సీతాఫలం ఉష్ణమండల పంట. ఎక్కువ చలి, మంచుకు తట్టుకోలేదు. అధిక చలి ఉండే ప్రాంతాల్లో కాయలు మాగకుండా గట్టిగా నల్లగా మారిపోతాయి. అధిక వర్షపాతం, వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలదు. పుష్పించే దశలో పొడి వాతావరణం, కాయ దశలో అధిక తేమ, వర్షపాతం 50-75 సెం.మీ. పంటకు అనుకూలం. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువైతే పూతరాలిపోయి పిందెలు ఏర్పడవు. నేలలు మురుగు నీటి సదుపాయం ఉండి 5.5-7.5 పి.హెచ్. గల నేలలు అనుకూలం. సీతాఫలం చెట్లు చౌడు, క్షారనేలలు మినహా అన్ని రకాల నేలల్లో పెరుగుతాయి. నీరు నిలువని చెల్కా నేలలు, గరుకు నేలలు, ఎర్రనేలలు, గరపనేలల్లో బాగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది. రాళ్ళతో కూడిన గరుకు నేలల్లో కూడా సాగుచేయవచ్చు. ప్రవర్థనం సీతాఫలంను వెనీర్ అంటు పద్ధతి ద్వారా ప్రవర్థనం చేయవచ్చు. సీతాఫలం విత్తనాలు సేకరించిన వెంటనే నారుపోస్తే మొలకెత్తవు. కాబట్టి సేకరించిన రెండున్నర నెలల తర్వాత, 25×15 సెం.మీ. సైజు పాలిథిన్ సంచికి 4-6 రంధ్రాలు చేసి 1.5 కిలోల పాటింగ్ మిక్చర్ (1:1:1 ) బాగా చివికిన పశు వుల ఎరువు, ఇసుక, నేల పైమట్టి, 5-8 గ్రా.ల సూపర్ ఫాస్పేట్, 100 గ్రా.ల వేపపిండితో పై అంచు వరకు సంచులను నింపి సీతాఫల విత్తనాన్ని 1.5 నుంచి 2 సెం.మీ. లోతులో నాటాలి. 30-40 సెం.మీ. ఎత్తు పెరిగి, పెన్సిల్ మందమున్నటు వంటి మొక్కలను ఉపయోగించాలి. సీతాఫలాన్ని అంటుకట్టడానికి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు అనుకూల సమయం. వేరు మూలం మెత్తని భాగంలో 3-4 సెం.మీ. నిలువుగాటు చేసి లోనికి 3-4 సెం.మీ. ఒక వైపు చెక్కిన సయాను పుల్లను అమర్చి పాలిథిన్ రిబ్బనుతో నీరు, గాలిలోనికి పోకుండా గట్టిగా చుట్టి ముడివేయాలి. 100-120 రోజుల్లో లేత కొమ్మఅంటు పొలంలో నాటుకొనేందుకు సిద్ధంగా ఉంటుంది. నర్సరీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నీరు పోసేటప్పుడు అంటు భాగంపై పడకుండా జాగ్రత్త వహించాలి. ఋతువును బట్టి ప్రతిరోజూ లేక రోజు మార్చి రోజు నీరు పోయాలి. అంటుకట్టిన 50-60 రోజుల తరువాత పాలిథిన్ రిబ్బను తీసివేయాలి. నర్సరీలో రసాయనిక ఎరువులు వాడరాదు. వర్షాకాలంలో నర్సరీలో నీరు నిలవకుండా చూడాలి. నాటటం పొలంలో 60×60×60 సెం.మీ. గుంతలను తవ్వి 5x5 మీ. ఎడంలో లేదా 6x6 మీ. ఎడంలో నాటుకోవాలి. 5x5 మీ. ఎడంలో నాటుకున్నట్టైతే ఎకరాకు 160 మొక్కలు, 6x6 మీ. ఎడంలో నాటుకున్నట్లైతే ఎకరాకు 110 మొక్కలు సరిపోతాయి. మొక్కలు నాటుకునే ముందు ఒక గుంతకు 20 కి. పశువుల ఎరువు, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రా. ఫాలిడాల్ 2% పొడి, పై మట్టితో బాగా కలిపి ఆ తర్వాత గుంతలు నింపాలి. గుంతలో నాటడానికి 3-4 రోజుల ముందు నీరు పారించాలి. వర్షాకాలం ప్రారంభం కాగానే అంటు మొక్కలను నాటాలి. నాటేటప్పుడు అంటుభాగం భూమి నుంచి 10-20 సెం. మీ. పైకి ఉండేలా చూడాలి. గుంత మధ్యలో నాటి తప్పకుండా ఊతం ఏర్పాటు చేయాలి. కత్తిరింపులు : వేరు మూలంపై చిగుళ్ళను, కొమ్మలను వెంటవెంటనే తీసివేయాలి. ఆకృతి లేని తెగులుసోకిన కొమ్మలను కత్తిరించి చిగురించే పరిస్థితిని కల్పించాలి. 2-3 సంవత్సరాల్లో అనవసరపు కొమ్మలు కత్తిరించి చెట్టుకు నిర్థిష్టమైన ఆకారం కల్పించాలి. అంతర పంటలు, పచ్చిరొట్ట పంటలు: మొదటి 3-4 సం.ల వరకు వేరుశనగ, అపరాలు, ఉలవలు, అలసంద, నీటి వసతి ఉంటే కూరగాయలను అంతరపంటలుగా పండించవచ్చు. పచ్చిరొట్ట పంటలను చెట్ల మధ్యలో వేసి పూతరాక ముందు భూమిలో బాగా కలియదున్నాలి. నీటి యాజమాన్యం వాతావరణ పరిస్థితులను బట్టి మొదట 2–3 రోజులకొకసారి, ఆ తర్వాత 4-7 రోజుల కొకసారి నీరు పారించాలి. డ్రిప్ పద్ధతి పాటించి నీరు సమృద్ధిగా పారిస్తే పెరుగుదల, దిగుబడి అధికంగా ఉంటుంది. 20 లీటర్ల నీరు పట్టే కుండలను భూమిలో పాదుల్లో అమర్చి పిచ్చర్ పద్ధతిలో కూడా నీటిని అందించవచ్చు. నీటివసతి లేకపోతే చెట్లు బాగా పెరిగే వరకు 2-3 సంవత్సరాల వరకు వేసవిలో నీరు అందించాలి. నీరు తక్కువైతే కాయలు గట్టిగా మారి పండుబారవు. చెట్ల పాదుల్లో 8 సెం.మీ. మందం వేరుశనగ పొట్టు లేదా వరి పొట్టును వేసి తేమను ఎక్కువ కాలముండేటట్లు చూడాలి. ఎండాకాలంలో నీరు పెడితే బాగా పెరిగి ముందుగా కాపునిస్తుంది. ఎరువులు సీతాఫలం చెట్టు ఎరువులకు బాగా ప్రతిస్పందించి మంచి దిగుబడులనిస్తుంది. మొక్కకు కావలసిన పోషకాలను తగిన మోతాదులో అందించేందుకు పత్రవిశ్లేషణ తప్పనిసరిగా చేయించాలి. 250గ్రా. నత్రజని (500 గ్రా. యూరియా), 125 గ్రా. భాస్వరం (700 గ్రా. సింగిల్ సూపర్ ఫాస్పేట్), 125 గ్రా. పొటాష్ (200 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్) చెట్టు పాదుల్లో తేమ ఉన్నప్పుడు రెండు దఫాలుగా జూన్-జులై, ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో వేసుకోవాలి. జీవన ఎరువైన అజటోబ్యాక్టర్ ను చెట్టుకి 250 గ్రా. వరకు వేసుకోవటం ద్వారా మంచి దిగుబడి పొందవచ్చు. దిగుబడి : సీతాఫలం అంట్లు నాటిన మూడవ సం. నుంచి కాపు వస్తుంది, కాని మంచి కాపు 7-8 సం,,ల వయసులో పొందవచ్చు. మామూలుగా ఒక చెట్టు 60-100 వరకు పండ్ల దిగుబడి నిస్తుంది. ఆధునిక యాజమాన్య పద్ధతులు పాటించినట్లైతే ఒక్కొక్క చెట్టుకు 100-150 కాయల చొప్పున ఎకరాకు 3-4 టన్నుల దిగుబడి పొందవచ్చు. పరిపక్వ దశ : కాయలపై కళ్ళు ప్రస్ఫుటంగా కనిపిస్తూ కళ్ళమధ్య తెలుపు నుంచి లేత పసుపు రంగు లేదా నారింజరంగుకు మారడంఅనేది పరిపక్వతకు సంకేతం. అలాగే కాయలు ఆకుపచ్చ రంగు నుంచి లేత ఆకుపచ్చరంగుకు మారడం పక్వానికి సంకేతం. సీతాఫలానికి నిల్వఉండే లక్షణం లేనందున ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సీతాఫలం కాయల్లో కొన్ని కాయలు పూర్తిగా అభివృద్ధి చెందక గట్టిగా మారి ఎండిపోతాయి. కాయలు నల్లగా మారతాయి. ఇవి చెట్టునుంచి రాలిపోకుండా చాలాకాలం వరకూ చెట్టుపైన కొమ్మలకు వేలాడుతూ ఉంటాయి. వీటిని రాతికాయలు అంటారు. తగిన మోతాదులో ఎరువులు వేసుకోవాలి. ఉపయోగాలు ఈ పంటను అతి తక్కువ వర్షపాత ప్రాంతాల్లో మెట్టభూముల్లో సాగు చేయవచ్చు. సీతాఫలం కార్బోహైడ్రేట్లు, విటమిన్ 'సి', విటమిన్ 'ఎ' లను కలిగి ఉంటుంది. ఐస్ క్రీమ్, పాల సంబంధిత పదార్థాల తయారీలో ఉపయోగ పడతాయి. సీతాఫలం ఆకులు, గింజల నుంచి తీసిన రసంలో కీటకనాశిని లక్షణాలు ఉంటాయి. సీతాఫలం గింజల నుంచి 27-30% దాకా నూనె లభిస్తుంది. ఈ నూనెను సబ్బు, రంగుల పరిశ్రమల్లో వాడతారు. ఆధారం : పాడిపంటలు మాస పత్రిక డా.వి.రమణ శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం) ఉద్యాన పరిశోధనా స్థానం, అనంతపురం