ఆరోగ్య ఫలం ఉసిరి సమగ్ర సస్యరక్షణతో సిరి ఉసిరి ఉష్ణమండల, వర్షాధార పంటగా మెట్ట ప్రాంతాల్లో పండించే పంట. ఉసిరి పంట 46 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు తట్టుకోగలదు. మంచి దిగుబడికి పూత దశలో అధిక ఉష్ణోగ్రత, కాయ దశలో తేమ అవసరం. అయిదారేళ్ళ చెట్ల నుంచి 50 కిలోల దిగుబడి వస్తుంది. 100 గ్రా. గుజ్జులో 788 మి.గ్రా, విటమిన్ 'సి' ఉంటుంది. మొక్కల ఎంపిక దశ నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకర మైన మొక్కలతో పాటు మంచి దిగుబడులు సాధించవచ్చు. ఎరువుల యాజమాన్యంలో భాగంగా ఒక చెట్టుకి ఒక సంవత్సరానికి 100 గ్రాముల నత్రజని, 50 గ్రాముల భాస్వరం, 100 గ్రాముల పొటాష్ నిచ్చే ఎరువులను అందించుకోవాలి. వీటితో పాటు 15 కిలోల పశువుల ఎరువును కూడా అందించాలి. అంతరపంటలు ఉసిరిలో వేరుశనగ, అలసంద, అశ్వగంధ, నేలవేము వంటి వివిధ పంటలను అంతర పంటలుగా ఎనిమిదేళ్ల వయసు వచ్చే వరకు వేసుకోవచ్చు. మన రాష్ట్రంలో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పిందె ఏర్పడుతుంది. పిందె ఏర్పడిన తర్వాత 120 నుంచి 130 రోజుల వరకు నిద్రావస్థలో ఉంటుంది. ఈ దశలో పాదులు చేయడం, దున్నడంవంటివి చేపట్టకూడదు. తొలకరి చినుకులు పడ్డ తర్వాత కాయలు నిద్రావస్థను వీడి పెరగడం మొదలై, అక్టోబర్ నాటికి పక్వానికి చేరుతాయి. పూత దశలో ఒకసారి, గోళీ సైజు కాయ ఉన్నప్పుడు ఒకసారి 1 శాతం బోరాన్ మిశ్రమాన్ని కాయలు తడిచేలాగా పిచికారీ చేస్తే కాయ రాలడం తగ్గిపోతుంది. ఐదేళ్ల చెట్టు నుంచి 40 నుంచి 50 కిలోలు, ఏడేళ్ల చెట్టు నుంచి 70-80 కిలోలు, పదేళ్ళ చెట్టు నుంచి 100-150 కిలోల వరకు దిగుబడిని పొందవచ్చు. సస్యరక్షణ బెరడు తొలుచు పురుగు ఇవి కాండంపై బెరడును. తినేయడం వల్ల కాండం, కొమ్మలు చనిపోతూ ఉంటాయి. నివారణకు పురుగు విసర్జితాన్ని తీసేసి, లీటరు నీటికి 2 మి.లీ క్లోరిఫైరిఫాస్ మందును కలిపి రంద్రాలలో వేసి మట్టితోకానీ సున్నంతో కానీ రంధ్రాన్ని మూసేస్తే ఈ పురుగును నియంత్రించవచ్చు తామర పురుగులు ఈ పురుగులు లేత ఆకులు, లేత కొమ్మల పైన రసాన్ని పీల్చివేసి ఒక గార మాదిరి ఏర్పరుస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి 0.25 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ కలిపి చెట్లు మొత్తం తడిచేలా పిచికారీ చేసుకోవాలి. పిండినల్లి చెట్ల లేత భాగాలలో రసాన్ని పీల్చి హాని కలిగిస్తాయి. వీటి నివారణకు నేలను తాకే కొమ్మలను తరుచుగా కత్తిరించుకుంటూ ఉండాలి. అదేవిధంగా వేసవిలో పొలాన్ని దున్నుకో వడం, పాదులు చదును చేసుకుని, పాదులలో 2% ఫాలిడాల్ పొడిని కలుపుకోవాలి. దీంతో పాటు లీటరు నీటికి 2.5 మి.లీ క్లోరిఫైరిఫాస్ కలిపి కొమ్మ మొదలు భాగాలు, చెట్టు మొదలు భాగం, ఆకులు మొత్తం తడిచేట్టుగా పిచికారీ చేసుకో వాలి. ఈ మందులను కాయ కోత దశలో ఉన్నప్పుడు పిచికారీ చేయరాదు. దానికి ప్రత్యా మ్నాయంగా వేప నూనెను 52.5/నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. గాల్ పురుగు ఇది వర్షాకాలంలో కొమ్మల చివరి అంచు భాగాలలో గుడ్లను పెట్టి అక్కడ నుంచి లార్వాలు చెట్టు కొమ్మల్లో పదార్థాన్ని తింటూ కొమ్మలకు హాని కలిగిస్తాయి. నివారణకు లీటరు నీటికి 2మి.లీ. క్లోరిఫైరిఫాస్ కలిపి మొత్తం తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. పేనుబంక ఇది చెట్ల లేత భాగాల్లో, పువ్వు, కాయల్లో రసాన్ని పీల్చి చెట్లకు హాని కలిగిస్తుంది. ఈ పురుగు ముఖ్యంగా పూత, పిందె దశలో వచ్చినట్లయితే నష్టం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి 0.25 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.3 గ్రాముల థయోమిథాక్సాం కలిపి పిచికారీ చేసుకోవాలి. తెగుళ్ళు తుప్పు తెగులు ఈ తెగులు సోకిన ఆకుల పై ప్రథమంగా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, తర్వాత తుప్పు రంగుకు మారిపోతాయి, చేతితో తాకినప్పుడు ఆ రంగు మన చేతికి అంటుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ తెగులు రావడం వల్ల కాయలు పక్వ దశకి చేరే కంటే ముందే రాలిపోతాయి. నివారణకు హెక్సాకొనజోల్ లేదా ప్రొపికొనజోల్ 1 మి.లీ/లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాయకుళ్ళు కాయలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కాయల నుంచి చెడు వాసన వస్తూ ఉంటుంది. దీనిని నివారణకు కాయలను నిల్వ ఉంచే ముందు 2 శాతం ఉప్పు ద్రావణంలో కానీ 1 శాతం బోరాక్స్ మిశ్రమంలో కానీ ముంచి పోయాలి. నల్లమచ్చ తెగులు కాయలు ఏర్పడిన తర్వాత మొదటిగా నల్ల మచ్చలు చిన్నగా ఏర్పడి. క్రమంగా పెద్దవవుతూ వస్తాయి. నివారణకు లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1% బోర్డో మిశ్రమాన్ని తొలకరి చినుకులు పడిన వెంటనే పిచికారీ చేసుకోవాలి. ఫ్రూట్ నెక్రోసిస్ తెగులు ఆశించిన కాయలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపి అవి నలుపుకు మారిపోతాయి. దీనికి ప్రధాన మైన కారణం బోరాన్. పిందె దశలో 3 దఫాలలో 15 రోజుల వ్యవధిలో 2 శాతం బోరాన్ పిచికారీ చేయాలి. సమగ్ర సస్యరక్షణ పాటించి విటమిన్ -సి అధికంగా గల ఉసిరిని సాగు చేసుకోవచ్చు ఆధారం: పాడిపంటలు ,డా.ఎస్.మానస, శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం) కృషి విజ్ఞాన కేంద్రం, ఊటుకూరు, కడప.