తెలంగాణ రాష్ట్రంలో 2025-26లో పత్తి పంటను దాదాపు 45 లక్షల ఎకరాలలో వాణిజ్య పంటగా సాగు చేశారు. మన దేశంలో, రాష్ట్రంలో పత్తి పంటను 2002 సంవత్సరం నుండి బి.టి. సాంకేతిక పరిజ్ఞానం కలిగిన హైబ్రిడ్లను రైతాంగం సాగు చేస్తున్నారు. ఈ బి.టి. –2 పత్తిని సాగుచేయడం ద్వారా పత్తి కాయ తొలిచే పురుగుల ఉధృతి తగ్గి మంచి దిగుబడులు సాధించుకున్నారు. కాని గత కొన్ని సంవత్సరాల నుండి పత్తిని గులాబి రంగు కాయ తొలిచే పురుగు ఆశించి అధికంగా పంటను నష్ట పరచడం వలన దాదాపుగా 50 శాతం వరకు దిగుబడులు తగ్గుతున్నాయి. గులాబి రంగు పురుగు ఉధృతి పెరగడానికి గల కారణాలు ప్రస్తుతం సాగు చేస్తున్న బి.టి. పంట చుట్టూ 2-4 వరుసల నాన్ బి.టి. మొక్కలు (రెఫ్యూజియా) వేయకపోవడం. పంట కాలాన్ని పొడిగించడం. పంట మోళ్ళను ఆలస్యంగా తీసివేయడం. పంట మోళ్ళను ఇళ్ళ దగ్గర నిల్వ చేయడం. గులాబి రంగు పురుగు ఆశించే విధానం తల్లి రెక్కల పురుగు లేత ఆకుల కింది భాగాన, లేత కొమ్మలపైన, పూమొగ్గల పైన / లేత కాయలపైన 150-200 గుడ్లను విడివిడిగా పెడుతుంది. గుడ్ల నుండి పొదగబడిన పిల్ల పురుగులు పూ మొగ్గలలోనికి చొచ్చుకొనిపోయి పూలను విచ్చుకోకుండా గుడ్డి పూలుగా మారుస్తాయి. పొదగబడిన పిల్ల పురుగులు (లార్వాలు) 20-30 నిమిషాలలోపే కాయలోనికి ప్రవేశించి కాయలోనే ఉండి గింజలను తింటూ దూది రంగు మార్చి గుడ్డి పత్తిగా మారుస్తుంది. గులాబి రంగు పురుగు నష్టాన్ని కాయ పగిలిన తరువాతనే గుర్తించగలం దీని లార్వా దశ మొత్తం పత్తి కాయలోనే పూర్తి చేసుకుంటుంది. ఈ లార్వాలు కాయకు చేసిన చిన్న రంధ్రం ద్వారా బయటకు వస్తాయి. జాగ్రత్తగా గమనిస్తే రంధ్రంను కాయలపై గమనించవచ్చు. తల్లి రెక్కల పురుగు సాయంత్రం 6-30 నుండి 8.00 గంటల వరకు చురుకుగా ఉంటుంది. ఈ పురుగు ఒక సంవత్సర కాలంలో 4-6 తరాలను పూర్తి చేసుకుంటుంది. గాలిలో తేమ శాతం 40-70 శాతం ఉన్నప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సమగ్ర యాజమాన్య పద్ధతులు పంట లేని సమయంలో చేయవలసినవి ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకోవడం వలన పురుగు కోశస్థ దశలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పురుగు ఆశించిన పత్తిని ఇంటివద్ద, జిన్నింగ్ మిల్లుల వద్ద ఎక్కువ కాలం నిల్వ చేయరాదు. గులాబి రంగు పురుగు ఆశించిన పత్తిని జిన్నింగ్ చేయగా వచ్చిన విత్తనాలను నాశనం చేయాలి. పంట కాలంలో చేయాల్సినవి తక్కువ కాల పరిమితి (140-150 రోజులు) గల బి.టి. హైబ్రిడ్స్‌ను ఎంపిక చేసుకొని సకాలంలో సమూహంగా ఒకేసారి విత్తడం ద్వారా గులాబి రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. పత్తి చేను చుట్టూ 4-5 వరుసల నాన్ బి.టి. విత్తనాలను విత్తుకోవాలి. తుత్తుర బెండ కలుపు మొక్కలను ఈ గులాబి రంగు పురుగు ఆశిస్తుంది. కావున తుత్తుర బెండ మొక్కలు లేకుండా చూడాలి. ఈ పురుగు పూత దశ నుండే పంటను ఆశించి నష్టపరుస్తుంది. కావున పంట 4-5 రోజుల దశలో ఎకరాకు 8 లింగాకర్షక బుట్టలు మొక్కకు ఒక అడుగు ఎత్తులో అమర్చినట్లతే గులాబి రంగు పురుగును నియంత్రించవచ్చు. పురుగు ఆశించిన గుడ్డి పూలను ఏరివేసి నాశనం చేయాలి. తొలిదశలో అంటే పురుగు ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు 5 మి.లీ. వేపనూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పురుగు ఉధృతి గమనిస్తే 1.5 గ్రా. థయోడికార్బ్ లేదా 2 మి.లీ. ప్రొఫినోఫాస్ లేదా 2.5 మి.లీ. క్లోరిఫైరిఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నవంబర్ మాసంలో పురుగు ఉధృతిని బట్టి ఒకటి. లేదా రెండు సార్లు మాత్రమే సింథటిక్ పైరిత్రాయిడ్ మందులైన 1మి.లీ. సైపర్ మెత్రిన్ లేదా 1 మి.లీ. లామ్డా సైహలోత్రిన్ లేదా 0.5 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ + లామ్డా సైహలోత్రిన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సింథటిక్ పైరిత్రాయిడ్ మందులను పత్తి పంటపై ఎక్కువ సార్లు పిచికారీ చేసినట్లయితే తెల్లదోమ ఉధృతి పెరిగే అవకాశం ఉంది. పంట తీసిన తర్వాత చేయాల్సినవి పత్తి పంటను 6 నెలలకు మించి పొడిగించరాదు. పత్తి మోళ్ళను ట్రాక్టర్‌తో నడిచే షెడ్డర్, మల్చర్ లేదా రోటవేటర్ తో భూమిలో కలియదున్నడం వలన పురుగు కోశస్థ దశలను నాశనం చేయవచ్చు. నీటి సదుపాయం ఉన్నచోట రెండో పంటగా ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి. ఈ విధంగా సరైన సమయంలో, సరైన యాజమాన్య పద్ధతులు పాటించి పత్తిలో గులాబి రంగు పురుగును అరికట్టవచ్చు. ఆధారం: పాడిపంటలు , ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్.