వేరుశనగ సాగులో పోషక లోపాలు-నివారణ భారతదేశంలోని నూనె గింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైనది. మొత్తం నూనె గింజల ఉత్పత్తిలో వేరుశనగ 67 శాతం ఉంది. ప్రస్తుతం వేరుశనగ పంట శాఖీయ దశ నుంచి ఊడలు దిగే దశలో ఉంది. రైతులు వేరుశనగలో కలుపు యాజమాన్యం, నీటి యాజమాన్యంతో పాటుగా సరైన సమయంలో పోషక లోపాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం, పోషక లోప సమస్యలు ఏర్పడకుండా సరైన పోషక యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులు పొందవచ్చు. సేంద్రియ ఎరువుల వాడకం ఆఖరి దుక్కిలో ఎకరాకు 4-5 టన్నుల సేంద్రియ ఎరువు వేసుకోవాలి. ఈ సేంద్రియ ఎరువులు నేలను గుల్లబరచడమే కాకుండ నేల భౌతిక, రసాయన, జీవ లక్షణాలను మెరుగుపరిచి, నేలలో నీటిని, పోషకాలను పట్టి ఉంచే స్వభావాన్ని పెంచుతాయి. కనుక రైతులు వీలైనంతవరకూ తగినంత మోతాదులో సేంద్రియ ఎరువులను వేసుకోవాలి. విత్తుకునే ముందు విత్తనాలకు రైజోబియం కల్చరు పట్టించి విత్తుకుంటే వేర్లపై బుడిపెలు బాగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల వాతావరణంలోని నత్రజని స్థిరీకరణ పెరుగుతుంది. దీని కొరకు ఎకరాకు సరిపడే విత్తనాలకు 200 గ్రాముల రైజోబియం కల్చర్ అవసరం. దుక్కి తయారీ, ఎరువుల వాడకం వర్షాధారంగా వేరుశనగ విత్తే సమయంలో ఎకరాకు 18 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్పేటు, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లను ఒకేసారి ఆఖరి దుక్కిలో లేదా విత్తే సమయంలో వేసుకోవాలి. నీటి వసతి కింద ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్పేటు, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దుక్కిలో వేయాలి. అలాగే 18 కిలోల యూరియాను విత్తే సమయంలో, 9 కిలోల యూరియాను 30 రోజుల తర్వాత అంటే తొలి పూత దశలో వేసుకోవాలి. పైరులో సూక్ష్మపోషక లోపాలు ఏర్పడిన వెంటనే వాటిని గుర్తించి తగు నివారణ చర్యలు చేపట్టాలి. వేరుశనగపై జింకు, ఇనుము లోపాలు తీవ్రంగాను, మాంగనీసు బోరాన్ లోపాలు అక్కడక్కడా కనిపిస్తాయి. జిప్సం వాడకం వేరుశనగలో కాయతో పాటుగా గింజలు బాగా ఊరి, నూనె శాతం పెరగడానికి కాల్షియం, గంధకం ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ రెండు ఉన్న జిప్సంను నీటిపారుదల కింద ఎకరానికి 200 కిలోలు తొలి పూతదశలో మొక్కల మొదళ్ళ దగ్గర సాళ్ళలో వేసి, కలుపు తీసి మొక్కల మొదళ్ళకు మట్టిని ఎగదోయాలి. వర్షాధారంగా అయితే ఊడలు దిగే సమయంలో అనగా విత్తిన 45 రోజులకు రెండో కలుపు తీసే సమయంలో వేసుకోవాలి. గంధకం లోప లక్షణాలు లేత ఆకులు చిన్నవై, వివర్ణమై నిటారుగా ఉంటాయి. ఆకులు పసుపు పచ్చగా మారతాయి. మొక్క పరిమాణం తగ్గిపోతుంది. ఇసుక నేలల్లో గంధకం లోప లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. జింకు లోపం జింకు లోపం సాధారణంగా క్షారగుణం గల నేలల్లో, భాస్వరం అధికంగాగల నేలల్లో ఎక్కువగా వస్తుంది. పైరు మొలచిన నెల రోజుల నుంచి జింకు లోపం కనిపిస్తుంది. ఆకులు మామూలు సైజుకన్నా చిన్నవిగా మారి దళసరిగా ఉంటాయి. మొక్క సరిగా పెరగదు. రెండు ఆకుల మధ్య కాండం పొడవు తగ్గుపోతుంది. లేత ఆకుల్లో ఈనెల మధ్య భాగం పసుపుగా మారి ఈనెలు మాత్రం ఆకుపచ్చగా ఉంటాయి. పైరులో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే 2 గ్రాముల జింకు సల్ఫేటును లీటరు నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. ఎకరా పొలంలో 200 లీటర్లు పిచికారీ చేసుకోవడానికి 400 గ్రాముల జింకు సల్ఫేటు అవసరమవుతుంది. భూసార పరీక్షల ద్వారా నేలలో జింకు లోపాన్ని గుర్తించినపుడు ఎకరాకు 200 కిలోల జింకు సల్ఫేటును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. ఇనుము లోపం ఇనుము లోపం సున్నంపాలు అధికంగాఉన్న నేలల్లో, బెట్ట పరిస్థితుల్లో వస్తుంది. సాధారణంగా మొక్క మొలచిన నెల రోజుల్లో లోప లక్షణాలు కనిపిస్తాయి. ఆకుల్లో ఈనెల మధ్య పచ్చదనం కోల్పోయి పసుపు పచ్చగా, తర్వాత తెలుపుగా మారతాయి. ముఖ్యంగా లేత ఆకులు పసుపు నుంచి తెల్ల రంగుకి మారి పాలిపోయి చివరకు ఎండిపోతాయి. పైరుపై ఇనుము లోపం గమనించిన వెంటనే లీటరు నీటికి 5 గ్రాముల అన్నభేది (ఐరన్ సల్ఫేటు) + అర గ్రాము నిమ్మ ఉప్పు (సిట్రిక్ ఆసిడ్) వంతున కలిపిన ద్రావణాన్ని ఆకులు తడిచేలా పిచికారీ చేయాలి. మామూలు ఆకుపచ్చరంగు వచ్చే వరకు 4-5 రోజులకొకసారి పిచికారీ చేయాలి. మాంగనీసు లోపం పైరుపై సాధారణంగా మాంగనీసు లోపం కూడా ఇనుము లోపంలాగే ఉంటుంది. మాంగనీసు లోపంలో ఈనెల పక్కనే అంటిపెట్టుకుని ఉండే ఆకు భాగం ముదురు ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి. దీని లోపం గుర్తించిన వెంటనే పైరుపై 2 గ్రాముల మాంగనీసు సల్ఫేటును లీటరు నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. భూసార పరీక్ష ద్వారా నేలలో బోరాన్ లోపం గుర్తించినట్లైతే ఎకరాకు 4 కిలోల బోరాక్స్ ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. ఈ విధంగా పైరుపై లోపాల ప్రభావం తీవ్రత పెరగకుండా నివారించగలిగితే వేరుశనగలో అధిక దిగిబడులు రైతులు పొందవచ్చు. ఆధారం: పాడిపంటలు డా.డి. శ్వేత, డా.సిహెచ్. పల్లవి, ఎ.సరిత, డా. ఎ. రమాదేవి, డా.జి. సంతోష్ కుమార్, వ్యవసాయ పరిశోధన స్థానం, ఏరువాక కేంద్రం, తోర్నాల