వ్యవసాయ వ్యర్ధ పదార్ధాల కంపోస్టింగ్ - ప్రాముఖ్యత పంట మార్పిడి మరియు పంట కోసిన తర్వాత పొలంలో మిగిలిపోయిన వరిగడ్డి, జొన్న, మొక్క జొన్న, పత్తి కట్టె, మిరప కట్టె, కంది కట్టె, బొప్పాయి కాండము, అరటి కాండం మరియు ఆకులు వంటి పంట వ్యర్థ పదార్థాలను పొలంలో వదిలివేయడం లేదా కాల్చటం చేస్తూ ఉంటారు.దీని వల్ల భూమి తన సహజ స్థితి ని కోల్పోవడమే కాకుండా వాతావరణ కాలుష్యం కూడా పెరిగిపోతుంది. వ్యవసాయ వ్యర్థ పదార్థాలలో లెగ్నిన్, హెమీ సెల్యూలోజ్, సెల్యూలోజ్, చక్కెర, కొవ్వు మరియు ప్రొటీన్స్ వంటి సంక్లిష్ట పదార్థాలు ఉంటాయి. ఇవి నేరుగా మొక్కలకు పోషకాలు అందించలేవు. కాబట్టి సేంద్రియ పదార్థం కంపోస్ట్ గా మారినప్పుడే పోషకాలు మొక్కలకు అంది నేల ఆరోగ్యం మెరుగవుతుంది. సేంద్రియ పదార్థం కంపోస్ట్ గా మారడానికి రసాయన జీవ ప్రక్రియలు జరగాలి. కంపోస్టింగ్ వలన కలిగే లాభాలు వ్యవసాయ వ్యర్థ పదార్థాలను కంపోస్టింగ్ చేయటం వల్ల పరిమాణం తగ్గి ఉపయోగించుకోవడానికి సులువుగా ఉంటుంది. కంపోస్టింగ్ ప్రక్రియలో వ్యాధులను కలుగజేసే శిలీంద్రాలు నశిస్తాయి. నేలలకు కావలసిన పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు అందుబాటులోకి వచ్చి నేల ఆకృతి భౌతిక మరియు రసాయన లక్షణాలు మెరుగుపడతాయి. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వ్యవ సాయ వ్యర్థ పదార్థాలను ఎరువుగా మార్చే సూక్ష్మజీవుల సముదాయం డికంపోజర్- ఎ. డికంపోజర్- బి ని తయారు చేసి రైతులకు అందిస్తున్నారు. డికంపోజర్-ఎ నాలుగు రకాల శిలీంద్రాల సముదాయం. డికంపోజర్- బి ఐదు రకాల బ్యాక్టీరియాల సముదాయం. వాడే విధానం ముందుగా 4.5 - 5.0 మీటర్ల పొడవు, 1.5 నుంచి 2 మీటర్ల వెడల్పు, 1-1.5 లోతు గల గుంతలను ఏర్పాటు చేసుకొని డికంపోజర్-ఎ, డికంపోజర్ - బి ని 50 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువులో కలపాలి. వ్యవసాయ వ్యర్థ పదార్థాలను అంటే వరిగడ్డి, జొన్న, మొక్కజొన్న, పత్తి కట్ట, కంది, మిరపకట్టలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వ్యర్థ పదార్థాలపై నీళ్లు చల్లి కుప్పగా వేసుకోవాలి. మరుసటి రోజు వ్యర్థపదార్ధాలను 25 సెం.మీ. మందంతో గుంతలో వేసుకోవాలి. వీటిపై 50 కిలోల పశువుల ఎరువులతో కలిపిన మిశ్రమాన్ని వ్యర్ధ పదార్ధాలను ఇంకొక 25 సెం.మీ. మందంతో వేసుకొని వీటిపై పశువుల ఎరువు కలిపిన డికంపోజర్- ఎ, డికంపోజర్ -బి వేసుకుని వీటిపై నీటిని పిచికారీ చేయాలి. ఈ విధంగా వ్యర్ధ పదార్థాలను 2-3 పొరలుగా వేసుకొని వారానికి ఒకసారి కిందకి పైకి తిప్పుకుని తేమ శాతం తక్కువ అయితే నీటిని పిచికారీ చేసి తిరిగి కుప్పగా పోసి పోగు పెట్టుకోవాలి. 40-65 రోజుల కంపోస్ట్ తయారవుతుంది. గుంతలు లేని చోట ప్లాస్టిక్ సంచుల్లో కూడా కంపోస్ట్ చేసుకోవచ్చు. కంపోస్ట్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొలంలోని పంట వ్యర్ధాలను కుళ్ళింప చేయడానికి గట్టిగా వున్న వ్యర్థ పదార్థాలను (కంది, పత్తి, మిరప ) షేడ్జర్ సాయంతో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. దీనివల్ల వ్యర్ధాలు త్వరగా కుళ్లుతాయి. వ్యర్థ పదార్థాలు మీద తగినంత తేమ ఉండేట్లు చూసుకోవాలి. వ్యర్థ పదార్థాలను డికంపోజర్లు ఎ.బి లను పశువుల ఎరువు కలిపిన మిశ్రమాన్ని 7 రోజుల కొకసారి కిందికి పైకి తిప్పి నీటిని పిచికారీ చేసుకోవాలి. ముందుగా పంట వ్యర్థాలను రోటవేటర్ తో ముక్కలుగా చేసి 1 కేజి డికంపోజర్ -ఎ మరియు ఒక కేజి డికంపోజర్ -బి లను 200 లీటర్ల నీటిలో కలిపి ఉదయం లేదా సాయంత్రం సమయంలో పంట వ్యర్థాలపై పిచికారీ చేయాలి. నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకుని వ్యర్థాలను నేలలో కలియదున్నటం ద్వారా 20-25 రోజుల్లో సేంద్రియ పదార్థం తయారవుతుంది. వరి, మొక్కజొన్న, చెఱకు పంట వ్యర్థాలను 25 రోజులలో సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు. ఆధారం: పాడి పంటలు డా.ఎం.రవీంద్రారెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త (మైక్రో బయాలజీ), వ్యవసాయ పరిశోధనా స్థానం, అమరావతి