తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతి కలిగిన ప్రాంతాల్లో ఖరీఫ్ మొక్కజొన్న, పసుపు తర్వాత, వరి మాగాణుల్లో వేసవిలో సాగు చేయడానికి అనువైన పంటల్లో నువ్వు పంట ముఖ్యమైనది. అదే విధంగా ఆలస్యంగా వేసిన ఖరీఫ్ పంటల తర్వాత రెండవ పంటగా విత్తుకోవచ్చు. వేసవిలో సాగు చేసే నువ్వు పంటలో చీడ పీడల బెడద తక్కువగా ఉండడం వలన తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందవచ్చు. నువ్వును వేసవిలో సాగు చేయడానికి జనవరి మొదటి పక్షం నుండి ఫిబ్రవరి మాసం 20వ తేదీలోపు విత్తుకోవచ్చు. వేసవిలో నువ్వు సాగుకు అనువైన రకాలు, సాగు పద్ధతులు ఈ కింది చూద్దాం. నేలలు నీటి వసతి కలిగిన ఎర్రనేలలు, సారవంతమైన మురుగు నీరు పోయే సౌకర్యం గల నల్ల నేలలు చాలా అనుకూలం. అదే విధంగా సమస్యాత్మక భూములు అంటే చౌడు, ఆమ్ల, క్షార స్వభావం గల నేలలు ఈ పంట సాగుకు పనికి రావు. అనువైన రకాలు శ్వేత: 85-90 రోజుల్లో కోతకు వచ్చే తెల్లగింజ రకం. ఈ రకం కాండం కుళ్ళు తెగులను తట్టుకొంటుంది. రాజేశ్వరి: తెల్లగింజ రకం 85-90 రోజుల్లో కోతకు వస్తుంది. కాండం కుళ్ళు, బూడిద తెగుళ్ళను తట్టుకుంటుంది. చందన: వెర్రి తెగులును తట్టుకొని 80-85 రోజుల్లో కోతకు వచ్చే గోధుమ రంగు గింజ రకం. ఎలమంచలి 66 (శారద): ఆకుమచ్చ తెగులును తట్టుకొనే లేత గోధుమ రంగు గింజ రకం. హిమ (జె.సి. ఎస్ 9426): 80-85 రోజులలో కోతకు వచ్చి వెర్రి తెగులును తట్టుకునే తెల్లగింజ రకం. నేల తయారీ నేలను 2-4 సార్లు మెత్తగా దున్ని, 2 సార్లు గుంటకతోలి, చదును చేయాలి. విత్తనం, విత్తే పద్దతి ఒక ఎకరాకు సరిపోయే 2.5 కిలోల విత్తనానికి మూడింతల ఇసుక కలిపి గొర్రుతో వరుసల మధ్య 30 సెం.మీ. (12 అంగుళాలు) మొక్కల మధ్య 15 సెం.మీ. (6 అంగుళాలు) ఉండే విధంగా విత్తుకోవాలి. మొలకెత్తిన 15 రోజులకు అదనంగా ఉన్న మొక్కలను తీసివేయాలి. విత్తనశుద్ధి నువ్వు పంటను ఆశించే వివిధ రకాల తెగుళ్ళ నుండి కాపాడుకోవడానికి ఒక కిలో విత్తనానికి 3 గ్రా. చొప్పున మాంకోజెబ్ అనే శిలీంధ్ర నాశిని కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. అదే విధంగా పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల నుండి రక్షించడానికి ఒక కిలో విత్తనానికి 2.0 మి. లీ. ఇమిడాక్లోప్రిడ్ అనే మందును విత్తనానికి పట్టించాలి. ఎరువుల యాజమాన్యం ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 24 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్, 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను అనగా 8 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్లను దుక్కిలో వేసి కలియదున్నాలి. విత్తనాలు వేసిన 30 రోజులకు కలుపు తీసి ఎకరాకు 26 కిలోల యూరియా వేయాలి. కలుపు యాజమాన్యం కలుపు నివారణ కోసం విత్తనాలు వేసే ముందు ఎకరానికి ఒక లీటరు ఫ్లూక్లోరాలిన్ (45 శాతం) అనే మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేకుంటే విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు 200 లీటర్ల నీటిలో ఒక లీటరు పెండిమిథాలిన్ (30 శాతం) లేదా అల్లాక్లోర్ (50 శాతం) అనే మందును కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులకు గొర్రుతో అంతర కృషి చేయాలి. నీటి యాజమాన్యం నువ్వులో విత్తనాలు వేసిన వెంటనే నీటి తడి ఇవ్వాలి. పూత కాయ అభివృద్ధి, గింజ కట్టే దశలు నీటి తడులకు కీలకమైనవి. కాబట్టి విత్తిన 35-40 రోజుల నుండి 65-70 రోజుల వరకు పైరుకు నీటి ఎద్దడి కలగకుండా చూసుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి పంట కాలంలో 3-4 తడులు అవసరమవుతాయి. నీటి తడులకు పూత దశ అత్యంత కీలకమైనది. కావున ఈ దశలో బెట్ట పరిస్థితులు ఏర్పడితే పూత తగ్గడంతో పాటు ఉన్న పూత కూడా రాలిపోతుంది. ఒకవేళ నీటి తడి ఇచ్చే అవకాశం లేకుంటే లీటరు నీటికి 20 గ్రా. యూరియాను కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. దీనివల్ల పంట నష్టాన్ని కొంత వరకు తగ్గించవచ్చు. సస్యరక్షణ - పురుగులు పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేస్తాయి. అలాంటి ఆకులు ముందుగా పాలిపోయి తర్వాత దశలో ఎండిపోతాయి. వీటి నివారణకు ఒక లీటరు నీటిలో 2 మి.లీ. డైమిథోయేట్ లేదా 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారీ చేయాలి. ఆకుముడత, కాయ తొలిచే పురుగులు మొక్క దశ నుండి కాయదశ వరకు నష్టం కలిగిస్తాయి. తొలిదశలో గొంగళి పురుగులు, 2-3 లేతాకులను కలిపి గూడు కట్టి లోపలి నుండి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీకి తినటమే కాకుండా మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పూతను, కాయల్లోని లేత గింజలను తింటూ పంటకు నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ. క్వినాల్ ఫాస్ కలిపి పిచికారీ చేయాలి. కోడు ఈగ చిన్న చిన్న పురుగులు లేత మొగ్గ, పూతను తినివేయడం వల్ల మొగ్గలు, పువ్వు నుండి కాయలుగా ఏర్పడక, గింజ పెరగక, తాలు కాయలుగా ఏర్పడతాయి. ఈ పురుగులు ఆశించిన మొగ్గలు, కాయల్ని ఏరివేయడం మంచిది. మొగ్గ దశలో డైమిథోయేట్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 1గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి నివారించుకోవాలి. లద్దె పురుగులు గుంపులు గుంపులుగా ఏర్పడి ఆకుల్లోని పత్రహరితాన్ని గీకి తినడం వలన జల్లెడాకులు ఏర్పడతాయి. ఎదిగిన గొంగళి పురుగులు పూలు, కాయలకు రంధ్రాలు చేసి నష్టపరుస్తాయి. వీటి నివారణకు ముందుగా జల్లెడాకులను ఏరివేయాలి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5 శాతం వేప గింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. పెద్ద పురుగుల నివారణకు లీటరు నీటికి 2.5 మి.లీ. క్లోరిఫైరిఫాస్ లేదా 1 గ్రా. ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్ళు పైరు ఎదిగే దశలో గాలిలో తేమశాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుమచ్చ తెగులు అధికంగా వ్యాపిస్తుంది. దీనివల్ల ఆకులు, కాండం మీద గోధుమ రంగు గల చిన్న చిన్న వలయాకారపు మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు కార్బండిజమ్ 1 గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. అదే విధంగా తెగులు సోకినపంట అవశేషాలను నాశనం చేయాలి. కాండం ఎండు తెగులు ఆశించినప్పుడు కాండంపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, క్రమేపి నల్లగా మారుతుంది. తెగులును కలిగించే శిలీంధ్రం భూమిలోను, విత్తనాలు, పంట అవశేషాలపై జీవిస్తుంది. భూమిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు తెగులు ఉధృతి అధికంగా క ఉంటుంది. దీని నివారణకు 3 గ్రా. మాంకోజెబ్ లేదా 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వెర్రి తెగులు పూత సమయంలో ఆశించినప్పుడు తెగులు సోకిన మొక్కల ఆకులు చిన్నవై, పువ్వులోని భాగాలన్ని ఆకులుగా మారి, కాయలు ఏర్పడవు. తద్వారా ఎదుగుదల తగ్గి పైభాగంలోని చిన్న ఆకులు గుబురుగా అవటం వలన వెర్రి తల మాదిరిగా ఉంటుంది. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా ఆశిస్తుంది. ఈ పురుగుల నివారణకు ఒక లీటరు నీటిలో మిథైల్ డెమటాన్ 1 మి.లీ. లేదా డైమిథోయేట్ 3 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. ఈ తెగులు అధికంగా ఆశించే ప్రాంతాల్లో రాజేశ్వరి, చందన, హిమ వంటి రకాలు సాగుచేయాలి. పంటకోత పంట కోత సమయంలో అధిక ఉష్ణోగ్రత వలన కాయలు చిట్లి గింజలు పొలంలోనే రాలిపోతాయి. కాబట్టి కింది ఆకులు, కాండం పసుపు రంగుకు మారుతున్న సమయంలోనే కోసి కట్టలుగా కట్టి ఎండబెట్టాలి. 5-6 రోజులు ఎండబెట్టిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి. నూర్పిడి చేసిన తర్వాత గింజల్లో తేమ 8 శాతానికి వచ్చే వరకు ఆరబెట్టి గోనె సంచుల్లో నిల్వ చేసుకోవాలి. వేసవిలో నువ్వు పంటను సాగుచేసే రైతు సోదరులు పైన తెలిపిన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే తక్కువ సమయంలో, తక్కువ వనరులతో మంచి లాభాలను పొందవచ్చు.