కీరదోస వేగంగా పెరిగే లాభదాయక పంట కీరదోస ఒక ముఖ్యమైన వేసవి కాల కూరగాయ పంట. తక్కువ ఖర్చుతో అధిక లాభాలను అందించే పంటగా రైతుల్లో ప్రాచుర్యం పొందింది. తక్కువ కాల వ్యవధిలోనే కోతకు వచ్చి రైతులకు త్వరిత ఆదాయం అందిస్తుంది. వేడి వాతావరణంలో సులభంగా పెరుగ గల తీగజాతి కూరగాయలలో కీరదోస ప్రధాన మైనది. పోషక ప్రాముఖ్యత కీరదోస తక్కువ కేలరీలతో కూడి, అధిక నీటి శాతం (సుమారు 95-96%) కలిగిన ముఖ్యమైన కూరగాయగా ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, అధిక మోతాదులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ C, పొటాషియం వంటి ఖనిజాలు ఉండి శరీరానికి అవసరమైన ప్రాథమిక పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా వేసవి లో ఇది శరీరాన్ని చల్లగా ఉంచి, డీహైడ్రేషన్‌ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబర్ ఉండటం వలన జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్దకాన్ని తగ్గిస్తుంది. తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు నియంత్రణకు సహాయపడుతుంది. కీరదోస లో ఉన్న యాంటీ ఆక్సీడెంట్లు, విటమిన్-C చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచి కాంతివంతంగా ఉంచుతాయి. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించే డీటాక్సిఫికేషన్ ప్రక్రియకు కూడా తోడ్పడుతుంది. ఈ విధంగా కీరదోసను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా శరీరానికి తేలికపాటి శక్తి, శీతలత, సమగ్ర ఆరోగ్యం పొందవచ్చు. వాతావరణం : కీరదోస ఒక వేసవి కాల పంట. ఇది 25°-35°C ఉష్ణోగ్రత లో బాగా పెరుగుతుంది చల్లటి వాతావరణం, ఈ పంటకు అనుకూలం కాదు. వేసవి కాలంలో పుష్పధారణ, పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. నేల: సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉన్న, నీరు నిల్వ కాకుండా మంచి డ్రైనేజ్ ఉన్న ఇసుక మట్టి లేదా లోమీ నేలలు అనుకూలం. రకాలు వేసవికి అనుకూలమైన రకాలు : కీరదోసలో ప్రధానంగా కీర దోస, పచ్చి దోస అనే రెండు వర్గాలు ఉన్నాయి. కీరదోస ఈ రకం వేసవి కాలానికి అనువుగా ఉండి, కొంతవరకు నీటి ఎద్దడిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎకరానికి సుమారు 60-70 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తుంది. పచ్చి దోస రకాలు జపనీస్ లాంగ్ గ్రీన్ : ఈ రకంలో కాయలు పొడవుగా, ఆకుపచ్చ రంగులో ఉండి త్వరగా కోతకు సిద్ధమవుతాయి.పూస సంయోగ్ (హైబ్రిడ్) : ఈ హైబ్రిడ్ రకం ఎకరానికి సుమారు 60 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. కాయలు వంపుగా ఉండి 60-65 సెం.మీ. పొడవు కలిగి ఉంటాయి. పంట కాలం సుమారు 100 రోజులు. పచ్చి దోస దిగుబడి ఎకరానికి సుమారు 56 క్వింటాళ్లు కాగ , కూరదోసగా సాగు చేసినప్పుడు 100- 112 క్వింటాళ్ల వరకు దిగుబడి లభిస్తుంది.పూస సీడ్స్ కుకుంబర్ 6 : ఈ రకం 40-45 రోజుల్లోనే మొదటి కోతకు వస్తుంది. ఎకరానికి సుమారు 50 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఇతర హైబ్రిడ్ రకాలు నాందరి, అభిజిత్, గోల్డెన్ గ్లోరి. మల్టీ స్టార్ వంటి రకాలు కూడా సాగుకు అనుకూలంగా ఉంటాయి. భూమిని 2-3 సార్లు దున్ని, మెత్తగా చేసి కలుపు మొక్కలను తొలగించాలి. చివరి దుక్కి లో మాగిన పశువుల ఎరువు 20-25 టన్నులు/హెక్టార్ కలపాలి. నీటి పారుదల సౌకర్యం ఉండాలి. విత్తన మోతాదు :హెక్టారుకు 2-3 కిలోల విత్తనాలు అవసరం. విత్తన శుద్ధి : కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 5గ్రా. కలిపి నీడలో ఆరబెట్టాలి. తరువాత థైరమ్ 3 గ్రా. కలిపి శుద్ధి చేయాలి. నాటే విధానం, దూరం : గుంటల విధానంలో విత్తనం వేయాలి. వరుసల మధ్య 1.5-2 మీటర్లు, మొక్కల మధ్య 60-90 సెం. మీ. దూరం పాటించాలి. ఎరువుల నిర్వహణ : పశువుల ఎరువు 20-25 టన్నులు/హెక్టార్. రసాయన ఎరువులు : NPK (50:25:25 కిలోలు/హెక్టార్), నత్రజనిని విడతలుగా ఇవ్వాలి. నీటి నిర్వహణ : విత్తిన వెంటనే నీరు ఇవ్వాలి. తరువాత 5-7 రోజుల వ్యవధిలో నీరు అందించాలి. పూత, కాయ దశలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. వృద్ధి నియంత్రణ : 2-4 ఆకుల దశలో బోరాన్ 3-4 గ్రా./లీటరు నీటికి లేదా ఇథైల్ 2.5 మి.లీ./10 లీటర్ల నీటికి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే పుష్పధారణ పెరుగుతుంది. కలుపు నియంత్రణ : 2-3 సార్లు కలుపు తీసి నేలను కదిలిస్తే మొక్క దృఢంగా పెరుగుతుంది. అవసరమైతే మల్చింగ్ చేయవచ్చు. కోత : విత్తిన 40-50 రోజుల తర్వాత కోత ప్రారంభమవుతుంది. కాయలను లేత దశలో కోయాలి. 2-3 రోజుల వ్యవధిలో కోత చేయాలి. దిగుబడి సాధారణ రకాలు : 60-70 క్వింటాళ్లు / ఎకరం. హైబ్రిడ్ రకాలు: 100-112 క్వింటాళ్లు/ఎకరం. కీరదోసను పాలీహౌస్, షేడ్‌నెట్ హౌస్, నెట్ హౌస్‌లలో కూడా విజయవంతంగా సాగు చేయవచ్చు. ఈ విధానంలో ఉష్ణోగ్రత. తేమ, కాంతి వంటి వాతావరణ అంశాలను నియంత్రించడం ద్వారా మొక్కల పెరుగుదల అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పార్థినోకార్పిక్ హైబ్రిడ్ రకాలను ఉపయోగించడం వల్ల పరాగ సంపర్కం అవసరం లేకుండానే కాయలు ఏర్పడి సమాన ఆకృతి. ఆకర్షణీయమైన రంగు, మంచి నాణ్యత కలిగిన ఉత్పత్తి లభిస్తుంది. పాలీహౌస్, షేడ్‌నెట్ హౌస్, నెట్ హౌస్‌ల సాగులో చీడపీడలు మరియు తెగుళ్ల ప్రభావం తక్కువగా ఉండటం వల్ల కాయల నష్టం తగ్గి మార్కెట్‌కు అనువైన గ్రేడ్ ఉత్పత్తి పొందవచ్చు. అదనంగా డ్రిప్ ఇరిగేషన్, ఫర్టిగేషన్ వంటి ఆధునిక పద్ధతులు వినియోగిం చడం వల్ల నీరు మరియు ఎరువుల వినియోగం సమర్థవంతంగా జరుగుతుంది. ఈ విధానంలో కీరదోస దిగుబడి సాధారణ భూముల్లో సాగుతో పోలిస్తే గణనీయంగా ఎక్కువగా ఉండి సాధారణంగా ఎకరానికి 150-200 క్వింటాళ్ల వరకు లభిస్తుంది. ఆధారం: పాడిపంటలు Dr. Y.S.R. ఉద్యాన విశ్వవిద్యాలయం.