టమాటా మేలైన సాగుతో ఆదాయపు బాట రైతులు సరైన రకాలను ఎంపిక చేసుకోకపోవడం, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించక పోవడం వలన ఆశించిన దిగుబడులను సాధించలేకపొతున్నారు. రైతులు టమాటా రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు తప్పనిసరిగా కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. మనం ఎంపిక చేసిన రకం తప్పనిసరిగా మనం పంట వేసుకునే సీజనకు అనుగుణంగా ఉండాలి. లోకల్ మార్కెట్ లేదా ప్రాసెసింగ్ కి తగ్గట్టుగా ఉండాలి. వాతావరణం టమాట పంటను సంవత్సరం పొడవునా అన్ని ఋతువుల్లోనూ సాగుచేయవచ్చు. అధిక దిగుబడికి శీతాకాలం అనుకూలం. అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ వర్షపాతానికి తట్టుకోలేదు. నేలలు బాగా నీరు ఇంకే బరువైన గరపనేలలు ఈ పంటకు అనుకూలం. వర్షాకాలంలో తేలికపాటి నేలల్లో వర్షాధార పంటగా కూడా సాగు చేయవచ్చు. శీతాకాలంలో దీనిని ఇసుకతో కూడిన గరప నేలల నుంచి బరువైన బంక నేలల్లాంటి వివిధ రకాల నేలల్లో సాగుచేయవచ్చు. మురుగు నీటి వసతి లేని భూములు, చౌడు భూములు ఈ పంటకు అనుకూలం కాదు. విత్తన మోతాదు ఎకరాకు సూటి రకాలకు 200గ్రా. సంకరజాతి రకాలకు 60-80గ్రా. విత్తనం కావాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్ లేదా 3 గ్రా. మెటలాక్సిల్, 2 గంటల తర్వాత 4 గ్రా. ట్రైకోడెర్మాతో విత్తనశుద్ధి చేయాలి. వేసవిలో రసంపీల్చు పురుగుల బెడద తట్టుకునే విధంగా ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రా/ కిలో విత్తనానికి పట్టించి ఆ తర్వాత శిలీంధ్ర నాశనులతో విత్తనశుద్ధి చేయాలి. నారు పోయటం ఎకరం పొలంలో నాటడానికి 4×1 చ.మీ. విస్తీర్ణం గల, 6" ఎత్తైన 8 నుండి 10 నారుమళ్ళు తయారుచేయాలి. నారుకుళ్ళు తెగులు సోకకుండా ముందు జాగ్రత్తగా లీటరు నీటికి 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 0.5% బోర్డో మిశ్రమంతో నారుమళ్ళను శుద్ధి చేయాలి (100 లీ. మందు ద్రావణం 40 చ.మీ. నారుమడికి). విత్తే ముందు విత్తనాలను 60° సెల్సియస్ వేడి నీటిలో 5-10 నిముషాల సేపు వుంచి తీయాలి. నారుమడిలో 10 సెం.మీ. ఎడంతో వరుసల్లో 1-1.5 సెం.మీ. లోతులో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి. విత్తిన వెంటనే రోజ్ కాన్ తో నీటిని చల్లి వరిగడ్డితో నారుమళ్ళను కప్పాలి. విత్తనాలు మొలకెత్తిన వెంటనే (7-10 రోజులకు) మల్చింగ్ వేసిన వరిగడ్డి లేదా పాలిథీన్ షీట్ తీసివేయాలి. 2-3 వారాల వయసులో నారుకుళ్ళు తెగులు రాకుండా కాపర్ ఆక్సీక్లోరైడ్ (2.5 గ్రా./లీ) పిచికారీ చేయాలి. 3 వారాల వయసుగల నారుమడికి రసంపీల్చే పురుగుల నుండి రక్షణకు కార్బోఫ్యూరాన్ 3 జి. గుళికలు 40 చ.మీ. నారుమడికి 100 గ్రా. చొప్పున వేసి నీటి తడి ఇవ్వాలి. నారుమడిని పీకడానికి 2-3 రోజులకు ముందుగా లీటరు నీటికి 2 మి.లీ. డైమిథోయేట్ 1 గ్రా. కార్బండిజంను కలిపి నారుమడిపై పిచికారీ చేయాలి. నారుమడిలో మొక్కలు ధృఢపడటానికి గింజ విత్తిన 21-25 రోజుల మధ్య రోజు విడిచి రోజూ నీరు కట్టాలి. 21-25 రోజుల వయసు ఉండి 3-4 ఆకులు గల మొక్కల్ని నాటుకోవాలి. సాధ్యమైనంత వరకు 30 రోజులు మించిన ముదురు నారును నాటరాదు. నాటటం వర్షాకాలంలో 60×45 సెం. మీ., శీతాకాలంలో 60x60 సెం.మీ., వేసవిలో 45x30 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. ఎరువులు చివరి దుక్కిలో ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. నాటేటప్పుడు ఎకరాకు 24 కిలోల భాస్వరం (150 కిలోల సూపర్ ఫాస్పేట్) మరియు 24 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను (40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) వేయాలి. 48-60 కిలోల నత్రజనిని 3 సమపాళ్ళుగా చేసి, నాటిన 30, 45 మరియు 60 వ రోజున పైపాటుగా వేసి బోదెలు ఎగదోయాలి. పూత దశలో లీటరు నీటికి 20 గ్రా. యూరియాను కలిపి పిచికారీ చేస్తే 15-20% దిగుబడి పెరుగుతుంది. నాటే ముందు ఎకరాకు 8–12 కిలోల చొప్పున బోరాక్స్ వేసినట్లయితే పండ్లు పగలకుండా వుంటాయి. ఎకరానికి 10 కిలోల చొప్పున జింకు సల్ఫేట్ వేసినట్లయితే జింక్ లోపం రాకుండా వుంటుంది. కలుపు నివారణ, అంతరకృషి కలుపు నివారణకు ఎకరాకు పెండిమిథాలిన్ 1.0 లీ. (తేలిక నేలలు), 1.20 లీ. (బరువు నేలలు) 200లీటర్ల నీటిలో కలిపి నాటిన 48 గంటలలోపు తడినేలపై పిచికారీ చేయాలి. మెట్రిబుజిన్ అనే మందును 300 గ్రా. మోతాదులో నాటిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో కలిపి వరుసల మధ్య పిచికారీ చేయాలి. నాటిన 30, 35 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. పొలంలో కలుపు లేకుండా, మొదటి నాలుగు వారాల్లో అంతరకృషి చేయాలి. మొక్కలు ఎదిగిన తర్వాత వాటిని కదిలించకూడదు.పొడవుగా పెరిగే హైబ్రిడ్ మొక్కలకు మరియు మామూలు రకాలకు కూడా కర్రలను పాతి ఊతం ఇవ్వాలి. ఊతమివ్వడం వలన మంచి పరిమాణం గల కాయలు ఏర్పడతాయి. అంతేకాక కాయలు నేలకు తగిలి చెడిపోకుండా కాపాడవచ్చు. వేసవి టమాట పంటకు ఎండ తీవ్రత తగ్గించుటకు ప్రతి 2-3 వరుసల టమాటాకు రెండు వరుసల మొక్కజొన్న పంటను ఉత్తర దక్షిణ దిశలో విత్తుకోవాలి. నీటి యాజమాన్యం భూమిలో తేమ ను బట్టి 7-10 8 వ్యవధిలో నీరు కట్టాలి. వేసవి లో 5-6 రోజుల కు ఒక సారి తడి అవసరం ఉంటుంది. డ్రిప్ పద్ధతిలో నీటిని అందించి నటయితే మంచి దిగుబడులు పొందవచ్చు.డ్రిప్ పద్ధతిలో నీటిని అందించటం ఊతం ఇవ్వడం టమాట మొక్కలను వెదురు బొంగులు, జిఐ వైర్ల సాయంతో ఏర్పరచిన ట్రెల్లీస్ పైకి పురికొస సాయంతో పాకించడం వల్ల బాగా గాలి, వెలుతురు తగిలి తెగుళ్ళ బెడద తగ్గించవచ్చు. అంతే కాకుండా కాయలు నేలకు తగలవు కాబట్టి కాయకుళ్ళు తగ్గి మంచి నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చు. అంతర్వాహిక కీటక నాశనులు అయిన ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా థయోమిథాక్సామ్ 0.4 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆధారం : పాడిపంటలు మాస పత్రిక డా.కె. క్రాంతికుమార్ శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం) ఉద్యాన కళాశాల, పార్వతీపురం