ఉద్యాన పంటలలో కృత్రిమ మేధస్సు ఆధారిత స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు ప్రస్తుత కాలంలో నీటి కొరత, విద్యుత్ అంతరాయాలు, కూలీల కొరత వంటి సమస్యలు రైతులకు పెద్ద సవాళ్లుగా మారాయి. ఈ సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారంగా కృత్రిమ మేధస్సు (ఎ.ఐ.), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఓ.టి.), స్మార్ట్ సెన్సార్ల ఆధారంగా పనిచేసే ఆటోమేటెడ్ నీటిపారుదల వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలోకి వచ్చాయి. భారతదేశంలో కూడా డ్రిప్, స్ప్రింక్లర్, ఆటోమేటిక్ పంప్‌సెట్ నియంత్రణ వ్యవస్థల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఎ.ఐ. ఆధారిత స్మార్ట్ ఇరిగేషన్ వ్యవస్థలు పంటలకు అవసరమైన సమయంలో, అవసరమైన పరిమాణంలో మాత్రమే నీటిని అందించడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతున్నాయి. పరిశోధనల ప్రకారం ఈ వ్యవస్థల వినియోగంతో నీటి వినియోగాన్ని 25-30 శాతం వరకు తగ్గించడంతో పాటు పంట దిగుబడులను 20-30 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. ఐ.ఓ.టి. అంటే ఇంటర్నెట్ ద్వారా పరస్పరం అనుసంధానించబడిన పరికరాల వ్యవస్థ. ఈ వ్యవస్థలో సెన్సార్లు, కంట్రోలర్లు, మోటార్లు, మొబైల్ ఫోన్లు, క్లౌడ్ సర్వర్లు సమన్వయంతో పనిచేస్తాయి. సెన్సార్లు సేకరించిన సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా క్లౌడ్‌కు పంపించి, రైతులు ఎక్కడ ఉన్నా మొబైల్ ఫోన్ లేదా మొబైల్ యాప్ ద్వారా వ్యవస్థను పర్యవేక్షించి నియంత్రించగలుగుతారు. తెలంగాణ ఉద్యానశాఖ లక్ష్యాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యానశాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ సూక్ష్మ సాగునీటి వ్యవస్థల్లో ఆటోమేషన్‌ను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ సూచనల మేరకు ఆటోమేటెడ్ మైక్రో ఇరిగేషన్ వ్యవస్థలను విస్తృతంగా అమలు చేయాలని నిర్ణయించింది. 2026-27 వార్షిక కార్యాచరణ ప్రణాళికలో తెలంగాణ ప్రభుత్వం సుమారు 2,61,838 ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో సుమారు 50,000 ఎకరాల్లో ఆటోమేషన్ వ్యవస్థలను సమీకరించాలని ప్రతిపాదించారు. ఈ లక్ష్యాల సాధన కోసం ఉద్యానశాఖ: ఆటోమేషన్ పరికరాల సాంకేతిక ప్రమాణీకరణ అర్హత గల మైక్రో ఇరిగేషన్ కంపెనీల ఎంపిక సెన్సార్ ఆధారిత కంట్రోలర్ల ప్రమాణాలు ఆటోమేటిక్ వాల్వ్ లు, ఫ్లో మీటర్లు, స్మార్ట్ పంప్ కంట్రోలర్ల ప్రమాణీకరణ రైతులకు సులభంగా ఉపయోగపడే తక్కువ ఖర్చు వ్యవస్థల ప్రోత్సాహం వంటి చర్యలు చేపడుతోంది. "పెర్ డ్రాప్ మోర్ క్రాప్" పథకం "పెర్ డ్రాప్ మోర్ క్రాప్" (పి.డి.ఎం.సి.) పథకం భారత ప్రభుత్వ ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (పి.ఎం.కె.ఎస్.వై.)లో భాగంగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యం ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా వినియోగించి తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించడం. ఈ పథకం కింద డ్రిప్, స్ప్రింక్లర్, ఆటోమేటెడ్ మైక్రో ఇరిగేషన్ వ్యవస్థలు, ఫెర్టిగేషన్ యూనిట్లు, సెన్సార్ ఆధారిత పరికరాలు, సౌరశక్తి ఆధారిత ఆటోమేషన్ యూనిట్లకు సబ్సిడీ అందిస్తున్నారు. రాష్ట్రాలు సూక్ష్మ సాగునీటిలో ఆటోమేషన్ ను ప్రోత్సహించేందుకు మార్గదర్శకాలు జారీ చేయగా, కనీసం 5% విస్తీర్ణాన్ని ఆటోమేషన్ కింద అభివృద్ధి చేయాలని సూచించారు. తెలంగాణలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ద్రాక్ష, దానిమ్మ, మామిడి, కూరగాయలు, ఆయిల్ పామ్ పంటల్లో డ్రిప్, ఆటోమేటెడ్ ఇరిగేషన్ వ్యవస్థలను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్తులో ఎ.ఐ., ఐ.ఓ.టి., సెన్సార్లు, క్లౌడ్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థలు "పెర్ డ్రాప్ మోర్ క్రాప్" లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఆటోమేషన్ వ్యవస్థల రకాలు సూక్ష్మ సాగునీటి వ్యవస్థల్లో ఆటోమేషన్ అనేది మానవ జోక్యం లేకుండా లేదా అత్యల్ప మానవ జోక్యంతో నీటిపారుదల నిర్వహించే విధానాన్ని సూచిస్తుంది. పంట అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరాను నియంత్రించడం ద్వారా నీటి పొదుపు, విద్యుత్ ఆదా, అధిక దిగుబడులు సాధ్యమవుతున్నాయి. ఆధునిక వ్యవసాయంలో వివిధ రకాల ఆటోమేటెడ్ నీటిపారుదల వ్యవస్థలు వినియోగంలో ఉన్నాయి. సమయ ఆధారిత నీటిపారుదల వ్యవస్థ ఈ విధానంలో ముందుగా నిర్ణయించిన సమయానికి మోటార్, వాల్వ్ లు ఆటోమేటిక్ గా ప్రారంభమై, నిర్ణీత సమయం పూర్తయ్యాక స్వయంచాలకంగా ఆఫ్ అవుతాయి. పంటకు అవసరమైన నీటి పరిమాణం, నీటి ప్రవాహ వేగాన్ని ఆధారంగా తీసుకొని నీటిపారుదల సమయాన్ని నిర్ణయిస్తారు. ఈ వ్యవస్థ టైమర్ లేదా కంట్రోలర్ సహాయంతో పనిచేస్తుంది. కంట్రోలర్ లో నీటిపారుదల ప్రారంభ సమయం, వ్యవధి, వాల్వ్ ల క్రమాన్ని ముందుగానే నమోదు చేస్తారు. నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు కంట్రోలర్ సంబంధిత సోలెనాయిడ్ వాల్వ్ ను ప్రారంభించి మోటార్ ను ఆన్ చేస్తుంది. ఒక భాగంలో నీటిపారుదల పూర్తయిన తర్వాత తదుపరి వాల్వ్ ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. అన్ని సెక్షన్లకు నీరు అందించిన తర్వాత మోటార్ స్వయంచాలకంగా ఆఫ్ అవుతుంది. ఈ విధానం తక్కువ ఖర్చుతో అమలు చేయవచ్చు కాబట్టి రైతులలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థల్లో చిన్న, మధ్య తరహా రైతులకు ఇది అనుకూలంగా ఉంటుంది. పరిమాణ ఆధారిత నీటిపారుదల వ్యవస్థ ఈ విధానంలో పంటలకు అవసరమైన నిర్ణీత పరిమాణంలో నీటిని మాత్రమే అందిస్తారు. ఆటోమేటిక్ మీటరింగ్ వాల్వ్ లు, ఫ్లో సెన్సార్లు, కంట్రోలర్ల సహాయంతో నీటి పరిమాణాన్ని ఖచ్చితంగా కొలుస్తారు. ముందుగా నిర్ణయించిన పరిమాణం పూర్తయ్యాక వాల్వ్ స్వయంచాలకంగా మూసుకుని తదుపరి భాగానికి నీటిపారుదల కొనసాగుతుంది. ఈ విధానంలోని ప్రధాన ప్రయోజనం ఏమిటంటే విద్యుత్ అంతరాయాలు వచ్చినా లేదా నీటి ప్రవాహం మారినా పంటకు అవసరమైన పూర్తి నీటి పరిమాణం ఖచ్చితంగా అందుతుంది. అందువల్ల నీటి వినియోగ సామర్థ్యం పెరిగి నీటి వృధా తగ్గుతుంది. అయితే ఈ వ్యవస్థలో ఉపయోగించే మీటరింగ్ వాల్వ్‌లు, సెన్సార్లు, నియంత్రణ పరికరాల ఖర్చు ఎక్కువగా ఉండటం వల్ల, సాధారణ సమయ ఆధారిత వ్యవస్థలతో పోలిస్తే అధిక పెట్టుబడి అవసరమయ్యే ఆధునిక నీటిపారుదల సాంకేతికతగా చెప్పవచ్చు. ఓపెన్ నియంత్రిత నీటిపారుదల వ్యవస్థ ఈ విధానంలో రైతు ముందుగానే నీటిపారుదల షెడ్యూల్‌ను నిర్ణయిస్తాడు. ఆ షెడ్యూల్ ప్రకారం మోటార్లు, వాల్వ్ లు నిర్ణీత సమయాల్లో పనిచేస్తాయి. నీటిపారుదల వ్యవధి, సమయం లేదా నీటి పరిమాణాన్ని ముందుగానే కంట్రోలర్‌లో నమోదు చేస్తారు. వ్యవస్థ అదే ప్రోగ్రామ్‌ను అనుసరించి పనిచేస్తుంది. ఈ విధానం వాతావరణ మార్పులు, వర్షపాతం లేదా నేల తేమ స్థాయిలో వచ్చే మార్పులకు స్వయంచాలకంగా స్పందించదు. అంటే, నేలలో తేమ సరిపడినా లేదా వర్షం పడినా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నీటిపారుదల కొనసాగుతుంది. క్లోజ్డ్ లూప్ నియంత్రిత నీటిపారుదల వ్యవస్థ ఈ విధానంలో నేల తేమ, ఉష్ణోగ్రత, గాలి ఆర్ద్రత, నీటి ప్రవాహం, పీడనం వంటి వివరాలను వివిధ సెన్సార్లు నిరంతరం సేకరిస్తాయి. ఈ సమాచారాన్ని కంట్రోలర్ లేదా కంప్యూటర్ ఆధారిత నియంత్రణ వ్యవస్థ విశ్లేషించి పంటకు అవసరమైన నీటి పరిమాణాన్ని స్వయంచాలకంగా నిర్ణయిస్తుంది. నేలలో తేమ స్థాయి తగ్గినప్పుడు సెన్సార్లు కంట్రోలర్‌కు సంకేతాలు పంపుతాయి. దీంతో మోటార్, సోలెనాయిడ్ వాల్వ్‌లు ఆటోమేటిక్‌గా ప్రారంభమై నీటిపారుదల జరుగుతుంది. అవసరమైన తేమ స్థాయి చేరుకున్న తర్వాత వ్యవస్థ స్వయంచాలకంగా మోటార్‌ను ఆఫ్ చేస్తుంది. ఈ విధంగా పంట అవసరానికి అనుగుణంగా ఖచ్చితమైన నీటిపారుదల నిర్వహించబడుతుంది. తక్షణ స్పందన నీటిపారుదల వ్యవస్థ ఈ వ్యవస్థలో పంటల అసలు నీటి అవసరాన్ని సెన్సార్లు నిరంతరం పర్యవేక్షిస్తాయి. నేల తేమ, వర్షపాతం, గాలి వేగం, ఉష్ణోగ్రత, సూర్యకాంతి తీవ్రత, వాతావరణ పరిస్థితులు వంటి పర్యావరణ అంశాలను విశ్లేషించి అవసరమైనప్పుడు మాత్రమే నీటిపారుదల నిర్వహిస్తాయి. ఈ విధానంలో సెన్సార్ల ద్వారా సేకరించిన సమాచారం కంట్రోలర్ లేదా ఎ.ఐ. ఆధారిత సాఫ్ట్‌వేర్‌కు పంపబడుతుంది. వ్యవస్థ పంటల ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించి నీటి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మోటార్, వాల్వ్‌లను స్వయంచాలకంగా ప్రారంభిస్తుంది. తగిన తేమ స్థాయి చేరుకున్న తర్వాత నీటిపారుదల ఆటోమేటిక్‌గా నిలిపివేయబడుతుంది. కంప్యూటర్ ఆధారిత నీటిపారుదల నియంత్రణ వ్యవస్థ పెద్ద వ్యవసాయ క్షేత్రాలు, గ్రీన్‌హౌస్‌లు, అధిక విలువ గల ఉద్యాన పంటల సాగులో కంప్యూటర్ ఆధారిత కేంద్ర నియంత్రణ వ్యవస్థలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ వ్యవస్థలు పంపులు, వాల్వ్ లు, ఫెర్టిగేషన్ యూనిట్లు, ఫిల్టర్లు, వివిధ సెన్సార్లను ఒకే కేంద్రం నుండి సమన్వయం చేసి నియంత్రిస్తాయి. ఈ విధానంలో సెన్సార్ల ద్వారా సేకరించిన సమాచారం కంప్యూటర్ లేదా కేంద్ర నియంత్రణ యూనిట్‌కు చేరుతుంది. ఇక్కడ సాఫ్ట్ వేర్ నేల తేమ, నీటి ప్రవాహం, పీడనం, వాతావరణ పరిస్థితులను విశ్లేషించి అవసరమైన చర్యలను స్వయంచాలకంగా అమలు చేస్తుంది. దీంతో పంటలకు అభిలషణీయ పరిమాణంలో నీరు, ఎరువులు అందించవచ్చు. సెన్సార్ల ఆధారిత స్మార్ట్ నీటిపారుదల సెన్సార్లు ఆటోమేటెడ్ నీటిపారుదల వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగాలు. ఇవి నేల తేమ, ఉష్ణోగ్రత, గాలి ఆర్ద్రత, నీటి ప్రవాహం, పీడనం, వాతావరణ పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని నిరంతరం సేకరిస్తాయి. ఈ డేటాను కంట్రోలర్ల, ఐ.ఐ. ఆధారిత సాఫ్ట్ వేర్ విశ్లేషించి పంటకు అవసరమైన సమయంలో మాత్రమే నీటిపారుదల నిర్వహిస్తాయి.నేలలో తేమ స్థాయి తగ్గినప్పుడు సెన్సార్లు వెంటనే సంకేతాలను కంట్రోలర్ కు పంపిస్తాయి. దీంతో ఆటోమేటెడ్ వాల్వ్ లేదా సోలెనాయిడ్ వాల్వ్ లు స్వయంచాలకంగా ప్రారంభమై పంటకు నీరు అందుతుంది. అవసరమైన తేమ స్థాయి చేరుకున్న తర్వాత వ్యవస్థ ఆటోమేటిక్ గా నీటిపారుదలను నిలిపివేస్తుంది. దీని ద్వారా నీటి వృధా తగ్గి, పంటలకు ఖచ్చితమైన పరిమాణంలో నీరు అందుతుంది. స్మార్ట్ నీటిపారుదలలో ఉపయోగించే ముఖ్యమైన సెన్సార్లు నేల తేమ సెన్సార్లు ఉష్ణోగ్రత సెన్సార్లు వర్షపాతం సెన్సార్లు నీటి ప్రవాహ సెన్సార్లు పీడన సెన్సార్లు నీటి స్థాయి సెన్సార్లు ఈ సెన్సార్ల సహాయంతో రైతులు మొబైల్ ఫోన్ ద్వారా నేల తేమ స్థితి, నీటి వినియోగం, మోటార్ పనితీరును ఎక్కడ నుంచైనా పర్యవేక్షించగలుగుతారు. అదనంగా, పైప్ లైన్ లీకేజీలు, తక్కువ నీటి ఒత్తిడి, మోటార్ లోపాలను కూడా వ్యవస్థ ముందుగానే గుర్తించి హెచ్చరికలు పంపిస్తుంది.సెన్సార్ల ఆధారిత స్మార్ట్ ఇరిగేషన్ వ్యవస్థలు నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కార్మిక వ్యయాన్ని తగ్గించి, అధిక దిగుబడులు సాధించడంలో రైతులకు ఎంతో సహాయపడుతున్నాయి. ఆటోమేటెడ్ వాల్వ్ లు, కంట్రోల్ వ్యవస్థలు ఆటోమేటెడ్ నీటిపారుదలలో వాల్వ్ లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి నీటి ప్రవాహాన్ని స్వయంచాలకంగా నియంత్రిస్తాయి. సోలెనాయిడ్ వాల్వ్ లు, కంట్రోలర్ పంపే ఎలక్ట్రికల్ సంకేతాలను హైడ్రాలిక్ నియంత్రణగా మార్చి వాల్వ్ లను తెరవడం లేదా మూయడం సోలెనాయిడ్ వాల్వ్ ల పని. డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. హైడ్రాలిక్ వాల్వ్ లు, నీటి పీడనం ఆధారంగా పనిచేసే ఈ వాల్వ్ లు పెద్ద సాగు విభాగాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. సీక్వెన్సర్ వ్యవస్థలు, విభిన్న సాగు విభాగాలకు వరుసగా నీటిని పంపిణీ చేయడానికి సీక్వెన్సర్ కంట్రోలర్లను ఉపయోగిస్తారు. ఇవి ఒక విభాగం పూర్తయ్యాక తదుపరి విభాగానికి స్వయంచాలకంగా నీరు అందిస్తాయి. ఆటోమేటెడ్ ఫెర్టిగేషన్: ఆధునిక స్మార్ట్ ఇరిగేషన్ వ్యవస్థల ద్వారా నీటితో పాటు ఎరువులను కూడా ఖచ్చితమైన మోతాదులో పంపిణీ చేసే విధానాన్ని ఆటోమేటెడ్ ఫెర్టిగేషన్ అంటారు. మీటరింగ్ పంపులు, ఆటోమేటెడ్ డోసింగ్ యూనిట్ల సహాయంతో పంటలకు అవసరమైన ఎరువులు సమయానికి అందించబడతాయి. దీనివల్ల ఎరువుల వృధా తగ్గి, నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. పంటలకు సమతుల్య పోషణ లభించడం ద్వారా దిగుబడి, నాణ్యత మెరుగుపడటంతో పాటు కార్మిక వ్యయం కూడా తగ్గుతుంది. భద్రతా, రక్షణ వ్యవస్థలు: ఆధునిక ఐ.ఐ. ఆధారిత నీటిపారుదల వ్యవస్థల్లో పలు రకాల భద్రతా, రక్షణ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ వోల్టేజ్ లేదామూడు ఫేజ్ ల లోపం వచ్చినప్పుడు మోటార్లను స్వయంచాలకంగా ఆఫ్ చేసే రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. బోర్ వెల్ నీటి స్థాయి తగ్గినప్పుడు ఆటో కట్ఆఫ్ ద్వారా మోటార్ దెబ్బతినకుండా రక్షణ ఉంది. అదనంగా పైప్ లైన్ పగుళ్లు, లీకేజీలు, అధిక నీటి ప్రవాహం, ఫిల్టర్ బ్లాకేజీలను సెన్సార్ల ద్వారా గుర్తించి వెంటనే హెచ్చరికలు పంపించే సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈ రక్షణ వ్యవస్థలు మోటార్ల జీవితకాలాన్ని పెంచడంతో పాటు నిర్వహణ ఖర్చులను తగ్గించి నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. కంప్యూటర్, క్లౌడ్ ఆధారిత నీటిపారుదల : ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఓ.టి.), క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారంగా పనిచేసే స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు రైతులకు పూర్తి రిమోట్ నియంత్రణ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. మొబైల్ ఫోన్ ద్వారా మోటార్లను ఆన్/ఆఫ్ చేయడం, రియల్ టైమ్ నేల తేమ సమాచారం, వాతావరణ విశ్లేషణ, నీటి, విద్యుత్ వినియోగ వివరాలను పర్యవేక్షించడం వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అదనంగా ఆటోమేటెడ్ అలర్ట్స్, ఐ.ఐ. ఆధారిత నీటి అవసర అంచనా వ్యవస్థలు నీటి వినియోగాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడుతున్నాయి. భవిష్యత్తులో డ్రోన్లు, ఉపగ్రహ డేటా, ఐ.ఐ., స్మార్ట్ సెన్సార్ల సమన్వయంతో వ్యవసాయం మరింత ఖచ్చితత్వం, సామర్థ్యం, సుస్థిరతను సాధించనుంది. స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలో ఉపయోగించే ప్రధాన పరికరాలు స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి పలు ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు, సెన్సార్లు కలిసి పనిచేస్తాయి. ఇవి పంటల అవసరాన్ని గుర్తించి నీటిపారుదలను స్వయంచాలకంగా నియంత్రిస్తాయి. ముఖ్యంగా ఉపయోగించే పరికరాలు ఇవి: Arduino కంట్రోలర్ : ఇది వ్యవస్థకు ప్రధాన నియంత్రణ యూనిట్ గా పనిచేస్తుంది. సెన్సార్ల నుంచి వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి మోటార్లు, వాల్వ్ లను అవసరానికి అనుగుణంగా ఆన్/ఆఫ్ చేస్తుంది. Raspberry Pi : ఇది చిన్న మైక్రో కంప్యూటర్ లా పనిచేస్తుంది. సెన్సార్ల ద్వారా సేకరించిన డేటాను క్లౌడ్ సర్వర్లకు పంపించి మొబైల్ కనెక్టివిటీ, రిమోట్ మానిటరింగ్ కు సహాయపడుతుంది. నేల తేమ సెన్సార్లు : ఇవి నేలలో తేమ స్థాయిని కొలుస్తాయి. నేల పొడిగా మారినప్పుడు నీటిపారుదల అవసరాన్ని గుర్తించి వ్యవస్థకు సమాచారం అందిస్తాయి. నీటి స్థాయి సెన్సార్లు : బోర్ వెల్, ట్యాంక్ లేదా నీటి వనరులో నీటి స్థాయిని గుర్తిస్తాయి. నీరు తక్కువైతే మోటార్ ను ఆటోమేటిక్ గా ఆఫ్ చేస్తాయి. Relay Switch : ఇది మోటార్ ను ఆన్/ఆఫ్ చేయడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ స్విచ్. కంట్రోలర్ ఇచ్చే ఆదేశాల ప్రకారం పనిచేస్తుంది. GSM / Wi-Fi మాడ్యూల్ : ఈ మాడ్యూల్ ద్వారా రైతులు మొబైల్ ఫోన్ లేదా మొబైల్ యాప్ సహాయంతో వ్యవస్థను దూరం నుంచే పర్యవేక్షించి నియంత్రించగలుగుతారు. వ్యవస్థ పనిచేసే విధానం : స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థ పూర్తిగా సెన్సార్లు, ఐ.ఓ.టి., ఐ.ఐ. సాంకేతికతల సమన్వయంతో పనిచేస్తుంది. ఈ వ్యవస్థ పంటలకు అవసరమైన సమయంలో మాత్రమే నీటిని అందించేలా స్వయంచాలకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. వ్యవస్థ పనిచేసే విధానం ఇలా ఉంటుంది: సమాచార సేకరణ : పొలంలో అమర్చిన సెన్సార్లు నేల తేమ, ఉష్ణోగ్రత, గాలి తేమ, నీటి స్థాయి వంటి వివరాలను నిరంతరం సేకరిస్తాయి. డేటా క్లౌడ్ కు పంపడం : సేకరించిన సమాచారాన్ని ఐ.ఓ.టి. ప్లాట్ ఫామ్ ద్వారా ఇంటర్నెట్ సహాయంతో క్లౌడ్ సర్వర్ కు పంపిస్తారు. కృత్రిమ మేధ ఆధారిత విశ్లేషణ : ఐ.ఐ. అల్గారిథమ్ లు పంట దశ, వాతావరణ పరిస్థితులు, నేల తేమ, నీటి అవసరాలను విశ్లేషించి నీటిపారుదలపై నిర్ణయం తీసుకుంటాయి. ఆటోమేటిక్ నీటిపారుదల ప్రారంభం : అవసరమైనప్పుడు మోటార్ లేదా సోలెనాయిడ్ వాల్వ్ స్వయంచాలకంగా ప్రారంభమై పంటలకు నీటిని అందిస్తుంది. మొక్కల ఆరోగ్య పర్యవేక్షణ : సెన్సార్లు, ఏ.ఐ. విశ్లేషణ ద్వారా మొక్కల ఒత్తిడి, పోషక లోపాలు, తేమ సమస్యలు, వ్యాధుల ప్రారంభ లక్షణాలను ముందుగానే గుర్తించవచ్చు. స్వయంచాలక నిలిపివేత : నేలలో తేమ అవసరమైన స్థాయికి చేరుకున్న తర్వాత మోటార్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. దీంతో నీటి వృధా తగ్గుతుంది. దూరం నుంచే నియంత్రణ : రైతులు ఎక్కడ ఉన్నా మొబైల్ ఫోన్ లేదా మొబైల్ యాప్ ద్వారా మోటార్లు, వాల్వ్‌లు, మొత్తం వ్యవస్థను పర్యవేక్షించి నియంత్రించగలుగుతారు. రైతుకు సమాచారం : మొత్తం ప్రక్రియకు సంబంధించిన సమాచారం రైతుకు మొబైల్ యాప్ లేదా ఎస్.ఎం.ఎస్. ద్వారా వెంటనే అందుతుంది. దీంతో రైతు ఎక్కడ ఉన్నా వ్యవస్థను పర్యవేక్షించగలుగుతాడు. పంప్సెట్తో సమన్వయం : ఈ స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలను ఇప్పటికే ఉన్న బోర్వెల్ పంప్‌సెట్లతో సులభంగా అనుసంధానించవచ్చు. రైతులు మొబైల్ ఫోన్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా మోటార్‌ను నియంత్రించగలరు. ఈ వ్యవస్థల ద్వారా మోటార్‌ను ఆన్/ఆఫ్ చేయడం, నీటి ప్రవాహాన్ని పర్యవేక్షించడం, ట్యాంక్ లేదా బోర్‌వెల్‌లోని నీటి స్థాయిని తెలుసుకోవడం, మోటార్ పనిచేసిన సమయాన్ని నమోదు చేసుకోవడం సాధ్యమవుతుంది. కొన్ని ఆధునిక వ్యవస్థలు బోర్‌వెల్‌లో నీటి మట్టం తగ్గినప్పుడు మోటార్‌ను స్వయంచాలకంగా ఆఫ్ చేయడం ద్వారా డ్రై రన్ సమస్యలను తగ్గించి మోటార్ కాలిపోవడం నివారిస్తాయి. కృత్రిమ మేధస్సు ఆధారిత ముఖ్య లక్షణాలు : కృత్రిమ మేధస్సు (ఏ.ఐ.) ఆధారిత స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు పంటల అవసరాలను విశ్లేషించి మరింత సమర్థవంతమైన వ్యవసాయ నిర్వహణకు సహాయపడుతున్నాయి. ఈ వ్యవస్థల ముఖ్య లక్షణాలు ఇవి:వాతావరణం, నీటి అవసరాల అంచనా : ఏ.ఐ. సాంకేతికత వర్షపాతం, ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితులను విశ్లేషించి పంటలకు అవసరమైన నీటి పరిమాణాన్ని ముందుగానే అంచనా వేస్తుంది. నీరు, ఎరువులు, పురుగుమందుల సమర్థ వినియోగం : పంట అవసరానికి అనుగుణంగా మాత్రమే నీరు, ఇతర ఇన్పుట్లను వినియోగించడం ద్వారా వృధాను తగ్గించి ఖర్చును ఆదా చేస్తుంది. వోల్టేజ్ రక్షణ : గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ వోల్టేజ్, ఆకస్మిక విద్యుత్ హెచ్చుతగ్గులు, మూడు ఫేజ్ ల లోపం వంటి సమస్యలు తరచుగా ఎదురవుతుంటాయి. ఈ పరిస్థితుల్లో మోటార్లు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆధునిక ఏ.ఐ. ఆధారిత స్మార్ట్ కంట్రోలర్లు ఈ సమస్యలను ముందుగానే గుర్తించి మోటార్లకు సమర్థవంతమైన రక్షణ కల్పిస్తాయి.ఈ స్మార్ట్ వ్యవస్థల్లో వోల్టేజ్ సెన్సార్లు, మైక్రోకంట్రోలర్లు నిరంతరం విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తాయి. తక్కువ వోల్టేజ్ వచ్చినప్పుడు లేదా అధిక వోల్టేజ్ నమోదైనప్పుడు మోటార్లను స్వయంచాలకంగా ఆఫ్ చేస్తాయి. అలాగే మూడు ఫేజ్ లలో ఏదైనా ఫేజ్ లోపించినప్పుడు లేదా ఫేజ్ అసమతుల్యత ఏర్పడినప్పుడు రక్షణ చర్యలు తీసుకొని మోటార్ కాలి పోకుండా కాపాడతాయి.విద్యుత్ సరఫరా మళ్లీ సాధారణ స్థితికి వచ్చిన వెంటనే వ్యవస్థ మోటార్ ను ఆటోమేటిక్ గా తిరిగి ప్రారంభిస్తుంది. దీంతో రైతులు రాత్రివేళల్లో లేదా పొలానికి దూరంగా ఉన్నప్పటికీ నీటిపారుదల నిరంతరంగా కొనసాగుతుంది. అదనంగా ఈ స్మార్ట్ కంట్రోలర్లు విద్యుత్ వినియోగాన్ని నమోదు చేయడం మోటార్ పనిచేసిన సమయాన్ని విశ్లేషించడం అధిక విద్యుత్ వినియోగంపై హెచ్చరికలు ఇవ్వడం మొబైల్ యాప్ ద్వారా సమాచారం పంపించడం డ్రై రన్ పరిస్థితులను గుర్తించడం వంటి ఆధునిక సదుపాయాలను కూడా అందిస్తాయి. ఈ విధమైన రక్షణ వ్యవస్థల వల్ల మోటార్ కాలిపోవడం తగ్గుతుంది విద్యుత్ వినియోగ సామర్థ్యం పెరుగుతుంది మరమ్మత్తు ఖర్చులు తగ్గుతాయి నీటిపారుదల వ్యవస్థ విశ్వసనీయత మెరుగుపడుతుంది మోటార్ జీవితకాలం పెరుగుతుంది ప్రస్తుతం స్మార్ట్ వ్యవసాయం, ఆటోమేటెడ్ మైక్రో ఇరిగేషన్ వ్యవస్థల్లో ఈ ఏ.ఐ. ఆధారిత విద్యుత్ రక్షణ సాంకేతికతలు వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. లీకేజీ గుర్తింపు, డేటా విశ్లేషణ ఏ.ఐ. ఆధారిత స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు నీటి ప్రవాహం, పీడనం, వినియోగ నమూనాల్లో వచ్చే మార్పులను నిరంతరం విశ్లేషించి పైప్ లైన్ లీకేజీలను వేగంగా గుర్తిస్తాయి. లీకేజీ సంభవించిన వెంటనే రైతుకు మొబైల్ యాప్ లేదా ఎస్.ఎమ్.ఎస్. ద్వారా హెచ్చరికలు పంపుతాయి. దీంతో నీటి వృధా, విద్యుత్ నష్టం తగ్గుతుంది. వ్యవస్థ సేకరించిన సమాచారాన్ని క్లౌడ్ సర్వర్లలో భద్రపరచడం వల్ల రైతులు మొబైల్ యాప్ ద్వారా రోజువారీ నీటి వినియోగం, నేల తేమ చరిత్ర, వాతావరణ వివరాలు, విద్యుత్ వినియోగ సమాచారం, ఎరువుల పంపిణీ వివరాలను ఎప్పుడైనా పరిశీలించవచ్చు. ఈ డేటా ఆధారంగా రైతులు నీటిపారుదల ప్రణాళికను మెరుగుపరచడంతో పాటు నీరు, విద్యుత్, ఎరువుల వినియోగాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఉద్యాన, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పరిశోధన సంస్థల నిపుణులతో కలిసి తెలంగాణ ఉద్యాన శాఖ, సూక్ష్మ సాగునీటి వ్యవస్థల్లో ఆటోమేషన్ ను సాంకేతికతలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తోంది. ఈ కొత్త లక్ష్యాలు తెలంగాణలో "స్మార్ట్ ఫార్మింగ్" వైపు ఒక కీలక అడుగుగా భావించవచ్చు. రైతులు భవిష్యత్తులో మొబైల్ ఫోన్ ద్వారా డ్రిప్ వ్యవస్థలను నియంత్రించడం, నేల తేమ ఆధారంగా ఆటోమేటిక్ నీటిపారుదల నిర్వహించడం, ఎరువుల పంపిణీని ఖచ్చితంగా నియంత్రించడం వంటి సాంకేతిక సదుపాయాలను సులభంగా వినియోగించగల అవకాశాలు పెరుగుతున్నాయి. ఆధారం : తెలంగాణ వ్యవసాయ శాఖ