ఆకు కూరలు - పోషక సిరులు

ఆకు కూరగాయలు మన రోజువారీ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆహారం. అవి మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాలను అందిస్తాయి. ఆకు కూరగాయలు తక్కువ ధరకు దొరికే అద్భుతమైన పోషక వనరులు. ఒక్కో ఆకు కూర ఒక్కో విధంగా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొన్ని రక్తాన్ని శుద్ధి చేస్తాయి, కొన్ని ఎముకలను బలపరుస్తాయి, మరికొన్ని కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఈ సహజమైన ఆహారాన్ని రోజూ తినడం వల్ల మందులపై ఖర్చు తగ్గుతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.రైతుల దృష్టిలో చూస్తే, ఆకు కూరగాయలు త్వరగా పెరిగే, తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం ఇచ్చే పంటలు. వీటిని పండించడానికి ఎక్కువ భూమి అవసరం లేదు చిన్న తోటలో, ఇంటి పెరట్లో కూడా పెంచవచ్చు. మార్కెట్లో ఆకు కూరగాయలకు ఎప్పుడూ డిమాండ్ ఉంది.

పాలకూర

పది సెంట్ల భూమి ఉంటే చాలు పాలకూరతో కుటుంబానికి ఆరోగ్యం, జేబులో డబ్బు రెండూ సాధ్యమే. విత్తనాలు చల్లిన ఆరు వారాల్లోనే కోతకు వస్తుంది. వేసవి తప్ప మిగతా అన్ని నెలల్లో వేయవచ్చు. ఒకే పొలంలో మూడు నాలుగు కోతలు కోయవచ్చు.నల్లరేగడి, ఎర్రమట్టి నేలు సరైనవి. 10-12 రోజులకు ఒకసారి నీరు పారించాలి. యూరియా తక్కువ, వర్మీకంపోస్ట్ ఎక్కువ వాడాలి. నీరు నిల్వ ఉంచరాదు. 6-8 వారాల్లో మొదటి కోతకు వస్తుంది.

పోషక సంపద : ఇనుము పుష్కలంగా ఉండి రక్తహీనత, అలసట పోగొడుతుంది. గర్భిణీ స్త్రీలు, పిల్లలకు అత్యంత ఉపకారి విటమిన్ K ఉంది. ఎముకలు బలంగా వుండేలా చేస్తుంది, రక్తం ఆగందుకు సహాయ పడుతుంది.విటమిన్ A వల్ల కంటి చూపు బాగుంటుంది. ప్రోటీన్లు శరీర కండరాలను పటిష్టంగా ఉంచుతాయి.

తోటకూర

30 రోజుల్లోనే కోత వేగంగా వచ్చి దిగుబడి ఇచ్చే కూర. కోత సమయంలో మొక్కను నేల నుంచి 10 సెం.మీ. వదిలి కోస్తే మళ్ళీ 15-20 రోజుల్లో తిరిగి పెరిగి కోతకు వస్తుంది. ఒక పంటలో 5-6 కోతలు వేయవచ్చు. అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. 4-5 రోజులకు ఒకసారి నీరు పెడితే సరిపోతుంది. ఎర్ర తోటకూర వేసవిలో బాగుంటుంది. 30 రోజుల్లో మొదటి కోతకు వస్తుంది. 10 సెం.మీ. వదిలి కోస్తే మళ్ళీ పెరుగుతుంది.

పోషక సంపద : కాల్షియం పాలలో కంటే ఎక్కువ. పిల్లలు వృద్ధులకు ఎముకలకు బలం చేకూరుస్తుంది.♦ ఇనుము అధికంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు వైద్యులు సిఫారసు చేస్తారు. విటమిన్ C శరీరానికి రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. ప్రోటీన్ పరిమాణం అనేక కూరగాయలకంటే ఎక్కువ శాకాహారులకు శ్రేష్టమైన పోషక మూలం.

మెంతికూర

మెంతికూర ఒక అద్భుతమైన ఔషధ మొక్క. చక్కెర వ్యాధి ఉన్న వారికి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వారికి, నోరు చేదుగా అనిపించినా ఈ మెంతికూర తింటూ ఉంటే మేలు చేస్తుంది. డ్రై మెంతి ఆకులు (కస్తూరి మెంతి) నిల్వ చేసి అమ్ముకుంటే మరింత ఆదాయం వస్తుంది. ఎర్ర నేలలు, నల్ల రేగడి నేలల్లో పెరుగుతుంది. వారానికి ఒక తడి సరిపోతుంది. మురుగు బోయే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.

పోషక సంపద : చక్కెర వ్యాధి ఉన్న వాళ్లకు రక్తంలో చక్కెర తగ్గిస్తుంది. ఇనుము, కాల్షియం బాలింతలకు మేలు జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. కడుపు నొప్పి, అజీర్ణం తగ్గుతుంది. పొటాషియం గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రిస్తుంది.

గోంగూర

ఆంధ్ర అంటేనే గోంగూర అని ప్రపంచం గుర్తిస్తుంది. గోంగూర పులుపు వల్ల అందరూ తింటారు. కానీ ఆ పులుపు వెనక ఎంత పోషణ దాగి ఉందో తెలుసా? గోంగూర పచ్చడి తయారు చేసి అమ్మగలిగితే రైతుకు రెట్టింపు ఆదాయం. ఎటువంటి నేలల్లోనైనా పెరుగుతుంది.

పోషక సంపద : విటమిన్ C రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇనుము రక్తహీనత తగ్గుతుంది. ఫోలిక్ యాసిడ్ గర్భిణీ స్త్రీలలో శిశువు మెదడు అభివృద్ధికి అవసరం. కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలు పటిష్టంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరంలో మంట తగ్గుతుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.

బచ్చలికూర

కొమ్మ ముక్కలు (కటింగ్స్) నేలలో నాటితే చాలు విత్తనాలు అవసరమే లేదు. ఇది వేసవి కాలంలో ఆకు కూరల కొరత ఉన్న సమయంలో మంచి ధరకు అమ్ముడవుతుంది. పందిరి వేసి పెంచితే నీడలో పెరిగిన ఆకులు నాణ్యంగా ఉంటాయి, మంచి ధర వస్తుంది.

పోషక సంపద : పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థకి, ఆరోగ్యానికి మంచిది. మలబద్ధకం పోతుంది. ఇనుము అధికంగా ఉండి రక్తహీనత సమస్యలకు మంచి పరిష్కారం విటమిన్ A కంటి ఆరోగ్యం కాపాడుతుంది. కాల్షియం వలన ఎముకలు బలంగా ఉంటాయి.

కరివేపాకు

కరివేపాకు లేని తెలుగు వంట అసంపూర్ణం. పోపు వేసినప్పుడు ఆ వేడి నూనెలో కరివేపాకు వేస్తే వచ్చే సువాసన మన బాల్యపు వంటింటి జ్ఞాపకం. ఈ చిన్ని ఆకులు వంటకానికి రుచి ఇవ్వడంతోనే ఆగవు. ఇవి ఒంటికి అద్భుతమైన ఔషధ గుణాలు కూడా అందిస్తాయి. కరివేపాకు చెట్టు ఒక్కసారి నాటితే 20-30 సం||లు ఆదాయం ఇస్తుంది.ఈ ఆకుల్లో దాగిన పోషకాలు అద్భుతం. కరివేపాకు ఆకులు ఎండలో ఆరబెట్టి పొడి చేసి అమ్ముకోవచ్చు. కొమ్మలు కత్తిరించకుండా ఉంటే ఆకులు ఎక్కువ. ఏ నేలలోనైనా పెరుగుతుంది.

పోషక సంపద : విటమిన్ A కంటి చూపు బావుంటుంది. జుట్టు రాలడం ఆవుతుంది ఆకుల్లో పోషకాలు జుట్టు వేర్లను బలపరుస్తాయి. చర్మ ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణకు మేలు. ఐరన్, కాల్షియం రక్తం, ఎముకలు బలంగా ఉంటాయి. పండించే ప్రతి ఆకుకూర ఒక ఔషధం, ఒక ఆదాయం.

ఆధారం : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ