జల సంరక్షణ విజయగాథ ఈనాడు సండే స్పెషల్‌లో 'వారు నీటిని సాధించారు' అనే శీర్షిక ఆధారంగా, టైమ్స్ ఆఫ్ ఇండియా అసోసియేటెడ్ ఆర్టికల్‌లో 'హాల్‌మా' అనే ఫిబ్రవరి 07, 2023 ఆధారంగా మధ్య ప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్, ఝబువా జిల్లాలో నివసించే భిల్ గిరిజనులు 'హాల్‌మా' అనే ప్రాచీన సాంప్రదాయ ఆచారంతో సాధించిన జల సంరక్షణ విజయగాథ అందరికీ స్ఫూర్తిదాయకమైనది. భారత రాష్ట్రపతి సైతం కొనియాడిన ఈ 'హాల్‌మా' సాంప్రదాయం నేటితరం జల సంరక్షణకు ఒక దిక్సూచిగా నిలిచింది. 2009లో మాజీ లోక్‌సభ స్పీకర్ శ్రీమతి సుమిత్ర మహాజన్ 40,000 గిరిజనులు హాథీపావ కొండల వద్ద జరిగిన చారిత్రాత్మక భారీ జల సంరక్షణ శ్రమదాన్ ఉత్సవంలో స్వయంగా పాల్గొన్నారు. ఇది ఒక ప్రజాభాగస్వామ్యానికి నిదర్శనం, పర్యావరణానికి ఆదర్శంగా నిలిచారని ఆ గిరిజనుల విజయాన్ని ప్రశంసించారు. హాల్‌మా విధానం అంటే గిరిజన సంస్కృతిలో ఒకరికి ఒకరు సహాయం చేసుకునే అద్భుతమైన సాంప్రదాయం. ఉమ్మడిగా గ్రామ సమస్యలు, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకునే శ్రమదాన ప్రక్రియ. అలీరాజ్‌పూర్, ఝబువా ప్రాంతాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఉండేది. వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఆ సమస్యను అధిగమించడానికి వేలాదిమంది గిరిజనులు 'హాల్‌మా' సాంప్రదాయంతో చేతులు కలిపి తమ తమ సాంప్రదాయ ఆయుధాలైన పారలు, గడ్డపారలు పట్టుకుని కొండల చుట్టూ లక్షలాది కాంటూర్ ట్రెంచ్‌లు (నీటి గుంతలు) తవ్వారు. వర్షపు నీటిని భూమిలోని ఇంకించుకున్నారు. వేలాది చెరువులను పునరుద్ధరించారు. ఒకే లక్ష్యం 'నీటిని నిలుపుదాం - నేలను కాపాడుదాం - గ్రామాన్ని బ్రతికిద్దాం'. ఈ సామూహిక ప్రయత్నం వల్ల కొన్ని వందల గ్రామాల్లో భూగర్భజల మట్టం పెరిగింది. ఎండిపోయిన బావులు, చేతి పంపులు మళ్ళీ జీవం పోసుకున్నాయి. వలస వెళ్లే గిరిజనులు తిరిగి తమ సొంత భూముల్లో వ్యవసాయం చేసుకోవడం ప్రారంభించారు. ఒక పంట నుంచి రెండు పంటలు పైగా ఐదుగులు వేయగలుగుతున్నారు. కేసరిపురా గ్రామం హాల్మాకు తాజా ఉదాహరణ 2026లో ఝబువా జిల్లాలోని పెట్లావాడ్ ప్రాంతంలోని కేసరిపురా గ్రామంలో చెరువులు పునరుద్ధరణకు గ్రామస్థులంతా సామూహికంగా మహిళలు, పురుషులు, యువత, పిల్లలు పాల్గొని చెరువులోని మట్టిని తొలగించి, కలుపును శుభ్రపరిచి, కట్టలను బలోపేతం చేసుకున్నారు. తమ గ్రామ సమస్యలను తామే ఐక్యంగా పరిష్కరించుకోవచ్చని ఆత్మవిశ్వాసం పెరిగింది. తెలంగాణకు కూడా ఒక స్ఫూర్తి హాల్‌మా సంప్రదాయం తెలంగాణ గ్రామాలకు కూడా ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది. మన గ్రామంలో కూడా 'మన ఊరు - మన నీరు - మననేల' అనే భావనతో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఎక్కడ పడిన వర్షపు నీటిని అక్కడే 'ఆపుదాం - మలుపుదాం - నిలుపుదాం' అనే ఆమని వాటర్‌షెడ్ సూత్రాన్ని ప్రజాఉద్యమంగా మార్చుకుంటూ నేటి నీటి సంరక్షణ బాధ్యతే రేపటి ఆహార భద్రతకు పునాదిగా ముందుకు సాగుదాం. ఆధారం: వ్యవసాయ పాడిపంటలు