పరిచయం వ్యవసాయం ప్రధానంగా సకాలంలో, తగినంత వర్షపాతం మీద ఆధారపడి ఉంటుంది. ఇటీవలి కాలంలో వాతావరణ మార్పులు రైతులకు అతిపెద్ద సవాలుగా మారాయి. భారత వ్యవసాయంపై ప్రభావం చూపుతున్న ముఖ్యమైన వాతావరణ సంఘటనలలోఎల్-నినో ఒకటి. దీని కారణంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం, దీర్ఘకాలిక వర్ష విరామాలు, రుతుపవనాల ఆలస్య ప్రవేశం, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎల్-నినోను నివారించడం సాధ్యం కాకపోయినా, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, సమర్థవంతమైన నీటి నిర్వహణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను అనుసరించడం ద్వారా దాని దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గించవచ్చు. సరైన ప్రణాళికతో రైతులు పంట నష్టాలను తగ్గించి, వాతావరణ అనిశ్చితిని సమర్థంగా ఎదుర్కోగలరు. ఎల్-నినో అంటే ఏమిటి? ఎల్-నినో అనేది మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల ఏర్పడే సహజ వాతావరణ ప్రక్రియ. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారతాయి. భారతదేశంలో ముఖ్యంగా నైరుతి రుతుపవనాల తీవ్రత తగ్గి వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుంది. ఎల్-నినో ప్రధాన ప్రభావాలు రుతుపవనాల ఆలస్య ప్రవేశం సాధారణం కంటే తక్కువ, అస్థిర వర్షపాతం పంట పెరుగుదల సమయంలో దీర్ఘకాలిక వర్ష విరామాలు పగటి ఉష్ణోగ్రతలు పెరగడం పంటల్లో తేమ కొరత చెరువులు, రిజర్వాయర్లు, భూగర్భజలాల పునర్భరణ తగ్గడం వ్యవసాయ ఉత్పాదకత తగ్గడం వ్యవసాయంపై ఎల్-నినో ప్రభావం విత్తనాల విత్తడంలో ఆలస్యం : సీజన్ ప్రారంభంలో తగినంత వర్షపాతం లేకపోవడం వల్ల భూమి సిద్ధం చేయడం, విత్తనాలు విత్తడం ఆలస్యం అవుతుంది. దీంతో పంట పెరుగుదల కాలం తగ్గుతుంది.మొలకలు సరిగా రాకపోవడం : నేలలో తేమ లేకపోవడం వల్ల విత్తనాల మొలక శాతం తగ్గి, మొక్కల జనాభా అసమానంగా ఉంటుంది.తేమ ఒత్తిడి : పంట ఎదుగుదల, పుష్పించే దశలో వర్ష విరామం ఏర్పడితే పుష్పాలు, గింజల ఏర్పాటుపై ప్రభావం చూపి దిగుబడి తగ్గుతుంది.కీటకాలు, వ్యాధుల ఉధృతి పెరగడం : అధిక ఉష్ణోగ్రతలు, తేమలో మార్పుల వల్ల కింది కీటకాలు ఎక్కువగా కనిపిస్తాయి. మొక్కజొన్నలో ఫాల్ ఆర్మీవార్మ్ కాండం తొలిచే పురుగులు పేనుబంకలు తెల్లదోమలు పత్తిలో రసం పీల్చే కీటకాలు పశుసంవర్ధకంపై ప్రభావం: పచ్చిమేత, తాగునీటి కొరత వల్ల పశువుల ఆరోగ్యం దెబ్బతిని పాల ఉత్పత్తి తగ్గుతుంది. వాతావరణ అనుకూల వ్యవసాయం కోసం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక వాతావరణ మార్పులు, రుతుపవనాల ఆలస్యం, దీర్ఘకాలిక వర్ష విరామాలు, అస్థిర వర్షపాతం ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లుగా మారాయి. ముఖ్యంగాఎల్-నినోపరిస్థితుల్లో ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అత్యంత సమర్థవంతమైన వ్యవసాయ వ్యూహం. సరైన పంటల ఎంపిక, సకాలంలో విత్తడం, నేలలో తేమను సంరక్షించడం, శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం ద్వారా రైతులు పంట నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అంటే ఏమిటి? సాధారణ పంటల సాగు వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల దెబ్బతిన్నప్పుడు అనుసరించే ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాన్ని ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అంటారు. ఈ పరిస్థితులు: రుతుపవనాల ఆలస్య ప్రారంభం రుతుపవనాల ముందస్తు విరమణ దీర్ఘకాలిక వర్ష విరామాలు అధిక వర్షాలు లేదా వరదలు కరువు పరిస్థితులు ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం రైతుల ఆదాయాన్ని కాపాడడం, సహజ వనరులను సంరక్షించడం, స్థిరమైన వ్యవసాయ ఉత్పత్తిని కొనసాగించడం. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ముఖ్య లక్ష్యాలు: పంట నష్టాలను తగ్గించడం. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం రైతుల ఆదాయాన్ని స్థిరంగా ఉంచడం వాతావరణ అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఆహార, పశుగ్రాస భద్రతను కాపాడడం రుతుపవనాలు ఆలస్యమైనప్పుడు సిఫార్సు చేసిన పంటలు విత్తే సమయం సిఫార్సు చేసిన పంటలు అనుకూలమైన రకాలు జూన్ 15 వరకు వరి, మొక్కజొన్న, వరి సాధారణ కాల వ్యవధి రకాలు జూన్ 16–30 వరి, మొక్కజొన్న, కంది, సోయాబీన్ మధ్యస్థ కాల వ్యవధి జూలై 1–15 కంది, పెసర, మినుము, నువ్వులు త్వరగా పండే రకాలు జూలై 16–31 పెసర, మినుము, అలసంద, కొర్ర స్వల్ప కాలవ్యవధి ఆగస్టు 1–15 పొద్దుతిరుగుడు, అలసంద, ఉలవలు, నువ్వులు అతి స్వల్ప కాలవ్యవధి పంటల వారీగా విత్తే సమయం పత్తి సాధారణ విత్తకం: జూన్ 10 - జూలై 10 ఆలస్య విత్తకం: జూలై 20 వరకు కరువును తట్టుకునే రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన హైబ్రిడ్లను ఉపయోగించాలి. మొక్కజొన్న సాధారణ విత్తకం: జూన్ 10 – జూన్ 30 ఆలస్య విత్తకం: జూలై 15 వరకు ఆలస్య పరిస్థితుల్లో స్వల్ప కాలవ్యవధి హైబ్రిడ్లను ఎంచుకోవాలి. వరి నర్సరీ: జూన్ మధ్యలో నాట్లు: జూలై మొదటి వారంలో వర్షాలు ఆలస్యమైతే: నేరుగా విత్తే వరి 120-130 రోజుల స్వల్పకాల రకాలు కంది ఉత్తమ విత్తే సమయం: జూన్ 20 - జూలై 15 పత్తి లేదా చిరుధాన్యాలతో అంతర పంటగా సాగు చేయాలి. పెసర జూలై నెలలో విత్తాలి. 60-70 రోజుల స్వల్పకాల రకాలను ఎంచుకోవాలి. మినుము జూలైలో విత్తడం అనుకూలం. ఆలస్య వర్షాల పరిస్థితులకు అనువైన పంట. నువ్వులు జూలైలో విత్తితే మంచి ఫలితాలు. తక్కువ తేమలో కూడా బాగా పెరుగుతుంది. చిరుధాన్యాలు : కొర్ర, సామలు, బ్రౌన్హాప్ మిల్లెట్ అనుకూల విత్తే సమయం: జూలై-ఆగస్టు. నేల, తేమ సంరక్షణ చర్యలు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక విజయవంతం కావాలంటే పడే ప్రతి వర్షపు నీటి బొట్టును సంరక్షించాలి. వర్షాధార భూముల్లో కంపార్ట్మెంట్ బండ్లు నిర్మించాలి. వాలుగా ఉన్న భూముల్లో కాంటూర్ సాగు చేయాలి. సంరక్షణ కందకాలు ఏర్పాటు చేయాలి. ప్రతి 8–10 వరుసలకు ఒక డెడ్ ఫరో ఏర్పాటు చేయాలి. బరువైన నేలల్లో బ్రాడ్ బెడ్, ఫరో పద్దతిని అనుసరించాలి. మల్చింగ్ - వినియోగించాల్సిన పదార్థాలు పంట అవశేషాలు వరి గడ్డి పత్తి కాండాలు ఎండిన ఆకులు ప్రయోజనాలు నేల తేమను నిల్వ ఉంచుతుంది. కలుపు మొక్కల పెరుగుదలను తగ్గిస్తుంది. నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచుతుంది. భాష్పీభవనాన్ని 30-40% వరకు తగ్గిస్తుంది. వర్షపు నీటి సంరక్షణ- రైతులు ఏర్పాటు చేసుకోవాల్సినవి వ్యవసాయ కుంటలు పెర్కొలేషన్ ట్యాంకులు చెక్ డ్యామ్లు రీచార్జ్ గుంతలు : ఈ నీటిని వర్ష విరామ సమయంలో రక్షణాత్మక నీటిపారుదలకు ఉపయోగించవచ్చు. సంరక్షణాత్మక దుక్కి: కనిష్ట దుక్కి సాధ్యమైన చోట జీరో టిల్లేజ్ పంట అవశేషాలను నేలపై ఉంచడం : ఇవి నీటి ప్రవాహాన్ని తగ్గించి నేలలోకి నీరు ఇంకేలా చేస్తాయి. వృక్ష సంరక్షణ చర్యలు భూమి అంచుల వెంట నాటవలసిన మొక్కలు: వెటివర్ గడ్డి నేపియర్ గడ్డి గ్లిరిసిడియా సుబబుల్ ఇవి నేల కోతను తగ్గిస్తాయి. తేమ కొరతలో పోషక నిర్వహణ నేల పరీక్ష ఆధారంగా ఎరువులు వేయాలి. నత్రజనిని విడతల వారీగా వేయాలి. కరువు సమయంలో 2% యూరియా ద్రావణం పిచికారీ చేయాలి. 1% పొటాషియం నైట్రేట్ పిచికారీ చేయడం ద్వారా తేమ ఒత్తిడి తగ్గుతుంది. సేంద్రియ ఎరువులు, కంపోస్టు వినియోగించాలి. అజోస్పిరిల్లం, అజోటోబాక్టర్, పీఎస్బీ, ట్రైకోడెర్మా వంటి జీవ ఎరువులను ఉపయోగించాలి. కలుపు నివారణ : సకాలంలో కలుపు నివారణ చేయడం ద్వారా నేల తేమను సంరక్షించవచ్చు. సిఫార్సులు: విత్తిన 20-25 రోజుల తరువాత ఒకసారి అంతర దుక్కి చేయాలి. కలుపు తీసిన తరువాత మల్చింగ్ చేయాలి. పంటకు అనుకూలమైన కలుపు మందులను సిఫార్సు మేరకు ఉపయోగించాలి. వర్ష విరామ సమయంలో తీసుకోవాల్సిన చర్యలు 10-15 రోజుల పాటు వర్షం లేకపోతే: అధికమొక్కల సాంద్రతను తగ్గించాలి. వెంటనే కలుపు తొలగించాలి. మల్చింగ్ చేయాలి. సాధ్యమైతే రక్షణాత్మక నీటిపారుదల ఇవ్వాలి. యాంటీ-స్ట్రెస్ పోషకాలను పిచికారీ చేయాలి. అధిక నత్రజని ఎరువులు వేయకూడదు. పంటల వైవిధ్యీకరణ వరి, మొక్కజొన్నలపైనే ఆధారపడకుండా : చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, పశుగ్రాస పంటలు సాగు చేయడం ద్వారా వాతావరణ ప్రమాదాలను తగ్గించి ఆదాయాన్ని పెంచుకోవచ్చు.తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు: సిఫార్సు చేసిన మేరకే విత్తన మోతాదు తగ్గించాలి. త్వరగా పండే రకాలను ఎంచుకోవాలి. వరుసలలో విత్తాలి. సకాలంలో అంతర దుక్కి చేయాలి. నేలలో తేమను బట్టి ఎరువులు వేయాలి. సమగ్ర పోషక నిర్వహణ : రైతులు: పశువుల ఎరువు వర్మీ కంపోస్ట్ జీవ ఎరువులు సమతుల్య రసాయన ఎరువులు ఉపయోగించడం ద్వారా నేలలో సేంద్రియ కార్బన్ పెరిగి తేమ నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది. సమగ్ర కీటక నిర్వహణ : ఎల్-నినో పరిస్థితుల్లో కీటకాల ఉధృతి పెరిగే అవకాశం ఉంది.అందువల్ల రైతులు: పొలాలను తరచుగా పరిశీలించాలి. ఫెరోమోన్ ట్రాప్లు ఏర్పాటు చేయాలి. పసుపు స్టిక్కీట్రాప్లను ఉపయోగించాలి. మిత్ర కీటకాలను సంరక్షించాలి. ఆర్థిక నష్టం స్థాయి దాటిన తరువాత మాత్రమే పురుగుమందులు పిచికారీ చేయాలి. కృషి విజ్ఞాన కేంద్రం పాత్ర కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు ఈ సేవలను అందిస్తున్నాయి. వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు వాతావరణ అనుకూల సాంకేతికతలు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక మార్గదర్శకాలు కరువు నిరోధక సాంకేతిక ప్రదర్శనలు రైతు శిక్షణ కార్యక్రమాలు నేల, నీటి సంరక్షణ సాంకేతికతలు సకాలంలో అందించే సలహాలు రైతులు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయి. రైతులకు ముఖ్య సూచనలు ఒకటి లేదా రెండు వర్షాలకే వెంటనే విత్తకాలు ప్రారంభించవద్దు; నేలలో తగిన తేమ వచ్చిన తరువాత మాత్రమే విత్తాలి. స్వల్పకాల, కరువును తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. పంటల వైవిధ్యీకరణను అనుసరించాలి. ప్రతి వర్షపు నీటి బొట్టును సంరక్షించాలి. నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచాలి. వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు వాతావరణ సూచనలను పరిశీలించాలి. కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ అధికారుల సాంకేతిక సలహాలను తప్పనిసరిగా పాటించాలి. ముగింపు : ఎల్-నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడం, కరువు పరిస్థితులు ఏర్పడడం, పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. అయితే సకాలంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, శాస్త్రీయ పంట నిర్వహణ, నీటి సంరక్షణ పద్ధతులు, వాతావరణ అనుకూల వ్యవసాయ సాంకేతికతలను అనుసరించడం ద్వారా ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సరైన పంటలను ఎంపిక చేసుకోవడం, నేల-నీటి వనరులను సమర్థంగా వినియోగించడం, కృషి విజ్ఞాన కేంద్రాల సలహాలను పాటించడం ద్వారా రైతులు పంటలను రక్షించుకొని స్థిరమైన దిగుబడులు, మెరుగైన ఆదాయం, భవిష్యత్తు వాతావరణ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఆధారం: వ్యవసాయ పాడిపంటలు