బీట్రూట్ ను పచ్చిగాను, కూరగాను, పచ్చళ్ళ తయారీలోను, సలాడ్ గాను తింటారు. బీట్రూట్ ఆకులను ఆకుకూరగాను వాడుతారు. శీతాకాలం పంట అయిన బీట్రూట్ ను మనం మన తెలంగాణలో సాగుచేసుకోవచ్చు. నేలలు సారవంతమైన, లోతైన ఇసుక నేలలు అనుకూలం. ఉదజని సూచిక 6-7 ఉండి నేలలు యోగ్యమైనవి, అధిక క్షారతగల చౌడు నేలల్లో కూడా పెంచవచ్చు. వాతావరణం బీట్రూట్ శీతాకాలం పంట, 18-24 డిగ్రీల సెల్సియస్స్ ఉష్ణోగ్రత అనుకూలం. విత్తే సమయం ఆగస్టు నెల నుండి నవంబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. దఫదఫాలుగా విత్తుకుంటే మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా పంట పొందవచ్చు. ఒక్కొక్కదఫాకు 15 రోజులు తేడాతో విత్తుకోవాలి. విత్తన మోతాదు బీట్రూట్ విత్తనాలను సీడ్ బాల్స్ అంటారు. ఒక్కదానిలో రెండుకంటే ఎక్కువ విత్తనాలుంటాయి. ఒక ఎకరాకు 3-4 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే విధానం వరుసలలోని మొక్కల మధ్య 10) సెం.మీ. వరుసల మధ్య 45 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి. రకాలు ఎర్లీ వండర్: గడ్డ ఎర్రగా ఉంటుంది. పంట కాలం 55-60 రోజులు, రెడ్ బాల్: గడ్డ ఎర్రగా గుండ్రంగా ఉంటుంది. పంట కాలం 70-90 రోజులు. క్రీమ్సన్ గ్లోబ్: గడ్డ గుండ్రంగా ఉండి, పైపొర లేత ఎరుపు రంగుతో ఉండి అధిక దిగుబడిని ఇస్తుంది. పంటకాలం 3 నెలలు. డెట్రాయిట్ డార్క్ రెడ్: అధిక దిగుబడినిచ్చే రకం, గడ్డ ఎర్రగా ఉంటుంది. పంట కాలం 80-100 రోజలు, నేల తయారీ, ఎరువులు నేలను బాగా దున్నాలి. ఆఖరి దుక్కిలో 10-15 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువును కలిపి కలియదున్నాలి. ఆఖరి దుక్కిలో 14 కిలోల నత్రజని, 44 కిలోల భాస్వరం, 14 కిలోల పొటాష్ ఒక ఎకరాకి వేయాలి. విత్తిన 25 రోజుల తరువాత 14 కిలోల నజ్రతని, 14 కిలోల పొటాష్ వేయాలి. అంతర కృషి గింజలు మొలకెత్తిన తర్వాత, ఒక్కొక్క సీడ్ బాల్ నుండి 3-6 మొలకలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక బలమైన మొలక ఉంచి మిగిలినవి పీకి వేయాలి. గడ్డ బాగా ఊరడానికి గింజ మొలకెత్తిన 20–25 రోజుల తర్వాత కలుపు తీసి, మన్ను ఎగదోయాలి. నీటి యాజమాన్యం విత్తనం నాటిన వెంటనే తడి ఇవ్వాలి. నీటిని బిందు సేద్య (డ్రిప్) పద్ధతి ద్వారా అందించినట్లయితే వృథా కాదు. మీరు వాడకంలో పొదుపు జరిగి గడ్డ పెరగడానికి కావాల్సిన నీరు అంది, అధిక దిగుబడినిస్తుంది. సస్యరక్షణ ఆకు తొలిచే పురుగు (పాముపొడ), ఆకు తినే పురుగు సాధారణంగా ఆశిస్తాయి. లీటరు నీటికి మలాథియాన్ 2 మి. లీ. కలిపి పిచికారీ చేసి ఆకు తొలిచే పురుగుని, లీటరు నీటికి కార్బరిల్ 3 గ్రా. కలిపి పిచికారీ చేసి ఆకుతినే పురుగుని నివారించవచ్చు. బూజు తెగులు, మొక్క కుళ్ళు తెగులు, పసుపు పచ్చ తెగుళ్ళు ఆశిస్తాయి. వీటి నివారణకు విత్తే ముందు, కిలో విత్తనానికి ధైరం లేదా కాప్టాన్ 2 గ్రా. పట్టించి విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. అలాగే పంటపై 2 గ్రా. డైథేన్జెడ్-78 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కోత, దిగుబడి 2-3 నెలల్లో పంట తయారవుతుంది. ఎకరాకు 10-12 టన్నుల దిగుబడి వస్తుంది. మొక్క మొత్తం గడ్డతో సహా పీకి, ఆకులు తీసివేసి శుభ్రంగా కడిగి మార్కెట్లోకి పంపాలి. ఆధారం: కాడూరి మౌనిక, ఉద్యానవన శాఖ, రుక్మాపూర్ ఉద్యాన నర్సరీ, కరీంనగర్