తమలపాకు తోట - సంప్రదాయం లోనే సంపద

తమలపాకుభారతీయ సంస్కృతికి ప్రతీక. తమలపాకు మన నాగరికతలో ఒక విడదీయరాని భాగం. పెళ్ళిళ్ళు, పండుగలు, పూజలు, అతిథి సత్కారాలు ఏ శుభకార్యమైనా తమలపాకు లేకుండా సంపూర్ణం కాదు. కేవలం సంప్రదాయానికే కాదు, ఆయుర్వేద వైద్యంలో కూడా తమలపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. కఫా, వాత నివారణకు, నోటి దుర్వాసన పోగొట్టేందుకు, జీర్ణక్రియ మెరుగుపరచడానికి, ఆకలి పెంచడానికి తమలపాకు అనాదిగా వాడుతున్నారు. తమలపాకులో ఉండే ఆయుర్వేద నూనె యాంటిసెప్టిక్ గుణాలు కలిగి ఉంటుంది. బహువిధ ప్రయోజనాల వల్ల తమలపాకు రైతుకు ఒక అత్యంత లాభదాయకమైన ఆదాయ పంటగా నిలిచింది.తమలపాకు ఒక బహువార్షిక తీగ జాతి మొక్క. ఒకసారి నాటితే సంవత్సరాల తరబడి దిగుబడి ఇస్తుంది. మన రాష్ట్రంలో గుంటూరు, కృష్ణా, కర్నూలు, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాలలో రైతులు తమలపాకు పండించి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

తమలపాకు రకాలు

తమలపాకులో ఆకు పరిమాణం, ఆకారం, ఘాటు, సువాసనను బట్టి ముఖ్యంగా మూడు ప్రధాన రకాలు ఉన్నాయి. కర్పూరి రకం, బంగ్లా రకం, మిఠా రకం.

ఈ 3 రకాలలో మళ్ళీ అనేక ఉప-రకాలున్నాయి. మీ ప్రాంతానికి, మీ నేలకు, మీ మార్కెట్కు తగిన రకాన్ని ఎంచుకోవడం దిగుబడి, లాభంపై నేరుగా ప్రభావం చూపుతుంది.

కపూరి : మన ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా సాగయ్యే రకం కర్పూరి, తెల్లాకు పొన్నూరు, తెల్లాకు కడప, కల్లేడు కడప వంటి ఉపరకాలు ఈ కోవకు చెందినవి. ఈ రకపు ఆకులు లేత ఆకుపచ్చ రంగులో మెత్తగా, మృదువుగా ఉంటాయి. కర్పూరి తీగలు ఎక్కువ కణుపులు కలిగి ఉండటం వల్ల ఎక్కువ ఆకులు వస్తాయి, దిగుబడి అధికంగా ఉంటుంది మరియు మార్కేట్లో మంచి ధర పలుకుతుంది. కపూరి రకాలలో స్వర్ణకపూరి రకం మిగిలిన అన్ని రకాల కంటే ఎక్కువ కణుపులు కలిగి అత్యధిక దిగుబడినిస్తుందని పరిశోధనలు నిర్ధారించాయి. ఈ రకం మన రాష్ట్రం రైతులకు అత్యంత శ్రేష్టమైన ఎంపిక.

బంగ్లా రకం : మహారాష్ట్ర, ఒరిస్సా, బెంగాల్, బీహార్, అస్సాం రాష్ట్రాలలో బంగ్లా రకం విస్తరంగా సాగవుతుంది. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఘాటైన రుచి కలిగి ఉంటాయి. కణుపులు తక్కువగా ఉండటం వల్ల దిగుబడి కపూరి కంటే తక్కువగా ఉంటుంది.

మీఠా రకం : (తీపి మరియు సువాసన) : పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ తాలూకాలో ఇది విశేషంగా సాగవుతుంది. కలకత్తా మీఠాపాన్ అని పేరుపొందిన ఈ రకపు ఆకులు తీపిగా, మంచి సువాసనతో ఉంటాయి. ఆకులు ముదురు పచ్చగా ఉండి తక్కువ కణుపులతో తక్కువ దిగుబడి ఇస్తాయి. మన రాష్ట్రంలో తగినంత నీడ కల్పించగలిగినట్లయితే మీఠాపాన్ సాగుచేయవచ్చు. మంచి ధర పలుకుతుంది.

వాతావరణం నేల

తమలపాకు సాగుకు వాతావరణం అత్యంత కీలకమైన అంశం. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండి, భూమిలో తగినంత తేమ కలిగిన ఉష్ణమండల ప్రాంతాలు తమలపాకుకు అత్యంత అనుకూలం. సంవత్సర వర్షపాతం 750 మి.మీ.-1500 మి.మీ. వరకు ఉండి, 10°C-40°C వరకు ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉన్న ప్రాంతాలలో ఆకు దిగుబడి ఎక్కువగా ఉంటుంది.

సాగు విధానం

భూమి తయారీ, అవిశ విత్తడం తమలపాకు సాగుకు అత్యంత ముఖ్యమైన మొదటి అడుగు.భూమి తయారీ, మే, జూన్ నెలల్లో పొలాన్ని బాగా దున్ని, సమం చేసుకోవాలి. ఎకరాకు 16-20 కిలోల అవిశ విత్తనాలను సాలుకు సాలుకు 1 మీటరు దూరం ఉండేలా దట్టంగా విత్తుకోవాలి. అవిశ విత్తనాలను ఉత్తరం నుండి దక్షిణం దిశలో మాత్రమే విత్తుకోవాలి. ఈ దిశ తమలపాకు తీగ పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది.

తీగలు నాటడం

నాటే ముందు శుద్ధి తప్పనిసరి. అవిశ విత్తిన రెండు నెలల తర్వాత సాళ్ళ మధ్య మట్టిని చెక్కి, మట్టిని అవిశ మొదల వద్ద వేసి చిన్న చిన్న బోదెలు చేయాలి. ప్రతి బోదె వద్ద 50 సెం.మీ. లోతు, 20 సెం.మీ. పొడవు, 10 సెం.మీ. వెడల్పుతో గుంతలు తీసి, 20 సెం.మీ. ఎడంతో ఎకరాకు 20వేల తమలపాకు తీగలు నాటుకోవాలి. తీగలను ఆరోగ్యవంతమైన తోటల నుండి 6-8 కణుపులు ఉండేలా ఎంపిక చేసుకోవాలి.నాటే ముందు 0.5% బోర్డో మిశ్రమంతో 15-20 నిమిషాల పాటు తీగలను ముంచి శుద్ధి చేయడం అత్యంత ముఖ్యం. 2-3 కణుపులు నేలలోకి వెళ్ళేలా తీగలను నాటాలి. నాటడానికి ముందే నీటి కాలువలు, మురుగు నీరు పోయే కాలువలు తయారు చేసుకోవాలి. సాలు పొడవు 8-10 మీటర్ల దూరానికి ఒక చిన్న కాలువ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.తీగలు నాటిన వెంటనే మొదటి మూడు రోజులు రెండు పూటలా (ఉదయం + సాయంత్రం) తప్పనిసరిగా నీరు కట్టాలి. తర్వాత మూడు రోజులు రోజుకు సాయంత్రం మాత్రమే నీరు ఇవ్వాలి. 15 నుండి 20 రోజుల వరకు రోజు మార్చి రోజు నీరు పెట్టాలి. తర్వాత స్థిరపడిన తోటకు పది రోజులకు ఒకసారి నీరు ఇస్తే సరిపోతుంది.

బిందు సేద్యం : తమలపాకు సాగులో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నీటిని ఆదా చేయడమే కాకుండా, నీరు నేరుగా మొదలుకు అందటం వల్ల మొదలు కుళ్ళు తెగులు తీవ్రత కూడా తగ్గుతుంది. వర్షాకాలంలో అదనపు నీరు బయటకు పోయేలా మురుగు కాలువలు ఎక్కువ వాలులో ఏర్పాటు చేసుకోవాలి. నీరు నిలవడం తమలపాకు తోటకు ప్రమాదకరం.

తీగలు పాకించడం

పెరుగుదల దశలో శ్రద్ధ చుగురించిన తీగలు పెరగడం మొదలైన ఐదు రోజులకు జమ్ముతో అవిశ మొక్కలకు కట్టి పాకించాలి. ఈ పని ప్రతి 15-20 రోజులకు ఒకసారి చేయాలి. ఒక్కో తీగకు ఒక అవిశ మొక్క ఉండేలా పలుచన చేసుకోవాలి. అవిశ నాలుగు మీటర్ల ఎత్తుకు పెరిగినప్పుడు తలలు తుంచాలి. 4-5 రోజుల సాళ్ళలో ఉంచి ఆకు రాలిన తర్వాత కాడలు తొలగించాలి. అవిశ మొక్కలు విరిగిపోకుండా ఒకదానినొకటి తాడుతో కట్టి, సాలు చివరన వెదురు గద్దెలకు బంధించాలి.

దింపకం

తమలపాకు సాగులో ప్రత్యేకమైన పద్ధతి. దింపకం అంటే తీగను అవిశ కాండం నుండి వేరుచేసి, దిగువన ఉన్న ఆకులు, కొమ్మలు తీసివేసి, తీగను చుట్టలుగా చుట్టి నేలకు తగిలేట్లుగా ఉంచి, చివర 50 సెం.మీ. పొడవు ఉన్న తీగ భాగాన్ని మాత్రమే అవిశ మొక్కకు కట్టి మళ్ళీ పాకించడం. దింపకం అనేది తమలపాకు రైతు నేర్చుకోవలసిన అత్యంత ముఖ్యమైన నైపుణ్యం. సరిగ్గా దింపకం వేస్తే తోట ఆయుష్షు పెరుగుతుంది. నాణ్యమైన ఆకులు దీర్ఘకాలం వస్తాయి.

ఆధారం : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ