వరి తెలంగాణ రాష్ట్రంలో వరి నాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ప్రస్తుతం వరి వివిధ దశల్లో ఉంది. వరి ఎక్కవ శాతం పిలకలు తొడిగే దశలో ఉంది. ఈ దశలో సరైన ఎరువుల యాజమాన్యం, తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లైతే వరిలో మంచి ఫలితాలు పొందవచ్చును. ఈ సమయంలో వరిలో కలుపు నివారణ కూడా ఎంతో అవసరం. పిలక దశలో ఉన్న వరిపైర్లలో ఎకరానికి 30-35 కిలోల యూరియాను బురద పదునులో చల్లుకోవాలి. అంకురం దశలో 30-35 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును వేసుకోవాలి. ఈ దశలో కాంప్లెక్స్ ఎరువులను వేయరాదు. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ మాసంలో వరినాట్లు వేయరాదు. ఈ మాసంలో నాట్లు వేసుకున్నట్లైతే పంట పూత సమయంలో చలి వాతావరణం వల్ల గింజ పట్టక తాలు గింజలు ఏర్పడి దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది. ప్రధాన పొలంలో పిలకలు వేసే దశలో 2 సెం.మీ. వరకు నీరు ఉండే విధంగా చూడాలి. పొలంలో ఊద, ఒడిపిలి వంటి కలుపు మొక్కలు ఉన్నట్లైతే నాటిన 12 రోజులకు సైహలోఫాప్-పి-బ్యుటైల్ 1.5 మి.లీ. లేదా బిస్పైరిబాక్ సోడియం 0.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి పంటలో సెప్టెంబర్ మాసం అత్యంత కీలకమైనది. ఈ మాసంలో చీడపీడల ఉధృతి అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ నెలలో ఎడతెరిపి లేకుండా (2-3 రోజులు) గాలులతో కూడిన వర్షాలు పడినా, తుఫాను ధాటికి రోజుల తరబడి వర్షం కురిసినట్లైతే బ్యాక్టీరియా ఆకు ఎండుతెగులు ఆశిస్తుంది. తెగులు 5 శాతం కంటే ఎక్కువ గమనించినట్లైతే తాత్కాలికంగా నత్రజని ఎరువులను వేయడం ఆపివేయాలి. తెగులు ఆశించిన పొలం నుండి నీటిని ఒకటి రెండుసార్లు పూర్తిగా బయటికి పంపాలి. తెగులు వ్యాప్తిని అరికట్టడానికి అగ్రిమైసిన్ 0.4 గ్రా. లేదా ప్లాంటామైసిన్ లేదా పోషామైసిన్ 0.2 గ్రా. 5-7 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ప్రధాన పొలంలో అగ్గితెగులు ఆశించే అవకాశం ఉంది. కావున అగ్గితెగులు మచ్చలు తొలిదశలోనే గుర్తించి ఐసోప్రోథయోలేన్ 1.5 మి.లీ. లేదా ట్రైసైక్లజోల్ 0.6 గ్రా. లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ. లేదా ట్రైసైక్లజోల్ + మ్యాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొలంలో గట్ల వెంబడి ఉన్న మొక్కలలో 10 శాతం పిలకలలో పాముపొడ తెగులు ఉన్నట్లు గమనించినట్లైతే హెక్సాకొనజోల్ 2 మి.లీ. లేదా ప్రొపికొనజోల్ 1 మి.లీ. లేదా వాలిడామైసిన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాలలో ఉల్లికోడు అధికంగా ఆశించే అవకాశం ఉంది. కనుక పొలంలో 5 శాతం ఉల్లిగొట్టాలు లేదా దుబ్బుకి ఒక కోడు సోకిన పిలక గమనించినట్లైతే కార్బోఫ్యూరాన్ 3సిజి 10 కిలోలు లేదా ఫిప్రోనిల్ 0.3జి గుళికలు 8 కిలోలు ఎకరానికి చల్లుకోవాలి. సెప్టెంబర్ నుండి వరి పంటను సుడిదోమ ఆశిస్తుంది. పిలకదశలో దుబ్బుకి 10-15 దోమలు గుర్తిస్తే అంకురం నుండి ఈనిక దశలో దుబ్బుకి 20-25 దోమలు ఉన్నట్లైతే తొలిదశలో ఎసిఫేట్ + ఇమిడాక్లోప్రిడ్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లైతే డైనోటెఫ్యూరాన్ 20 ఎస్ 0.4 గ్రా. లేదా పైమెట్రోజైన్ 50 డబ్ల్యుజి 0.6 గ్రా. లేదా ట్రైఫ్లూమెజో పైరిమ్ 0.485 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 40% + ఎథిప్రోల్ 40% డబ్ల్యుజి 0.25 గ్రా. లీటరు నీటికి మొక్కల మొదళ్ళపై పడేటట్లు పిచికారీ చేయాలి. దోమ ఉధృతి దోహదపడే మందులైన ప్రొఫెనోఫాస్, సింథటిక్ పైరిత్రాయిడ్స్, బయోమందులను వాడరాదు. పొలాన్ని అడపాదడపా ఆరగట్టాలి. ఈ మాసంలో కాండంతొలిచే పురుగు రెక్కల పురుగు ఉధృతి అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అంకురం నుండి చిరుపొట్టదశలో ఉన్న వరి పైర్లలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పి 400 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్సి 60 మి.లీ. ఎకరానికి పిచికారీ చేయాలి. మొక్కజొన్న ప్రస్తుతం కురిసిన అధిక వర్షాల వల్ల నీరు నిలిచి మొక్కజొన్న పంట దెబ్బతినే అవకాశముంది. కావున ముందుగా అధిక నీరు నిలిచిన పొలాల్లో మురుగు నీటి కాల్వలను ఏర్పరచుకొని బయటకు పారదోలాలి. వర్షాలు ఆగిన తర్వాత ఎకరాకు 30-40 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పైపాటుగా వేయాలి. ఆకుమచ్చ, ఆకుమాడు తెగుళ్ళు ఆశిస్తే మ్యాంకోజెబ్ 2.5 గ్రా. లేదా ప్రొపికొనజోల్ 1 మి.లీ. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలి. ప్రస్తుతం పంటదశలో మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉధృతి తగ్గే అవకాశం ఉంది. అవసరమైతే, నివారణకు క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 మి.లీ. లేదా స్పైనిటోరం 0.5 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి మొక్క సుడిలో మందు ద్రావణం పడేటట్లు పిచికారీ చేయాలి. ఎదిగిన లార్వాల నివారణకు విషపు ఎరను పెట్టుకోవాలి. వరి తవుడు 10 కిలోలు + బెల్లం 2 కిలోలు + 2–3 లీటర్ల నీటిలో కలిపి 24 గంటలు పులియనిచ్చి మరుసటిరోజు థయోడికార్బ్ 100 గ్రా. కలిపి ఉండలుగా తయారుచేసి సాయంకాలం వేళలో మొక్కల సుడులలో వేసుకోవాలి. చిరుధాన్యాలు జొన్న ఈ పంట వేసిన 35 రోజుల నుండి పంట కోసేవరకు కాండం తొలిచే పురుగు ఆశిస్తుంది. కావున ఈ పురుగు నివారణకు ఎకరానికి 4 కిలోలు కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలను కాండం సుడుల్లో వేయాలి. అదేవిధంగా కత్తెర పురుగు ఉనికి గమనించినట్లైతే మొదటి దశ లార్వాకు వేపనూనె (అజాడిరక్టిన్) 1500 పిపియం 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి మొక్క సుడుల్లో పడే విధంగా పిచికారీ చేయాలి. సజ్జ పంట పూత దశలో ఉంటుంది. వానాకాలంలో 20-25 రోజులకు మించి బెట్ట పరిస్థితులు ఏర్పడితే పూత, గింజకట్టే దశలో నీటితడులు ఇవ్వడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చు. గులాబి రంగు పురుగు ఆశించినట్లైతే నివారణకు క్లోర్‌పైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మబ్బులతో కూడిన వాతావరణం, వర్షపు తుంపరలు తేనెబంక తెగులు వ్యాప్తికి దోహదపడతాయి. పుష్పించే సమయంలో ఆశించే ఈ తెగులు నివారణకు కార్బండాజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రాగి ఎదిగిన మొక్కలలో అగ్గితెగులు ఆశించినప్పుడు ఆకులు, కణుపులు, వెన్నులపైన నూలుకండె ఆకారం మచ్చలు ఏర్పడతాయి. కణుపులు విరిగిపోతాయి.వెన్నుపై గింజలు తాలుగా మారతాయి. అగ్గితెగులు నివారణకు కార్బాండాజిమ్ 1 గ్రా. లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రా. లేదా ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంట పూత, గింజ పాలుపోసుకునే దశల్లో పైరు నీటి ఎద్దడికి గురికాకుండా చూడాలి. కొర్ర ఈ పంటలో అగ్గితెగులును గమనించినట్లైతే రాగి పంటలో సూచించిన విధంగా మందులను పిచికారీ చేయాలి. పూత, గింజ పాలుపోసుకునే దశల్లో పైరు నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. వేరుశనగ వానా కాలం పంటలో లద్దెపురుగు ఆశించినట్లైతే, పురుగు తొలిదశలో ఉన్నప్పుడు 5% వేప గింజల కషాయం పిచికారీ చేసుకోవాలి. ఎకరాకు 8-10 పక్షి స్థావరాలను అమర్చాలి. ఎదిగిన లార్వాలను నివారించేందుకు ఫ్లూబెండమైడ్ 20% డబ్ల్యుజి 0.6 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు ఉధృతి గమనించినట్లైతే 2 మి.లీ. హెక్సాకొనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. యాసంగి వేరుశనగ పంటను సాధారణంగా సెప్టెంబర్ 15 నుండి విత్తుకోవచ్చు. విత్తుకునే ముందు నేలను మెత్తగా దున్ని చదును చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో 4-5 టన్నుల పశువుల ఎరువు, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 20 కిలోల యూరియా వేసుకోవాలి. ఎకరానికి 65-80 కిలోల గింజ అవసరమవుతుంది. ఒక కిలో విత్తనానికి 3 గ్రా. మ్యాంకోజెబ్ లేదా 1 గ్రా. టెబ్యుకొనజోల్తో విత్తనశుద్ధి చేసుకోవాలి. వరుసకు వరుసకు మధ్య 22.5 సెం.మీ., మొక్కకు మొక్కకు మధ్య 10 సెం.మీ. దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. అలాక్లోర్ అనే కలుపు మందును 1.5-2.0 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 48 గంటలలోపు పిచికారి చేసుకోవాలి. ఆముదం భూమిలో తేమ ఉన్న సమయంలో 15 కిలోల యూరియాను పైపాటుగా వేయాలి. దాసరి పురుగు ఉధృతిని గమనించినట్లైతే తొలిదశలో 5 మి.లీ. వేపనూనె లీటరు నీటికి, పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లైతే మలాథియాన్ 50ఇసి 3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 8-10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. రసం పీల్చే పురుగుల నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్ 0.2గ్రా. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగును గమనించినట్లైతే తొలిదశలో ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. 5 కిలోల వరి తవుడు + 500 గ్రా బెల్లం + 500 మి.లీ. ఎసిఫేట్ 1.5 గ్రా కలిపి విషపు ఎరను వాడవచ్చును. ఎండు తెగులును గమినించినట్లైతే కార్బండాజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళ దగ్గర నేలను తడపాలి. వర్షాకాలం ఆముదం పంట ఇప్పుడు పూత దశలో ఉంటుంది. కాబట్టి బూజు తెగులు రాకుండా ఉండేందుకు వాతావరణ హెచ్చరికల ప్రకారం వర్షానికి 4-6 గంటల ముందు, వర్షాలు తగ్గాక ప్రొపికొనజోల్ 1 మి.లీ. లేదా కార్బండాజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువును అదనంగా వేసుకుంటే తర్వాత వచ్చే గెలలు ఆరోగ్యంగా వస్తాయి. నువ్వులు ఆలస్యంగా విత్తుకున్న నువ్వు పంటలో మొక్కలు మొలిచిన 15-20 రోజులకు కలుపును, అదనపు మొక్కలను తీసివేయాలి. విత్తిన 30-35 రోజులకు గొర్రుతో అంతరకృషి చేయాలి. మొక్కలు మొలిచిన 7-20 రోజులలో మొక్కలు చనిపోవడం గమనించినట్లైతే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలుపుకొని మొక్కల మొదళ్ళ దగ్గర పోయాలి. పొద్దుతిరుగుడు లద్దెపురుగులను గమనించినట్లైతే నొవాల్యురాన్ 1.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. బీహారి గొంగళి పురుగు నివారణకై క్వినాల్ ఫాస్ 25 ఇసి 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు నివారణకై ప్రొపికొనజోల్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆగష్టు రెండవ పక్షంలో విత్తిన పొద్దుతిరుగుడు పంటపై రసం పీల్చే పురుగులను గమనించినట్లైతే ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కుసుమ కుసుమ పంటను సెప్టెంబర్ రెండవ పక్షం నుండి వేసుకోవచ్చు. తేమను నిలుపుకునే బరువైన నల్లరేగడి నేలలు కుసుమ సాగుకు అనుకూలం. సాధారణంగా ఎకరానికి 4 కిలోల విత్తనం అవసరం అవుతుంది. కిలో విత్తనాన్ని 3 గ్రా. థైరమ్ లేదా కాప్టాన్ లేదా 1 గ్రా. కార్బండాజిమ్ విత్తనశుద్ధి చేసుకోవాలి. ఎత్తు మడులు, కాలువల పద్ధతిలో నాటుకున్నట్లైతే తేమ సంరక్షణతోపాటు అధిక దిగుబడులు పొందవచ్చును. సోయాచిక్కుడు సోయాచిక్కుడు, ప్రస్తుతం కాయ ఏర్పడే దశ నుండి గింజ నిండే దశలో ఉంది. సాధారణంగా సోయా పంటలో ఆశించే తెగుళ్లలో ఎక్కువగా పూత దశ నుండే ఆశిస్తాయి. మన రాష్ట్రంలో కురిసిన అధిక వర్షాల వల్ల పొలాలలో నీరు చేరడం వలన వేరుకుళ్ళు తెగులు, ఆంత్రక్నోస్ ఆకుమచ్చ, కాయకుళ్ళు తెగులు ఆశిస్తాయి. వీటితోపాటు మసి బొగ్గు, రైజోక్టోనియా ఏరియల్ బ్లాయిట్ తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది. వేరుకుళ్ళు తెగులు నివారణకు, లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1 గ్రా. కార్బండాజిమ్ మందుతో మొక్క చుట్టూ భూమిని తడపాలి. ఆంత్రక్నోస్ ఆకుమచ్చ, కాయకుళ్ళు తెగులు, మసి బొగ్గు తెగులు, రైజోక్టోనియా ఏరియల్ బ్రైట్ తెగుళ్ళ నివారణకు, 2.5 గ్రా. టెబ్యుకొనజోల్ 10% + సల్ఫర్ 65% డబ్ల్యుజి లేదా 0.6 మి.లీ. పైరాల్లొటిన్ + ప్లక్సాపైరోక్సాడ్ లేదా 1 గ్రా. టెబ్యుకొనజోల్ లేదా 1 మి.లీ. ప్రొపికొనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాండం తొలిచే ఈగ, కాండం తొలిచే పురుగులను అదుపు చేయడానికి, థయోమిథాక్సామ్ 12.6 శాతం + లామ్డా సైహలోత్రిన్ 9.5 శాతం లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 9.3% లామ్డా సైహలోత్రిన్ 4.6% లేదా 1.2 మి.లీ. ఇసోసైక్లోసోరం వంటి పురుగుమందులను, 10గ్రా. 13:00:45 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయడం వలన పంట దిగుబడి కూడా పెరుగుతుంది. తెల్లదోమ ఉధృతి అధికంగా ఉంటే, పైన తెలిపిన సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులను పిచికారీ చేయకూడదు. పొగాకు లద్దెపురుగు నివారణకు, 0.3 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ లేదా 1.65 గ్రా. నొవాల్యురాన్ 5.25% + ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.9% ఎస్సి లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే, పల్లాకు తెగులు ఉధృతి అక్కడక్కడ గమనిచారు. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. కావున తెల్లదోమ నివారణకు, 1.25 మి.లీ. డైఫెన్థయూరాన్ 50% డబ్ల్యుపి లేదా 0.5 గ్రా. ఎసిఫేట్ + బైఫెంత్రిన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అపరాలు యాసంగి– మినుము, పెసరకు అనువైన రకాలు మినుము : ఎం.బి.జి. -1070, ఎం.బి.జి. -207, జి .బి.జి. -1, టి.బి.జి.-104, ఎల్.బి.జి.-787, ఎల్.బి.జి.-752, పి.యు .-31. పెసర : ఎం.జి.జి. -385,ఎం.జి.జి.-295, ఎం.జి.జి.-౩51, ఎం.జి.జి.-347, ఎం.జి.జి.-348, డబ్ల్యూ .జి.జి.-42, టి. ఎం.-96-2, ఎం.జి.జి.-460, ఎం.జి.జి.-407, ఐ.పి.యు.-2-14. విత్తే సమయం: యాసంగి - 15 సెప్టెంబర్ నుండి అక్టోబర్ చివరి వరకు విత్తాలి విత్తన మోతాదు: 6-8 కిలోలు ఎకరాకు విత్తనం అవసరమవుతుంది. విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్ లేదా కాప్టాన్ లేదా మ్యాంకోజెబ్ మందుతో విత్తనశుద్ధి చేసిన తరువాత 5 గ్రా. థయోమిథాక్సామ్ లేదా 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తనశుద్ధి చేసి విత్తితే తొలిదశలో ఆశించే రసంపీల్చే పురుగులు, తెగుళ్ళ బారి నుండి కాపాడుకోవచ్చును. చివరగా విత్తే ముందు 10 కిలోల విత్తనానికి 200 గ్రా. రైజోబియం కల్చర్‌ను పట్టించి విత్తుకోవాలి. అంతరకృషి పెసర/మినుము పైరును 30 రోజుల వరకు కలుపు బారి నుండి రక్షించుకోవాలి. 20 రోజులు, 30 రోజుల దశలో గొర్రు/దంతి ద్వారా అంతకృషి చేస్తే కలుపు నివారణతోపాటు తేమను కూడా నిలుపుకోవచ్చు. కలుపు అధికంగా ఉండే భూములలో పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.0-1.4 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజుగాని పిచికారీ చేయాలి. వెడల్పాకు కలుపు నివారణకు ఇమాజితాఫిర్ (పర్సుట్) 300 మి.లీ. ఎకరాకు లేదా 2 నుండి 3 ఆకుల గడ్డిజాతి కలుపు నివారణకు ఎకరాకు 400 మి.లీ. క్విజలోపాప్ ఇథైల్ లేదా ప్రొపిక్విజాపాప్ 10% ఇసి 250 మి.లీ. పిచికారీ చేయాలి. కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు నేలలో తగు తేమ ఉండేలా చూసుకోవాలి.నీటి యాజమాన్యం: వానాకాలంలో పెసర, మినుమును వర్షాధారంగా పండిస్తారు. బెట్ట పరిస్థితులలో అవసరం మేరకు కీలక దశల్లో 1–2 తడులు ఇస్తే మంచి దిగుబడి సాధించవచ్చును. కీలక దశలు: పూత, కాయ తయారయ్యే దశలో పంట బెట్టకు గురికాకుండా చూడాలి. బెట్ట పరిస్థితుల్లో 2% (20 గ్రా. లీటరు నీటికి) యూరియా ద్రావణాన్ని అవసరాన్ని బట్టి 2 లేదా 3 సార్లు పిచికారీ చేయాలి. యాసంగి కంది కంది పైరును నీటి వసతి ఉన్న ప్రాంతాలలో సెప్టెంబర్ నెలలో సాగు చేసుకునే అవకాశముంది. రకాలు: డబ్ల్యు. ఆర్.జి-65, ఐసిపిఎల్- 2740, టిడిఆర్ జి -4, ఐసిపిఎల్ -87119 (ఆశ), డబ్ల్యుఆర్-255, టిడిఆర్ జి-59. విత్తే సమయం: సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చును. విత్తే దూరం: భూ స్వభావాన్ని బట్టి 60×20 సెం.మీ./90×20 2.2. / 120×20 .. మార్చుకోవాలి. ఎరువులు నత్రజని 20 కిలోలు, భాస్వరం 50 కిలోలు హెక్టారుకు దుక్కిలో వేయాలి. సూటి ఎరువులు అయినటువంటి యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడాలి. కంది పెరిగే దశలో ఆకు చుట్టూ పురుగు క్లోరోపైరిఫాస్ 2 మి.లీ. లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తొలకరిలో ఆశిస్తుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లైతే నివారణకు వేసిన మినుము, పెసర పైర్లు పూత, కాయ దశల్లో, కంది శాఖీయ దశల్లో ఉన్నాయి. మినుము, పెసర పైర్లకు ముఖ్యంగా కింది పురుగులు, తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది. తలమాడు లేదా మొవ్వుకుళ్ళు: వైరస్ వల్ల కలిగే తెగులు, తామర పురుగులు దీని వ్యాప్తికి దోహదపడుతాయి. ముఖ్యంగా బెట్ట వాతావరణంలో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులును నివారించాలంటే తామర పురుగులను నియంత్రించాలి. వీటి నివారణకు 1 గ్రా. ఎసిఫేట్ లేదా ఫిప్రోనిల్ 1.5 మి.లీ. లేదా స్పైనోశాడ్ 0.3 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి ఉధృతిని బట్టి వారం రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి. పంట కంటే ఒక అడుగు ఎత్తులో నీలి రంగు జిగురు అట్టలను, ఎకరానికి 20 ఉంచినట్లైతే తామర పురుగుల ఉధృతిని తెలుసుకోవచ్చును. పల్లాకు తెగులు: పల్లాకు తెగులు సోకిన మొక్కలను, ఇతర కలుపు మొక్కలను పీకి నాశనం చేయాలి. పైరు పై ఒక అడుగు ఎత్తులో పసుపు రంగు రేకులను గాని అట్టలను గాని ఉంచి వాటి మీద ఆముదం గాని గ్రీజుగాని పూసినట్లైతే తెల్లదోమ ఉధృతిని తెలుసుకొనవచ్చును. తెల్లదోమ నివారణకు ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లీటరు నీటికి కలిపి, పురుగుల ఉధృతిని బట్టి 7 నుండి 10 రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి. మారుకా మచ్చల పురుగు: పూతదశలో 'మారుకా' అనే గూడు పురుగు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు లీటరు నీటికి క్లోర్‌పైరిఫాస్ 2.5 మి.లీ. లేదా నొవాల్యురాన్ 1.0 మి.లీ. లేదా స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మి.లీ. మందును పిచికారీ చేస్తే పురుగును నివారించవచ్చు. అవసరమైతే వారం రోజుల తర్వాత మరల పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు: ఈ తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగు గుండ్రని చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు పెద్దవై ఆకులు ఎండి రాలిపోతాయి. దీని వలన కాయల్లో గింజలు సరిగ్గా నిండవు. నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. మ్యాంకోజెబ్ లేదా 1 గ్రా. క్లోరోథెలానిల్ లేదా 1 గ్రా. కార్బండాజిమ్ లేదా 1 గ్రా. థయోఫానేట్ మిథైల్లను కలిపి పిచికారీ చేయాలి. పత్తి రాష్ట్రంలో ప్రస్తుతం పత్తి పంట పూత, కాత /కాయ ఏర్పడే దశలో ఉంది. నేలలో అధిక తేమ లేదా బెట్ట పరిస్థితుల్లో పత్తి పంటలో పూత, కాత రాలటం జరుగుతుంది లేదా ఎక్కువ మోతాదులో యూరియా వాడినా లేదా తక్కువ పొటాషియం వాడినా లేదా భూమిలో బోరాన్ తక్కువగా ఉన్నా పూత, కాత రాలుతుంది. పత్తిలో పూత, కాత పిందె రాలటం ఎక్కువగా ఉంటే 5 లీటర్ల నీటికి 1 మి.లీ. ప్లానోఫిక్స్ (ఎన్ఎఎ 10 పిపిఎం) కలుపుకొని పిచికారీ చేయాలి. యూరియా, పొటాష్ ఎరువును పత్తి పంట 80-90 రోజుల దశ వరకే వాడాలి. విత్తిన 80-90 రోజుల తర్వాత నుండి ఎరువులు వేయడం ఆపివేయాలి. పత్తి మొక్క ఎదుగుదల తక్కువగా ఉన్నట్లైతే పైపాటుగా లీటరు నీటికి 10 గ్రా. చొప్పున 13:0:45 (-3) 5 19:19:19 (2) లేదా యూరియాను పురుగు లేదా తెగులు మందులను పిచికారీ చేసేటప్పుడు కలుపుకొని పైపాటుగా వాడుకోవచ్చు. పత్తి మొక్క మధ్య ఆకులు ఎరుపు లేదా పండాకుగా మారినట్లైతే లీటరు నీటికి 10 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ + 2 గ్రా. జింక్ సల్ఫేట్ + 2 గ్రా. బోరాన్ ను కలిపి వారం పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. అధిక సాంద్రతలో పత్తిని సాగు చేస్తున్న రైతులు పత్తి చేను 60-65 రోజుల దశలో ఉంటే మొక్క పెరుగుదలను, శాఖీయ కొమ్మల పెరుగుదలను అదుపులో ఉంచడానికి మెపిక్వాట్ క్లోరైడ్ మందును లీటరు నీటికి 1.2 మి.లీ. కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పత్తిలో పేనుబంక, పచ్చదోమ, తామర పురుగులు ఆశించే అవకాశం ఉంది. తామర, పేనుబంక, పచ్చదోమ నివారణకై ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా: లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రా. లేదా ఫ్లోనికామిడ్ 0.3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ. లేదా సల్ఫాక్సాఫ్లోర్ 0.75 గ్రా. లేదా డైఫెన్థయూరాన్ 1.25 గ్రా. డైనోటెఫ్యూరాన్ 0.4 గ్రా. లేదా స్పైనోటోరమ్ 0.9 మి.లీ. లేదా ఎసిఫేట్ + ఇమిడాక్లోప్రిడ్ 2 గ్రా. లీటరు నీటికి కలుపుకొని మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. తెల్లదోమ నివారణకై సల్పాక్సాప్లోర్ 0.75 గ్రా. లేదా డైఫెన్థయూరాన్ 1.25 గ్రా. లేదా బైఫెన్అన్+ డైఫెన్ఫయూరాన్ 1.25 గ్రా. మందులను లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. తలమాడు తెగులు (టి.ఎస్.వి) పత్తిలో ఆశించినట్లు గమనించారు. తామర పురుగులు ఈ తెగులు వ్యాప్తికి దోహదబడతాయి. అదేవిధంగా వయ్యారిభామ కలుపు మొక్కలు పూతకు రాక ముందే పీకి వేయాలి. తామర పురుగు నివారణకు ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా సల్పాక్సాఫ్లోర్ 0.75 గ్రా. లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రా. కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. గులాబిరంగు పురుగు నివారణకై పంట పూత దశ నుండే లింగాకర్షక బుట్టలు ఎకరాకు 4 నుండి 8 వరకు పెట్టుకోవాలి. గుడ్డిపూలను ఎరి వేయాలి. పురుగు తాకిడిని బట్టి మొదటగా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. + వేపనూనె 5 మి.లీ. లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పత్తి పంటలో కనిపించే వివిధ ఆకుమచ్చల నివారణకు లీటరు నీటికి 2.5గ్రా. మాంకోజెబ్ లేదా 1 గ్రా. కార్బండజిమ్ లేదా 2.5 గ్రా. కార్బండజిమ్ + మాంకోజెబ్ మిశ్రమాన్ని 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. చెరకు అధిక వర్షాలు, తుఫాను గాలులకు పంట పడిపోకుండా మొక్కల వరుసల మొదళ్ళకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. నీటి ముంపునకు గురైన లేదా గురికాబోయే తోటల్లో, ప్రతి 24 మీటర్లకు 40 సెం.మీ. లోతు, 60 సెం.మీ. వెడల్పుగల కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. తోటల్లో నీరు నిల్వకుండా మురుగు నీటి కాల్వల ద్వారా గాని లిఫ్టు పంపులు వినియోగించి తరచుగా నీటిని తీసివేయాలి.ఈ మాసంలో దూదేకుల పురుగు పంటను ఆశించి, పురుగులు ఆకుల అడుగుభాగాన గుంపులు గుంపులుగా చేరి, ఆకుల నుండి రసాన్ని పీల్చి వేయడం వలన ఆకులు వడలిపోతాయి. క్లోర్‌పైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి ఈ పురుగును నివారించుకోవచ్చు. వాతావరణం మబ్బుగా ఉండి 19-35 డిగ్రీల సెల్సిఎస్ వరకు ఉష్ణోగ్రత, 80-90 శాతం గాలిలో తేమ ఉన్నప్పుడు తెల్లపేను (ఊలి ఎఫిడ్) అభివృద్ధి చెందుతుంది. దీని తల్లి, పిల్ల పురుగులు ఆకుల అడుగుభాగంలో గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వలన తెలుపు, పసుపు వర్ణం మిళితమైన మచ్చలు ఏర్పడతాయి. మొదట అంచులు, తర్వాత మొత్తం ఆకులు క్రమేపి ఎండిపోతాయి. ఈ పురుగుల విసర్జన తియ్యని జిగట పదార్థం లాగా ఉండి కిందున్న ఆకుల పై భాగాన పడి, దాని మీద సూటీమోల్డ్ అనే నల్లని శిలీంధ్రం పెరిగి ఆకు మసిబారుతుంది. గాలి ద్వారా 1.5-2.0 కిలోమీటర్ల దూరం వరకు ఈ పురుగులు వ్యాప్తి చచెందగలవు. దీని నివారణకు, పంటకు సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని ఎరువులు వాడాలి. పురుగు ఆశించిన ఆకులను తీసి తగులబెట్టాలి. లీటరు నీటికి క్లోర్బైరిఫాస్ 2.5 మి.లీ. మోతాదులో కలిపి పిచికారీ చేయాలి. ఈ మాసంలో పిండి పురుగు కూడా పంటను ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. పురుగులు ఆకు తొడిమెలకు, చెరకు గడలకు మధ్య గుంపులు గుంపులుగా చేరి గదల నుండి రసాన్ని పీల్చివేస్తాయి. పంట పక్వానికి వచ్చేటప్పుడు పిండినల్లి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్భతంగా ఉన్నప్పుడు మొవ్వు ఎండిపోతుంది. ఎదిగిన తోటల్లో పురుగు నివారణకు ఆకులు రెలచి, బహిర్గతమైన కణుపుల మీద లీటరు నీటికి క్లోర్బైరిఫాస్ 2.5 మి.లీ. మోతాదులో కలిపి పిచికారీ చేయాలి. ఇటీవల కాలంలో ఆకుపై ఆశిస్తున్న పిండినల్లి (డిసి కాకస్ కారెన్స్) నివారణకు కూడా పైన సూచించిన మందులను ఆకు తడిచేటట్లుగా పిచికారీ చేసి, పురుగును అదుపులో ఉంచవచ్చు. (ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో) ఆధారం: వ్యవసాయ పాడిపంటలు