డ్రిప్ ఇరిగేషన్తో స్మార్ట్ సాగు పంటకు కావలసిన నీటిని వివిధ రకాల పద్ధతులలో రైతులు అందిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి సాంప్రదాయ పద్ధతి అనగా ఫ్లడ్ ఇరిగేషన్, అలానే తుంపర (స్ప్రింక్లర్), డ్రిప్ పద్ధతిలో (బిందు సేద్యం). వీటిలో సాంప్రదాయ పద్ధతిలో మనకు 30 నుంచి 40 శాతం వరకు నీటి వినియోగ సామర్థ్యం ఉంటుంది. తుంపర పద్ధతిలో 50-70% వరకు నీటి వినియోగ సామర్థ్యం ఉంటుంది. బిందు సేద్యం పద్ధతిలో అయితే 90-95% వరకు నీటి వినియోగ సామర్థ్యం ఉంటుంది. పంటను, ప్రాంతాన్ని బట్టి ఒక అలవాటుగా, అదీనూ నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని అందిస్తున్నారు. అయినప్పటికీ నీటిని పొదుపుగా వాడి భావి తరాలకు నీటి అందించటం అనేది మన ముందున్న తక్షణ కర్తవ్యం. ప్రతి నీటిని బొట్టును డబ్బుతో కొనవలసి వస్తే అది ఎంత కష్టమో కదా! బిందు సేద్యం ద్వారా నీటిని పొదుపుగా వాడవచ్చు అలానే నీటిని పోషకాలను ఒకేసారి మొక్కకు అందించే అవకాశం ఉంటుంది. బిందు సేద్యం వలన కలిగే లాభాలు వివిధ పంటలలో 20 నుంచి 50 శాతం వరకు సాగునీరు ఆదా అవుతుంది. మొక్కల వేర్లకు దగ్గరగా భూమిలో తేమ అందించడం వలన మనం వేసిన రసాయన ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా పెరిగి మొక్క త్వరగా గ్రహించి ఏపుగా పెరిగి సరైన సమయం లో పక్వానికి వచ్చి అధిక, నాణ్యమైన దిగుబడులు పొందడా నికి అవకాశం ఉంటుంది. తేలికైన ఇసుక నేలలలో, నల్లరేగడి నేలలలో, లోతు తక్కువ ఎత్తు పల్లాలుగా ఉండే భూములకు, కొండ ప్రాంతాలలో వేసే పంటలకు కూడా డ్రిప్పు లేదా బిందు సేద్యంతో మనం నీరు అందించవచ్చు. ప్రతి మొక్కకు నీరు ఒకే మోతాదులో సమానంగా అవసరాన్ని బట్టి అందజేయడం ద్వారా మొక్కకు కావలసిన నీటిని కొద్ది గంటలలోనే మనము అందించడానికి వీలవుతుంది. పోషక పదార్థాలు నీటిలో కరిగించిఫర్టిగేషన్ ద్వారా నేరుగా వేళ్ళ దగ్గరకు అందించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి దాదాపు 20 నుంచి 30% ఎరువులు ఆదా అవుతాయి. ఈ పద్ధతి ద్వారా ఎరువులు నేరుగా అనుకున్న మొక్కకు అందించవచ్చు. నేలను చదును చేయడం, గట్లు, నీరు పారించే కాలువలు ఏర్పరచుకోవడం, బోదెలు వేయడం వంటివి అవసరం లేకుండా ఈ పద్ధతి ద్వారా నీరు అందించ వచ్చు. కాబట్టి పొలంలో ఈపనులకు అయ్యే ఖర్చును కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఈ పద్ధతిలో నీరు అందించడం వలన మొక్కల వరుసల మధ్యలో తేమ ఉండదు తద్వారా కలుపు సమస్య తగ్గుతుంది. మొక్కల మొదళ్ళ వద్ద మాత్రమే తేమ కలిగి వరుసల మధ్యలో పొడిగా ఉండడం వలన పంటకు వేరే పనులు చేసుకోవడానికి సులభం అవుతుంది. నేరుగా మొక్కకు నీటిని వేరు వ్యవస్థ దగ్గర అందించడం వలన స్ప్రింకర్ల మాదిరిగా ఆకులపై తేమ ఉండదు, చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది. ముంపు నీటి పారుదల ఇచ్చినట్లుగా నీరు కట్టము కాబట్టి భూమి కోతకు గురికాదు. ఎరువులు భూమి లోపలి పొరల్లోకి చొచ్చుకుని పోయి వృధా కావు. అధికంగా గాలి వీయడం వలన స్ప్రింక్లర్ పద్ధతిలో మాదిరిగా నీటి వినియోగ సామర్థ్యం ఏమాత్రం తగ్గకుండా ఎక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిని అన్ని రకాల పంటలకు ఫీల్డ్ క్రాప్స్, ఆకుకూరలు, పండ్లతోటలు, ఔషధ పంటలు, పూల పంటలు మొదలైన అన్ని రకాల పంటలలో అమర్చుకోవచ్చు. కానీ ఈ డ్రిప్పు పద్ధతిని అమర్చుకునేటప్పుడు వేసే పంట, పంట రకం, మొక్కల సాంద్రత, మొక్కకు కావలసిన నీటి పరిమాణం, పంట కాలం, నేల స్వభావం, ఏటవాలు, సాగు విస్తీర్ణం, నీటి వసతి బావులు కాలువలు, బోర్లు లేదా చెరువులు మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫర్టిగేషన్ ద్వారా ఎరువుల యాజమాన్యం పంటకు కావలసిన నీరు, పోషకాలను ఒకేసారి సమానంగా సూక్ష్మ నీటిపారుదల పద్ధతిలో మొక్కలకు అందించడాన్ని ఫర్టిగేషన్ అంటారు. ఈ పద్ధతి వల్ల పంట దిగుబడులు పెరగడమే కాకుండా పర్యావరణం పై అధిక రసాయన ఎరువులు వాడడం వలన కలిగే దుష్ప్రభావాలను తగ్గించడానికి వీలవుతుంది. ఇటీవల కాలంలో రైతులకు బిందు సేద్యం లేదా డ్రిప్ ఇరిగేషన్ పై అవగాహన పెరగడం ప్రభుత్వం సబ్సిడీ రూపంలో డ్రిప్కు సంబంధించిన డ్రిప్ లేటరల్ పైపులను, ఇతర పరికరా లను అందించడం వలన రైతులు డ్రిప్ ఇరిగేషన్ వాడడానికి తద్వారా ఫెర్టిగేషన్ రూపంలో పంటకు కావలసిన ఎరువులను వేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఫర్టిగేషన్ ద్వారా మొక్క ఎదుగుదల పంటకు కావలసిన పోషకాల అవసరాలను మనం గమనిస్తూ వేరు ఎదుగుదల, అభివృద్ధి చెందే దశ, పంటలోని కీలక దశలైన పూత దశ కాపు దశలో మొక్కకు కావలసిన సిఫార్సు చేసిన పోషకాలను అందించే అవకాశం ఉంది.చాలామంది రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఫెర్టిగేషన్ పై కొంత వరకు అవగాహన ఉంది. కానీ కొద్దిపాటి ముఖ్యమైన అంశాలను గమనించుకొని పంటకు కావలసిన నీటిని డ్రిప్పర్ల ద్వారా సరైన సమయంలో అందిస్తూ నీటితోపాటు పంటకు కావలసిన పోషకాలను ఫర్టిగేషన్ ద్వారా సరైన భాగంలో అందించడం వలన పోషకాల వినియోగ సామర్థ్యం పెరిగి తద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చు. ఆధారం: పాడి పంటలు , వ్యవసాయ పరిశోధనా స్థానం.