పూలసాగు స్థిరమైన జీవనోపాధి గ్రామీణ భారతంలో రైతు జీవితం అనేక సవాళ్లతో నిండిపోయి ఉంటుంది. వర్షాల పై ఆధారపడే పంటలు, మారే మార్కెట్ ధరలు, పెరుగుతున్న ఖర్చులు రైతు ఆదాయం పై తీవ్ర ప్రభావం చూపు తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పూల సాగు రైతులకు ఒక స్థిరమైన, లాభదాయకమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా. కొన్ని పూల జాతులు ఈ వాతావరణానికి బాగా సరిపోతాయి. ఈ పూలు తక్కువ కాలంలోనే పూసి, తరచుగా కోతకు వస్తాయి. అందువల్ల రైతులకు రోజువారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కూరగాయలతో పోలిస్తే పూలు మార్కెట్లో ధరల మార్పులకు తక్కువగా గురవుతా యి, ముఖ్యంగా పండుగల సమయంలో ధరలు పెరుగుతాయి. పూలు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు... మన సంస్కృతి, సంప్రదాయాల్లో అవి ఒక ముఖ్యమైన భాగం. ప్రతి రోజు దేవాలయాల్లో పూజలు, వివాహాలు, శుభకార్యాలు, వేడుకలు ఏదైనా జరిగినా పూల అవసరం తప్పనిసరి. ఈ నిరంతర డిమాండ్ రైతులకు రోజువారీ ఆదాయం అందించే మార్గాన్ని కల్పిస్తుంది. చాలా గ్రామాల్లో చిన్న స్థలంలోనే మల్లె, బంతి, కనకాంబరం వంటి పూల సాగు చేస్తున్న రైతులు ఉన్నారు. ఉదయం పూట పూల కోత తీసుకుని, సమీప మార్కెట్కు తీసుకెళ్లి అమ్మడం ద్వారా వారికి తక్షణ ఆదాయం సమకూరుతోంది. ఇది కూరగాయలు లేదా ధాన్య పంటలతో పోలిస్తే వేగంగా ఆదాయం ఇచ్చే విధానం. ముఖ్యంగా మహిళలు, చిన్న రైతులు ఈ రంగంలో ఎక్కువగా పాల్గొని కుటుంబ ఆదాయాన్ని పెంచుతున్నారు. పూల సాగులో పెట్టుబడి తక్కువగా ఉండటం కూడా ఒక పెద్ద ప్రయోజనం. సరైన నేల, నీటి నిర్వహణ, కొద్దిపాటి శ్రద్ధతో మంచి దిగుబడి పొందవచ్చు. డ్రిప్ ఇరిగేషన్, సేంద్రియ ఎరువులు వాడితే ఖర్చులు మరింత తగ్గుతాయి. మార్కెట్ పరంగా కూడా పూలకు మంచి అవకాశాలు ఉ న్నాయి. స్థానిక మార్కెట్లతో పాటు, పట్టణాల్లోని ఫంక్షన్ హాళు ఈవెంట్ డెకరేటర్లు, దేవాలయాలు, పూలకు స్థిరమైన కొనుగోలు కేంద్రాలు. రైతులు నేరుగా వీరితో సంబంధాలు పెంచుకుంటే మధ్యవర్తులపై ఆధారపడకుండా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో కొన్ని ప్రత్యేక పూలు విరివిగా పూసి, మార్కెట్లో అధిక ధరలకు అమ్ముడవుతాయి. ఇప్పుడు వేసవిలో లభించే ప్రధాన పూలు, వాటి సాగు విశేషాలు, మార్కెట్ ప్రాధాన్యత గురించి చూద్దాం. మల్లెపూలు వేసవిలో విరివిగా పూసే పంట. ఒకసారి మొక్కలు నాటుకుంటే ప్రతిరోజూ కోత తీసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు మల్లెకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో రోజువారీ ఆదాయం పొందవచ్చు. కనకాంబరం వేడి వాతావరణాన్ని తట్టుకునే పంట. జడ అలంకరణలో విస్తృతంగా ఉపయోగిస్తారు. నిరంతర పూల కోతతో స్థిర ఆదాయం వస్తుంది. బంతి పండుగలు, వివాహాల్లో ప్రధానంగా ఉపయోగించే పూలు. ఇవి తక్కువ కాలంలో పెరిగి, అధిక దిగుబడిని ఇస్తాయి. తక్కువ ఖర్చుతో పూల దిగుబడి, అధిక లాభం. వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగ వేళల్లో భారీ డిమాండ్. గులాబీపూలు డెకరేషన్, బొకేలు, ప్రేమను వ్యక్తపరచడం వంటి అనేక అవసరాలకు ఉపయోగపడతాయి. కట్ ఫ్లవర్కు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. వేసవిలో పూల ధరలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా: వివాహ సీజన్లో ధరలు రెట్టింపు అవుతాయి. పట్టణ మార్కెట్లలో రోజువారీ డిమాండ్ ఉంటుంది. దేవాలయాల దగ్గర స్థిరంగా అమ్మకాలు జరుగుతాయి. రైతులు దగ్గరలోని మార్కెట్లు, ఫంక్షన్ హాళ్లు, ఫ్లోరల్ డెకరేటర్లతో నేరుగా సంబంధాలు పెంచుకుంటే మధ్యవర్తులు లేకుండా ఎక్కువ లాభం పొందవచ్చు. మొత్తానికి, పూల సాగు రైతులకు కేవలం ఒక పంట కాదు అది ఒక స్థిరమైన జీవనోపాధి మార్గం. సరైన పద్ధతులు, మార్కెట్ అవగాహన, కృషి ఉంటే ఈ రంగంలో రైతులు స్థిరమైన ఆదాయం సంపాదించి, తమ జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోవచ్చు. ప్రత్యక్షం గానే కాకుండా పూలతో విలువ ఆధారిత ఉ త్పత్తుల ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. పూల సాగు ద్వారా మాత్రమే కాదు పూలను ప్రాసెస్ చేసి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తే రైతులకు మరింత లాభం లభిస్తుంది. మార్కెట్లో ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉండటం వల్ల చిన్న స్థాయిలోనే ప్రారంభించి పెద్ద స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. గులాబీ ఆధారిత ఉత్పత్తులు గుల్కంద్: గులాబీ రేకులతో తయారు చేసే ఆరోగ్యకరమైన పదార్థంరోజ్ వాటర్ : కాస్మెటిక్స్, పూజలు, వంటల్లో వినియోగంరోజ్ ఆయిల్ : సుగంధ ద్రవ్యాలు, అత్తర్లు తయారీలో ఉపయోగం మల్లెపూల ఉత్పత్తులు జాస్మిన్ ఆయిల్: సుగంధ ద్రవ్యాలలో అత్యంత విలువైనది. అగరవత్తులు : మల్లె సువాసనతో తయారు చేస్తారు.పర్ఫ్యూమ్స్ : చిన్న యూనిట్లలో తయారీకి అనుకూలం ఎగుమతి అవకాశాలు కూడా ఉన్నాయి. పూలను కేవలం ముడి రూపంలో అమ్మడం కంటే, " వాటితో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తే రైతులు రెట్టింపు ఆదాయం పొందవచ్చు. ఇది ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుంది."పూలకు విలువ జోడిస్తే రైతుకు రెట్టింపు ఆదాయం" ఆధారం: పాడిపంటలు