బంతి సాగు ఎల్ నినో ప్రభావం - తీసుకోవాల్సిన జాగ్రత్తలు బంతి పూల సాగు తక్కువ పెట్టుబడి, స్వల్ప కాలపరిమితి (నాటిన 45-60 రోజులకే పూత), ఏడాది పొడవునా డిమాండ్ కారణంగా చిన్న, సన్నకారు రైతులకు లాభదాయకమైన పంట. వాణిజ్య పరంగా ప్రధానంగా రెండు జాతులు సాగులో ఉన్నాయి ఆఫ్రికన్ బంతి పొడవుగా పెరుగుతుంది (60-100 సెం.మీ.), పూలు పెద్దవి, ముదురు పసుపు/ నారింజ రంగు. దండలు, రంగుల తయారీకి అనుకూలం. ఫ్రెంచ్ బంతి పొట్టి రకం (30-40 సెం.మీ.), పూలు చిన్నవి, గుత్తులుగా వస్తాయి. అలంకరణ, అంచు పంట, అంతర పంటగా అనుకూలం. ప్రాముఖ్యత, ఉపయోగాలు పూలదండలు, పూజాసామగ్రి, అలంకరణ, పందిరి అలంక రణలలో వినియోగిస్తారు. లూటిన్ అనే వర్ణ ద్రవ్యం తయారీ, కోళ్ళదాణా, ఆహార రంగుల పరిశ్రమలో, కంటి ఆరోగ్య మందుల్లో వాడతారు. పరిమళ ద్రవ్యాల పరిశ్రమలో, సుగంధ తైలం తయారీలో వినియోగిస్తారు. టమాటా, వంగ, అరటి తోటల్లో అంతరపంటగా నెమటోడ్ లను (వేరుబుడిపె పురుగు) సరిహద్దు పంటగా వేస్తారు. టమాటా, పొగాకు, పత్తిలో కాయ తొలుచు పురుగు ఆకర్షణకు 1:16 నిష్పత్తిలో ఎరపంటగా వేస్తారు. రబీ : సెప్టెంబరు అక్టోబర్లో నాటితే నాణ్యమైన పెద్ద పూలు వస్తాయి. సంక్రాంతికి మార్కెట్ బాగుంటుంది. వేసవి : జనవరి-ఫిబ్రవరిలో వేసుకుంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నీటి వసతి తప్పనిసరి. కలకత్తా లోకల్ / లోకల్ ఆరెంజ్ ఆఫ్రికన్ ప్రత్యేకతలు దండలకు అనుకూలం. రైతుల్లో ప్రాచుర్యం. పూసాఅర్పిత, హిసార్ బ్యూటీ (ఫ్రెంచ్ పొట్టిరకం, గుత్తి పూత, అలంకరణకు అనుకూలం. హైబ్రిడ్లు ఆఫ్రికన్ ఏకరీతి పూలపరిమాణం, ఎక్కువ దిగుబడి, విత్తనఖర్చు ఎక్కువ. విత్తన మోతాదు : ఎకరాకు 400-600 గ్రా. (హెక్టారుకు 1.0-1.5కి.గ్రా). హైబ్రిడ్ రకాలకు తక్కువ సరిపోతుంది. నారుమడి: 3 మీ.× 1 మీ. × 15 సెం. మీ. ఎత్తు ఉన్న మడులు, తయారు చేయాలి. కుళ్ళిన పశువుల ఎరువు కలపాలి. విత్తనశుద్ధి కిలో విత్తనానికి 3 గ్రా. కాప్టాన్ లేదా థైరమ్ లేదా 5 గ్రా. ట్రైకోడెర్మా విరిడితో శుద్ధి చేయాలి. విత్తనాలను 5 సెం.మీ. దూరంలో గాడులలో పల్చగా విత్తి, సన్నని మట్టి/ఎరువుతో కప్పి, గోనె సంచులతో కప్పాలి. విత్తనాలు 4-6 రోజుల్లో మొలకెత్తుతాయి. నారు 25-30 రోజుల్లో (4-5 ఆకుల దశలో, 10-12 సెం.మీ. ఎత్తు) నాటడానికి సిద్ధమవుతుంది. నారుమడిలో నీరు నిలవకుండా జాగ్రత్త వహించాలి. రోజ్ క్యాన్ తో తేలికపాటి తడి ఇవ్వాలి.నాటే ముందు రోజు నారు.మడికి నీరు ఇచ్చి, నారు వేర్లు తెగకుండా పీకాలి. ప్రధాన పొలం తయారీ, నాటడం పొలాన్ని 2-3 సార్లు దుక్కి చేసి, ఎకరాకు 8-10 టన్నుల పశువుల ఎరువు వేసి కలియ దున్నాలి. వర్షాకాలంలో నీరు నిల్వకుండా బోదెలు కాలువలు లేదా ఎత్తుమడులు తయారు చేయాలి. నాటేదూరం ఆఫ్రికన్ బంతికి 45 × 30 సెం. మీ. లేదా 60 × 30 సెం.మీ. ఫ్రెంచ్ బంతికి 30 X 20 సెం.మీ. మొక్కల సంఖ్య : ఎకరాకు సుమారు 28,000-30,000 (ఆఫ్రికన్) (ఫ్రెంచ్ రకంలో ఎక్కువ. సాయంత్రంవేళల్లో నాటడం మంచిది. నాటిన వెంటనే నీరు ఇవ్వాలి. అంతరకృషి, కలుపు, కత్తిరింపు (పించింగ్) : నాటిన 20-25 రోజులకు, 45 రోజులకు కలుపు తీసి, గొప్పు తవ్వి మట్టిని ఎగదోయాలి. పించింగ్ : నాటిన 30-40 రోజులకు మొక్కకొన (ప్రధానకాండం చిగురు) గిల్లాలి. దీని వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి, పూల సంఖ్య 25-40% పెరుగుతుంది. ఎండు. ఆకుమాడు తెగుళ్లు వ్యాపించకుండా ఆకులు, ఎండిన పూలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. మల్చింగ్ (ఎండుగడ్డి లేదా ప్లాస్టిక్) చేస్తే తేమ నిలుస్తుంది, కలుపు తగ్గుతుంది. ఎల్ నినో ప్రభావం నారుమడి దశ: అధిక ఉష్ణోగ్రత వల్ల విత్తన మొలక శాతం తగ్గి, నారు మాడిపోతుంది. ఉష్ణోగ్రత 35-38° సెల్సియస్ దాటితే పుప్పొడి జీవశక్తి తగ్గి, మొగ్గలు, పూలు రాలిపోతాయి. పూల పరిమాణం చిన్నదై, రంగు మసకబారుతుంది. నీటి ఎద్దడ్ వల్ల మొక్క ఎదుగుదల ఆగిపోయి, కొమ్మల సంఖ్య తగ్గుతుంది, పూత దశ కుదించుకుపోయి, దిగుబడి 30-50% వరకు తగ్గే ప్రమాదం ఉంది. పొడి, వేడి వాతావరణంలో ఎర్రనల్లి, తామర పురుగులు, తెల్ల దోమ వ్యాప్తి బాగా పెరుగుతుంది. నేలలో తేమ తగ్గడం వల్ల బోరాన్, కాల్షియం పోషక లోపాలు కనిపిస్తాయి. ఎల్సినో ముగింపు దశలో అకాల వర్షాలు వస్తే విచ్చుకున్న పూలు కుళ్ళిపోయి, అకుమచ్చ తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందస్తు ప్రణాళిక: నాటే తేదీని సర్దుబాటు చేసుకోవాలి. రుతు పవనాలు ఆలస్యమైతే నారు పోసే సమయాన్నికూడా వెనక్కి జరపాలి తీవ్ర వేడి కాలం పూత దశపై పడకుండా చూడాలి. మొత్తం విస్తీర్ణాన్ని ఒకేసారి నాటకుండా 10-15 రోజుల వ్యవధిలో దశలవారీగా నాటాలినీటి వసతికి అనుగుణంగానే విస్తీర్ణం నిర్ణయించాలి. నీరు తక్కువగా ఉంటే విస్తీర్ణం తగ్గించి, డ్రిప్ కింద సాగు చేయాలి. ఉష్ణోగ్రతను తట్టుకునే, తక్కువ కాలపరిమితి గల రకాలు /హైబ్రిడ్లను ఎంచుకోవాలి. నీటి యాజమాన్యం : బిందుసేద్యంలో సాగు చేస్తే 30-50% నీరు ఆదా అయి పూత దశలో ఏకరీతి తేమ లభిస్తుంది. మల్చింగ్: ఎండుగడ్డి, వరి పొట్టు లేదా వెండి-నలుపు ప్లాస్టిక్ షీట్ వేయడం వల్ల నేల తేమ ఆవిరి కావడం తగ్గి, నేల ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. నీటి ఎద్దడి ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ బోదెల్లో నీరు ఇవ్వడం శ్రేయస్కరం. వర్షపు నీటిని సేద్యపు కుంటలు, ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంల ద్వారా నిల్వ చేసుకోవాలి. నీటి కొరత తీవ్రంగా ఉంటే క్లిష్టదశలకు (నాటిన తర్వాత, మొగ్గ దశ, పూత దశ) మాత్రమే నీరు ఇచ్చి ఇతర దశల్లో తగ్గించాలి. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక డా.ఎం. సాయిరత్న శర్వాణి అసిస్టెంట్ ప్రొఫెసర్ ( ఉద్యాన విభాగం), ఉద్యాన కళాశాల, వెంకటరామన్న గూడెం, పశ్చిమ గోదావరి