ఖరీఫ్‌కు సమృద్ధిగా ఎరువుల నిల్వలు బఫర్ స్టాక్‌తో ప్రభుత్వం సన్నద్ధం. రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా ఎరువుల సరఫరా. సాగు ఖర్చులు తగ్గించేందుకు సహకరించాలి. ఖరీఫ్ సీజన్ లో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీతో పాటు అన్ని రకాల ఎరువులను ప్రభుత్వం సమృద్ధిగా అందుబాటులో ఉంచిందని వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా మార్క్ ఫెడ్ గోదాముల్లో తగిన బఫర్ స్టాక్ ను నిల్వ ఉంచామని ఎక్కడైనా నిల్వలు తగ్గిన వెంటనే అదనపు ఎరువులను తరలించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తు న్నారని చెప్పారు. చాలా కంపెనీల నుంచి ఎరువుల స్టాక్ ను వ్యవసాయశాఖ స్వాధీనం చేసుకుని ప్రభుత్వ గోదాముల్లో భద్రపరుస్తోందని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ అవసరాలకు 85 శాతం సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. అలాగే డీఏపీ కూడా ప్రస్తుత సీజన్ అవసరాల్లో 64% మేర అందుబాటులో ఉందన్నారు. అవసరానికి అనుగుణంగా నిరంతరం అదనపు రేకులు రాష్ట్రానికి చేరుతున్నాయని రైతులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా సరఫరా కొనసాగుతోందని స్పష్టం చేశారు. నిల్వలు పరంగా అన్ని జిల్లాల్లో అవసరమైన యూరియా బఫర్ స్టాక్ ను ఉంచామని, డీఏపీ వంటివి కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగుతోందని తెలిపారు. జిల్లాల వారీగా నిల్వలు వినియోగాన్ని ప్రతిరోజూ సమీక్షిస్తూ అవసరమైన చోట వెంటనే అదనపు నిల్వలు తరలిస్తున్నామని, అవసరమైనమేరకు ఎరువులను ప్రభుత్వం సమయానికి అందిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధుల బృందం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులను విడివిడిగా కలుసుకుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై ఈ సందర్భంగా చర్చించి, వినతిపత్రాలను అందజేశారు. వ్యవసాయంలో పెట్టుబడి వ్యయాలు పెరగడంతో రైతులపై ఆర్థికభారం పెరుగుతుందని, కేంద్రం సాగు ఖర్చులు తగ్గించేందుకు సహకారం అందించాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికు బృందం విజ్ఞప్తి చేసింది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కలిసి అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ (NFDB) ప్రాంతీయ కార్యాలయం, ఆక్వా క్వారంటైన్ ఫెసిలిటీ (AQF) ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయడంపై చర్చించారు. అనంతరం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి తో రాష్ట్ర మంత్రుల బృందం కీలక సమావేశం నిర్వహించింది. ఆక్వాకల్చర్ రంగం ఎదుర్కొంటున్న నష్టాలు, ఎఫ్ఎసిబి (FCV) పొగాకు రైతులు, ఎగుమతిదారులు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కేంద్రాల ఏర్పాటు వల్ల NFDB ప్రాంతీయ కార్యాలయం, ఆక్వా క్వారంటైన్ ఫెసిలిటీ, శిక్షణ కేంద్రం అందుబాటులోకి వచ్చి ప్రజలకు, ఆక్వా రంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రొయ్యల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందని, ఈ రంగంపై లక్షలాది మంది రైతులు, కార్మికులు, హేచరీలు, ఫీడ్ తయారీదారులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులు ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు. ఆధారం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ