మిరియాల కోత అనంతర సంరక్షణ ప్రక్రియ “సుగంధ ద్రవ్యాల రాజు"గా ప్రసిద్ధి చెందిన మిరియాలు, ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన, ప్రజాదరణ పొందిన, విస్తృతంగా ఉపయోగించే సుగంధ ద్రవ్యం. ఎండిన మిరియాల గింజలను నల్ల మిరియాలు అని పై పొర తీసివేసి ఎండబెట్టిన మిరియాలను తెల్ల మిరియాలు అని పిలుస్తారు. అన్ని రకాల సుగంధ ద్రవ్యాలలో ఆహారంలో అత్యధికంగా కలిపే పదార్థాలలో ఇది మూడవది. మిరియాల కోతానంతర ప్రక్రియలు : మిరియాల సాగులో కోతానంతర ప్రక్రియలలో నూర్పిడి, బ్లాంచింగ్, ఎండబెట్టడం, శుభ్రపరచడం, గ్రేడింగ్, ప్యాకేజింగ్ మొదలైనవి ముఖ్యం. నూర్పిడికి ముందు మిరియాలు గోధుమ రంగులోకి మారడానికి, కోసిన కంకులను/గుత్తులను రాత్రంతా ఒక కుప్పగా పోయాలి. ఈ ప్రక్రియ నూర్పిడి సమయంలో గుత్తుల నుండి గింజలను సులభంగా వేరు చేయడానికి వీలు కల్పిస్తుంది. నూర్పిడి : మిరియాలను కాళ్ళతో తొక్కడం ద్వారా, చేతితో గానీ, లేదా నూర్పిడి యంత్రాలను ఉపయోగించి గానీ గుత్తుల నుండి వేరుచేయవచ్చు. చేతితో ఒక కూలీ రోజుకు 200 కిలోల మిరియాలను మాత్రమే వేరు చేయగలుగుతాడు. కాని గంటకు 2500 కిలోల వరకు సామర్థ్యం గల నూర్పిడి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక ఎలాంటి మలినాలు లేని శుభ్రమైన మిరియాలను పొందవచ్చు. మిరియాల సాగులో ఉపయోగపడే నూర్పిడి యంత్రాలు యాంత్రిక మిరియాల త్రెషర్ : ఈ యంత్రం 95% సామర్థ్యం కలిగి, గంటకు 320 కిలోల మిరియాలను నూర్పిడి చేస్తుంది. చేతితో నడిపే మిరియాల త్రైషర్: ఈ త్రెషర్ 96% సామర్థ్యం కలిగి, గంటకు 60 కిలోల మిరియాలను నూర్పిడి చేస్తుంది. బ్లాంచింగ్ : నూర్పిడి చేసిన మిరియాలను ఎండలో అరబెట్టడానికి ముందు, ఒక నిమిషం పాటు మరిగే నీటిలో ముంచి తీయడం చేయాలి. ఇలా చేయడం వల్ల. అవి త్వరగా గోధుమ రంగులోకి మారుతాయి. ఇది మిరియాలకు ఏకరీతిగా, నిగనిగలాడే నల్లని రంగును కూడా ఇస్తుంది. బ్లాంచింగ్ ప్రక్రియ మిరియాలపై ఎలాంటి సూక్ష్మజీవుల లేకుండా చేస్తుంది, వాటికి అంటి ఉన్నటువంటి మురికి, ధూళిని తొలగిస్తుంది, ఎండలో ఆరబెట్టే సమయాన్ని 3-4 రోజులకు తగ్గిస్తుంది. ఎండబెట్టడం : మిరియాల గింజలను ఆరుబయట ఆరబెట్టే ప్రదేశాన్ని శుభ్రపరిచి పివిసి షీట్లు లేదా వెదురు చాపలపై పరవాలి. ఎండబెట్టేటప్పుడు, అన్ని వైపులా సమానంగా ఆరేలా చూడటానికి చెక్క పారతో గింజలను తిప్పుతూ ఉండాలి. గింజలలోని తేమ 10 శాతానికి తగ్గే వరకు 3-5 రోజుల పాటు ఎండబెట్టాలి. సాంప్రదాయ పద్ధతిలో ఎండలో ఎండబెట్టడం 12% కంటే ఎక్కువ తేమ శాతం ఉన్న ఎండిన నల్ల మిరియాలను శిలీంధ్రాలు ఆశించే అవకాశం ఉంది. ఈ శిలీంధ్రాలు మైకోటాక్స్ న్లను ఉత్పత్తి చేసి, మిరియాలను వినియోగానికి పనికిరాకుండా చేస్తాయి. వివిధ రకాల ప్రసిద్ధ యాంత్రిక డ్రైయర్లు సోలార్ డ్రైయర్, కలపతో మండించే డ్రైయర్, ఆస్పిరేటర్ తో కూడిన సోలార్ క్యాబినెట్ డ్రైయర్, ఆస్ట్రా డ్రైయర్ (IISC బెంగళూరు), వ్యవసాయ వ్యర్థాలతో మండించే కొబ్బరి డ్రైయర్. శుభ్రపరచడం : శుభ్రపరచడం, గ్రేడింగ్ చేయడం అనేవి మిరియాల కోతానంతర ప్రక్రియలో ప్రాథమిక అంశాలు. ఎండిన గింజలు/బెర్రీలను, రాలిన గుత్తులు/కంకులు, సూదిమొనలు, రాళ్లు, తక్కువ మొత్తంలో అనగా చిన్న యూనిట్లలో శుభ్రపరచడం అనేది తూర్పార పట్టడం, చేతితో ఏరివేయడం ద్వారా చేయవచ్చు. పెద్ద ఎత్తున శుభ్రపరచడం విద్యుత్తుతో పనిచేసే బ్లోయర్లను ఉపయోగించి చేయవచ్చు, ఇవి తేలికైన భాగాలను సులభంగా ఎగిరి పోయేటట్లు చేస్తాయి. గ్రేడింగ్: ఎండిన గింజలను/బెర్రీలను వాటి పరిమాణం ఆధారంగా గ్రేడింగ్ చేసుకోవాలి. మిరియాల యొక్క ప్రధాన గ్రేడ్లు టెల్లిచెర్రీ గార్బుల్డ్ స్పెషల్ ఎక్స్ట్రా బోల్డ్ (టి.జి.ఎస్.ఇ.బి) (4.8 22.) టెల్లిచెర్రీ గార్బుల్డ్ ఎక్స్ట్రా బోల్ట్ (టి.జి.ఇ.బి) (4.2 మి.మీ) టెల్లిచెర్రీ గార్బుల్డ్ (టి జి) (4.0 మి.మీ) మలబార్ గార్బుల్డ్ (యమ్ జి గ్రేడ్లు 1 మరియు 2) మలబార్ అన్ గార్బుల్డ్ (యమ్ యు గ్రేడ్లు 1, 2). మిరియాల స్పైరల్ సెపరేటర్ మిరియాలను శుబ్రపరచడానికి, గ్రేడింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఆగ్మార్క్ (AGMARK) నిర్దేశాల ప్రకారం మిరియాలను మూడు గ్రేడ్లుగా వర్గీకరించడానికి చిన్న, పెద్ద పరిమాణపు మలినాలను వేరు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది 88% సామర్థ్యంతో పనిచేస్తుంది. ఫీడ్ హాప్పర్ సామర్థ్యం ఒక గంటకు 200 కిలోలు. ప్యాకేజింగ్ మిరియాలు తేమను పీల్చుకునే స్వభావం కలిగి ఉంటాయి, దీని ఫలితంగా బూజు పట్టడం, కీటకాలు చేరడం జరుగుతుంది. సాంప్రదాయకంగా, ఎండబెట్టిన మిరియా లను రెండు పొరల గోనె సంచులలో నిల్వ చేయాలి. జనపనార గోనె సంచులు, కాగితపు సంచులు మొదలైన పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్ సామగ్రిని మాత్రమే ఉపయోగించాలి. పాలిథీన్ సంచుల వాడకాన్ని తగ్గించాలి. తర్వాత అన్ని సంచులకు విడివిడిగా లేబుల్ చేయాలి.నేలపై పాలీప్రొఫైలిన్ షీట్లను పరిచిన తర్వాత, ఈ సంచులను చెక్క ప్యాలెట్లపై ఒకదానిపై ఒకటిగా అమార్చాలి. నిల్వ ఉంచిన గింజలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరిశీలిస్తూ ఉండాలి. గదిలో సరైన వెలుతురు, తేమ, ఉష్ణోగ్రత నియంత్రణ వుండేలా చూసుకోవాలి. నిల్వ చేయడానికి ముందు గదిని సరిగ్గా ఫ్యూమిగేట్ చేయాలి.ఈ విధంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచి ధరను పొందవచ్చు ఆధారం: పాడిపంటలు మాసపత్రిక డా. పి. రమణ సీనియర్ శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం), అధిపతి ఉద్యాన పరిశోధనా స్థానం, చింతపల్లి, అల్లూరి సీతారామరాజు