మామిడి తోటలో అక్టోబర్ యాజమాన్యం మామిడి మన రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన ఉద్యాన పంట, బంగినపల్లి, తోతాపురి, సువర్ణరేఖ, చెరకు రసం, నీలం వంటి రకాలు రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. అయితే చాలా తోటల్లో ఒక ఏడాది మంచి కాపు, మరుసటి ఏడాది తక్కువ కాపు రావడం, పూత సరిగా రాకపోవడం, వచ్చిన పూత రాలిపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. వీటికి ప్రధాన కారణం పూతకు ముందు చేయవలసిన పనులను సకాలంలో చేయకపోవడమే. వర్షాకాలం ముగిసి చలి మొదలయ్యే అక్టోబర్ నెల మామిడికి అత్యంత కీలకమైన సమయం. ఈ నెల నుండి డిసెంబర్ వరకు కొమ్మల చివర్లలో ఉన్న మొగ్గలు పూత మొగ్గలుగా మారే ప్రక్రియ (పూమొగ్గ విభజన) జరుగుతుంది. ఈ దశలో చెట్టుకు తగినంత పోషణ, పరిశుభ్రమైన వాతావరణం, సరైన నీటి ఒత్తిడి లభిస్తేనే ఏకరీతిగా, సమృద్ధిగా పూత వస్తుంది. పూత బాగా రావడానికి చెట్టుకు కావలసినవి జూన్-అగస్టులో వచ్చిన చిగుర్లు కనీసం 4-6 నెలల వయస్సు కలిగి, పూర్తిగా ముదిరి (పక్వానికి వచ్చి) ఉండాలి. అక్టోబర్-డిసెంబర్ మధ్య కొత్త చిగుర్లు రాకుండా ఉండాలి. ఈ సమయంలో వచ్చే చిగురు పూతను తగ్గిస్తుంది. పొడి వాతావరణం, చల్లని రాత్రులు, నేలలో మితమైన నీటి ఒత్తిడి ఉండాలి. చెట్టులో పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) తగినంత నిల్వ ఉండాలి కాని నత్రజని అధికంగా ఉండకూడదు. తోట శుభ్రత తోటను శుభ్రంగా ఉంచడం వల్ల పురుగులు, తెగుళ్లకు స్థావరాలు లేకుండా చేయవచ్చు. పూత సమయంలో వచ్చే తేనెమంచు పురుగు, పిండి నల్లి, బూడిద తెగులు, పక్షికన్ను (ఆంత్రాక్నోస్) తెగులు ఉధృతి గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి అక్టోబర్లో ఈ క్రింది పనులు తప్పనిసరిగా చేపట్టాలి. రాలిన ఆకులు, కాయలు, చెత్త తొలగింపు చెట్ల కింద రాలిన ఆకులు, ఎండుకొమ్మలు, కుళ్లిన కాయలు, పాత పూత కాడలను సేకరించాలి. వీటిలో బూడిద తెగులు, పక్షికన్ను తెగులు శిలీంధ్ర బీజాలు, పురుగుల గుడ్లు ఉంటాయి. తెగులు లేని ఆకులను కంపోస్టు గుంతలో వేసి ఎరువుగా మార్చుకోవచ్చు తెగులు సోకిన భాగాలను కాల్చివేయాలి లేదా లోతుగా పాతిపెట్టాలి. దుక్కి, కలుపు నివారణ వర్షాలు తగ్గిన వెంటనే, నేలలో తగినంత తేమ ఉన్నప్పుడే చెట్ల వరుసల మధ్య ట్రాక్టర్ కల్టివేటర్ లేదా డిస్కోహ్యారోతో అడ్డంగా, నిలువుగా దున్నాలి. దుక్కి వల్ల కలుపు మొక్కలు నశిస్తాయి. నేలలో ఉన్న పిండి నల్లి గుడ్లు, పండు ఈగ కోశస్థ దశలు (ప్యూపాలు), నిద్రావస్థలో ఉన్న ఇతర పురుగుల నిద్రావస్థలు ఎండకు, పక్షులకు బహిర్గతమై నాశనమవుతాయి. పిండి నల్లి పిల్ల పురుగులు నవంబర్-డిసెంబర్ నుండి నేల నుండి చెట్టు పైకి పాకుతాయి. అక్టోబర్ లోనే పాదులను దున్ని గుడ్లను నాశనం చేయాలి. నవంబర్ మొదటి వారంలోపు చెట్టు మొదలు పై నేల నుండి 60-90 సెం.మీ. ఎత్తులో 25-30 సెం.మీ. వెడల్పు గల పాలిథీన్ పట్టీ (జారుడు పట్టీ) కట్టి, దాని దిగువ అంచుకు గ్రీజు పూయడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. చెట్టు పాదుల్లో (బేసిన్) కలుపును చేతితో తీసివేసి, పాదులను సరిచేయాలి. చెట్టు మొదలుకు దెబ్బ తగలకుండా జాగ్రత్తగా దున్నాలి. వేర్లు ఎక్కువగా తెగకుండా ఉండటానికి చెట్టు మొదలు నుండి కనీసం 1-1.5 మీటర్ల దూరం వదిలి దున్నాలి. కొమ్మల కత్తిరింపు ఎండిపోయిన, విరిగిన, తెగులు సోకిన, పురుగు తొలిచిన కొమ్మలను ఆరోగ్యకరమైన భాగం వరకు కత్తిరించి తొలగించాలి. చెట్టు లోపలి భాగంలో ఒకదానిపై ఒకటి అడ్డంగా పెరిగిన కొమ్మలు, నీడలో బలహీనంగా పెరిగే కొమ్మలు, నేలను తాకే కొమ్మలు, నిటారుగా పెరిగే నీటి కొమ్మలను (వాటర్ షూట్స్) తొలగించాలి. చెట్టు మధ్య భాగంలోకి సూర్యరశ్మి, గాలి బాగా ప్రసరించేలా చేస్తే పూత ఎక్కువగా రావడమే కాకుండా తెగుళ్లు తగ్గుతాయి, మందుల పిచికారీ సులభమవుతుంది. కత్తిరించిన పెద్ద గాయాలపై బోర్డో పేస్ట్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ పేస్ట్ (కాపర్ ఆక్సీక్లోరైడ్ 10 గ్రా. + కొద్దిగా నీరు కలిపి ముద్దగా) పూయాలి. దట్టంగా పెరిగిన పాత తోటల్లో ఒకేసారి ఎక్కువ కొమ్మలు కత్తిరించకూడదు ఎక్కువగా కత్తిరిస్తే కొత్త చిగుర్లు వచ్చి పూత తగ్గుతుంది. తేలికపాటి కత్తిరింపే మేలు. బదనిక (లోరాంథస్) తొలగింపు మామిడి కొమ్మలపై పరాన్నజీవిగా పెరిగే బదనిక చెట్టు పోషకాలను, నీటిని పీల్చుకొని కొమ్మలను బలహీనపరుస్తుంది. బదనిక ఉన్న కొమ్మను అది అంటుకున్న చోటు కంటే 15-20 సెం.మీ. క్రిందికి కత్తిరించి తొలగించాలి. కేవలం పైభాగం మాత్రమే కోస్తే మళ్లీ చిగురిస్తుంది. తొలగించిన బదనికను తోట బయట కాల్చివేయాలి. పోషక యాజమాన్యం కాపు పూర్తయిన తరువాత చెట్టు కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి, రాబోయే పూతకు అవసరమైన నిల్వలను సమకూర్చుకోవడానికి సమతుల్య పోషణ అవసరం. మామిడికి ఎరువులను సాధారణంగా రెండు దఫాలుగా మొదటి దఫా కోత తరువాత జూన్-జులైలో, రెండవ దఫా సెప్టెంబర్ అక్టోబర్లో వేయాలి. ఎరువులను పిందె కట్టిన తర్వాత అనగా బఠాణీ గింజ పరిమాణంలో ఉన్నప్పుడు, రెండవ దఫా నీరు కట్టేటప్పుడు వేయాలి పురుగులు, తెగుళ్ల పర్యవేక్షణ అక్టోబర్లో వర్షాల తరువాత గాలిలో తేమ ఎక్కువగా ఉండి ఆకులపై పక్షికన్ను తెగులు మచ్చలు, చిగుర్లపై తేనెమంచు పురుగు, ఆకుగూడు పురుగు, ఆకు తినే గొంగళి పురుగులు కనిపించవచ్చు. వారానికి ఒకసారి తోటలో తిరిగి గమనించాలి. ఉదృతి ఎక్కువగా ఉంటే స్థానిక ఉద్యాన అధికారి లేదా శాస్త్రవేత్త సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. అనవసర పిచికారీలు పరాగసంపర్కానికి తోడ్పడే తేనెటీగలు, మిత్ర పురుగులకు హాని చేస్తాయి. కాండం మరియు మొదలు సంరక్షణ కాండం తొలుచు పురుగు: కాండంపై రంధ్రాలు, వాటి నుండి బయటకు వచ్చే రంపపు పొట్టు లాంటి పదార్థం, జిగురు కనిపిస్తే ఆ రంధ్రాన్ని ఇనుప తీగతో శుభ్రం చేసి, డైక్లోరోవాస్ 76 ఇ.సి. మందులో ముంచిన దూది ఉండను రంధ్రంలో పెట్టి, బంకమట్టితో మూసివేయాలి. మొదలుకు పూత: చెట్టు మొదలు నుండి సుమారు ఒక మీటరు ఎత్తు వరకు బోర్డో పేస్ట్ (1 కిలో మైలుతుత్తం+1 కిలో సున్నం+10 లీటర్ల నీరు) పూస్తే కాండం తెగుళ్లు, బెరడు పగు ళ్లు, కొన్ని పురుగుల బెడద తగ్గుతుంది. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక