అనంతపురము జిల్లాలో సత్ఫలితాలిస్తున్న ఆముదం సాగు టి మంజునాథ1, పి శ్రీవళ్ళి*, వై పవన్ కుమార్ రెడ్డి* 1- ఐసిఏఆర్-భారతీయ నూనె గింజల పరిశొధన సంస్థ, హైదరాబాద్ *వ్యవసాయ పరిశోధన సంస్థ (ANGRAU), రేకులకుంట, అనంతపురము వాణిజ్య నూనె గింజల పంటలలో ఆముదము ముఖ్యమైన పంట. ఆముదం విత్తనాలలో 40-50% నూనె తో పాటుగా 80-93% రిసినోలిక్ ఆమ్లం కలిగి ఉండడం వలన, ఆముదం నూనెను వాణిజ్య పరంగా నైలాను దారములు, ఔషధాలు, జెట్ యంత్రాలలో కందెనగా, హైడ్రాలిక్ ద్రవంగా, అలంకరణ సామాగ్రి తయారీ మొదలగు ఎన్నో పరిశ్రమలలో వాడుతున్నారు. ప్రపంచంలో సుమారుగా 70% విస్తీర్ణం మరియు 85% ఉత్పత్తి మన దేశంలోనే జరుగుతోంది. సుమరుగా 9.7 లక్షల హెక్టార్లలో పంట సాగుబడి, దాదాపు 16 లక్షల టన్నుల ఉత్పత్తి మరియు హెక్టారుకి 1.80 టన్నుల దిగుబడి తో భారత దేశం ఆముదం పంటలో అగ్రగామిగా నిలుస్తోంది. మన దేశంలో గుజరాత్, రాజస్తాన్, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఆముదం ప్రధానంగా, కర్నాటక, తమిళు నాడు, ఒడిశా, హరియాణ మరియు మహరాష్ట్రాలలో మితంగా సాగుచేస్తున్నారు. గుజరాత్, రాజస్తాన్ మరియు హరియాణ రాస్ట్రాలలో నీటి వసతి క్రింద సాగు చేస్తున్నారు. ప్రస్తుతం సుమారుగా 90% విస్తీర్ణం పైనే ఆముదంలో అధిక దిగుబడిని ఇచ్చే సంకరజాతి రకాలు ఉదా: జిసిహెచ్-4, జిసిహెచ్-7, జిసిహెచ్-8, డిసిహెచ్ -177, డిసిహెచ్ -519, ఐసిహెచ్-66 మరియు వంగడాలు ఉదా: క్రాంతి, జ్వాల, ప్రగతి మరియు డిసిఎస్-107 ని వర్షాధారంగా లేదా నీటి వసతి క్రింద ఖరీఫ్ పంటగా ఎక్కువగా, రబీ పంటగా మితంగా సాగుచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురము జిల్లాలో సగటు వర్షపాతం 552 మి.మీ. జిల్లా యొక్క వర్షపాతం తక్కువగా ఉండడంతోపాటు ఇటీవల వాతవరణం మార్పులవలన గత రెండు దశాబ్దాలనుంచి ఋతుపవనాలలో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. వర్షాధారంలో ఎక్కువ ఖర్చుతో (రూ. 12000-15000/ఎకరానికి) పండించే వేరుశనగ పంట బెట్టకు తట్టుకోగలిగినా అనిశ్చిత వర్షపాతం, వైరస్ తెగుళ్ళు మరియు చీడ పురుగులవలన అతి తక్కువ దిగుబడి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కారణాలవలన రైతులు ప్రత్యామ్నాయ పంటగా ఆముదపు పంట వైపు మొగ్గు చూపుతున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 90 శాతం సాగు వర్షాధారంగానే ఉంటుందికాబట్టి ఖర్చు తక్కువగా ఉండటంతోపాటు బెట్టకు తట్టుకుని స్థిరమైన మరియు లాభదాయకంగా దిగుబడినిచ్చే పంటలు సాగుచెయ్యాలి. అలాంటి పంటలలో ఆముదం అతి ముఖ్యమైన మరియు లాభదాయకమైన వాణిజ్య పంట. గతంతో పోలిస్తే జిల్లాలో ఆముదం పండించే విస్తీర్ణం క్రమంగా పెరుగుతుంది. గత మూడు సంవత్సరాలుగా గమనిసిస్తే సుమారు 12 వేల హెక్టారులలో ఆముదం సాగు చేస్తున్నారు. వేరుశనగతో పోలిస్తే ఆముదం ప్రత్యేకతలు ఈ క్రింది పట్టికలో గమనించవచ్చు. వేరుశనగతో పోలిస్తే ఆముదం ప్రత్యేకతలు అనంతపురము జిల్లాకి అనువైన హైబ్రిడ్స్: సాధారణంగా హైబ్రిడ్ ఆముదం అధిక దిగుబడి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఐసిహెచ్-66, డిసిహెచ్-519, జిసిహెచ్-4, జిసిహెచ్-8 మరియు పిసిహెచ్-111 హైబ్రిడ్ రకాలు పండించినట్లయితే రైతులు అధిక దిగుబడి మరియు లాభాలను పొందే అవకాశముంది వర్షాధారంలో సరాసరి దిగుబడి మరియు ఇతర లాభాలు: గత ఐదు సంవత్సరములుగా (2015-2019) ఆముదం పంట పండిస్తున్న రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. వాటి వివరాలు ఈ క్రింది పట్టిక రూపంలో వివరించటం జరిగింది నీటి సదుపాయము ఉన్నప్పుడు వరుసలు మద్య కనీసం 4 అడుగలు మరియు మొక్కల మధ్య కనీసం 2 ఆడుగలతో విత్తుకోవాలి. నేల సారవంతం మరియు పంట వ్యవధిని బట్టి ఈ దూరం పెరుగుతుంది. ఆముదము పంటని సెప్టెంబర్ ఆఖరి లో విత్తుకొని ని రబీ పంటగా కూడా పండించుకోవచ్చు. వేసవిలో టమాట పంటలో అముదం పంటను అంతర పంటగా వేసుకోవడం వలన రైతులు అధిక లాభాలు పొందుతున్నారు. ఆముదం పంటని కొన్ని చీడ పురుగులు ఆశిస్తుంటాయి. వీటిలో ముఖ్యంగా, దాసరి పురుగు, పొగాకు లద్దె పురుగు, కాయ తొలుచు పురుగు మరియు కొన్ని రసం పీల్చే పురుగులవలన పంట దిగుబడికి భారిగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందికాబట్టి, చీడ పురుగుల నివారణ గురించి ఈ క్రింద వివరించడం జరిగింది. సస్య రక్షణ దాసరి పురుగు(నామాల పురుగు): దాసరి పురుగు ఉధ్రుతి జులై నుంచి సెప్టెంబర్ మాసాలలో అధికంగా ఉంటుంది. ఎకరానికి 10 పంగల కర్రలను పక్షులు వాలుటకు వీలుగా నాటు కొన్నట్లయితే పొలంలోకి పక్షులు వచ్చి పురుగులను ఏరి తింటాయి. బ్యాసిలస్ తురింజినిసిస్(Bt) 2 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి ఆకు అడుగు బాగం బాగా తడిచేలా పిచికారి చేయాలి. పరాన్న జీవులు (అడ్డశిల) తక్కువగా ఉన్నప్పుడు కురాక్రాన్ 2 మి. లీ ఒక లీటరు నీటికి కలిపి ఆకు అడుగు బాగం బాగా తడిచేలా పిచికారి చేయాలి. పొగాకు లద్దె పురుగు నివారణ: లద్దె పురుగు జులై నుంచి అక్టోబర్ మాసాలలో అధికంగా ఉంటుంది. సాధారణంగా పురుగు రాత్రివేళ ఆకులను, లేత గెలలను మరియు కాండమును తిని పగటి పూట నేలలోని పగుళ్ళులో ఉంటుంది. దీని గ్రుడ్ల సముదాయాలు మరియు పిల్లల పురుగుల సముదాయములను ఆకు అడుగు బాగాన గుర్తించవచ్చు. పిల్లల సముదాయాలు ఉన్న ఆకులు జల్లెడగా మారుతాయి. వారానికి ఒకసారి గ్రుడ్లు మరియు పిల్లల పురుగుల సముదాయములున్న ఆకులను ఏరి నాశనం చేసేదానివలన పొగాకు లద్దె పురుగును బాగా నివారణ చేయవచ్చు. ఈ దశలో బ్యాసిలస్ తురింజినిసిస్(Bt) 2 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి ఆకు అడుగు బాగం బాగా తడిచేలా పిచికారి చేసేదానివలన కూడా పొగాకు లద్దె పురుగును బాగా నివారణ చేయవచ్చు. ఎకరానికి 4-5 లింగాకర్షక బుట్టలను అమర్చి గ్రుడ్లు పెట్టే రెక్కల పురుగుల సాంధ్రతను గమనించి తగిన చర్యలు తీసుకోవాలి. పురుగులు కొంచెం పెద్దయ్యాక (3వ దశ) తన సముదాయాలనుంచి విస్తరించి ఇతర మొక్కలకి, ఆకులు, గెలలను ఆశించి తీవ్ర పంట నష్టం కలిగిస్తాయి. ఈ దశలో థయొడికార్బ్ 2 గ్రాములు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 1 గ్రాము లేదా ఫేం 0.4 మి. లీ లేదా కొరాజెన్ 0.6 మి. లీ ఒక లీటరు నీటికి కలిపి బాగా తడిచేలా పిచికారి చేయాలి. కాయ తొలుచు పురుగు నివారణ: గెలలోని కాయలు లేతదశలో ఉన్నప్పుడు ఆశించి నష్టపరుస్తాయి. దీన్ని సరైన సమయంలో గమనించి, గెల లోని కాయలు అభివృద్ధి చెందుతున్నప్పుడు స్పైనోసాడ్ 1 మి. లీ లేదా కురాక్రాన్ 3 మి. లీ ఒక లీటరు నీటికి కలిపి గెలలు బాగా తడిచేలా పిచికారి చేయాలి. రసం పీల్చే పురుగులు: వీటిలో పచ్చ దోమ, తెల్ల దోమ, తామర పురుగులు ముఖ్యమైనవి. పచ్చ దోమలు: ఆకు క్రింద బాగాన ఉంటూ ఆకునుంచి రసం పీల్చడంతో ఆకులో కప్ ఆకారం వచ్చి నెమ్మదిగా ఆకుల చివర్లు ఎండిపోతుంటాయి. మొక్క ఆకులకి మైనము తక్కువగా ఉన్న రకాలలో పచ్చదోమ ఎక్కువగా నష్టం కలగజేస్తుంది. పైన వివరించిన హైబ్రిడ్ రకాలలో పచ్చ దోమను తట్టుకునే శక్తి ఉంటుంది. డైమిథోయేట్ లేదా కురాక్రాన్ 2 మి. లీ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయడంవలన పచ్చ దోమను సులువుగా నివారించవచ్చు. తెల్ల దోమ: సాధారణంగా నవంబర్ నుంచి ఏప్రిల్ మాసాలలో ఎక్కువగా ఉంటుంది. దీని నివారణ కష్టమే అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవడంవలన పంట నష్టం చాలావరుకు తగ్గించుకోవచ్చు. మొక్క ఆకులకి మైనము ఎక్కువగా ఉన్న రకాలలో తెల్లదోమ ఎక్కువగా నష్టం కలగజేస్తుంది. డిసిహెచ్-177 లాంటి మైనము తక్కువగా ఉన్న రకాలు తెల్లదోమకు తట్టుకోగల శక్తి ఉంటుంది. తెల్లదోమ ఆశించినప్పుడు పైరిత్రైడ్స్ పిచికారి చేయకూడదు. వేపనూనె 5 మి.లి ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయడంవలన తెల్లదోమను కొద్దిగా నివారించికోవచ్చు. డైమిథోయేట్ (2 మి. లీ) లేదా అసిఫేట్ (3 గ్రాములు) లేదా డైఫెంతైఉరాన్ (3 గ్రాములు) ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయడంవలన తెల్లదోమను కొంతవరకు నివారించుకోవచ్చు. తామర పురుగులు: ముఖ్యంగా లేత గెలలను మరియు లేత ఆకులను ఆశిస్తుంటాయి. ఇందువలన లేత ఆకులు మరియు లేత పువ్వులు లేదా గెలలు నల్లగా అగ్గిలో కాలినట్టు కనిపిస్తాయి. గెలలోని లేత కాయలు ఎండిపోతుంటాయి. ఒక తెల్లటి పేపర్ మీద లేత ఆకులు మరియు గెలలను విదిల్చడంవలన సన్నటి తామర పురుగులని గమనించవచ్చు. డైమిథోయేట్ లేదా కురాక్రాన్ 2 మి.లి ఒక లీటర్ నీటిలో కలిపి గెలలు బాగా తడిచేలా పిచికారి చేయడంవలన తామర పురుగును సులువుగా నివారించవచ్చు. బూజు తెగులు: బూజు తెగులు నాలుగు రోజులకు పైగా నిరంతరం వర్షాలు వచ్చినప్పుడు ముఖ్యంగా గెలలకు ఆశించి గణనీయంగా నష్టాన్ని కలగజేస్తుంది. నిరంతరం వర్షాలు వచ్చే అవకాశం ఉంటే గనక, ప్రొపకొనజోల్ అనే మందు 1 మి. లీ ను 1 లీ నీటితో కలిపి వర్షాలు మొదలయ్యే ముందు రోజు గెలలుకు పిచికారి చేయవలెను. దీనితో పాటు, వర్షాలు ఆగిన వెంటనే, కుళ్ళి పోయిన గెలలును తీసి వేయడం తో పాటు, ఒక ఎకరానికి 10 నుంచి 15 కె.జి ల యూరియా ను అందించడంవలన కొత్త గా గెలలు వచ్చి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది A- దాసరి పురుగు (నామాల పురుగు), B- పరాన్నజీవి ఆశించిన దాసరి పురుగు, C- కాయ తొలుచు పురుగు, D- గొంగళి పురుగు, E- పొగాకు లద్దె పురుగు గ్రుడ్లు సముదాయము, F- పొగాకు లద్దె పురుగుల పిల్లల సముదాయము, G- లద్దె పురుగులున్న ఆముదం మొక్క, H -లద్దె పురుగు ఆశించిన ఆముదం ఆకు , I-లద్దె పురుగు, J- తామర పురుగులు సంక్రమించిన లేత పువ్వులు లేదా గెల, K- పచ్చ దోమలు సంక్రమించిన ఆకు, L- తెల్ల దోమ సంక్రమించిన ఆకు, M- బూజు తెగులు సోకిన గెల. విత్తన లభ్యత: డిసిహెచ్-519 మరియు ఐసిహెచ్-66 హైబ్రిడ్ (సంకరజాతి) విత్తనము ఐసీఎర్-భారతీయ నూనె గింజల పరిశొధనా సంస్థ (ICAR-IIOR), హైదరాబాద్ ద్వారా రైతులు పొందవచ్చు. వీరి చిరునామా మరియు ఫోన్ నంబర్లు ఈ క్రింద ఇవ్వటం జరిగింది. విత్తనము కావలసిన రైతులు వీరిని సంప్రదించినట్లయితే నాణ్యమైన విత్తనమును సరకు రవాణా సంస్థల ద్వార మీకు తెలుపబడును. లేదా రైతులు నేరుగా ఐసీఎఆర్ -భారతీయ నూనె గింజల పరిశొధనా సంస్థ కు విచ్చేసి కొనుగోలు చేసుకోవచ్చు. విత్తన విభాగము, ఐసీఎఆర్ -భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ (ICAR-IIOR), రాజేంద్రనగర్, హైదరాబాద్, తెలంగాణ-500030 ఫోన్ నంబరు: 040-24598135/040-24598101/7893826802/ 9160451473.