స్వీట్ కార్న్ సాగు - నాణ్యమైన దిగుబడికి మెలకువలు పట్టణ పరిసర ప్రాంతాలలో మొక్కజొన్న కందెలకు బాగా గిరాకీ ఉంటుంది. గింజపాలు పోసుకునే దశలో సాధారణ మొక్కజొన్న కందెలతో పోలిస్తే తీపిమొక్కజొన్న కందెలలో చక్కెర శాతం (25-30%), పోషక విలువలు ఎక్కువ. కావున ఈ మధ్య పట్టణ ప్రాంత ప్రజలు విరివిగా తినేందుకు రకాన్ని మార్కెట్లో కొంటున్నారు. రెండు తీపికందెల ప్యాకెట్ సుమారు రూ. 20/- వరకు మార్కెట్ ధర పలుకుతోంది. ఎకరానికి 30 వేల మొక్కల వరకు ఉండే అవకాశం ఉన్నది. కావున రమారమి 30 వేల బుట్టలు వస్తే రూ. 5/- చొప్పున రూ. 90 వేల రూపాయలు. ఎకరానికి ఖర్చు పోను నికర ఆదాయం రూ. 60 వేల వరకు వచ్చే అవకాశం ఉంది. మామూలు మొక్కజొన్న కన్నా నికర ఆదాయం రెండింతలు ఎక్కువ. కావున నగర, పట్టణ ప్రాంత రైతులు మార్కెట్ సౌకర్యం చూసుకొని ఈ పంటను సాగు చేసుకున్నట్లయితే అధిక లాభం పొందవచ్చు. తీపి మొక్కజొన్నను నీటి పారుదల కింద మాత్రమే సాగుచేసుకోవాలి. తీపి కందెను అవసరాన్ని బట్టి బేబీ కార్న్ గా కూడా మార్కెట్ చేసుకోవచ్చు. నేలలు తీపిమొక్కజొన్న సాగుకుమార్గాన నీటిపారుదల సౌకర్యంగల అన్ని రకాల నేలలు అనువైనవి. రకాలు, పంట కాలం షుగర్-75, మీట 222, ఎన్ డబ్ల్యూ సి -1 అనే హైబ్రిడ్, విన్ ఆరెంజ్ రకాలు, మాధురి, ప్రియ, అల్మోరా తీపి మొక్కజొన్న లాంటి కాంపోజిట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఖరీఫ్ లో 80-85 రోజులు, రబీలో 85-95 రోజులకు కోతకు వస్తుంది. విత్తు కాలం తీపి మొక్కజొన్నను మార్కెట్ అనుకూలతను బట్టి సంవత్సరం పొడవునా విత్తుకోవచ్చు. ముఖ్యంగా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా దఫాలుగా విత్తుకుంటే అధిక లాభాలను పొందవచ్చును. కానీ ఖరీఫ్ లో జూన్ 15 నుండి జులై 15 లోపల అలాగే రబీలో అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 లోపల విత్తుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చును. విత్తన మోతాదు సాధారణంగా ఎకరానికి 3-3.5 కిలోల విత్తనం సరిపోతుంది (సాధారణంగా రకాలు) కాని ప్రైవేట్ హైబ్రిడ్ రకాలను ఎకరానికి 2-2.5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తన శుద్ధి కిలో విత్తనానికి 6.0 మి.లీ. సయంట్రానిలిప్రోల్ + థయామిథాక్సామ్ కలిపి విత్తనశుద్ధి చేసి విత్తుకున్నట్లయితే తొలి దశలో ఆశించే కత్తెరపురుగును నివారించుకోవచ్చును. నేల తయారీ, విత్తే పద్ధతి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేయాలి. దుక్కి బాగాదున్ని చదును చేసుకొని బోదె నాగలితో 60 సెం.మీ. ఎడంతో బోదె కాలువలు చేసుకోవాలి. మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం ఉండేటట్లు విత్తనాన్ని బోదెకు ఒకవైపున పై నుండి 1/3 వంతు ఎత్తులో విత్తుకుంటే నీటి పారుదలకు సులభంగా ఉండడమే కాక, వర్షపాతం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవడానికి వీలుంటుంది. విత్తిన పది రోజుల తరువాత కుదురుకు ఒక్క మొక్కను మాత్రమే ఉంచి మిగతా మొక్కలను తీసివేయాలి.తీపి మొక్కజొన్నను కందెల తీపి దనము, ఇతర నాణ్యత ప్రమాణాల కోసం వేరే మొక్కజొన్న రకాల నుండి 250 మీటర్ల దూరంలో లేదా 14 రోజుల పూత అంతరం ఉండేలా సాగు చేసుకోవాలి. ఎరువుల యాజమాన్యం ఎకరానికి 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు లేక కంపోస్టును ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి. భూసార ఫలితాలను బట్టి ఎరువులను తగిన మోతాదులో వాడాలి. ఎకరానికి 175 కిలోల యూరియా (నత్రజని), 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ (భాస్వరం), 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (పొటాష్) అవసరం ఉంటుంది. యూరియాను మూడు దఫాలుగా 1/3వ వంతు విత్తే సమయంలో, 1/3వ వంతు 30-35 రోజులకు, మిగిలిన 1/3 వంతు 50-55 రోజులకు వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో 1/3వ వంతు యూరియాతో పాటు మొత్తం భాస్వరం (ఎస్.ఎస్.పి.), సగం పొటాష్ వేయాలి. మరలా 50-55 రోజులకు యూరియాతో పాటు మిగతా సగం పొటాష్ ను వేయాలి. కలుపు యాజమాన్యం మొక్కజొన్నలో మొదటి 3 నుంచి 4 వారాల వరకు పెరుగుదల నెమ్మదిగా ఉండటం వలన కలుపును ఏ మాత్రం తట్టుకోలేదు. కనుక 6 వారాల వరకు కలుపు పెరుగుదలను అరికడితే పంటకు నష్టం కలగకుండా చూడాలి. విత్తిన తరువాత అట్రాజిన్ అనే కలుపు మందును ఎకరానికి 1-1.5 కిలోలు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 48 గంటలలోపు నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వలన వెడల్పాటి ఆకులు గల కలుపు మొక్కలను దాదాపు ఒక నెల వరకు మొలవ కుండా అదుపు చేయవచ్చు. విత్తిన 30 నుంచి 35 రోజులకు కల్టివేటర్ తో అంతర కృషి చేసి కలుపు మొక్కలను పూర్తిగా నివారించవచ్చు. పైరు 20-25 రోజుల దశలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటే టెంబోట్రైయోన్ 34.4 % ఎస్.సి. 115 మి.లీ + 400 గ్రా. అట్రాజిన్ లేదా టోప్రామిజోన్ 36 మి.లీ, 400 గ్రా. అట్రాజిన్ లేదా 1400 మి.లీ మిసోట్రైయిన్ + అట్రాజిన్ ను 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు సరిపోయేలా పిచికారీ చేయాలి. విత్తిన 30 నుండి 35 రోజుల దశలో వరుసల మధ్య కల్టివేటర్ తో అంతరకృషి చేసి కలుపు మొక్కలను పూర్తిగా నివారించవచ్చు. సస్య రక్షణ ప్రస్తుతం మొక్కజొన్నలో కాండం తొలిచే పురుగు కంటే కూడా కత్తెర పురుగు అధికంగా వున్నది. ఈ పురుగు ఆకు, కాండం పై రంధ్రాలు చేసి మొక్కలకి నష్టంచేసి పెరగకుండా చేస్తుంది. దీని నివారణకు విత్తనశుద్ధి చేసుకోవాలి. ఉధృతి ఎక్కువైనప్పుడు 30 % వరకు దిగుబడులు తగ్గుతాయి. నివారణకు లార్వా తొలి దశలో వేపనూనె (అజాడిరాక్టిన్ 1500 పి.పి.ఎం) 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే పంట 20-25 రోజుల దశలో కూడా పురుగు ఉధృతిని గమనించినట్లయితే స్పైనోటోరం 0.5 మి.లీ లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో కనీసం రెండు సార్లు పిచికారీ చేయాలి. పంట మోతాదట్లు దశలో పురుగు గమనించిన వెంటనే పొడి ఇసుకను, సున్నంను (9 పాళ్లు ఇసుక + 1 పాళ్లు సున్నం) కలిపి మొక్కజొన్న సుడులలో వేసుకుంటే ఇసుక రాపిడికి లార్వాలు చనిపోతాయి. నీటి యాజమాన్యం మొక్కజొన్న నీటి ఎద్దడిని (ముఖ్యంగా పూత దశలో), నీటి ముంపును (ముఖ్యంగా లేత దశలో) తట్టుకోలేదు. మొక్కజొన్న ఎంత వ్యవధిలో నీరు పెట్టాలి అనేది వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం, సేంద్రియ పదార్థ శాతం, పంట రకం, పంట పెరుగుదల అనేది యాజమాన్య పరిస్థితులు, నీరు పెట్టే పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.మొక్కజొన్న తొలిదశలో నీటి ముంపునకు, అలానే పూతదశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కావున ఈ దశల్లో పంట ఇలాంటి సమస్యలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలి. మొక్కజొన్న పంటలో ముఖ్యంగా పూత, గింజ పాలు పోసుకొనే దశల్లో వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు నీటి పారుదల సౌకర్యం ఉంటే 1 లేక 2 తడులు ఇవ్వడం ద్వారా దిగుబడులు పెంచుకోవచ్చు. రబీ కాలంలో నేలను బట్టి 6-7 తడులు అలానే వేసవి కాలంలో అయితే 7-8 తడులు ఇవ్వవలసి ఉంటుంది. పంట కోత కొంచెం ఎండిన పీచు, కందెపైన బిగుతుగా ఉన్న పచ్చని పొట్టు, బాగా పెరిగిన కండె పరిమాణాన్ని బట్టి తోటను సరైన సమయమని గుర్తించవచ్చు. గింజలు మెరుస్తూ, బాగా పెరిగి, గిల్లితే పాలు కారుతాయి. చక్కెర శాతం గింజపాలు పోసుకునే దశ నుంచి 10 రోజుల వరకు స్థిరపడి తరువాత క్రమంగా తగ్గుతుంది. కావున రైతాంగం సరైన సమయంలో వచ్చి కందెలను కోసి, గ్రేడింగ్ చేసుకొని మార్కెట్కు తరలించాలి. తీపి మొక్కజొన్నను కోసిన వెంటనే పొలం నుంచి షెడ్ కి తరలించి చెక్క పెట్టెల్లో లేదా అట్ట పెట్టెల్లో పెట్టి చల్లని ప్రదేశంలో (0-40°O) నిల్వచేయాలి. కందెలను పాలిథిన్ సంచుల్లో పెట్టి మార్కెట్లో అమ్మవచ్చు. దిగుబడి తీపి రకంలో ఎకరానికి 8-10 టన్నులు పచ్చికందెలు దిగుబడి సాధించ వచ్చును. సుమారుగా 26-33 వేల కందెలు ఉంటాయి. ఎకరానికి 10-12 టన్నులు పచ్చిమేత దిగుబడి వలన అధిక ఆదాయాన్ని పొందవచ్చును.ముఖ్యంగా పట్టణ పరిసర ప్రాంత రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించు కొని, వీలైతే మార్కెట్ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చు కొని, మంచి హైబ్రిడ్ రకాలను ఎన్నుకొని, మార్కెట్ అనుగుణంగా తీపి మొక్కజొన్న సాగుచేసి, అవసరమైతే 3-4 దఫాలుగా విత్తనం పెట్టి అధిక లాభాలను గడించాలని ఆశిస్తున్నాం. ఆధారం: వ్యవసాయ పాడి పంటలు , మొక్కజొన్న పరిశోధనా విభాగం, వ్యవసాయ పరిశోధన సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్.