పండ్ల తోటలు మామిడి కాండం తొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంది. ఆశించిన యెడల పురుగులను గట్టి ఇనుప తీగను చొప్పించి బయటకు లాగి చంపివేసి రంధ్రాల్లో పెట్రోలు వేసి బంక మట్టితో మూసి వేయాలి. అరటి తల్లి మొక్క చుట్టూ వచ్చే పిలకల కోతకు ఉపయోగించు కొడవలిని ప్రతీసారీ ముందుగా డీజిల్/కిరోసిన్‌లో ముంచి వైరస్ తెగుళ్ళ వ్యాప్తిని నివారించాలి. వైరస్ తెగులు వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు మిథైల్ డెమటాన్ 2 మి.లీ./లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి. పచ్చ అరటి, కొవ్వూరు బొంత, కర్పూర చక్కెరకేళి రకాలకు రెండవ దఫాగా 110 గ్రా. యూరియా, 80 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇచ్చి తేలికపాటి తడి ఇవ్వాలి. బొప్పాయి నారు పెంపకము: ఎకరాకు డైయిషియస్ రకాలకు 200 గ్రా., గైనోడైయిషియస్ రకాలకు 20 గ్రా. విత్తనం కావాలి. విత్తనాన్ని 22.5× 15 సెం. మీ. 150 గేజ్ మందం గల పాలిథీన్ సంచులలో పశువుల ఎరువు, ఇసుక కలిపిన మట్టితో నింపి నాటాలి. విత్తనాలను 1సెం.మీ. లోతు మించకుండా విత్తుకోవాలి. కూరగాయ పంటలు బెండ, టమాట, వంగ బెండ, టమాట, వంగ పంటల్లో సిఫార్సు చేసిన నత్రజని ఎరువులను వేసుకొని నీరు పెట్టాలి. ఈ పంటలలో వైరస్ తెగుళ్ళ వ్యాప్తిని అరికట్టేందుకు రసం పీల్చే పురుగులను నివారించాలి. తీగ జాతి కూరగాయలు బూడిద తెగులు ఆశించే అవకాశం ఉంది నివారణకు కెరాథేన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పండు ఈగ నివారణకు 2 మి.లీ. మలాథియాన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి లేదా మలాధియాన్ 100 మి.లీ. 100 గ్రా. చక్కెర లేదా బెల్లం + 10లీ. నీరు కలిపి విషపుఎర తయారు చేసి మట్టి మూకుడులో/ప్లాస్టిక్ పళ్ళాలలో పోసి ఎకరాకు 10-12 మూకుడులను అక్కడక్కడ పెట్టాలి. చేమ ఆఖరి దఫాగా ఎకరాకు 35 కిలోల యూరియా, 18 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను మొక్కకు ఇరువైపులా గుంటలో వేసి కప్పి తేలికపాటి తడి ఇవ్వాలి. పూలతోటలు చామంతి నాటిన 30 రోజులకు తలను తుంచి వేయాలి. పువ్వు పరిమాణాన్ని పెంచటానికి పక్క నుండి వచ్చిన పూ మొగ్గలను తుంచివేసి మధ్య వున్న మొగ్గల పరిమాణం పెరిగేటట్లు చూడాలి. కలుపు రాకుండా మొక్కల మధ్య ఎండుటాకులు లేదా ఎండుగడ్డిని కప్పాలి. బంతి సాగుకు మరియు బంతి విత్తనోత్పత్తికి నారు పోసుకోవాలి. నేల సంపంగి (లిల్లీ) తోటలలో ఎకరాకు 27 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ నిచ్చే ఎరువులను పైపాటుగా వేయాలి. కొద్దిగా విచ్చిన పూలను తెంపి వెదురుబుట్టలలో ఉంచి మార్కెట్‌కు తరలించాలి. ఆధారం: పాడిపంటలు మాసపత్రిక రైతు సలహా కేంద్రం, ఉద్యాన విశ్వ విద్యాలయం, వెంకటరామన్న గూడెం, పశ్చిమ గోదావరి.