వరి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వరి వివిధ దశల్లో ఉంది. ఎక్కువ శాతం పిలకలు తొడిగే దశలో ఉంది. ఈ దశలో సరియైన ఎరువుల యాజమాన్యం, తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లైతే మంచి ఫలితాలు పొందవచ్చును. పిలక దశలో ఉన్న వరి పైర్లలో ఎకరానికి 30-35 కిలోల యూరియాను బురద పదునులో చల్లుకోవాలి. అంకురం దశలో 30-35 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును వేసుకోవాలి. ఈ దశలో కాంప్లెక్స్ ఎరువులను వేయరాదు. సెప్టెంబర్ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో వరి నాట్లు వేయరాదు. నాట్లు వేసుకున్నట్లైతే పంట పూత సమయంలో చలి వాతావరణం వలన గింజ పట్టక తాలుగింజలు ఏర్పడి దిగుబడిపై అధిక ప్రభావం చూపిస్తుంది. అయితే చలి తక్కువగా ఉండే నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో ప్రత్యామ్నాయ పరిస్థితులలో సెప్టెంబర్ 15 వరకు వరి నాట్లు వేసుకోవచ్చు. ప్రధాన పొలంలో పిలకలు వేసే దశలో ఆరుతడి విధానాన్ని పాటించి నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. పొలంలో ఊద, ఒడిపిలి వంటి కలుపు మొక్కలు ఉన్నట్లైతే నాటిన 15-20 రోజులకి సైహలోఫాప్-పి-బ్యుటైల్ 1.5 మి.లీ. లేదా బిస్పైరిబాక్ సోడియం 0.5 మి.లీ., లేదా ఫినాక్సీప్రాప్ ఇథైల్ 1.25 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. (ఇసుకలో కలిపి చల్లరాదు). కొన్ని రకాల వెడల్పాకు మొక్కలు, తుంగ ఉన్నట్లైతే కలుపు 2-4 ఆకుల దశలో ఎకరానికి పెనాక్సులమ్ 400 మి.లీ. పిచికారీ చేయాలి. రైతులు క్రమం తప్పకుండా పొలంలో కలియ తిరుగుతూ పురుగులను, తెగుళ్ళ ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, నన్యరక్షణకు అనవసర ఖర్చు చేయకుండా, నిపుణుల సలహామేరకు మాత్రమే పురుగులు లేదా తెగుళ్ళ మందులు వాడాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి పంటలో సెప్టెంబర్ మాసం చాలా ప్రధానమైనది. ఈ మాసంలో చీడపీడల ఉధృతి అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ నెలలో ఎడతెరిపి లేకుండా 2-3 రోజులు గాలులతో కూడిన వర్షాలు పడినా, రోజుల తరబడి తుఫాను ధాటికి వర్షం కురిసినట్లైతే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశిస్తుంది. తెగులు 5 శాతం కంటే ఎక్కువ గమనించినట్లైతే తాత్కాలికంగా నత్రజని ఎరువులను వేయడం ఆపివేయాలి. తెగులు ఆశించిన పొలం నుండి నీటిని ఒకటి రెండుసార్లు పూర్తిగా బయటికి పంపాలి. తెగులు వ్యాప్తిని అరికట్టడానికి అగ్రిమైసిన్ 0.4 గ్రా. లేదా ప్లాంటామైసిన్ లేదా పోషామైసిన్ 0.2 గ్రా. 5-7 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ప్రధాన పొలంలో అగ్గితెగులు ఆశించే అవకాశం ఉన్నందున మచ్చలు తొలిదశలోనే గుర్తించి ఐసోప్రోథయోలేన్ 1.5 మి.లీ. లేదా ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ. లేదా ట్రైసైక్లోజోల్ + మ్యాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొలంలో గట్ల వెంబడి ఉన్న మొక్కలలో 10 శాతం పిలకలలో పాముపొడ తెగులు ఉన్నట్లు గమనిస్తే హెక్సాకొనజోల్ 2 మి.లీ. లేదా ప్రొపికొనజోల్ 1 మి.లీ. లేదా వాలిడామైసిన్ 2 మి.లీ., లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాలలో ఉల్లికోడు అధికంగా ఆశిస్తుంది. కనుక పొలంలో 5 శాతం ఉల్లిగొట్టాలు లేదా దుబ్బుకి ఒక కోడు సోకిన పిలక గమనించినట్లైతే కార్బోఫ్యూరాన్ 3 సిజి 10 కిలోలు లేదా ఫిప్రోనిల్ 0.3జి గుళికలు 8 కిలోలు ఎకరానికి చల్లుకోవాలి. సెప్టెంబర్ నుండి వరి పంటను సుడిదోమ ఆశిస్తుంది. పిలకదశలో దుబ్బుకి 10-15 దోమలు ఉన్నట్లైతే అంకురం నుండి ఈనిక దశలో దుబ్బుకి 20-25 దోమలు ఉన్నట్లైతే తొలిదశలో ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లైతే డైనోటెఫ్యూరాన్ 0.4 గ్రా. లేదా పైమెట్రోజైన్ 0.6 గ్రా. లేదా ట్రైఫ్లూమెజో పైరిమ్ 0.485 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 40% + ఎథిప్రోల్ 40% డబ్ల్యుజి 0.25 గ్రా., లీటరు నీటికి మొక్కల మొదళ్ళపై పడేటట్లు పిచికారీ చేయాలి. ఈ మాసంలో కాండం తొలిచే పురుగు రెక్కల పురుగు ఉధృతి అధికంగా ఉండే అవకాశం ఉంది. నివారణగా పిలకదశ / దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అంకురం నుండి చిరుపొట్ట దశలో ఎకరాకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4జి గుళికలు 4 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న కొన్ని ప్రాంతాల్లో వర్షాల వల్ల నీరు నిలిచి మొక్కజొన్న పంట దెబ్బతినే అవకాశముంది. కావున ముందుగా అధిక నీరు నిలిచిన పొలాల్లో మురుగు నీటి కాల్వలను ఏర్పరుచుకొని బయటకు పారదోలాలి. వర్షాలు ఆగిన తర్వాత ఎకరాకు 30-40 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పైపాటుగా వేయాలి. వర్షాలు లేకపోతే మొక్కల ఎదుగుదలను కొనసాగించేందుకు రెండు శాతం యూరియా ద్రావణం (20 గ్రా. యూరియా లీటరు నీటిలో కలిపి), లేదా డి.ఎ.పి. లేదా 19:19:19, 10 గ్రా. లీటరు నీటిలో కలిపి ఆకులపై పిచికారీ చేయాలి సాధారణ మొక్కజొన్న సాగు చేసిన పొలాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగి పంట కోలుకునే అవకాశం లేకపోతే, ఆ పంటను సైలేజ్ లేదా పశుగ్రాసంగా వినియోగించడం ద్వారా రైతుల ఆర్థిక నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. పంట పూత, గింజలు నిండే దశలో సాధ్యమైనంత వరకు తేమ కొరత రాకుండా చూడాలి. సాధ్యమైతే లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ ఇవ్వాలి. ప్రస్తుత పంటదశలో మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉన్నది. అవసరమయితే, నివారణకు క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 మి.లీ లేదా స్పైనిటోరం 0.5 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి మొక్క సుడిలో మందు ద్రావణం పడేటట్లు పిచికారీ చేయాలి. పంట మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో ఒక కిలో సున్నం, తొమ్మిది కిలోల ఇసుకను కలిపి మొక్కల సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవాలి. ఎదిగిన లార్వాల నివారణకు విషపు ఎరను పెట్టుకోవాలి: వరి తవుడు 10 కిలోలు + బెల్లం 2 కిలోలు + 2-3 లీటర్ల నీటిలో కలిపి 24 గంటలు పులియనిచ్చి మరుసటిరోజు థయోడికార్బ్ 100 గ్రా. కలిపి ఉండలుగా తయారుచేసి సాయంకాలం వేళలో మొక్కల సుడులలో వేసుకోవాలి. వర్షాభావ పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగితే మొక్కజొన్నలో ఎండు తెగులు వ్యాధి ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. ఎండు తెగులు వ్యాధి నివారణకు నేలలో తేమను సాధ్యమైనంత వరకు నిల్వ ఉంచడం, సమతుల్య ఎరువుల నిర్వహణ చేపట్టడం, వ్యాధి సోకిన మొక్కలను వెంటనే తొలగించి పొలం నుండి బయటకు తీసివేయాలి. అవసరమైతే అమిస్టర్ టాప్ అనే మందుని 1 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే మందు 3 గ్రా. లీటరు నీటిలో కలిపి తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మొదళ్లకు దగ్గరగా తడుపుకోవాలి. చిరుధాన్యాలు జొన్న పంట వేసిన 35 రోజుల నుండి పంట కోసే వరకు కాండం తొలిచే పురుగు ఆశిస్తుంది. కావున నివారణకు ఎకరానికి 4 కిలోలు కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను కాండం సుడుల్లో వేయాలి. అదే విధంగా కత్తెర పురుగు ఉనికి గమనించినట్లయితే, మొదటి దశ లార్వాకు వేపనూనె 1500 పి.పి.యం. 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి మొక్క సుడుల్లో పడే విధంగా పిచికారీ చేయాలి. సజ్జ పంట పూత దశలో ఉంటుంది. వానాకాలంలో 20-25 రోజులకు మించి బెట్ట పరిస్థితులు ఏర్పడితే పూత, గింజకట్టే దశలో నీటి తడులు ఇవ్వడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చు. గులాబి రంగు పురుగు ఆశించినట్లయితే నివారణకు క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మబ్బులతో కూడిన వాతావరణం, వర్షపు తుంపరలు తేనెబంక తెగులు వ్యాప్తికి దోహదపడతాయి. పుష్పించే సమయంలో ఆశించే ఈ తెగులు నివారణకు కార్బండాజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రాగి ఎదిగిన మొక్కలలో అగ్గితెగులు ఆశించినప్పుడు ఆకులు, కణుపులు, వెన్నులపైన నూలు కండె ఆకారం మచ్చలు ఏర్పడతాయి. కణుపులు విరిగిపోతాయి. వెన్నుపై గింజలు తాలుగా మారుతాయి. అగ్గితెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంట పూత, గింజ పాలుపోసుకునే దశల్లో పైరు నీటి ఎద్దడికి గురికాకుండా చూడాలి. కొర్ర ఈ పంటలో అగ్గి తెగులును గమనించినట్లయితే రాగి పంటలో సూచించిన విధంగా మందులను పిచికారీ చేయాలి. పూత, గింజ పాలుపోసుకునే దశల్లో పైరు నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. వేరుశనగ వానాకాలం పంటలో లద్దెపురుగు ఆశించినట్లైతే, పురుగు తొలిదశలో ఉన్నప్పుడు 5% వేపగింజల కషాయం పిచికారీ చేసుకోవాలి. ఎకరాకు 8–10 పక్షి స్థావరాలను అమర్చాలి. ఎదిగిన లార్వాలను నివారించేందుకు ఫ్లూబెండమైడ్ 20% డబ్ల్యుజి 0.6 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగుళ్ళ ఉధృతి గమనించినట్లైతే 2 మి.లీ. హెక్సాకొనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. యాసంగి వేరుశనగ పంటను సాధారణంగా సెప్టెంబర్ 15 నుండి విత్తుకోవచ్చు. విత్తుకునే ముందు నేలను మెత్తగా దున్ని చదును చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో 4-5 టన్నుల పశువుల ఎరువు, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 20 కిలోల యూరియా వేసుకోవాలి. ఎకరానికి 65-80 కిలోల గింజ అవసరమవుతుంది. ఒక కిలో విత్తనానికి 3 గ్రా. మ్యాంకోజెబ్ లేదా 1 గ్రా. టెబ్యుకొనజోల్తో విత్తనశుద్ధి చేసుకోవాలి. వరుసకు వరుసకు మధ్య 22.5 సెం.మీ. మొక్కకు మొక్కకు మధ్య 10 సెం.మీ. దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. అలాక్లోర్ అనే కలుపు మందును 1.5-2.0 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 48 గంటలలోపు పిచికారీ చేసుకోవాలి. ఆముదం భూమిలో తేమ ఉన్న సమయంలో 15 కిలోల యూరియాను పైపాటుగా వేయాలి. దాసరి పురుగు ఉధృతిని గమనించినట్లైతే తొలిదశలో 5 మి.లీ. వేపనూనె లీటరు నీటికి, ఎకరాకు 8-10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. రసంపీల్చే పురుగుల నివారణకై ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్ 0.2గ్రా. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండుతెగులును గమనించినట్లైతే కార్బండాజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళ దగ్గర నేలను తడపాలి. వర్షాకాలం ఆముదం పంట ప్రస్తుతం పూతదశలో ఉంది. కాబట్టి బూజు తెగులు రాకుండా ఉండేందుకు వాతావరణ హెచ్చరికల ప్రకారం వర్షానికి 4-6 గంటల ముందు, వర్షాలు తగ్గాక ప్రొపికొనజోల్ 1 మి.లీ. లేదా కార్బండాజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువును అదనంగా వేసుకుంటే తర్వాత వచ్చే గెలలు ఆరోగ్యంగా వస్తాయి. నువ్వులు ఆలస్యంగా విత్తుకున్న నువ్వు పంటలో మొక్కలు మొలిచిన 15-20 రోజులకు కలుపును, అదనపు మొక్కలను తీసివేయాలి. విత్తిన 30-35 రోజులకు గొర్రుతో అంతరకృషి చేయాలి. మొక్కలు మొలిచిన 7-20 రోజులలో మొక్కలు చనిపోవడం గమనించినట్లైతే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలుపుకొని మొక్కల మొదళ్ళ దగ్గర పోయాలి. పొద్దుతిరుగుడు పొగాకు లద్దెపురుగులను గమనించినట్లైతే నొవాల్యురాన్ 1.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. బీహారి గొంగళి పురుగు నివారణకై క్వినాల్ ఫాస్ 25 ఇసి 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు నివారణకై ప్రొపికొనజోల్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆగష్టు రెండవ పక్షంలో విత్తిన పొద్దుతిరుగుడు పంటపై రసంపీల్చే పురుగులను గమనించినట్లైతే ఫ్లోనికామిడ్ 0.3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కుసుమ కుసుమ పంటను సెప్టెంబర్ రెండవ పక్షం నుండి వేసుకోవచ్చు. తేమను నిలుపుకునే బరువైన నల్లరేగడి నేలలు కుసుమ సాగుకు అనుకూలం. సాధారణంగా ఎకరానికి 4 కిలోల విత్తనం అవసరం అవుతుంది. కిలో విత్తనాన్ని 3 గ్రా. థైరామ్ లేదా కాప్టాన్ లేదా 1గ్రా. కార్బండాజిమ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎత్తు మడులు, కాలువల పద్ధతిలో నాటుకున్నట్లైతే తేమ సంరక్షణతోపాటు అధిక దిగుబడులు పొందవచ్చును. సోయాచిక్కుడు సోయాచిక్కుడు ప్రస్తుతం కీలకమైన గింజ నిండే దశ నుండి గింజ గట్టిపడే దశలో ఉంది. ఈ దశలలో బెట్ట పరిస్థితులు ఏర్పడినట్లైతే 15 రోజులకొకసారి 1-2 నీటి తడులను ఇవ్వాలి. సోయా పంటలో గింజ నిండే దశ వరకు కాండం తొలిచే ఈగ, కాండం తొలిచే పురుగు, తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాండం తొలిచే ఈగ, కాండం తొలిచే పురుగు నివారణకు, 0.5 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ 9.3% (+) లామ్డా సైహలోత్రిన్ 4.6% జెడ్సీ లేదా 0.3 మి.లీ క్లోరాంట్రానిలిప్రోల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే, నివారణకు 0.3 గ్రా. ఎసిటామిప్రిడ్ 20% లేదా 2.0 మి.లీ ఫిప్రోనిల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నట్లయితే, 1.25 గ్రా. డైఫెన్టియురాన్ 50% డబ్ల్యుపి లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు సింథటిక్ పైరెథ్రాయిడ్స్ మందులను పిచికారీ చేయకూడదు. సోయా పంటలో ఆశించే తెగుళ్లలో ఎక్కవగా పూత దశ నుండే ఆశిస్తాయి. వర్షభావ పరిస్థితులు ఉన్నపుడు , మసి బొగ్గు తెగులు, రైజోక్టోనియా ఏరియల్ బ్లాయిట్ తెగుళ్లు ఆశిస్తాయి. మసి బొగ్గు తెగులు, పొడి వాతావరణం, భూమిలో తక్కువ తేమశాతం, పోషకాలు, ఉష్ణోగ్రత 25-35 సెం.గ్రే. ఉన్నపుడు ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ తెగులు లక్షణాలు వేర్లు, కాండం, కాయల మీద కనిపిస్తాయి. ఈ తెగులు పంట కాలం మొత్తం ఉంటుంది. ఈ తెగులు వ్యాపించినప్పుడు మొలకలు చనిపోతాయి. తెగులు సోకిన మొక్కలు బలహీనవడి, ఎండిపోయి చనిపోతాయి. అకాలంగా ఈ తెగుళ్ల నివారణకు, బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు నీటి తడులతో పాటు పైపాటుగా పోషకాలను కూడా అందించాలి. ముందస్తు చర్యగా, పూత సమయంలో 2.5 గ్రా. థియోఫానేట్ మిథైల్ 70 డబ్ల్యుపి లేదా 0.6 మి.లీ. పైరక్లోస్ట్రోబిన్ + ఫ్లక్సాపైరోక్సాడ్ లేదా 2.5 గ్రా. టెబుకోనజోల్ 10% + సల్ఫర్ 65% డబ్ల్యుజి లేదా 1 గ్రా. టెబుకోనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆంథ్రాక్నోస్ ఆకుమచ్చ, కాయ కుళ్ళు తెగులు ఉధృతి వేడి వాతావరణం, ఉష్ణోగ్రత 35 సెం.గ్రే. 12 గంటలకు పైగా వర్షం/ మంచు కురిసినప్పుడు ఎక్కవగా ఉంటుంది. + ఈ తెగులు లక్షణాలు - పత్రపీఠం, కాండం, ఆకులు, విత్తనం పైన కనపడతాయి. ఈ తెగుళ్ల నివారణకు, మన బొగ్గు తెగులును నివారించడానికి సూచించిన మందులను పిచికారీ చేయాలి. అపరాలు యాసంగి-మినుము, పెసరకు అనువైన రకాలు మినుము: ఎం.బి.జి-1070, ఎం.బి.జి-1080, ఎం.బి.జె-207, జి.బి.జె-1, టి.బి.జె-104, ఎల్.బి.జె-787, ఎల్.బి.జె-752, పి.యు-31 పెసర: ఎం.బి.జె-385, ఎం.బి.జె-295, ఎం.బి.జె-389, ఎం.బి.జె-351, ఎం.బి.జె-347, ఎం.బి.జె-348, డబ్ల్యు.జి.జె-42, టీ.ఎం-96-2, ఎల్.బి.జె-460, ఎల్.బి.జె-407, ఐ.పి.ఎం-2-14. విత్తే సమయం: యాసంగి సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. విత్తన మోతాదు: ఎకరాకు 6-8 కిలోలు విత్తనం అవసరమవుతుంది. ఎరువులు: ఎకరాకు నత్రజని 8 కిలోల (17 కిలోల యూరియా), భాస్వరం 20 కిలోల (125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్) ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్ లేదా కాప్టాన్ లేదా 2.5 మ్యాంకోజెబ్‌తో విత్తనశుద్ధి చేసిన తరువాత 5 గ్రా. థయోమిథాక్సామ్ లేదా 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తనశుద్ధి చేసి విత్తుకోవచ్చు. విత్తే ముందు 10 కిలోల విత్తనానికి 200గ్రా. రైజోబియం కల్చర్‌ను పట్టించి విత్తుకోవాలి. అంతరకృషి: పెసర/మినుము పైరును 30 రోజుల వరకు కలుపు బారి నుండి రక్షించుకోవాలి. 20 రోజులు 30 రోజుల దశలో గొర్రు/దంతి ద్వారా అంతరకృషి చేస్తే కలుపు నివారణతోపాటు తేమను కూడా నిలుపుకోవచ్చు. కలుపు అధికంగా ఉండే భూములలో పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.0-1.4 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజుగాని పిచికారీ చేయాలి. వెడల్పాకు కలుపు నివారణకు ఇమజితాఫిర్ (పర్‌స్యుట్) 300 మి.లీ. ఎకరాకు లేదా 2 నుండి 3 ఆకుల గడ్డిజాతి కలుపు నివారణకు ఎకరాకు 400 మి.లీ. క్విజలోఫాప్ ఇథైల్ లేదా ప్రొపక్విజాఫాప్ 10% ఇసి 250 మి.లీ. పిచికారీ చేయాలి. కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు నేలలో తగు తేమ ఉండేలా చూసుకోవాలి. నీటి యాజమాన్యం: వానాకాలంలో పెసర, మినుమును వర్షాధారంగా పండిస్తారు. బెట్ట పరిస్థితులలో అవసరం మేరకు కీలక దశల్లో 1-2 తడులు ఇస్తే మంచి దిగుబడి సాధించవచ్చు. యాసంగిలో నీటి పారుదల కింద సాగు చేసుకోవాలి. కీలక దశలు: పూత, కాయ తయారయ్యే దశలో పంట బెట్టకు గురికాకుండా చూడాలి. బెట్ట పరిస్థితుల్లో 2% (20 గ్రా. లీటరు నీటికి) యూరియా ద్రావణాన్ని అవసరాన్ని బట్టి 2 లేదా 3 సార్లు పిచికారీ చేయాలి. యాసంగి కంది కంది పైరును నీటి వసతి ఉన్న ప్రాంతాలలో సెప్టెంబర్ నెలలో సాగు చేసుకునే అవకాశముంది. రకాలు: డబ్ల్యు.ఆర్.జి-65, ఐసిపిఎల్-2740, టిడిఆరిజి-4, ఐసిపిఎల్-87119 (ఆశ), డబ్ల్యూ.ఆర్.జి-255, టి.డి.ఆర్.జి-59, టి.డి.ఆర్.జి-272 విత్తే సమయం: సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చును. విత్తే దూరం: నేల స్వభావాన్ని బట్టి 60×20 సెం.మీ. 90×20 సెం.మీ. 120x20 సెం.మీ. దూరాన్ని మార్చుకోవాలి. ఎరువులు: నత్రజని 20 కిలోలు, భాస్వరం 50 కిలోలు హెక్టారుకు దుక్కిలో వేయాలి. సూటి ఎరువులు అయినటువంటి యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడాలి. కంది పెరిగే దశలో ఆకు చుట్టు పురుగు ఆశిస్తుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లైతే నివారణకు క్లోరిపైరిఫాస్ 2 మి.లీ. లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తొలకరిలో వేసిన మినుము, పెసర పైర్లు పూత, కాయ దశల్లో, కంది శాఖీయ దశల్లో ఉన్నాయి. మినుము, పెసర పైర్లకు ముఖ్యంగా కింది పురుగులు, తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది. తలమాడు లేదా మొవ్వుకుళ్ళు: వైరస్ వల్ల ఆశించే తెగులు, తామర పురుగులు దీని వ్యాప్తికి దోహదపడతాయి. ముఖ్యంగా బెట్ట వాతావరణంలో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులును నివారించాలంటే తామర పురుగులను నియంత్రించాలి. వీటి నివారణకు లీటరు నీటికి 1 గ్రా. ఎసిఫేట్ లేదా ఫిప్రోనిల్ 1.5 మి.లీ. వారం రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి. పంట కంటే ఒక అడుగు ఎత్తులో నీలి రంగు జిగురు అట్టలను, ఎకరానికి 20 ఉంచినట్లైతే తామర పురుగుల ఉధృతిని తెలుసుకోవచ్చును. పల్లాకు తెగులు: పల్లాకు తెగులు సోకిన మొక్కలను, ఇతర కలుపు మొక్కలను పీకి నాశనం చేయాలి. పైరుపై ఒక అడుగు ఎత్తులో పసుపు రంగు రేకులను గాని అట్టలను గాని ఉంచి వాటి మీద ఆముదం గాని గ్రీజుగాని పూసినట్లైతే తెల్లదోమ ఉధృతిని తెలుసుకొనవచ్చును. తెల్లదోమ నివారణకు ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లీటరు నీటికి కలిపి పురుగుల ఉధృతిని బట్టి 7 నుండి 10 రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి. మారుకా మచ్చల పురుగు: పూతదశలో మారుకా అనే గూడు పురుగు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా నొవాల్యురాన్ 1.0 మి.లీ. లేదా స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మి.లీ. మందును పిచికారీ చేస్తే పురుగును నివారించవచ్చు. అవసరమైతే వారం రోజుల తర్వాత మళ్లీ పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు: ఈ తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగు గుండ్రని చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు పెద్దవై ఆకులు ఎండి రాలిపోతాయి. దీని వలన కాయల్లో గింజలు సరిగ్గా నిండవు. నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. మ్యాంకోజెబ్ లేదా 1 గ్రా. క్లోరోథలోనిల్ లేదా 1 గ్రా. కార్బండాజిమ్ లేదా 1 గ్రా. థయోఫానేట్ మిథైల్లను కలిపి పిచికారీ చేయాలి. పత్తి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని వర్షాధార పత్తి పంటలో పైపాటుగా ఎకరానికి 25 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను 40, 60, 80 రోజుల పత్తి పంటకు తగినంత తేమ ఉన్నప్పుడు అందించాలి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు రసంపీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. రసంపీల్చే పురుగుల ఉధృతిని గమనించడానికి పసుపు, నీలం రంగు జిగురు పూసిన అట్టలను (ఎకరాకు 10 చొప్పున) అమర్చుకోవాలి. తామర పురుగులు, పేనుబంక గమనించినట్లైతే నివారణకు 5 మి.లీ. వేపనూనె (1500 పిపియం) మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు నివారణకు 2 మి.లీ. ఫిప్రోనిల్ లేదా 0.3 గ్రా. ఫ్లోనికామిడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతిని గమనించడానికి ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. చెరకు అధిక వర్షాలు, తుఫాను గాలులకు పంట పడిపోకుండా మొక్కల మొదళ్ళకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. నీటి ముంపునకు గురయ్యే తోటల్లో, ప్రతి 24 మీటర్లకు 40 సెం.మీ. లోతు, 60 సెం.మీ. వెడల్పు గల కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. తోటల్లో నీరు నిల్వకుండా మురుగు నీటి కాల్వల ద్వారా గాని లిఫ్టు పంపులు వినియోగించి తరచుగా నీటిని తీసివేయాలి. ఈ మాసంలో దూదేకుల పురుగు పంటను ఆశించి పురుగులు ఆకుల అడుగుభాగాన గుంపులు గుంపులుగా చేరి, ఆకుల నుండి రసాన్ని పీల్చి వేయటం వల్ల ఆకులు వడలిపోతాయి. క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి ఈ పురుగును నివారించుకోవచ్చు. వాతావరణం మబ్బుగా ఉండి 19-35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత, 80-90 శాతం గాలిలో తేమ ఉన్నప్పుడు తెల్ల పేను (ఊలి ఎఫిడ్) అభివృద్ధి చెందుతుంది. దీని తల్లి, పిల్ల పురుగులు ఆకుల అడుగుభాగంలో గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వలన తెలుపు, పసుపు వర్ణం మిళితమైన మచ్చలు ఏర్పడతాయి. మొదట అంచులు, తర్వాత మొత్తం ఆకులు క్రమేపి ఎండిపోతాయి. ఈ పురుగుల విసర్జన తియ్యని జిగట పదార్థం లాగా ఉండి కిందున్న ఆకుల పైభాగాన పడి, దాని మీద సూటీమోల్ట్ అనే నల్లని శిలీంధ్రం పెరిగి ఆకు మసిబారుతుంది. గాలి ద్వారా 1.5-2.0 కిలోమీటర్ల దూరం వరకు ఈ పురుగులు వ్యాప్తి చెందగలవు. దీని నివారణకు, పంటకు సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని ఎరువులు వాడాలి. పురుగు ఆశించిన ఆకులను తీసి తగులబెట్టాలి. లీటరు నీటికి క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ. మోతాదులో కలిపి పిచికారీ చేయాలి. ఈ మాసంలో పిండి పురుగు కూడా పంటను ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. పురుగులు ఆకు తొడిమెలకు, చెరకు గడలకు మధ్య గుంపులు గుంపులుగా చేరి గడల నుండి రసాన్ని పీల్చి వేస్తాయి. పంట పక్వానికి వచ్చేటప్పుడు పిండినల్లి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఉదృతంగా ఉన్నప్పుడు మొవ్వు ఎండిపోతుంది. ఎదిగిన తోటల్లో పురుగు నివారణకు ఆకులు రెలచి, బహిర్గతమైన కణుపుల మీద లీటరు నీటికి క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ. మోతాదులో కలిపి పిచికారీ చేయాలి. ఇటీవల కాలంలో ఆకుపై ఆశిస్తున్న పిండినల్లి నివారణకు కూడా పైన సూచించిన మందులను ఆకు తడిచేటట్లుగా పిచికారీ చేసి, పురుగును అదుపులో ఉంచవచ్చు. ఆధారం: పాడిపంటలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో -రాష్ట్ర వ్యవసాయశాఖ