వయ్యారిభామ పేరు లో అందం- నియంత్రించకుంటే ప్రమాదం పార్టీనియం (వయ్యారిభామ) మొక్కను మాచెర్ల కంచె, పిచ్చి గంజాయి, వయ్యారి భామ అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ మొక్క మనదేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలో వ్యాపించి ఉ న్నది. ఇది సుమారు 1-1.5 మీ. ఎత్తు నూగు కలిగిన కాండము, తెల్లని పూలతో బంతి చెట్టును పోలి ఉంటుంది. ఈ కలుపు మొక్కలు పి. ఎల్. 480 స్కీము ద్వారా మనదేశంలోకి 1950 లో అమెరికా నుండి దిగుమతి చేసుకున్న గోధుమలతో కలిసి వచ్చి దేశం అంతటా వ్యాప్తి చెందింది. మన దేశంలో ఈ మొక్కను మొట్టమొదట 1956లో గుర్తించారు. దీని పుప్పొడిని పీలిస్తే జలుబు, కండ్లు ఎర్రబడుట, జ్వరం వస్తాయి. ఎండిపోయిన మొక్కలను తగలబెట్టినపుడు ఆ పొగను పీలిస్తే ఉబ్బసం వంటి వ్యాధులు వస్తాయి. ఈ మొక్కలు పశువులకు కూడా హానికరం. ఈ మొక్క అన్ని భాగాలలో “పార్థానిన్” అనే విష పదార్థం ఉంది. ఈ విషపూరిత రసాయనాలు వర్షం ద్వారా మొక్క పై భాగం నుంచి నేలలో చేరి ఏ ఇతర మొక్కలను పెరగనివ్వవు. పైర్ల మొక్కలను సరిగా మొలకెత్తనివ్వవు. ఒకవేళ మొలకెత్తినా సరిగా ఎదగనివ్వవు. భూసారాన్ని పెంచే సూక్ష్మజీవులను చంపివేస్తాయి. ఈ విత్తనాలు చాలా తేలికగా ఉండడం వల్ల గాలి, నీరు ద్వారా వ్యాపించగలవు. దీని జీవిత కాలం నాలుగు నెలలు. కావున, మొక్కలు పుష్పించక ముందే పూర్తిగా నిర్మూలించవలసిన అవసరం ఉంది. సాధారణంగా పంటపొలాలలో సిఫారసు చేసిన రసాయనాలు దీని నిర్మూలనకు సరిపోతాయి. పంటలు లేని ప్రదేశాల్లో 1 లీటరు నీటికి 2 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్ 80% పొడిమందు లేదా లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున అట్రాజిన్ 50 శాతం పొడిమందులలో ఏదో ఒక దానిని నీటిలో కలిపి పూతకు ముందు పిచికారీ చేయాలి లేదా పార్థీనియం మొలకెత్తిన ప్రదేశాల్లో తంగేడు జాతికి చెందిన 'కాసియా సెరెసియా' అను మొక్క విత్తనాలను లేదా బంతి విత్తనాలను వెదజల్లితే ఈ మొక్కల పెరుగుదలను అరికట్టవచ్చును. ఈ మొక్కవలన సామాజిక ఆరోగ్యం దెబ్బ తింటుంది. కనుక ప్రభుత్వం, ప్రజలు సామూహికంగా నిర్మూలన చేపట్టాలి. ఇది పంటలకు, పశువులకు, పర్యావరణానికి మన ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. అందువల్ల దీన్ని నియంత్రించడం అత్యంత అవసరం.పార్థీనియం అనే కలుపు మొక్క వర్షాకాలంలో (జూన్-సెప్టెంబర్) ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో ఇది పుష్కలంగా పెరిగి పూలు, గింజలు ఉత్పత్తి చేసి వేగంగా వ్యాపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో, పాఠశాలల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో పార్థేనియం నిర్మూలన కార్యక్రమాలు చేపట్టాలి. పార్థీనియం మొక్క 90 రోజులు మాత్రమే జీవిస్తుంది. 40 నుంచి 60 రోజుల వరకు పూత పూస్తుంది. ఒక్కో మొక్క సుమారు 40 వేలగింజల్ని ఉత్పత్తి చేస్తుంది. దీనికి కాలంతో నిమిత్తం లేదు. ఎప్పుడైనా మొలుస్తుంది. ఎప్పుడైనా పూస్తుంది. పంట పొలాల్లో, గట్ల మీద, రోడ్ల వెంబడి, కాలువల పక్కన, ఖాళీ స్థలాల్లోకాస్త జాగా దొరికితే చాలు మొలిచి పెరుగుతుంది. పంట వేయని పొలాల్లో దీని ఉధృతి మరింత ఎక్కువగా ఉంటుంది. మామిడి సహా అన్ని రకాల తోటల్లోనూ వయ్యారిభామ మొక్కలు పంట మాదిరిగా పెరుగుతాయి. పార్థీనియం కలుపు హానికర ప్రభావాలు వ్యవసాయంపై ప్రభావం: పార్థీనియం మొక్క పంటల దిగుబడిని 40% నుండి 90% వరకు తగ్గించగలదు. ఇది పంటల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.మానవ ఆరోగ్యంపై ప్రభావం: ఈ మొక్క నుంచి వచ్చే రసాయనాలు చర్మ అలర్జీలు, శ్వాస సంబంధిత సమస్యలు (ఆస్తమా), జ్వరాలు డెర్మటైటిస్ వంటి ఆరోగ్య సమస్యలను కలిగించగలవు.పశువులపై ప్రభావం: పార్థీనియం మేతగా తినడం వల్ల పశువుల పాల ఉత్పత్తి తగ్గుతుంది మరియు వాటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.పర్యావరణంపై ప్రభావం: ఇది స్థానిక మొక్కల జీవ వైవిధ్యాన్ని తగ్గిస్తుంది, తేనెటీగలు, ఇతర పరాగ సంపర్క కీటకాలు దీని పువ్వుల వల్ల ప్రభావితమై, పరాగ సంపర్కం తగ్గుతుంది. జీవ వైవిధ్యం తగ్గడం వలన పర్యావరణ సమతుల్యం దెబ్బతిని, వాతావరణ మార్పులు తీవ్రం అవుతాయి. నియంత్రణ, నివారణ చర్యలు పంట పొలాల్లో మొలిచిన వయ్యారిభామ పూత పూయక ముందే వేర్లతో సహా పీకి బురదలో తొక్కెయ్యాలి. తర్వాత నీరు పెడితే అది బాగా మురిగి పచ్చరొట్ట ఎరువుగా మారుతుంది. లేదా ఇది పూత దశకు రాకముందే వేళ్లతో సహా. పీకి తగల బెట్టాలి. కాలుతున్నప్పుడు వచ్చే పొగకు దూరంగా ఉండాలి. తంగేడు చెట్లు ఉన్న ప్రాంతంలో ఈ మొక్క మొలవదు. వయ్యారి భామను నివారించే శక్తి తంగేడు మొక్కకు మాత్రమే ఉంటుంది. పొలాల గట్లు, బంజరు భూముల్లో తంగేడు చెట్లను తొలగించకూడదు. యాంత్రిక/మానవీయ పద్ధతుల్లో నియంత్రణ వర్షం పడకముందే చిన్న దశలోనే మొక్కలను చేతితో పీకివేయాలి. పీకేటప్పుడు క్లౌజులు, మాస్క్ ధరించడం అవసరం (అలర్జీలు రాకుండా). పీకిన మొక్కలను గుంతలో వేసి మట్టితో కప్పేయాలి. పార్థీనియం పెరుగుదలని అడ్డుకునే ఇతర పంటలు/మొక్కలు నాటాలి. ఉదా: బంతి, సన్ఫ్లవర్, సవాన్ గడ్డివంటి మొక్కలు. పశువుల మేత కోసం మెరుగైన గడ్డి మొక్కలను పెంచడం వల్ల వయ్యారి భామ తగ్గుతుంది. జీవ నియంత్రణ పద్ధతులలో ఒక్కో మొక్కపై 10 జైకోగ్రామా బదనికల్ని వదిలితే అవి వయ్యారిభామ మొక్కల ఆకులు, పూలను తినేస్తాయి. ఇది పర్యావరణానికి హానికరం కాదు, సహజ నియంత్రణ పద్ధతి. రసాయనిక నియంత్రణ వయ్యారిభామ మొక్క మొలిచిన తర్వాత లీటరు నీటికి 4 మి.లీ. చొప్పున గ్లూఫోసినేట్ అమోనియం లేదా లీటరు నీటికి 5 మి.లీ. చొప్పున పారాక్వాట్ కలిపి పిచికారీ చేయవచ్చు. లీటరు నీటికి 2-4 గ్రాముల సోడియం క్లోరైడ్ కలిపి మొక్కలపై పిచికారీ చేసినా కొంత ఫలితం ఉంటుంది. అవగాహన కార్యక్రమాలు వయ్యారి భామ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. ఒక్క పద్ధతి కాకుండా, సమగ్ర కలుపు నిర్వహణ పద్ధతులు పాటిస్తే దీన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయమేమంటే.. పూతకు రాకముందే వయ్యారిభామ మొక్కల్ని పీకి తగలబెట్టాలి. పూతకు వచ్చిన తర్వాత పీకితే విత్తనాలు నేలపై రాలి మళ్లీ కొత్త మొక్కలు వస్తాయి. ఆధారం : పాడిపంటలు మాస పత్రిక డా. ఎస్.ప్రతిభ శ్రీ ప్రధాన శాస్త్రవేత్త, (సమగ్ర కలుపు యాజమాన్య విభాగం) ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం, లాం, గుంటూరు.