స్థూల పద్ధతిలో అరటి మొక్కల పెంపకం ఆంధ్రప్రదేశ్ అధిక విస్తీర్ణంలో అరటి సాగుచేస్తూ. మిలియన్ టన్నుల దిగుబడితో దేశంలో మొదటి స్థానంలో ఉంది. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అరటి సాగు వేగంగా అభివృద్ధి రైలుతోంది. ఈ ప్రాంతాల్లో ప్రధానంగా గ్రాండ్ నైన్ అనే వాణిజ్య రకం సాగుచేస్తున్నారు. అరటి మొక్కలను మూడు ప్రధాన పద్ధతుల్లో అభివృద్ధి చేయవచ్చు. సహజ విధానం టిష్యూ కల్చర్ పద్ధతి స్థూలపద్ధతి టిష్యూకల్చర్ పద్ధతి టిష్యూకల్చర్ పద్ధతిలో ఆరోగ్యకరమైన మొక్కలు లభిస్తాయి. కానీ చాలా ఖరీదైన ప్రక్రియ కావడంతో చిన్న రైతులకు అందుబాటులో ఉండటం లేదు. దేశంలో కేవలం 4% రైతులు మాత్రమే టిష్యూకల్చర్ మొక్కలను వాడుతున్నారు. మిగిలిన 96% ఇంకా పిలకలతోనే సాగు చేస్తున్నారు. తిరుచిరాపల్లి జాతీయ అరటి పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసి ప్రామాణీకరించిన స్థూలపద్ధతి ద్వారా అరటి పెంపకం రైతులకు అనుకూలమైన సాంకేతిక పద్ధతి. ఇది తక్కువ ఖర్చుతో, ఎక్కువ లాభం ఇవ్వగల విధానం కావడంతో, రైతులకు ఎక్కువ ప్రయోజనకరం దీని వల్ల రైతులు సొంతంగా ఆరోగ్యకరమైన, నాణ్యమైన అరటి మొక్కలను ఎక్కువ మొత్తంలో తయారు చేసుకోవచ్చు. ఈ విధానం, సాంప్రదాయ పిలకల పద్ధతితో పోలిస్తే మెరుగైనది. ఒక్క అరటి దుంప (పిలక) నుంచి సుమారు 3-4 నెలల్లో 20-25 వరకు అరటి మొక్కలను తయారు చేసుకోవచ్చు. టిష్యూకల్చర్ కంటే తక్కువ ఖర్చు. స్థూల పద్ధతిలో అరటి మొక్కల పెంపకం ఈ విధానంలో ముందుగా కావలసిన అరటి రకానికి చెందిన 6 నెలలు వయస్సు గల ఆరోగ్యకరమైన ముదురు అరటి పిలకలను ఎంపిక చేసుకోవాలి. ఎటువంటి పురుగులు లేదా నెమటోడ్స్ ఆశించని ఆరోగ్యకరమైన అరటి పిలకలను ఎంపిక చేసుకోవాలి. దుంప, వాయు జన్యకాండం కలిసే చోట ఉన్న కణజాలాన్ని తొలగించాలి. వేర్లు, పిలకల బయట పొరను పదునైన కత్తితో చెక్కాలి. తరువాత పిలకకు మధ్యలో గల కణజాలాన్ని (2 సెం.మీలోతు) తొలగించి కత్తితో 6-8 అడ్డకోతలు పెట్టుకోవాలి (అదనపు తేమ నిలవకుండా ఉండేందుకు). పిలకలను క్రిమి నాశకమిశ్రమంలో (కార్బండిజమ్ -50% డబ్ల్యు.పి.1 గ్రాము /లీటరు) 15-20 నిమిషాలు నానబెట్టి శుభ్రపరచాలి లేదా, వేడినీటిలో కూడా శుభ్రం చేసుకోవచ్చు. పిలకలను నాటుకునే గుంతల్లో 2 కేజీల రంపపు పొట్టు లేదా కోకోపిట్ + 30 గ్రా. ఆర్బస్కులర్ మైకోరైజ్ శిలీంధ్రాలు + 30గ్రా. బాసిల్లస్ సబిలిస్ మొక్క ఒక్కింటికి పోయాలి. నాటుకొని బి.ఏ.పి 0.06% ద్రావణాన్ని 4మి. లీ పోయాలి. 15-20 రోజుల్లో దుంపపై ఉన్న మొగ్గల నుంచి మొదటి తరం పిలకలు ఉత్పత్తి అవుతాయి. మొదటితరం పిలకలను 25-30 రోజుల పాటు పెరగనిచ్చి, మూడు ఆకుల దశలో, మొక్క మొదలు చుట్టు కొలత వద్ద సుమారు 15-20 సెం.మీ ఎత్తు + 2.5 సెం.మీ. పై భాగాన్ని తొలగించి కత్తితో 4 గాట్లు పెట్టి రెండోతరం పిలకలను ఉత్పత్తి చేసుకోవాలి. రెండోతరం పిలకలను 25-30 రోజుల పాటు పెరగనిచ్చి, తర్వాత జాగ్రత్తగా కొంత దుంప కణజాలాన్ని జోడించి వేరు చెయ్యాలి. తరువాత మట్టి, పశువుల ఎరువు కలిపిన మిశ్రమం ఉన్న చిన్న పాలీధిన్ సంచుల్లో నాటుకుంటే, వేరు వ్యవస్థ ఏర్పడి 40-45 రోజుల్లో వృద్ధిచెంది 4–5 ఆకులు తొడిగి ప్రధాన పొలంలో నాటు కోవడానికి సిద్ధమవుతాయి. హార్డెనింగ్ దశలో తగినంత నీటి సరఫరా, సంరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ స్థూల పద్ధతిలో రైతులకు కలిగే లాభాలు 3-4 నెలల్లో ఒక అరటి పిలక నుంచి 20-25 నాణ్యమైన అరటి మొక్కలను తయారు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మొక్కలు. ఆరోగ్యకరమైన నర్సరీ మొక్కలు తన ఇంటివద్ద నే తయారు చేసుకోవచ్చు. చిన్నరైతులకు కూడా అందుబాటులో ఉండే సాంకేతిక పద్ధతి. కొత్త రకాలైన అరటి పిలకలను ఇతర రైతులకు అమ్ముకోవచ్చు. ఈ విధానంలో అరటి ఉత్పత్తి పెరగడమే కాక, రైతులకు మంచి ఆదాయ వనరు. సన్న, చిన్న కారు రైతులకు ఉపయుక్తం. అరటితో అదనపు ఆదాయం విలువ ఆధారిత ఉత్పత్తులు మన దేశంలో అరటి పండు “పండ్లలో ఆహారరాజు" గా పేరు పొందింది. ఇది కేవలం తినే పండు మాత్రమే కాదు.. రైతులకు అదనపు ఆదాయం తెచ్చే విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రధాన వనరు. అరటి చిప్స్ - మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉన్న రుచికరమైన స్నాక్. అరటి పౌడర్ - బేబీ ఫుడ్, బేకరీ ఉత్పత్తుల్లో విస్తృత వినియోగం. జామ్, జెల్లీ - పండిన అరటితో సులభంగా తయారయ్యే మధుర ఉత్పత్తులు. వెనిగర్, వైన్- ఆరోగ్యపరంగా ప్రయోజనకరమైన ప్రత్యేక ఉత్పత్తులు. మొక్క ఆధారిత ఉత్పత్తులు అరటి కాండం ఫైబర్ - వస్త్రాలు, హ్యాండ్ క్రాఫ్ట్ వస్తువులకు. అరటి ఆకులు - విందులు, పండుగలలో వడ్డనకు. అరటి పువ్వులు - కూరలలో, వేపుళ్లలో రుచికరమైన పోషక ఆహారం. అరటిపండుతో కేవలం పండు అమ్మకమే కాకుండా, విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రైతు ఆదాయం రెట్టింపు అవుతుంది. గ్రామీణ స్థాయిలో చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. అరటిపండు రైతులకు పంట మాత్రమే కాదు, అదనపు లాభాల బాట. “అరటిపండుతో కొత్త ఆలోచనలు- కొత్త అవకాశాలు" అన్న నినాదంతో రైతులు విలువ ఆధారిత ఉత్పత్తుల దిశగా అడుగులు వేయాలి. ఆధారం: పాడి పంటలు మాసపత్రిక డా. ఎ. రేష్మ శాస్త్రవేత్త (ప్లాంట్ ఫిజియోలజి), అరటి పరిశోధనా స్థానం, పులివెందుల, కడప