆల్కహాల్ తయారీలో చివరగా మిగిలిన మిశ్రమం నుండి ఘన పదార్థాలను వేరు చేయగా పలుచని ద్రవ పదార్థం వస్తుంది. ఈ ద్రవ పదార్ధాన్ని ఆవిరి చేయగా వచ్చే అర్ధ ఘన రూప పదర్గాన్నే డిస్టిల్లరీ ద్రవ పదార్థంగా పిలుస్తారు. బీరు పొట్టును ఈ డిస్టిల్లరీ ద్రవ పదార్థంను కలుపగా వచ్చే పదార్ధాన్ని తడి బీరుపొట్టు అని, తడి బీరు పొట్టును పూర్తిగా ఎండబెట్టగా వచ్చే పదర్గాన్ని పొడి బీరు పొట్టు అని పిలుస్తారు. డిస్టిల్లరి ద్రవ పదార్థం లోని మాంసకృత్తులలో అధిక శాతం (80 శాతం) రుమేన్లోనే జీర్ణం అవుతాయి. దీన్ని అధికంగా వాడినప్పుడు రక్తంలో, పాలలో యూరియా సంబంధిత నత్రజని పెరిగి పశువులు అనారోగ్యానికి గురవుతాయి. ఎంత మోతాదులో ఇవ్వాలి ? డిస్టిల్లరీ ద్రవ పదార్ధాన్ని పశువుల దాణాలో 5-10 శాతం వరకు వాడవచ్చు. డిస్టిల్లరీ ద్రవరూప పదార్థం నిర్దేశిత మోతాదులోనే వాడాలి. విచక్షణారహితంగా వాడినట్లయితే పశువులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. దీన్ని పశువుల మేతలో వాడేటప్పుడు మొత్తం మేతలో కొవ్వుల పరిమాణం 6 శాతం అంటే ఎక్కువ అవకుండా చూసుకోవాలి. దాణాలో డిస్టిల్లరీ ద్రవ పదార్థంను కొద్ది కొద్దిగా పెంచుతూ పశువులకు అలవాటు చేయాలి. దాణానుండి డిస్టిల్లరి ద్రవ పదార్ధాన్ని ఒక్కసారిగా తొలగించకుండా కొద్దికొద్దిగా తగ్గించడం మంచిది. పోఛక విలువలు (శాతం) డిస్టల్లరీ ద్రవ వ్యర్థపదార్థం తేమ 55-70 మాంసకృతులు 20-30 కొవ్వులు 9-15 శక్తినిచ్చే పదార్థాలు 75-120 ఫాస్ఫరస్ 1.3-1.45 సల్ఫర్ 0.37-0.95 ధర/ కిలో రూ. 4-5 డిస్టిల్లరీ ద్రవరూప పదార్థం వాడకం వల్ల ప్రయోజనాలు దీనిలో శక్తినిచ్చే పదార్థాలు, మాంసకృత్తులు, ఫాస్పరస్ అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి మొక్కజొన్న సోయావంటి దాణా దినుసులకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. అధిక పోషక విలువలు గల దాణాను పశువులకు అందించవచ్చు. దాణా ఖర్చు గణనీయంగా తగ్గించుకోవచ్చు తక్కువ ఖర్చులో అధిక పాల దిగుబడి పొందవచ్చు. తక్కువ పోషక విలువలు గల మేతతో పాటుగా డిస్టిల్లరీ ద్రవరూప పదార్థం ఇచ్చినట్లయితే ఆ మేత పోషక విలువలు పెంచవచ్చు. డిస్టిల్లరీ ద్రవరూప పదార్థం (కండెన్స్డ్ డిస్టిల్లర్స్ సాల్యూబుల్ -సి.డి.ఎస్) వాడకం వల్ల సమస్యలు మేతలో నుండి ఒకేసారి సి.డి.ఎన్ను తొలగించడం అవి సరిగా మేత మేయక పోవడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీన్ని దీర్ఘకాలికంగా వాడటం వల్ల పాడి పశువులలో ప్రత్యుత్పత్తిలో సమస్యలు ఎదురవుతున్నాయి అనే భావన పాడి రైతులలో ఉంది. అల్కహాల్ తయారీలో వాడే ధాన్యాన్ని బట్టి, తయారీ ప్రక్రియను బట్టి సి.డి.ఎస్‌లోని పోషకాల పరిమాణం మారుతుంది. డిస్టల్లరీ ద్రవరూప పదార్థంలో తేమ శాతం అధికంగా ఉండడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ చేయడం సాధ్యం కాదు. రైతులు నిల్వ చేసుకున్న సి.డి.ఎస్. ను వాడుతున్నట్లయితే ఏవైనా శిలీంద్రాల పెరుగుదల ఉందా అని జాగ్రత్తగా గమనించాలి. డిస్టిల్లరీ ద్రవరూప పదార్థం ఎక్కువ దూరం రవాణా చేయడం కూడా కష్టం. శిలీంద్రాల పెరుగుదలకు (మైకో టాక్సిన్ల) సమస్య ఉంటుంది. అధిక పరిమాణంలో సల్ఫర్ ఉండే అవకాశం ఉంటుంది. అధిక మోతాదులో సి.డి.ఎస్. వాడటం వల్ల ఆమ్ల జనిత అజీర్తి వచ్చే అవకాశం ఉంది. సి.డి.ఎస్‌లో ఫాస్పరస్ అధిక శాతం ఉండడం వల్ల పర్యావరణం కలుషితమయ్యే అవకాశం ఉంది. డిస్టల్లరీ ద్రవరూప పదార్థం వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా వాడటం వల్ల పశువుల ఆరోగ్యం, ప్రత్యుత్పత్తిలో ఏవైనా సమస్యలు ఎదురవుతాయా అనే కోణంలో ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. రైతులు పై విషయాలు అన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణీత మోతాదులో, నాణ్యమైన డిస్టల్లరీ ద్రవరూప పదార్ధాన్ని మాత్రమే తమ పశువుల మేతలో భాగంగా వాడుకొని వాటికి తక్కువ ఖర్చుతో మంచి పోషకాలు ఉన్న దాణా ఇవ్వడం ద్వారా అధిక పాల దిగుబడి, పొందవచ్చు. ఆధారం : పాడిపంటలు మాస పత్రిక