అధిక సాంద్రత పత్తి సాగు తర్వాత కొర్ర సాగు చేసి అధిక ఆదాయం పొందిన రైతు విజయగాథ సిద్దిపేట జిల్లా, జగదేవపూర్ మండలం ఆలీరాజపేట్ గ్రామానికి చెందిన రాచమల్ల కిష్టయ్య అనే రైతు 3 ఎకరాల నల్లరేగడి భూమిలో పత్తి సాగు చేస్తున్నాడు. రైతు పత్తిపంటను సాధారణ పద్ధతిలో సాగు చేసినపుడు పత్తిలో గులాబీ రంగు పురుగు, చిడపీడల ఉధృతి ఎక్కువగా ఉండటం, పెట్టుబడిఎక్కువ అవ్వడం వలన ఆశించినంత దిగుబడి సాదించలేకపోయారు. పత్తి తర్వాత మొక్కజొన్నను సాగు చేసేవాడు. మొక్కజొన్నలో అధికఎరువుల, నీటి వినియోగం, చీడపీడల ఉదృతి గమనించారు. దీని నివారణకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, సిద్దిపేట శాస్త్రవేత్తలను సంప్రదించినపుడు గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించడానికి రైతు అధిక సాంద్రత పత్తి వేసి, ఆ మోళ్ళను భూమిలో కలియదున్ని కొర్ర సాగు చేయమని సలహా ఇచ్చారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, సిద్దిపేట శాస్త్రవేత్త సలహా మేరకు రైతు పత్తి మోళ్ళను రోటవేటార్ తో భూమిలో కలియదున్ని తక్కువ పంటకాలం, ఎలాంటి ఎరువులు, పురుగు మందులు వాడకుండా సేంద్రియ పద్దతిలో తనకున్న 3 ఎకరాలలో ఒక ఎకరం కొర్ర సాగు చేసారు. పత్తి అవశేషాలను మట్టిలో కలియదున్ని దుక్కిలో వర్మీకంపోస్ట్ ఎరువు ఎకరానికి రెండు బ్యాగులు (100 కిలోలు) చల్లుకున్నాడు. డిసెంబర్ చివరి వారంలో కొర్ర విత్తనాన్ని (2 కిలోలు) చల్లుకుని డ్రిప్ ఏర్పాటు చేసున్నారు. డ్రిప్ ద్వారా 2-3 తడులు ఇచ్చుకున్నారు. విత్తనం మొలకెత్తిన 30 రోజుల తర్వాత పైపాటుగా జీవామృతంను చల్లుకున్నారు. 90 రోజులలో పంట చేతికందింది. కొర్ర సాగు చేయడానికి రైతుకు ఒక ఎకరానికి పెట్టుబడి 14,620 రూపాయలు ప్రాసెసింగ్ తో కలిపి ఖర్చు అయింది. రైతుకు ఎకరానికి 4.5 క్వింటాళ్ళ చొప్పున దిగుబడిని పొందారు. కోర్రను ప్రాసెసింగ్ చేసి అమ్మడం వలన ఒక క్వింటాలుకు 12,000 రూపాయల చొప్పున ఎకరానికి 54,000 పెట్టుబడి పోను 39,380 రూపాయల ఆదాయం వచ్చింది. కొర్ర సాగును మొక్కజొన్న పంటతో పోల్చుకున్నపుడు మొక్కజొన్న ఎక్కువ కాలపరిమితి (120 రోజులు) కలిగి ఒక రోజు ఆదాయం 395 రూపాయలు అదే విధంగా కొర్ర తక్కువ కాలపరిమితి (90 రోజులు) కలిగి ఒక రోజు ఆదాయం 437 రూపాయలు, కొర్ర సాగులో తక్కువ నీటి వినియోగం (2-3 తడులు), పురుగు తెగుళ్ల ఉధృతి తక్కువగా ఉండటం, పెట్టుబడి తక్కువ అధిక ఆదాయం గమనించారు. రైతు అభిప్రాయం: అధిక సాంద్రతపత్తి సాగును డిసెంబర్ మొదటి వారంలో పంటను తీసివేసి, కొర్రను సాగు చేశారు, ఇతనికి రూ.38,880/- ఆదాయాన్ని పొందారు. కావున రైతులు కోర్రను సాగు చేసినట్టైతే తక్కువ పెట్టుబడితో, తక్కువ నీటితో సేంద్రియ పద్ధతిని పాటించి అధిక ఆదాయం పొందవచ్చునని, రైతులందరూ కోర్ర పంటను సాగు చేయాలనీ కోరారు. కొర్ర సాగు, మొక్కజొన్న సాగు వివరాలు (ఒక ఎకరాకు) వివరాలు కొర్ర సాగుకు అయ్యే ఖర్చు(రూ./ఎకరా) మొక్కజొన్న సాగుకు అయ్యే ఖర్చు(రూ./ఎకరా) నేల తయారీ 3000/- 4000/- విత్తన ఖర్చు 120/- 1800/- ఎరువులు 1000/- 4600/- విత్తడానికి నేరుగా విత్తు 1000/- కలుపు యాజమాన్యం - 1800/- పురుగు మందులు - 1800/- పురుగుమందు పిచికారీ ఖర్చు - 1000/- జీవామృతం 1000/- - కోత ఖర్చులు 2500/- 5600/- నీటి పరుదల ఖర్చు 1000/-(2–3 తడులు ) 3000/-(8–9 తడులు) ప్రాసెసింగ్ ఖర్చు 6000/- - మొత్తం సాగు ఖర్చు 14620/- 24600/- గింజ దిగుబడి(క్వి./ఎకరానికి) 4.5(6.0-ప్రాసెసింగ్ ముందు) 36.0 స్థూల ఆదాయం 54,000/- 72000/- నికర ఆదాయం 39,380/- 47400/- నికర ఆదాయం :ఖర్చు నిష్పత్తి 2.69 1.92 పంట కాలం 90 రోజులు 120 రోజులు ఒక రోజు ఆదాయం 437/- 395/- ఆధారం: వ్యవసాయ పాడిపంటలు సిహెచ్. పల్లవి. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, సిద్దిపేట.