మీ పంట నమోదు మీ మొబైల్ తో సాగు చేస్తున్న పంటలకు సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేయడమే e-పంట నమోదు ముఖ్య లక్ష్యం. వివిధ ప్రభుత్వ పథకాలు, పంటల బీమా, పంట కొనుగోలు, ఆపత్కాలంలో ప్రభుత్వం ప్రకటించే రాయితీలు, పెట్టుబడి సాయం, తదితర వ్యవసాయ సేవలు రైతులు పొందడానికి e-పంట సమాచారమే కీలకం.ప్రస్తుతం రైతులే తమ పంట వివరాలను స్వయంగా మొబైల్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి రైతు తాను సాగు చేసిన పంట వివరాలను సకాలంలో, ఖచ్చితంగా నమోదు చేసుకోవడం ఇక సులువు. e-పంట నమోదుకు అవసరమైనవి స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయం ఆధార్ నెంబర్కు అనుసంధానమైన మొబైల్ నెంబర్ భూమి వివరాలు, సాగు చేస్తున్న పంట వివరాలు రైతు నమోదు చేసిన పొలం వద్ద కనీసం 20 మీటర్ల పరిధిలో తీసిన పంట ఫొటో నమోదు చేసుకునే విధానం రైతులు ఇ-పంటలో నమోదు చేసుకోవడానికి ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ఐఫోన్లో యాప్ స్టోర్ నుంచి APAIMS 2.0 వ్యవసాయ సేవల యాప్ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఓపెన్ పై క్లిక్ చేసి క్యాప్చియా ఎంటర్ చేసి, గెట్ యాప్ బటన్ పై క్లిక్ చేస్తే రైతు నమోదు, లాగిన్ పేజీ వస్తుంది. ఇందులో తెలుగు/ఇంగ్లీష్ భాషల్లో మీకు కావల్సిన భాషను ఎంపిక చేసుకొని ఆధార్ నెంబర్ నమోదు చేస్తే, ఆధార్ నెంబర్కు అనుసంధానమైన మొబైల్ ఫోన్ కు ఓటిపి వస్తుంది. ఓటిపి నమోదు చేసిన తర్వాత రైతు వివరాలు ధృవీకరించండి అనే పేజీ వస్తుంది. రైతు వివరాలను ధృవీకరించుకోవాలి : రైతు పేరు, ఆధార్ నెంబర్. పుట్టిన తేది, చిరునామా, మొబైల్ ఫోన్ నెంబర్ వంటి వివరాలను పరిశీలించుకోవాలి. వివరాలు సరిగా ఉన్నట్లైతే “ధృవీకరించండి" పై క్లిక్ చెయ్యాలి. ఆ తర్వాత నచ్చిన నాలుగు అంకెలతో ఎంపిన్ పెట్టుకోవాలి. తదుపరి కాలంలో ఆధార్ నెంబర్, ఈ ఎంపిన్ తోనే లాగిన్ అవ్వొచ్చు. సాగు చేస్తున్న భూమిని ఎంచుకోవాలి: లాగిన్ అయిన తరువాత, రైతు పేరు పక్కన ఉన్న “పొలం వివరాలు” క్లిక్ చేస్తే, భూమి వివరాలు వస్తాయి. ఇక్కడ ఉన్న భూమి వివరాలను పరిశీలించుకొని, ఏవైనా తప్పులుంటే “ రైతు వివరాలు అప్ డేట్ చెయ్యండి” పై క్లిక్ చేసి, ఫిర్యాదు ద్వారా వివరాలను సరిదిద్దుకోవచ్చు. e-పంట నమోదు ప్రక్రియ తనకు సంబంధించిన సర్వే నంబర్ లేదా ఆ సీజన్ లో సాగు చేస్తున్న భూమి వివరాలను ఎంచుకుని, " మీ పంటను బుక్ చేయండి" పై క్లిక్ చేస్తే, 1. సాగు చేసిన పంట 2. పంట సాగు చేయలేదు అన్న రెండు ఎంపికలు వస్తాయి. ఒక వేళ పంట సాగు చేయని పరిస్థితుల్లో, పంట సాగు చేయలేదు పై క్లిక్ చేసి అక్కడ ఉన్న 1. బీడు భూమి. 2. ఆక్వా/ఇతర సాగు, 3. వ్యవసాయేతర వినియోగంలలో ఏది వర్తిస్తుందో దాన్ని ఎంపిక చేసుకొని నమోదుచేసుకోవాలి. ఈ విస్తీర్ణం, మొత్తం విస్తీర్ణానికి సమానంగా ఉంటే, ఇకపై ఆ సీజన్లో e-పంట నమోదు చేయడానికి సాధ్యం కాదు అని గమనించాలి. తరువాత ప్రివ్యూ పేజీకి వెళ్ళి, నమోదు వివరాలు పరిశీలించుకున్న తర్వాత, తప్పులేమైనా ఉంటే సవరించుకోవచ్చు. లేదా వివరాలు సరిగా ఉన్నట్లైతే సమర్పించుకోవాలి. సాగు చేసిన పంట నమోదు చేసుకోవాలి అని అనుకుంటే. "సాగు చేసిన పంట" పై క్లిక్ చేస్తే "మీ పంట బుక్ చేయండి" పేజీ తెరుచుకుంటుంది. ఇక్కడ పంట పేరు, రకం, విస్తీర్ణం, విత్తిన తేదీ, నీటిపారుదల వసతి, వ్యవసాయ విధానం వంటి అవసరమైన వివరాలు నమోదు చేయాలి. అలాగే సంబంధిత పొలం 20 మీటర్ల పరిధిలో నుండి భౌగోళిక సమన్వయంతో ఫొటో తీసుకొని అప్ లోడ్ చేయాలి. సాగు చేసిన పంట విస్తీర్ణాన్ని నమోదు చేసేటప్పుడు, ఉన్న విస్తీర్ణం మించకుండా చూసుకోవాలి. అన్ని వివరాలు నమోదు చేసిన తరువాత ప్రివ్యూ పేజీకి వెళ్ళి, మరొక్కసారి నమోదు చేసిన వివరాలను పరిశీలించుకొని, తప్పులుంటే సవరించుకొని, వివరాలు సరిగా ఉన్నాయని నిర్ధారించుకొన్న తరువాత 'పంట వివరాలు ఆమోదించండి" పై క్లిక్ చెయ్యాలి.ఇక్కడితో e-పంట నమోదు ప్రక్రియ పూర్తయినట్లే. వివరాల్లో ఏదైనా తప్పులు ఉంటే, "ఫిర్యాదు అభ్యర్థించండి" పై క్లిక్ చేసి సవరణ చేసుకోవచ్చు. e-పంట వివరాల పరిశీలన: రైతు సమర్పించిన e-పంట వివరాలు సంబంధిత రైతు సేవా కేంద్రం అధికారికి వెళ్తాయి. అక్కడ నమోదు చేసుకున్న వివరాలు సరిగా ఉంటే ఆమోదించడం జరుగుతుంది. వివరాలు సరిగా లేకపోతే తిరస్కరి స్తారు. ఈ వివరాలను రైతు APAIMS App లో చూసుకోవచ్చు. రైతులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు సాగు చేస్తున్న పంటను మాత్రమే నమోదు చేయాలి. నమోదు చేసిన సర్వే నంబర్, సాగు విస్తీర్ణం వంటి వివరాలను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. పంట మార్పు జరిగితే సంబంధిత వివరాలను సకాలంలో సరి చేసుకోవాలి. నమోదు పూర్తయిన తర్వాత వచ్చిన నమోదు వివరాలను భద్రపరచుకోవాలి. నమోదు సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే రైతు సేవా కేంద్రంలోని గ్రామ వ్యవసాయ సహాయకులను లేదా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. “పంట వివరాలను సకాలంలో, సక్రమంగా నమోదు చేసుకోండి ప్రభుత్వ పథకాలు, సేవలకు అర్హత పొందండి". ఆధారం: పాడిపంటలు మాసపత్రిక