నేటి పెయ్యదూడలే రేపటి పాడిపశువులు, అవి రాబోయే రోజులలో పాల ఉత్పత్తికి పునాదులు. పెయ్యదూడల పోషణలో ఏ మాత్రం అశ్రద్ధ చేసినా రాబోయే రోజులలో దాని పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని నష్టపోవలసి వస్తుంది. మొదటి 3 – 4 మాసాల వయస్సు అత్యంత కీలకమైనది. ఈ దశలో దాని కిచ్చే పోషణ, మేపు సక్రమంగా ఉండేటట్లు చూడాలి. పుట్టిన వెంటనే 6 గంటల లోపు జున్ను పాలు త్రాగేటట్లు చూడాలి. పుట్టిన తర్వాత మొదటి 3 రోజుల వరకు తగినన్ని జున్నుపాలు త్రాగనివ్వాలి. దాని శరీర బరువుని బట్టి 3 మాసాల వరకు తగినన్ని జున్నుపాలు త్రాగనివ్వాలి. (మొదటి నెలలో రోజులకు 2 – 2.5 లీటర్ల చొప్పున, రెండవ నెలలో 2.5 – 3.0 లీటర్ల చొప్పున ఆ తర్వాత 3వ నెలలో 3.5 లీటర్ల చొప్పున పాలు దూడకు వదలాలి). దూడలకు దాణాను మొదటి 2 నెలల వయస్సు వరకు లేగ దూడల పోషణ రోజుకు 150-200 గ్రాములు, 3వ నెల నుండి 300 – 400 గ్రాములు, 4వ నెల నుండి 500 – 600 గ్రాములు, 5 – 6 నెలల వయస్సు నుండి 750 – 850 గ్రాములు, 7వ నెల నుండి 1 కిలో వరకు దాని శరీర బరువును బట్టి కొద్దిగా బెల్లం కలిపి పెట్టవలెను. దూడకు 15 రోజుల వయస్సు నుండి లేత పచ్చగడ్డి మేత తినడం అలవాటు చేయాలి. 3వ నెల వయస్సు నుండి పచ్చిమేత మరియు ఎండుగడ్డి మేపాలి. దూడలకు వారం లోపల మొదటి సారి, తర్వాత ప్రతి నెలకొక సారి నట్టల మందు త్రాగించాలి. నేటి లేగదూడల ఆరోగ్య సంరక్షణ రేపటి పాడి పశువుల పెరుగుదల మరియు పాల ఉత్పాదన శక్తిని చాలా ప్రభావం చేస్తుంది, కాబట్టి లేగదూడల ఆరోగ్య సంరక్షణలో తగు జాగ్రత్త వహించాలి. లేగ దూడలలో సరియైన ఎదుగుదల లేకపోవడం, ఎప్పుడు రోగాల బారినపడి ఉండటం, వివిధ రోగాలు దూడల నుండి పాడి పశువులకు సోకడం మొదలైన వాటివల్ల రైతులు చాలా ఆదాయాన్ని నష్టపోవాల్సి వస్తుంది. ప్రతి రైతు లేగ దూడలకు వచ్చే మూడు ముఖ్యమైన వ్యాధుల నుండి తగు ఆరోగ్య సంరక్షణను కల్పించాలి. ఈ వ్యాధి దూడ పుట్టక ముందే, తల్లి గర్భాశయంలో ఉన్నప్పుడే సూక్ష్మజీవుల వల్ల సోకుతుంది. వ్యాధి సోకిన దూడలు పాలు త్రాగవు, ఎండిపోతుంటాయి, చాలా నీరసించి నిలబడలేక పడిపోతుంటాయి. ఈ వ్యాధి నివారణకు యాంటి బయొటిక్ మందులను దగ్గరలో ఉన్న పశువైద్యున్ని సంప్రదించి వాడాలి. విరోచనాలు ఈ వ్యాధి ఎక్కువగా లేగదూడలలో పుట్టిన ఒకనల లోపు వస్తుంది. వ్యాధి సోకిన దూడలలో రక్తం కలిసిన విరోచనాలు ఎక్కువగా అవుతాయి, దూడలు పాలు త్రాగక నీరసించి పోతాయి. ఈ వ్యాధి నివారణకు యాంటిబయొటిక్ మందులతో పాటు శరీరంలో నీటి శాతంను అదుపులో ఉంచే ద్రవాలను దగ్గరలో ఉన్న పశువైద్యున్ని సంప్రదించి వాడాలి. న్యుమోనియా (దమ్మరోగం): దూడలను గాలి మరియు వెలుతురు సరిగాలేని, తేమ ఎక్కువగా ఉన్న పాకల్లో ఉంచడం వల్ల ఈ వ్యాధి వచ్చి ఊపిరితిత్తులు పాడు అవుతాయి. దూడలలో ఈ వ్యాధివల్ల ముక్కునుండి పచ్చని చీమిడి కారుతుంది, బాగా దగ్గువస్తుంది. దూడలకు జ్వరం వచ్చి ఊపిరి తీసుకోవటంలో, పాలు త్రాగటంలో ఇబ్బంది పడతాయి. ఈ వ్యాధి నివారణకు యాంటిబయొటిక్ మందులను దగ్గరలో ఉన్న పశువైద్యున్ని సంప్రదించి వాడాలి. ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.