క్యాబేజ్, కాలీఫ్లవర్ సాగులో మెలకువలు చల్లని వాతావరణం కలిగిన శీతాకాలంలో సాగు చేయదగిన కూరగాయ పంటలలో ఆకు మరియు పువ్వు గోబీలు ముఖ్యమైనవి. ముఖ్యంగా ఆకు గోబీ పంటను విటమిన్లతో నిండిన ఆకు కూరగా వర్ణిస్తారు. పంట మార్పిడి విధానంలో ఆకు మరియు పువ్వు గోబీ పంటలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. చల్లని వాతావరణం కలిగిన ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో వీటిని శీతాకాలపు పంటలుగా సాగు చేస్తారు. దక్షిణ భారత దేశంలోని ఎతైన కొండ ప్రాంతాలలో కూడా సాగు చేస్తారు. ఉష్ణ మండల ప్రాంతాలకు అనువైన రకాలను వృద్ధి చేసిన తర్వాత ఈ పంటలను మన రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో విస్తృతంగా సాగు చేస్తున్నారు. చలి తక్కువగా ఉండే ఉష్ణ మండల ప్రాంతాలలో సాగు చేసే రకాలు లేదా వంగడాలు సాధారణంగా ఉష్ణ వాతావరణాన్ని తట్టుకోగలిగి తరువాత కాపుకొచ్చేవిగా ఉంటాయి. చలి తక్కువ ఉన్న ప్రాంతాలలో సాగు చేసే రకాలు సాధారణంగా లేత పసుపు పచ్చని వర్ణంలో ధృఢంగా ఉంటాయి. సాగు సమయం: తెలుగు రాష్ట్రాలలో ఈ పంటను సెప్టెంబర్ ఫిబ్రవరి మాసాల మధ్య సాగు చేస్తుంటారు. నేలలు: సారవంతమైన బాగా నీరు ఇంకే ఇసుకతో కూడిన నేలలు చాలా అనువైనవి. నేల ఉదజని సూచిక 6.0-6.5 మధ్య ఉండాలి. అధిక ఆమ్ల లేదా చౌడు నేలలు ఈ పంట సాగుకు పనికి రావు. విత్తన మోతాదు : ఎకరా పొలానికి సరిపడ నారును పొందుటకు సూటి రకాలైతే 300 గ్రామాలు హైబ్రీడ్ వంగడాలైతే 100 150 గ్రామల విత్తనం సరిపోతుంది. విత్తన శుద్ధి కిలో విత్తనానికి 3 గ్రాముల ధైరమ్ ను కలిపి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి. విత్తనాలను ఇసుక లేదా కంపోస్టుతో కలిపి పలుచగా వరసలలో విత్తుకోవాలి. విత్తనాలు మొలకెత్తే వరకూ రోజు నీటి తడిని అందించాలి. సాధారణంగా 25-30 రోజులు వయస్సు గల నారు నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రతి విత్తనం మొలకెత్తుతుంది మరియు నారు కుళ్ళు తెగులను అదుపులో ఉంచవచ్చును. నాటే సమయం: తెలుగు రాష్ట్రాలలో ఈ పంటలను శీతాకాలపు పంటలుగా సాగు చేస్తున్నపుడు అక్టోబర్- నవంబరు మాసాలు అనువుగా ఉంటాయి. రకాలు/వంగడాలు: ఆకు మరియు పువ్వు గోబి పంటలలో అధిక దిగుబడినిచ్చే అనేక సూటి రకాలు మరియు హైబ్రీడ్ వంగడాలు మార్కెట్లో లభ్యమగుచున్నవి. వాటిలో ముఖ్యమైన కొన్నింటి వివరాలను పరిశీలిద్దాం. ఆకు గోబి రకాలు గోల్డెన్ ఎకర్: ఇది స్వల్ప కాలిక రకం ఆకు గుండ్రంగా ఆకర్షనీయమైన ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పంట కాలం 60-65 రోజులు ఉంటుంది. ప్రైడ్ ఆఫ్ ఇండియా : ఇది కూడా తక్కువ కాల వ్యవధిలో కోతకు వస్తుంది. ఆకు గడ్డలు గోల్డెన్ ఎకర్ కంటే కొంచెం పెద్దవిగా ఉంటాయి. పూసా ముక్తా : ఇది నల్ల తెగులును తట్టుకునే రకం. పంట కాలం 70-75 రోజులుగా ఉంటుంది. సెప్టెంబర్ ఎర్లీ : మధ్యస్థ పరిమాణం గల ఆకు గడ్డలను ఉత్పత్తి చేస్తుంది. లేట్ డ్రమ్ హెడ్ : ఇది ఆలస్యంగా కోతకు వచ్చే రకం. ఆకు గడ్డలు పెద్దవిగా, ధృఢంగా ఉండును. పువ్వు గోబీ రకాలు పూసా దీపాలి : శీతాకాలంలో ముందుగా విత్తుకోవడానికి అనువైన రకం. పువ్వు గడ్డలు తెల్లగా, ధృఢంగా ఉంటాయి. పంట కాలం 90-100 రోజుల ఉంటుంది. స్నోబాల్ -16 : శీతకాలంలో పండే రకం, పూగడ్డలు తెల్లగా, గుండ్రంగా ఉంటాయి. పంట కాలం 100-120 రోజులు ఉంటుంది. పూసా స్నోబాల్ కె-1 : ఈ రకం నల్ల కుళ్ళు తెగులును తట్టుకుంటుంది. పువ్వులు తెల్లగా ఉంటాయి, ఆలస్యంగా నాటు కోవడానికి అనువైన రకం. పూసా హైబ్రీడ్ -2 : బూజు తెగులును తట్టుకునే రకం, పూ గడ్డ సమానంగా కిలో బరువు ఉంటుంది. పూసా శుభ్ర : నల్లకుళ్ళు తెగులును తట్టుకుంటుంది, పూగడ్డలు తెల్లగా, నున్నగా ఉంటాయి. రైతులు ఆయా ప్రాంత వాతావరణ మరియు నేల స్వభావానికి అనుకూలమైన రకాలను ఎంచుకోవడానికి స్థానిక రైతులు, ఉద్యాన శాస్త్రవేత్తలు లేదా ఉద్యాన అధికారులను సంప్రదించడం ఉత్తమం అలాగే మార్కెట్లో లభించే క్రొత్త రకాల గురించి మరియు వాటి పనితీరు గురించి పూర్తి సమాచారం పొందడం ద్వారా రైతులు మంచి లాభాలు పొందవచ్చును. సాగు యాజమాన్యం నేలను 3-4 సార్లు బాగా దున్ని గుల్ల బరుచుకోవాలి, చివరి దుక్కిలో ఎకరానికి 8-10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువును వేసి కలియ దున్నాలి. ఆకు గోబీలో స్వల్ప కాలిక రకాలకు 45 సెం. మీ. × 45 సెం.మీ దీర్ఘకాలిక రకాలకు 60 సెం. మీ. × 45 సెం.మీ దూరంలో నాటుకోవాలి. పూగోబీ రకాలను సాధారణంగా 60 సెం.మీ X. 45 సెం.మీ దూరంలో నాటుకోవాలి. ఎరువుల యాజమాన్యం అధిక దిగుబడి సాధనకు ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్యం చివరి దుక్కిలో ఎకారానికి 8-10 టన్నుల బాగా కుళ్ళిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. సేంద్రీయ ఎరువుతో పాటు రసాయనిక ఎరువులను కూడా వేయాల్సి ఉంటుంది. చివరి దుక్కిలో ఎకరానికి 32-40 కిలోల భాస్వరం (200 – 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్) ఎరువు మరియు 40 కిలోల పోటాష్ (65 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్) నిచ్చు ఎరువులను వేసి బాగా కలియదున్నాలి. పూగోబీలో పూ గడ్డలు గట్టిగా ఉండటానికి మరియు రంగు కోల్పోకుండా ఉండటానికి బోరాక్సిల్ (బోరాక్స్) ధాతువును 1.0 1.5 గ్రాముల లీటరు నీటికి కలిపి పువ్వు అభివృద్ధి చెందే -దశలో పిచికారి చేయాలి. నీటి యాజమాన్యం మరియు అంతరకృషి మొక్కలకు నిరంతరం తేమ ఉండేలా చూడాలి. నేల రకాన్ని బట్టి 7-10 రోజుల వ్యవధి లో నీటి తడులనివ్వాలి. కలుపు మొక్కలు లేకుండా పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. పూగోబీలో పువ్వు ఏర్పడిన తరువాత ఎండ తగలకుండా ఆకులతో కప్పి ఉంచాలి. దీని వలన పువ్వు తెల్లగా ఉంటుంది. ఆకు గోబీలో గడ్డ గట్టి పడే సమయంలో నేలకు అంటి ఉన్న ఆకులను తీసి వేయడం వలన గడ్డ నాణ్యత బాగుంటుంది. చీడ పీడల నివారణ ఆకు మరియు పూగోబీలనుఆశించే ముఖ్యమైన చీడ పీడలలో ఆకు తినే పురుగులు ప్రధానమైనవి. క్యాబేజీ వాపర్ నివారణ కొరకు లీటరు నీటికి 0.3 మీ.లీ క్లోరంత్రా నిలిప్రొల్ మందును కలిపి పిచికారీ చేయాలి. నల్ల కుళ్ళు తెగలు నివారణ కొరకు లీటరు నీటికి 2.5 గ్రా|| కాపర్ ఆక్సీ క్లోరైడ్ మరియు 0.5 గ్రా. (స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ మందులను కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. కోత మరియు దిగుబడి: గోబీ పువ్వు తెల్లగా, గట్టిగా గుండ్రంగా ఉన్నపుడే కోయాలి. ఆలస్యం చేస్తే, పువ్వులు వదులైపోయి రంగు మారతాయి. ఎకరం పొలం నుండి 12-15 టన్నుల దిగూడి వస్తుంది. ఆధారం: పాడి పంటలు డా. వి. విజయ్ భాస్కర్ , శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం) డా.వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వ విద్యాలయం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.