వర్షాభావ పరిస్థితుల్లో వేసుకోదగ్గ ప్రత్యామ్నాయ పంటలు ఎల్ నినో ప్రభావంతో 2026 ఆగస్టు నాటికి ఆంధ్రప్రదేశ్ ఋతుపవన వర్షపాతంలో అనిశ్చిత మరియు లోటు వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఈ పరిస్థితుల్లో నీటి సంరక్షణ, నేలతేమ పరిరక్షణ, తక్కువ నీటి అవసరమున్న పంటలు, చిరుధాన్యాల సాగు, ప్రత్యామ్నాయ పంట ప్రణాళిక మరియు సూక్ష్మ సాగునీటి పద్ధతులు ప్రోత్సహించాలి. ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితుల్లో రైతులు బెట్ట పరిస్థితులను తట్టుకోగలిగే పంటలు, తక్కువ ఖర్చుతో కూడుకున్న పంటలను సాగు చేయాలి. ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో వేసుకోదగ్గ ప్రత్యామ్నాయ పంటల గురించి తెలుసుకుందాం. కంది అనుకూల రకాలు: ఎల్.ఆర్.జి 52, ఎల్.ఆర్.జి 105, టి.ఆర్.జి 59, లక్ష్మీ, ఆశ, పి.ఆర్.జి 158, పి.ఆర్.జి 176 (ఉజ్వల)విత్తన మోతాదు: ఎకరాకి 6-8 కిలోలు, విత్తన శుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రా. మాంకోజెబ్ పట్టించి విత్తన శుద్ధి చేయాలి. విత్తే దూరం: 45-90×10 సెం.మీ. ఎరువులు : చివరి దుక్కిలో ఎకరాకి 2 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని 20 కిలోల చొప్పున భాస్వరం వేసుకోవాలి. కలుపు యాజమాన్యం: ఎకరాకు 1.3 లీటర్ల పెండిమిథాలిన్ 200 లీ. నీటిలో కలిపి విత్తైన రెండు రోజుల లోపు నేలపై పిచికారీ చేయాలి. విత్తిన 30, 60 రోజుల వయస్సులో గుంటక లేక గొర్రుతో అంతర కృషి తప్పనిసరిగా చేయవలెను. మినుము అనుకూల రకాలు: ఎల్.బి.జి -787, పి.యు -31, టి.బి.జి-104. జి.బి.జి-1, ఎల్.బి.జి-884, విత్తన మోతాదు,విత్తే దూరం: 8-10కిలోలు/ ఎకరానికి, 30×10 సెం.మీ. ఎరువుల యాజమాన్యం: భూమిని బాగా దుక్కి దున్ని విత్తటానికి ముందు ఎకరాకు 8 కిలోల నత్రజని 20 కిలోల భాస్వరంను ఇచ్చే ఎరువులను వేసి గొర్రుతో కలయ దున్నాలి. కలుపు నివారణ: పెండిమిథాలిన్ ఎకరాకు 1-1.5 లీటర్లు లేదా అలాక్లోర్ ఎకరాకు 1లీ. చొప్పున విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. వెడల్పాకు గడ్డి జాతి కలుపు . ఉన్నప్పుడు 200 మి.లీ ఇమజితాఫిర్ను 200 లీటర్ల నీటిలో కలుపుకొని 20-25 రోజుల పొలంలో తేమగా ఉన్నప్పుడు, కలుపు 2-4 ఆకుల దశలో పిచికారీ చేసుకోవాలి. పెసర రకాలు: డబ్ల్యూ.జి.జి -42, ఐ.పి.ఎం 2-14, ఎల్.జి.జి 607. విత్తన మోతాదు: ఎకరానికి 6-7 కిలోలు విత్తే దూరం: వరుసల మధ్య 30 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. ఉండేటట్లు గొర్రుతో విత్తుకోవాలి. విత్తన శుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్/కాప్టన్, కార్బెండజిమ్, 5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రా. థయోమిథాక్సామ్తో కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఎరువులు : ఎకరాకు 8 కిలోల నత్రజనిని, 20 కిలోల భాస్వరాన్ని విత్తడానికి ముందు వేసుకోవాలి. కలుపు యాజమాన్యం: ఎకరాకు 1.3 లీటర్ల పెండిమిథాలిన్ 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20, 25 రోజులప్పుడు గుంటక లేక గొర్రుతో అంతర కృషి చెయ్యాలి. సజ్జ కాంపోజిట్ రకాలు: ఐ.సి. ఎం.వి 221 ఏ.బి.వి 04, ఐ.సి.టి.పి 8203. సంకర రకాలు : హెచ్. హెచ్.బి 67.పి.హెచ్.బి 3, ఆర్.హెచ్.బి 121, ఐ.సి.ఎం.హెచ్. 356. విత్తన మోతాదు : ఎకరానికి 2 కిలోలు, విత్తే దూరం: 45×15 సెం.మీ. విత్తన శుద్ధి: కిలో విత్తనాలకు 3 గ్రా. థైరం లేదా కాప్టాన్ మందు కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎరువులు: పశువుల ఎరువు 4 టన్నులు, ఎకరాకు ఆఖరి దుక్కిలో 12 కిలోలు నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం, 30-35 రోజుల సమయంలో 12 కిలోల నత్రజని వేసుకోవాలి. కలుపు యాజమాన్యం: అట్రాజిన్ 50% పొడి మందు ఎకరాకు 600గ్రా. 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేయాలి. జొన్న రకాలు : సి.ఎస్.హెచ్ 15, ఆర్.సి.ఎస్.హెచ్16, ఎన్.టి.జె 5, ఎన్ 15, యం. 35-1, పి.ఎస్.వి-56 నేలలు: నల్ల రేగడి నేలలు, నీటి సౌకర్యం ఉన్న ఎర్ర నేలలు, విత్తే సమయం : మాఘీ జొన్నను సెప్టెంబర్ నెలలో రెండవ పక్షములో విత్తు కోవాలి. విత్తన శుద్ధి : కిలో విత్తనానికి 3 గ్రాముల ధైరం లేదా కాప్టాన్ లేదా 1.5 గ్రాముల టెబ్యుకోనజోల్ 2% మందును కలిపి విత్తనశుద్ది చేయాలి. మొవ్వ ఈగ నివారణకు ఒక కిలో విత్తనానికి 3 గ్రాముల థయోమిథాక్సామ్ మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. విత్తన మోతాదు, విత్తే దూరం: 8-10 కేజి/హె, 45× 15 సెం.మీ. ఎరువుల యాజమాన్యం: పశువుల ఎరువు-4 టన్నులు/ఎ, ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం12 కిలోల పోటాష్ ని ఎకరానికి వేసుకోవాలి. నత్రజని ఎరువును రెండు దఫాలుగా విత్తేముందు, మోకాలు ఎత్తు పైరు దశలో వేయాలి. కలుపు యాజమాన్యం : విత్తిన వెంటనే లేదా 2 రోజుల లోపల తడి నేల పై అట్రాజిన్ 50% పొడి మందును ఎకరాకు 800 గ్రా. చొప్పున 250 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 30 రోజులకు గుంటక లేదా దంతితో అంతర కృషి చేయడం వలన పొలంలో కలుపు నివారణ జరగడంతో పాటు తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి. కొర్ర రకాలు : సూర్య నంది, గరుడ, రేనాడు, మహానంది, ఎస్ ఐ ఎ-3156, ఎస్ ఐ ఎ- 3085. విత్తే సమయం: కొర్ర ఒక ప్రత్యామ్నాయ పంటగా ఆగష్టు రెండవ పక్షంలో కూడా విత్తుకొని మంచి దిగుబడులు పొందవచ్చు. విత్తన మోతాదు: సరాసరి ఒక ఎకరాకు వరుసల్లో నాటడానికి 2కి. విత్తనము, వెదజల్లుటకు 4-7 కిలోల విత్తనము సరిపోతుంది.. విత్తన శుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్ లేదా మాంకోజెబ్ లేదా 2గ్రా. ట్రైసైక్లోజోల్తో విత్తన శుద్ధి చేసి విత్తనాల ద్వారా సంక్రమించే శిలీంధ్రాలు రాకుండా కాపాడు కోవచ్చు, లేత దశలో మొక్కలను తెగులు బారి నుండి కాపాడు కోవచ్చు. విత్తే పద్ధతి: వరుసలకు మధ్య 22.5 సెం.మీ, మొక్కల మధ్య 7.5 సెం.మీ దూరం ఉండేటట్లు సుమారు 2.0 సెం.మీ. లోతులో విత్తనం గొర్రుతో విత్తుకోవాలి. ఎరువుల యాజమాన్యం: ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. ఎకరాకు 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం విత్తేటప్పుడు వేయాలి. విత్తిన 3-4 వారాల తర్వాత నేలలో తగిన తేమ చూసి పైపాటుగా మరో 8 కిలోల నత్రజనిని వేసుకోవాలి. కలుపు నివారణ అంతర కృషి : విత్తిన 30 రోజుల వరకు పంట పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూడాలి. ఐసో ప్రొట్యురాన్ 400 గ్రాములను 200 లీ. నీటితో కలిపి విత్తిన వెంటనే లేదా రెండు రోజుల లోపల నేలతడిచేటట్టు పిచికారీ చేయాలి. వర్షపాతం ఆలస్యం లేదా లోటుగా ఉన్న పరిస్థితుల్లో రైతులు పంటకాలం, నేల రకం, నేలతేమ, అందుబాటులో ఉన్న నీటి వనరులను పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలి. తక్కువ కాలంలో కోతకు వచ్చే, బెట్ట పరిస్థితు లను తట్టుకునే తక్కువ నీటి అవసరమున్న పప్పుధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనెగింజల పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సమ యానుకూలంగా పంట మార్పిడి, నేలతేమ సంరక్షణ, సూక్ష్మ సాగు నీటి పద్ధతులు నీటి సమర్థ వినియోగం ద్వారా ఎల్న్ని వల్ల కలిగే పంటనష్టాలను తగ్గించి, రైతుల ఆదాయాన్ని స్థిరీకరించవచ్చు. ఆధారం: పాడిపంటలు మాసపత్రిక డా. కె. సాయిమహేశ్వరి, శాస్త్రవేత్త (సేద్య విభాగం), కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు, కడప,