పంటల బీమా ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఎల్ నినో ప్రభావం గణనీయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పంటల బీమా పథకం పంటలకు తగిన రక్షణ ఇచ్చి రైతులకు పూర్తి భరోసా కల్పిస్తుంది. ప్రస్తుత ఖరీఫ్ లో నష్టాల నుంచి కొంతైనా బయటపడవచ్చు. బీమా కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. రైతులు తమ మొబైల్ ఫోన్ లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని నమోదు చేసుకోవచ్చు. పిఎంఎఫ్ బై పోర్టల్ లోను చేయవచ్చు. రాష్ట్రంలోని రైతులకు పంటల భద్రత కల్పించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY), పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (RWBCIS)లను 2026-27 సంవత్సరానికి (ఖరీఫ్-2026, రబీ 2026-27) మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంటల బీమా పథకాల ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర అనుకోని కారణాలతో పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. ఖరీఫ్-2026 సీజన్ లో నోటిఫై చేసిన ప్రాంతాల్లో నోటిఫై చేసిన పంటలను సాగు చేస్తున్న యజమాని రైతులు, కౌలు రైతులు, భాగస్వామ్య సాగుదారులు, అందరూ పథకంలో నమోదు చేసుకోవచ్చు. రైతులు ఇవి గమనించాలి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద ఖరీఫ్-2026 సీజన్ లో వరి మినహా అన్ని నోటిఫై చేసిన పంటలకు నమోదు గడువు జూలై 31. వరి పంటకు నమోదు గడువు ఆగస్టు 15.పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (RWBCIS) కింద ఖరీఫ్-2026 సీజన్ లో అన్ని నోటిఫై చేసిన పంటలకు నమోదు గడువు జూలై 15. రుణం పొందిన రైతులు ఈ పథకం నుంచి వైదొలగాలనుకుంటే నమోదు గడువుకు కనీసం ఏడు రోజుల ముందుగా ఆప్ట్-అవుట్ ప్రకటన సమర్పించాల్సి ఉంటుంది. బీమా చేసిన పంటలలో మార్పులు చేసుకోవాలనుకుంటే ప్రీమియం డెబిట్ కు రెండు పనిదినాల ముందే సంబంధిత సమాచారాన్ని అందించాలి. బ్యాంకులు ప్రీమియం చెల్లించి నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ (NCIP) లో వివరాలను నమోదు చేయడం సహా సీజనాలిటీ నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులు, తీసుకోని వారు ప్రీమియం కట్టవచ్చు. గతంతో పోలిస్తే ప్రీమియం తక్కువేనని చెప్పవచ్చు. రైతులు సొంతంగా చెల్లిస్తే వెంటనే రశీదు వస్తుంది. పంటలకు బీమా రక్షణ లభిస్తుంది. పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (RWBCIS) లో అనంతపురం, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, నంద్యాల, బాపట్ల, అనకాపల్లి, ప్రకాశం, ఏలూరు, కర్నూలు జిల్లాలకు జూలై నెలాఖరు వరకు గడువు ఉంది. యాప్ ఉంటే తేలికే పీఎంఎఫ్ వై పోర్టల్ ఓపెన్ చేసి ఆధార్ నెంబరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ పీఎంఎఫ్ వై యాప్ డౌన్ లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేసుకోవాలి. ఒకసారి నమోదైతే అందులో మీ భూమి ఎక్కడెంత విస్తీర్ణంలో ఉందనే వివరాలు కనిపిస్తాయి. అందుకు అనుగుణంగా సాగు చేసిన పంటల్ని ఎంపిక చేసుకుని నిర్ణీత ప్రీమియం చెల్లించవచ్చు. ఏ పంట సాగు చేశారో ఆ మేరకు రైతు దృవీకరణ ఇవ్వాలి. ఈ-పంట సమయంలో అవి సరిపోలాలి. పొలం ఖాళీగా ఉన్నా సాగు చేసిన పంట వేరుగా ఉన్నా తిరస్కరిస్తారు. రైతులు తాము సాగు చేస్తున్న పంటలనే నమోదు చేసి ప్రీమియం చెల్లించాలి. నమోదుకు మార్గాలు రైతులు వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు (శాఖల ద్వారా), కామన్ సర్వీస్ సెంటర్లు (CSC/CSC-VLE), ఎంపికైన బీమా కంపెనీలు, వాటి అధీకృత మధ్యవర్తులు లేదా ఏజెంట్లు, నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ (pmfby.gov.in), క్రాప్ ఇన్సూరెన్స్ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. CSC కేంద్రాల ద్వారా నమోదు చేసుకునే రైతులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించనక్కర్లేదు. అగ్రిస్టాక్ ఫార్మర్ ఐడి, ఈ-పంట దృవీకరణ తప్పనిసరి కేంద్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు 2026-27 సంవత్సరానికి PMFBY, RWBCIS పథకాలలో నమోదుకు అగ్రిస్టాక్ ఫార్మర్ రిజిస్ట్రీ కింద చెల్లుబాటయ్యే ఫార్మర్ ఐడి తప్పనిసరి. ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం నుంచి మినహాయింపు ఉత్తర్వులు అందేవరకు ఫార్మర్ ఐడి నిబంధన మేరకే నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. రైతుల నమోదు వివరాలను ప్రస్తుత సీజన్ ఈ-పంట (డిజిటల్ క్రాప్ సర్వే) వివరాలతో దృవీకరించే విధానం కూడా 2026-27 సంవత్సరానికి కొనసాగుతుంది. రైతు చెల్లించాల్సిన మిగిలిన ప్రీమియం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సరి సమానంగా ప్రీమియం సబ్సిడీ బీమా కంపెనీలకు చెల్లిస్తాయి. ఖరీఫ్, రబీ పంటకాలాల్లో క్రింది పంటలను బీమా పథకంలో చేర్చడం జరిగింది. దిగుబడిఆధారిత పథకం (PMFBY) వాతావరణఆధారిత పథకం (RWBCIS) ఖరీఫ్ రబీ ఖరీఫ్ రబీ వరి వరి వేరుశనగ జీడి మామిడి సజ్జ జొన్న పత్తి టమాటా జొన్న మొక్కజొన్న టమాటా - మొక్కజొన్న రాగి నిమ్మ - కొర్ర పెసర దానిమ్మ - రాగి మినుము బత్తాయి - పెసర వేరుశనగ అరటి - మినుము నువ్వులు - - కంది ప్రొద్దుతిరుగుడు - - వేరుశనగ శనగ - - నువ్వులు రాజ్మా - - ఆముదం మిర్చి - - మిర్చి ఉల్లి - - పసుపు - - - ఆధారం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ