చిరుధాన్యాల (మిల్లెట్స్) గురించి మీకు ఈ ముచ్చట్లు తెలుసా! భూమి మీద నివసిస్తున్న సమస్త మానవాళికి సమతుల్య ఆహారం, పోషణ వైవిధ్యం, పోషకార భద్రత, ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఆహార ఉత్పత్తి పంటల సరళిని మార్చి పోషకాహార భద్రత వైపు అడుగులేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యంగా చేసుకుంటూ ముందుకు వెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి పరిస్థితులలో మన పెద్దలు సాగు చేసి తిన్నటువంటి జొన్నలు, మిల్లెట్స్ వంటల సాగు విస్తీర్ణం పెంచడంతోపాటు, విలువ జోడించడం, కాలంతో పరిగెత్తుతున్న రోజుల్లో వండుకోవడానికి, తినడానికి అనువుగా ఉండే వివిధ రకాల ఆహార పదార్థాల తయారీ, మార్కెటింగ్ సదుపాయాలు మొదలైనటువంటి కార్యక్రమాలను ఉధృతం చేసి ప్రజలందరికీ ఆరోగ్యమైన ఆహారాన్ని వంట గదికి చేర్చడానికి ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉంది. ఇక్రిశాట్ మిల్లెట్స్న స్మార్ట్ ఫుడ్‌గా పిలుస్తుంది. ఎందుకంటే బలవర్ధకమైన పోషక విలువలను కలిగి ఉండడం వలన మనం ఆహారంగా తిన్నట్లయితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మిల్లెట్స్ పండించడానికి ఎక్కువ ఎరువులు, పురుగు మందుల అవసరం ఉండదు. పంట పండించే సమయంలో వాతావరణం లోనికి తక్కువ కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి వదులుతాయి. మన వాతావరణానికి ముఖ్యంగా విశ్వానికి ప్రయోజనం చేకూరుస్తుంది. అంతేకాకుండా మిల్లెట్స్ పంట కాల వ్యవధి తక్కువగా ఉండడం వలన తక్కువ సమయంలో రైతుకు పంట చేతికి అందుతుంది. ఈ విధంగా రైతులకు కూడా ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. అందుకే మిల్లెట్స్ ను స్మార్ట్ ఫుడ్స్ పిలుస్తారు. ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ రైతులు ఎక్కువ మొత్తంలో సాగు చేయడం లేదు. మిల్లెట్స్ ను పూర్వకాలంలో పేదలు తినే వారు అనే అపోహ, వండడం సులభతరంగా లేకపోవడం, ప్రాసెసింగ్ యంత్రాలు అందుబాటులో లేకపోవడం, కనీస మద్దతు ధర, మార్కెట్ సదుపాయాల అందుబాటులో లేకపోవడం వలన పోషక ధాన్యాల సాగు మనదేశంలో తగినంతగా లేదు. మిల్లెట్స్ గురించి మీకు తెలుసా ! నిన్నటి ముతక ధాన్యాలు నేటి పోషక ధాన్యాలైన మిల్లెట్స్ - అలనాడు పేదవాడి ఆహారం. ఈరోజు అది అందరి ఆహారం మిల్లెట్ సాగులో చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవి చాలా తెగుళ్లు, వ్యాధులకు నిరోధకతను కలిగి ఉంటాయి. వివిధ రకాల వాతావరణ మార్పులను ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలుగుతాయి. పోషక ధాన్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ మరోవైపు చిన్నపిల్లల్లో పోషకార లోపాలలో మన దేశం రెండో స్థానంలో ఉన్నది. సుమారు 32 శాతం చిన్నపిల్లలు వయసుకు తగ్గ బరువు లేరు, 36 శాతం మంది పిల్లలలో సరైన ఎదుగుదల లేదు. అంతేకాకుండా 15-49. సంవత్సరాల వయసు గల ఆడవారిలో 50 శాతానికి పైగా రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నారు చాలా రకాల మిల్లెట్స్ బియ్యం, గోధుమల కన్నా మూడు నుండి నాలుగు రేట్ల కన్న ఎక్కువ పోషక విలువలు కలిగి ఉంటాయి ముఖ్యంగా పోషక ధాన్యాలలో ప్రోటీన్లు, విటమిన్లు, పీచు పదార్థం, ఖనిజ లవణాలు అధిక మోతాదులో లభ్యమవుతాయి. అందుకే చిరుధాన్యాలు లేదా పోషక ధాన్యాలను సూపర్ ఫుడ్స్ గా పిలుస్తారు. దేశంలో పెరుగుతున్న పోషకారాలోపాలను అధిగమించాలన్న, జీవనశైలికి సంబంధించిన వ్యాధులను అరికట్టి ప్రజా జీవితాన్ని మెరుగు పరచాలంటే మిల్లెట్ సాగు, మిల్లెట్స్ ను రెగ్యులర్ గా తినడం ఆచరణీయమైన పరిష్కార మార్గం. మిల్లెట్స్ తినడం ద్వారా శరీరానికి కావలసిన మంచి శక్తితో పాటు, పుష్కలంగా దొరికే పీచు పదార్థం, నెమ్మదిగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు తద్వారా రక్తంలోనికి గ్లూకోస్ నెమ్మదిగా విడుదలవుతుంది. ప్రీ డయాబెటిక్ పేషెంట్స్‌కు, టైప్ -2 డయాబెటిస్ పేషెంట్స్ కు మిల్లెట్స్ తినడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. 100 గ్రాముల మిల్లెట్స్ తినడం ద్వారా సుమారు 320 -370 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇది మన దేశ జాతీయ పోషకార సంస్థ నిర్దేశించిన రోజుకు ఒక మనిషి తీసుకునే శక్తి 2000 కిలో క్యాలరీలలో సుమారు 16–18.5%. చిరు ధాన్యాలను తీసుకోవడం ద్వారా కలిగే అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ముఖ్యంగా వీటిలో అధిక మొత్తంలో పీచు పదార్థం, గ్లూటెన్ ఫ్రీ ప్రోటీన్లు, తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్, ఇతర బయో యాక్టివ్ సమ్మేళనాలు కూడా అధికంగా ఉంటాయి. జొన్నలు, చిరుధాన్యాల లో సగటు కార్బోహైడ్రేట్ల 56.88-72.97%, ໖ 7.5-12.5%, కొవ్వు పదార్థాలు 1.3 -6.0% ఉంటాయి. అంతేకాకుండా అతి ముఖ్యమైన పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా విరివిగా దొరుకుతాయి. వివిధ పరిశోధనలో మిల్లెట్స్ విరివిరిగా తినడం ద్వారా క్యాన్సర్, స్థూలకాయత్వం, మధుమేహం, గుండె సంబంధ సమస్యలు, ఉబ్బసం, జీర్ణక్రియ సమస్యలు, కిడ్నీలో రాళ్ల సమస్యలు, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను తగ్గించుకోవడంతో పాటు వ్యాధుల బారిన ప్రబలకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. చిన్నపిల్లలకు, కిశోర బాల బాలికలకు, గర్భిణీ స్త్రీలకు మిల్లెట్స్‌తో చేసిన బలమైన పోషకాహార పదార్థాలను తినిపించడం ద్వారా వారిలో ఎదుగుదల, ఆరోగ్యం మెరుగుపడినదని ప్రయోగపూర్వకంగా వివిధ రకాల పరిశోధనా సంస్థలు నిరూపించాయి. పంట కోత అనంతరం మిల్లెట్స్ ను ప్రైమరీ ప్రాసెసింగ్ ద్వారా తినడానికి అనువుగాని భాగాలైనా పొట్టు లేదా ఉనుక వంటి భాగాలను తొలగించి బియ్యంగా మార్చి వండుకొని తినడం లేదా పిండిగా మార్చి వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలో ముడి సరుకుగా వాడుతారు. ప్రైమరీ ప్రాసెసింగ్‌లో భాగంగా మిల్లెట్స్‌ని నానబెట్టడం, మొలకెత్తించి మాల్ట్ తయారు చేయడం, పెనం పైన వేయించడం, ఎండబెట్టడం, పాలిషింగ్ చేయడం, మిల్లింగ్ చేసి పిండి, ఆట, రవ్వ వంటివి తయారు చేయడం. మిల్లెట్స్‌ను సెకండరీ ప్రాసెసింగ్ విధానంలో పులియబెట్టి ఇడ్లీ, దోస, పునుగులు, పొంగనాలు వడ, డోక్లా వంటి ఆహార పదార్థాలు, పార్బోయిలింగ్ పద్ధతి ద్వారా బియ్యం, రవ్వ వంటి ఆహార పదార్థాలను తయారు చేయడం, ఇన్సెంట్ కుకింగ్ మీల్స్ ముఖ్యంగా ఉప్మా, కిచిడి, పొంగల్, పులిహోర, పెరుగన్నం, పాయసం, బిర్యానీ, పలావ్ వంటివి తయారు చేయవచ్చు, పఫ్ఫింగ్ ద్వారా మురుముర్లు, అటుకులు, వివిధ ఇండస్ట్రీలకు అవసరమైన మిల్లెట్స్ ఇంగ్రెడైంట్స్ ( ముడి సరుకు) ద్వారా వివిధ రకాల తినుబండారాలు, సౌకర్యవంతమైన వంట గదిలో వండుకునే ఆహార పదార్థాలు ముఖ్యంగా నూడిల్స్, వర్మిసెల్లి, పాస్తా, సూప్ మిక్స్, బేకరీ మిక్సెస్, కుకీస్, బిస్కెట్స్, పాన్ కేక్స్, కేక్ మిక్సెస్ మరెన్నో సంప్రదాయ ఆహార పదార్థాలను తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. ప్రధానమైన తృణధాన్యాలతో పోలిస్తే మిల్లెట్లలో పిండిపదార్థం లేని పాలీశాకరైడ్లు, డైటరీ ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉంటాయి. మిల్లెట్స్ లో అధిక మోతాదులో పీచు పదార్థం ఉండడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను మన శరీరానికి అందిస్తాయి. ముఖ్యంగా జీర్ణకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రక్తంలో చక్కెర, కొవ్వుల నియంత్రణ. వివిధ చిరుధాన్యాలు (మిల్లెట్స్) లో పోషక విలువలు ప్రతి 100 గ్రాములకు మిల్లెట్స్ ప్రోటీన్లు(గ్రా) కొవ్వు పదార్థాలు(గ్రా) పీచు పదార్థం(గ్రా) కార్బోహైడ్రేట్లు(గ్రా) ఖనిజ లవణాలు ఇనుము(మి.గ్రా.) కాల్షియం(మి.గ్రా.) జొన్నలు 10.4 1.9 1.6 72.6 1.6 4.1 25 కొర్రలు 12.3 4.3 8.0 60.9 3.3 2.8 31 కొర్రలు 11.6 5.0 1.2 67.5 2.3 8.0 42 రాగులు 7.3 1.3 3.6 72.0 2.7 3.9 344 ఆరికలు 11.0 3.6 10.0 66.6 1.9 0.5 27 సామలు 7.7 – 7.6 – 1.5 9.3 27 ఊదలు 12.5 4.2 2.2 73.0 1.9 0.8 14 ఉదలు 12.2 3.85 10.1 55.8 3.2 1.4 24 అండు కొర్రలు 11.5 – 12.5 69.37 4.21 0.65 100 ఆధారం : పాడిపంటలు ఎ. పోశాద్రి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్.