శ్రమ తగ్గించు - లాభాలు పెంచు వరిలో యాంత్రీకరణ వరి సాగులో యాంత్రీకరణ వల్ల వ్యవసాయం సులభతరంగా మారుతుంది. ట్రాక్టర్లు, రోటావేటర్లు, వరుస నాటే యంత్రాలు, కంబైన్ హార్వెస్టర్లు వంటి పరికరాల వాడకం వల్ల పని వేగంగా పూర్తి చేయవచ్చు. ఇది రైతుల శ్రమను తగ్గించడంతో పాటు వ్యవసాయ పనుల ఖర్చును కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ కార్మికుల లభ్యత లోపిస్తున్న ఈ రోజుల్లో యాంత్రీకరణ అనివార్యమైంది. అధిక దిగుబడులు సాధించడంలో, సమయపాలనలో యాంత్రీకరణ కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా వ్యవసాయ ఉత్పత్తి సామర్థ్యం పెరిగి, రైతుల ఆదాయం మెరుగవుతుంది. రోటవేటర్ ఈ పరికరాన్ని మట్టిని దున్నడానికి, అదే విధంగా వరి పొలంలో దమ్ము చేయడానికి సమర్థంగా వాడవచ్చు. ఈ పరికరం ట్రాక్టర్ పి.టి.ఒ. షాఫ్ట్ ద్వారా నడుపబడే యంత్రం. ఈ యంత్రానికి అమర్చబడిన వైపు కర్రలు పి.టి.ఓ. షాఫ్ట్ ద్వారా అందిన శక్తితో వేగంగా తిరిగి, మట్టి గడ్డలను తిప్పి నీటిలో కలిపేస్తుంది. ఇలా చేయడం వలన వరినాట్లకు కావాల్సిన దమ్ము నాణ్యత పెరిగి నీటిలో ఇంకిపోకుండా పూర్తిగా అరికడుతుంది. రోటవేటర్ సహాయంతో దమ్ము చేయడం మూలంగా 60 శాతం సమయాన్ని, 40 శాతం సాగునీటిని తగ్గించి నాణ్యమైన దమ్మును పొందవచ్చు. దీని ఖరీదు రూ.80,000 నుండి రూ.1,80,000 వరకు ఉంటుంది. పళ్ళపు దంతి ఈ పళ్ళపు దంతి మెట్ట సేద్యంలోనే కాక, వరి పొలంలో దమ్ము చేయడానికి కూడా సమర్థవంతంగా వాడచ్చు. ఈ పళ్ళపు దంతుల్లో సింగిల్ యాక్షన్ డిస్క్ హేరోనీ మాత్రమే దమ్ము చేయడానికి వాడాలి. ఈ పరికరం ద్వారా సాగునీటిని 20శాతం వరకు ఆదా చేయవచ్చని నిరూపించారు. ఈ పరికరం ఖరీదు రూ. 55,000 నుండి రూ.70, 000 వరకు ఉంటుంది. డ్రం సీడర్ ఈ పరికరాన్ని దమ్ము చేసిన పొలంలో, వరుసలలో నేరుగా వరి విత్తడానికి వాడతారు. 24 గంటలు నానబెట్టిన విత్తనాన్ని, మరో 24 గంటలు మండెకట్టగా మొలకెత్తిన తర్వాత దమ్ము చేసి, బురద పదునుగా ఉండే పొలంలో ఈ డ్రం సీడర్లో విత్తనాలు నింపి లాగటం ద్వారా వరుసలలో విత్తవచ్చు. వరుసల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవచ్చు. వరిని నాట్లు పద్ధతిలో సాగు చేయడం మన రాష్ట్రంలో పరిపాటి, కాకపోతే రైతు పధ్ధతిలో ఎక్కువ కూలీల అవసరం ఉంటుంది. రోజురోజుకి పెరుగుతున్న కూలీల సమస్య నుంచి బయట పడేందుకు వరి గింజలని వరుసలో వేయడానికి రైతు సోదరులు మొగ్గుచూపుతున్నారు. ఈ పద్ధతిలో డ్రం సీడర్ లాగడానికి ఒకరు, ఒకరు విత్తనం అందించడానికి అవసరం కావడం వలన వరి నాటే ఖర్చు బాగా తగ్గి సుమారుగా రూ.1500 నుండి రూ.2000 వరకు ఆదా చేయవచ్చునని పరిశోధనలు ద్వారా నిరూపించారు. ఈ పద్ధతుల్లో నాట్లు వరుసల్లో వేయడం వలన వరుసల మధ్యలో కలుపు తీసేందుకు అంతరకృషి పరికరాలను వాడడానికి సులభంగా ఉంటుంది. దీని ఖరీదు రూ. 7,500/- లు. వరి నాటే యంత్రం వ్యవసాయంలో రోజురోజుకి మారుతున్న వాతావరణం, అదేవిధంగా రోజురోజుకీ పెరుగుతున్న కూలీల సమస్యల వలన, రైతు సోదరులు సరైన సమయానికి వరినాట్లు చేయకుండా ఇబ్బంది ఉండడం వలన, నాట్లు వేసే యంత్రాన్ని రైతు సోదరులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. యంత్రం ద్వారా ఉడుపు చేయడానికి వరి నారులని ప్లాస్టిక్ ట్రేలో గాని, ప్లాస్టిక్ షీట్ల మీద 15 నుంచి 25 రోజుల దాకా పెంచుతారు. ఈ విధంగా పెంచిన 80 ట్రేలు ఎకరానికి కావాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో ముందుగా పొలాల్ని బాగా దమ్ము చేసి చదును చేసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాక పొలాన్ని ఆరబెట్టాలి. నాటే ముందు పల్చగా నీళ్ళు పెట్టడం వలన వరి నాట్లు యంత్రం ద్వారా ఉడుపు సక్రమంగా జరుగుతుంది. ఈ పరికరంలో వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసలలో మొక్కల మధ్య 12, 14, 16, 18, 21 , సెంటీ మీటర్ దూరంలో , 2-5 సెం.మీ. లోతుల్లో ఉడుపు చేసుకోవచ్చు. ఈ యంత్రం ద్వారా 50% విత్తనాలని అదేవిధంగా వ్యవసాయ కూలీల ఖర్చు సుమారుగా 40% తగ్గుతుంది. ఈ యంత్రం ద్వారా ఒక రోజుకు 3 నుంచి 4 ఎకరాల వరకు వరి ఊడ్పు చేయవచ్చు.దీని ఖరీదు రూ.3,10,000 నుండి 18,00,000 వరకు ఉంటుంది. విత్తన, ఎరువు గొర్రు ఈ పరికరం ద్వారా విత్తనాల్ని, అదే విధంగా ఎరువు కూడా సరైన లోతులో, సరైన దూరంలో విత్తడానికి ఉపయోగిస్తారు. విత్తనాన్ని విత్తడం అనేది సేద్యంలో చాలా ముఖ్యమైన ప్రక్రియ. విత్తనం ఎంత మంచిదైనా నిర్ణీత సమయంలో విత్తినప్పుడే పూర్తి దిగుబడి సాధ్యం అవుతుంది. వర్షాధార పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణాన్ని సమర్థవంతంగా, అనువైన తేమ ఉన్నప్పుడే విత్తడానికి, విత్తే పరికరాలు ఎంతైనా అవసరం. ఈ పరికరాన్ని వాడడం వలన సాలుల మధ్య అంతర కృషి చేయడానికి పరికరాల్ని వాడటం సాధ్యపడుతుంది. అంతేకాక కూలీల సమస్యని తప్పించుకోవచ్చు. దీని ఖరీదు రూ. 54,000/-. కోనో వీడరు ఈ పరికరాన్ని యంత్రాల ద్వారా ఉడుపు చేసిన పొలంలో అంటే మనుషుల ద్వారా సాళ్ళలో విత్తనం / ఉడుపు చేసిన పొలంలో కలుపు తీసేందుకు ఉపయోగిస్తారు. ఈ పరికరం ద్వారా ఒక రోజుకి 0.3 – 0.4 ఎకరం పొలాన్ని కలుపు తీయవచ్చు. ఈ పరికరం 6 కేజీల బరువు ఉంటుంది. ఈ పరికరం ఖరీదు రూ. 2000/-. వరిలో పవర్ వీడర్ యంత్రాల ద్వారా ఉడుపు చేసిన వరి పొలంలో, అలాగే సాళ్ళలో ఉడుపు చేసిన వరి పొలంలో ఈ పరికరాన్ని కలుపు తీయడానికి ఉపయోగించవచ్చు. ఒక యంత్రానికి 1.8 హెచ్.పి. ఇంజన్లను అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజిన్ సహాయం ద్వారా కలుపు తీసే బ్లేడులు నడుస్తూ ఉంటాయి. ఈ పరికరం ఖరీదు రూ.45,000/-. డ్రోన్ స్ప్రేయర్ రైతు పద్ధతి (బ్యాటరీ, ఇంజన్ (స్పేయర్) ద్వారా భారతదేశం అంతటా రసాయనాలకు సంవత్సరానికి 65 టన్నులు మందును పిచికారీ చేస్తున్నారు. బ్యాటరీ, ఇంజన్ల స్ప్రేయర్ తో పిచికారీ చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఈ పద్ధతిలో పిచికారీ చేస్తున్నప్పుడు రైతు ద్రవంతో పాటు స్పేయర్ బరువును సుమారుగా 30 నుండి 40 కేజీల వరకు బురదలో మొయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో మందు పిచికారీ చేయడం మూలంగా రైతులు ప్రమాదకరమైన వ్యాధులకు గురి అవుతూవుంటారు. డ్రోన్ స్ప్రేయింగ్ ద్వారా 25% రసాయనిక మందులు తగ్గించవచ్చు. డ్రోన్ స్ప్రేయింగ్ లో సుమారుగా 10 లీటర్లు నీటితోనే మందును పిచికారీ చేయవచ్చు. ఇలా పిచికారీ చేయడం మూలంగా 180 లీటర్ల వరకు నీటిని ఆదా చేయవచ్చు. డ్రోన్ స్ప్రేయింగ్ ద్వారా ఎకరం పొలాన్ని 6 నుండి 10 నిమిషాలలో మొక్క పై నుండి కాండం దాకా పిచికారీ చేయవచ్చు. డ్రోన్ స్ప్రేయింగ్ వలన ఖర్చు, రసాయనం, సమయం, శారీరక శ్రమ తగ్గుతుంది, అలాగే స్ప్రేయింగ్ ఖచ్చితత్వం సమర్థంగా జరుగుతుంది. వ్యవసాయ డ్రోన్‌ను వరి, చెరకు, పత్తి, మొక్కజొన్న పంటలకు పిచికారీ చేయడానికి ఉపయోగించవచ్చు. డ్రోన్ ద్వారా పిచికారీ చేసే మనిషిపై మందు ప్రభావం ఉండదు. ఆరోగ్య సమస్యలు ఉండవు. డ్రోన్ ఖరీదు ఖర్చు రూ.3,50,000/- నుండి 6,00,000/- ఉంటుంది. వరి కోత కోసే పరికరం (రీపర్) ఈ పరికరాన్ని చిన్న చిన్న కమతాల్లో పండించిన వరి పొలాన్ని కోత కోసేందుకు ఉపయోగిస్తారు. అతి తక్కువ సమయంలో, తక్కువ గింజలు నష్టం, తక్కువ ఖర్చుతో వరి పొలాన్ని కోత కోయవచ్చు. ఈ పరికరం ద్వారా ఒక రోజుకి పది ఎకరాల వరి కోత చేయవచ్చు. ఈ యంత్రాన్ని వరి, గోధుమ, బార్లి, ఇతర ధాన్యపు పంటల్ని కోసేందుకు ఉపయోగిస్తారు. ఈ వరికరం ఖరీదు రూ. 1,45,000/-. రీపర్ కం బైండర్ చిన్న, సన్నకారు రైతులు వరి గడ్డి నష్టపోయేందుకు ఇష్టపడరు. ఇందుకుగాను అంటే 'చిన్న కమతాల్లో, గడ్డి నష్టపోకుండా కోసేందుకు ఈ పరికరాన్ని వాడతారు. ఈ పరికరం వరి కోత కోసి, కట్టలు కట్టి పొలంలో పనలు ఎండబెట్టేందుకు ఉపయోగపడుతుంది. ఇలా కట్టలు కట్టడం వలన పొలం నుండి నూర్పిడి చేసే స్థలానికి సులువుగా చేర్చవచ్చును. ఈ యంత్రం ద్వారా ఒక రోజుకి 3 నుండి 5 ఎకరాలు వరకు వరి కోత నిర్వహించవచ్చు. ఈ యంత్రం ద్వారా వరి, గోధుమ పంటను సమర్థంగా కోతచేయవచ్చు. ఈ యంత్రం ఖరీదు రూ. 3,50,000/-. కంబైన్డ్ హార్వెస్టర్ ఈ యంత్రంలో వరి కోత కోయడం, నూర్పిడి చేయడం, చెరగడం ఒకేసారి జరుగుతుంది. ఈ యంత్రం ద్వారా వరిని కోసేందుకు ఒక వారం ముందుగానే పొలానికి నీళ్ళు పెట్టకుండా ఉంచాలి. ఈ యంత్రం ద్వారా వరి కోత కోయడం వలన చాలా వరకు ధాన్యం పొలంలో నష్టపోకుండా ఉంటుంది. యంత్రాన్ని వరి, గోధుమ,, మొక్కజొన్న పంటలను కోసేందుకు ఉపయోగించవచ్చు. ఈ యంత్రం ఖరీదు రూ.14 నుండి రూ.19 లక్షల వరకు ఉంటుంది. వరిగడ్డి కట్టలు కట్టే యంత్రం వరి కోత అయిన తర్వాత పొలంలో పడిన గడ్డిని తీసుకెళ్ళి పశువులకు వాడటం అనేది రైతు రంగంలో సహజక్రియ. కానీ ఈ ప్రక్రియలో కూలీల ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ యంత్రం ద్వారా పొలంలో పడిన గడ్డిని తీసి కట్టలు కట్టేందుకు వీలుగా రూపొందించారు. ఈ యంత్రం పి.టి.ఒ. షాఫ్ట్ సహాయంతో నడుస్తుంది. ఈ యంత్రం వరి గడ్డి రెండు విధాలుగా కట్టలు కడుతుంది. ఒకటి గుండుగా, చౌక్ ఆకారంలో. ఈ యంత్రంలో వరిగడ్డిని మూడు ప్రక్రియలలో కట్టలు కడుతుంది. మొదటిగా వరిగడ్డిని కలెక్టరు ద్వారా కలెక్ట్ చేసుకోవడం, రెండోది బైండ్ చేయడం, మూడోది అన్లోడ్ ద్వారా అన్లోడ్ చేయడం. ఈ పరికరం ద్వారా గడ్డిని కట్టిన కట్టలు 20 నుండి 50 కేజీల వరకు ఉంటుంది. ఈ యంత్రం ఖరీదు రూ.3 నుండి రూ.3.5 లక్షల వరకు ఉంటుంది.వరి సాగులో యాంత్రికరణ పద్ధతి ద్వారా మనకు పంట పది రోజులు ముందే కోతకు వస్తది అలాగే ఎకరాకు సుమారుగా హెక్టారుకు రూ.15,000 వరకు ఆదా అవుతుంది. కాబట్టి రైతులు వరి సాగులో యాంత్రికరణని ఉపయోగించడం ద్వారా శ్రమ తగ్గి కూలీలు ఖర్చు తగ్గి అనుకున్న దిగుబడులు సాధించగలరు.ఆధారం: వ్యవసాయ పాడిపంటలు , కృషి విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి.