సహజ ఔషధ భాండాగారం ఆగాకర ఆగాకర ఒకసారి నాటితే చాలా సంవత్సరాల వరకు పంటను తీసుకోవచ్చు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఎతైన కొండ ప్రాంతాలలోను, అడవులలోనూ పెరుగుతుంది. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మహారాష్ట్రాలలో అటవీ ప్రాంతాలలో పండుతుంది. మన రాష్ట్రంలో అటవీ ప్రాంతాలలో స్వయంసిద్ధంగా పెరుగుతుంది. గిరిజనులు అటవీ కొండ ప్రాంతాల నుండి వీటిని వర్షాకాలంలో సేకరించి దగ్గరలోని సంతలలో, పట్టణాలలో అమ్ముకుంటారు. ఈ మధ్యకాలంలో ఉభయ గోదావరి జిల్లాలలోని రైతులు ఈ ఆగాకర సాగును ఎక్కువ విస్తీర్ణములో చేబడుతున్నారు. ఈ కూరగాయ పెద్ద పట్టణాల్లో అధిక ధర పలుకుతుంది. ఆగాకర బహువార్షికం. తీగలా ప్రాకుతుంది. దీనిలో మగ, ఆడ మొక్కలు విడివిడిగా ఉంటాయి. వేరు మొదటి భాగం చిలగడ దుంప మాదిరిగా లావుగా తయారవుతుంది. ఆకులు దొండ ఆకు ఆకారంలో ఉంటాయి. పూలు పసుపు రంగులో ఉండి, కాయల మీద మృదువైన ముళ్ళు ఉంటాయి. పచ్చికాయ ఆకుపచ్చ రంగులో పండిన కాయ నారింజ రంగులో ఉండి, గింజలుఎర్రని గుజ్జులో పొదిగి ఉంటాయి. లేత కాయలను కూరగాయగా వాడుతారు. పండిన కాయలు కూరకుపనికిరావు. ఆగాకర వేరు దుంపలను జీర్ణ, మూత్ర వ్యవస్థ సంబంధిత రోగాల నివారణకోసం వాడుతారు. గింజల నుండి వచ్చే నూనెను పెయింట్ లలో, వార్నిష్ పరిశ్రమలలో వాడుతారు. రకాలు : ప్రత్యేకమైన రకాలు ఇంకా గుర్తింప బడలేదు. ఏతీగనుండిసుమారు రెండు కిలోల వరకు దిగుబడివస్తే దానిని మంచి రకంగా ఎన్నుకొని, ఆ తీగ నుండి దుంపలను సేకరించి నాటుకోవచ్చు. వాతావరణం : అధిక వర్షపాతం, అధిక తేమతో కూడిన వాతావరణం ఆగాకర సాగుకు మిక్కిలి అనుకూలం. మన రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని అటవీ ప్రాంతాలు, ఎత్తయిన కొండ ప్రాంతాలు అనువైనవి. నేలలు : ఎర్ర నేలలు, సారవంతమైన ఇసుక నేలలు అనుకూలం. కొండల మీద కొద్దిపాటి లోతు గల రాళ్ళతో కూడిన ఎర్రనేల లందు కూడా సాగుచేయవచ్చు. విత్తనం : పూత సమయంలో తీగలను గమనించి, బాగా కాసే ఆడమొక్కల నుండి దుంపలను సేకరించి నాటుకుంటే మంచిది. పండిన కాయల నుండి విత్తనాలను సేకరించి విత్తుకోవచ్చు. అంతేకాక వచ్చిన మొక్కలలో మూడు వంతులు మగ మొక్కలు, ఒక వంతు మాత్రమే ఆడ మొక్కలు వస్తాయి. కనుక ఎకరాకు సుమారు 8-10 కిలోల విత్తనం అవసరమవుతుంది. బలిష్టంగా ఎదిగిన ఆడ తీగల నుండి 5 కణుపులు గల బలమైన తీగలను కత్తిరించి వాటి కొనలను సెరడెక్స్- బి హార్మోన్ పొడిలో ముంచి, ఎత్తైన నారుమళ్ళలో నాటితే, వేర్లు తొడుగుతాయి. నాటిన సంవత్సరంలో వాటి వేరు దుంపగా మారిన తర్వాత మరుసటి సంవత్సరం జూన్ లో పొలంలో నాటుకోవాలి. నాటే సమయం విత్తనాలు అయితే మే చివరి వారంలో విత్తుకుంటే 40-45 రోజులకు మొలకెత్తుతాయి. అదే దుంప లైతే జూన్ మొదటి పక్షంలో నాటుకోవాలి. గుంతను పశువుల ఎరువు, భాస్వరం, పొటాష్ ఎరువులతో నింపి, మధ్యలో దుంపను పెట్టి కాండం పైభాగం భూమికి సమాంతరంగా ఉంచి, మట్టి నింపి గట్టిగా అదమాలి. ఆ తర్వాత గడ్డితో నేలను కప్పి నీరు ఇస్తే తేమ ఆరకుండా ఉండటమేకాక, మొలక బాగా వస్తుంది. ప్రతి 10 ఆడ మొక్కలకు ఒక మగ మొక్కను తప్పని సరిగా నాటుకోవాలి. ఎరువులు ఎకరాకు 8-10 టన్నుల పశువు ఎరువు, 32-40 కిలోల భాస్వరం, 16-20 కిలోల పొటాష్ ను ఇచ్చే ఎరువులతో గుంతలు నింపాలి. నత్రజని ఎకరాకు 32-40 కిలోల చొప్పున మూడు సమ భాగాలు చేసి నాటిన 15, 30, 45 రోజులకు వేసి నీరు పారించాలి.అంతర కృషి: మొదటి 45 రోజుల వరకు కలుపులేకుండా జాగ్రత్త పడాలి. దొండమాదిరిగా ఈ తీగలకు కూడా తప్పనిసరిగా పందిరి వేయాలి. అందువల్ల పండు ఈగ బెడద తగ్గడమేకాక, నాణ్యమైన అధిక దిగుబడులు వస్తాయి. కాయకోత, దిగుబడులు ఆగస్టు చివరి వారం నుంచి అక్టోబర్ చివరి వరకు కాయలు కాస్తాయి. కాయలను వారానికి 2-3 సార్లు కోయాలి. కాయలు కోసేటప్పుడు తీగలు తెగకుండా జాగ్రత్త పడాలి. సాధారణ వాతావరణంలో కూడా కాయలు 3– 4 రోజుల వరకు నిలువ ఉంటాయి. దిగుబడి మొదటి సంవత్సరం 8-10 క్వింటాళ్ళు/ఎకరాకు మార్కెటింగ్: వెదురుబుట్టలలో అడుగున ఎండుగడ్డిని పరిచి ఆ తర్వాత కాయలతో నింపి, ఆపైన తడి గోనె సంచితో ప్యాకింగ్ చేసి దూరప్రాంతపు మార్కెట్లకు రవాణా చేసుకోవచ్చు. కాపు అనంతరం జాగ్రత్తలు అక్టోబర్ తర్వాత తీగలు ఎండిపోతాయి. వీటికి నీరు ఇవ్వకుండా అలానే ఉంచితే నిద్రావస్థలో భూమిలో దుంపలు ఉండిపోతాయి. మళ్లీ జూన్ లో తొలకరి వర్షాలకు లేదా నీరు పెట్టినప్పుడు, దుంపల నుంచి తీగ పెరుగుదల ప్రారంభమవుతుంది. మళ్లీ ఎరువులు వేసి నీరు ఇస్తే ఇంకో పంట వస్తుంది.రెండు మూడేళ్ల తర్వాత తల్లి వేరు దుంప నుంచి ఇంకొన్ని పిల్ల దుంపలు వస్తాయి. వీటిని వేరు చేసి విడిగా నాటడానికి పయోగించవచ్చు లేదా విత్తనం అమ్ముకుని రైతులు అదనపు రాబడి పొందవచ్చు. జాగ్రత్తలు : తప్పనిసరిగా ప్రతి 10 ఆడ మొక్కలకు ఒక మగ మొక్క చొప్పున నాటుకోవాలి. మగపూల నుంచి సేకరించిన పుప్పొడిని మెత్తటి బ్రష్ తో ఆడపూల పై అద్దితే ఎక్కువ కాయ దిగుబడి వస్తుంది. వర్షాకాలంలో వర్షపాతం తక్కువైనప్పుడు 10 రోజులకొకసారి తేలికపాటి తడులు ఇవ్వాలి. ఆగాకర ఉపయోగాలు డయాబెటిస్ ఉన్న రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వృద్ధాప్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వాడకం కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అదనపుచెమట పట్టడమును తగ్గిస్తుంది (హైపర్ హైడ్రోసిస్). ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన జీర్ణక్రియ సులభతరం అవుతుంది. పాలిచ్చే తల్లులు ఈ కూరగాయలను తినడంవల్ల శిశువులలో వాంతులు తగ్గుతాయి. ఫైటోన్యూట్రియంట్లు ఎక్కువుగా ఉంటాయి మరియు కేలరీలు తక్కువగా ఉంటాయి.* మూత్రపిండాల్లో రాళ్లను కూడా తొలగిస్తుంది. ఆహారంలో ఉపయోగించడం వల్ల దగ్గు సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. శ్వాస సమస్యలను తగ్గిస్తుంది. ప్రతి 100 గ్రా. ఆగాకరలో 72 mg ఫోలేట్ లభిస్తుంది. ఇది నవజాత శిశువులలో న్యూరల్ ట్యూబ్ లోపం యొక్క అవకాశాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆధారం: పాడిపంటలు మాసపత్రిక డా.జి.క్రాంతిరేఖ శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం) ఉద్యాన పరిశోధనా స్థానం, లాం, గుంటూరు