నేటి వ్యవసాయంలో కూలీల కొరత పెద్ద సమస్యగా మారింది. ఈ కారణంగా పనులు ఆలస్యమవుతూ, పెట్టుబడులకు తగ్గ ఫలితాలు రావడం లేదు. ఈ పరిస్థితిని అధిగమించడానికి రైతులు తప్పనిసరిగా వ్యవసాయ యాంత్రీకరణ వైపు మొగ్గుచూపాలి. పొలం దున్నడం, విత్తనం వేయడం, నీరు పెట్టడం, కలుపు తీయడం, కోత మరియు పంట నూర్చటం వంటి పనులు యంత్రాల సహాయంతో సులభంగా చేయవచ్చు. దీనివల్ల కూలీల కొరత సమస్య తగ్గిపోతుంది, పనులు సమయానికి పూర్తవుతాయి, ఖర్చు తగ్గుతుంది మరియు రైతులపై ఉండే శారీరక భారం కూడా తగ్గుతుంది. ఫలితంగా మంచి దిగుబడి సాధించి రైతు ఆదాయం పెరుగుతుంది. అందువల్ల, నేటి పరిస్థితుల్లో యాంత్రీకరణ రైతు జీవితంలో శ్రమను తగ్గించి లాభాలను పెంచే ఒక మంచి వ్యవస్థగా మారుతుంది. వేరుశనగలో వాడే వివిధ పనిముట్లు వాటి ఆవశ్యకత రెక్కనాగలి : ఈ నాగలి భూమిని దీర్ఘచతురస్రాకారంగా కోయడం వల్ల దుక్కిలోనే నాణ్యమైన దుక్కి లభిస్తుంది. దీని ద్వారా సుమారు 40 సెం.మీ. లోతు వరకు దుక్కి చేసుకోవచ్చు. పళ్ళపునాగలి : ఈ నాగలి గుండ్రంగా తిరుగుతూ కోయడం వల్ల రాపిడి తగ్గుతుంది. ముఖ్యంగా దీన్ని బంకమట్టి, గట్టినేల, ఎక్కువ లోతు, రాళ్ళు ఉన్న నేలలు దున్నటానికి ఉపయోగిస్తారు. ఒంటిమడక : దీనిని ఉపయోగించి దుక్కిని అతిలోతుగా అనగా 60-90 సెం.మీ. వరకు దున్నవచ్చు. ఈ నాగలి మూడు లేదా నాలుగు సంవత్సరాలకు ఒక సారి రెండు నుంచి మూడు మీటర్లకు ఒక్కసారి దున్నటం వల్ల కింది భాగంలో గట్టి పొరను చీల్చి తేమశాతం ఎక్కువ రోజులు నిల్వ ఉండే అస్కారం ఉంటుంది. రోటవేటర్: దీంతో పొలంలో మట్టిగడ్డలు, పంట నిల్వలను బాగా కత్తిరించి కలియ తిప్పవచ్చు. అత్యధిక నాణ్యమైన, గుల్ల బారిన పొలం తయారవు తుంది. ఇది చెయ్యడానికి 35-65 అశ్వశక్తి కల ట్రాక్టర్ అవసరం. ఐదు కర్రుల బాతుపాదం ఆకార గొర్రు : ఈ గొర్రు నేలను తిరిగేసి, పెళ్లగించి, బాగా గుల్లబారేటట్లు చేయడం వల్ల కలుపు మొక్కలు, క్రిమి కీటకాలు సూర్యరశ్మి వలన ఎండ సోకి నశిస్థాయి. ట్రాక్టర్‌తో లాగే విత్తన గొర్రు : ఈ పరికరం వాడి ఒకే సారి 8 సాళ్లలో వేరుశనగ విత్తనాలు విత్తుకోవచ్చు. ఇది సాలుకు సాలుకు మద్య 25 సెం.మీ., విత్తనానికి విత్తనానికి మద్య 10 సెం.మీ. ఉ oడేలా రూపొందించారు. దీంతో రోజుకు 7-8 ఎకరాలు విత్తుకోవచ్చు. వేరుశనగ దిగ్గర్, షికర్ విండ్రోయర్ : ఈ యంత్రం 45 అశ్వ శక్తి గల ట్రాక్టర్ అనుసంధానించి వాడుకోవచ్చు. ఇది ఒకేసారి వేరుశనగ మొక్కలను కాయలతో సహా తవ్విమట్టి నుంచి వేరు చేసి ఒక వరుసలో పడేస్తుంది. గంటకు 1.5 ఎకరా వరకు చేస్తుంది. దీనిధర రూ.1.80 లక్షలు. పచ్చి వేరుశనగ కాయల నూర్పిడి యంత్రం: పంటను తవ్వి తీసిన వెంటనే ఏమాత్రము ఈయంత్రంతో ఆరపెట్టకుండా కాయలను వేరు చేయవచ్చును. దీని పని ద్వారా దాదాపు 400 కేజీలు గంటకు తీయవచ్చును. దీనికి అయిదుగురు. కూలీల అవసరం. దీని ధర 2.20 లక్షల వరకు ఉంటుంది. ఎండు వేరుశనగ కాయల నూర్పిడి యంత్రము: ఈ యంత్రం ఉపయోగించాలంటే తవ్వి తీసిన పంటను పొలంలోనే 3-4 రోజుల వరకు ఎండపెట్టాలి. దీనిని వాడడానికి ఆరుగురు కూలీలు అవసరమవుతారు. ఒకగంటకు 600 కేజీల కాయలని వేరుచేయవచ్చు. ఇవి డీజిల్ ఇంజిన్ లేదా ట్రాక్టర్‌తో పనిచేయు పరికరాలు అందుబాటులో ఉన్నాయి. దీని ధర దాదాపు రూ. 1,70 లక్షలు వేరుశనగకాయలు ఒలిచే యంత్రం: ఈ యంత్రం హెచ్.పి. విద్యుత్తు మోటారుతో పనిచేస్తుంది. ఈ యంత్రంతో కాయల నుంచి పొత్తు, గింజలు వేరుచేయబడుతాయి. ఇది ఒక గంటలో 240 కిలోల వేరుశనగ కాయలను ఒలుస్తుంది. ఆధారం: పాడిపంటలు డా.ఎం. మల్లికార్జున్, శాస్త్రవేత్త (సేద్యవిభాగం), కె.వి.కె. కళ్యాణదుర్గం, అనంతపురం