పరిమళం, ఆరోగ్యం కలిస్తే ధనియాలు కొత్తిమీరగా ఉన్నప్పుడు సువాసన ఇచ్చి గింజగా మారాక ఆరోగ్యం ఇచ్చే సుగంధ ద్రవ్యం ధనియా. కొత్తిమీర ను దాదాపు అన్ని కూరలు, సాంబారు, రసం తయారీలో వాడతారు. కొత్తిమీర పచ్చడి కూడా చేస్తారు. ఇక ధనియాలు పొడి చేసి మసాలా తయారీలో వినియోగిస్తారు. ఆరోగ్య ప్రయోజనాలు ధనియాల గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఇన్ఫెక్షన్ లను దూరం చేసి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పైత్యం, వికారం, అజీర్తి, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలను నివారిస్తాయి. అనేక చర్మ సమస్యలను తగ్గించడంలో ధనియాలు బాగా పని చేస్తాయి. గజ్జి, చర్మం, దురదలు, దద్దుర్లు, వాపులను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం కూడా తగ్గుతుంది. ధనియాల కషాయాన్ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనియాల్లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. రక్తహీనత సమస్య తొలగిపోతుంది. చర్మ సంబంధిత సమస్యలు తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తిమీరతో కొత్తిమీరలో విటమిన్ ఎ, సి, తో పాటు క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేసే ఫ్లేవనాయిడ్లు కూడా అధికంగా ఉంటాయి. ఖనిజ లవణాలు, ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్త హీనత తగ్గుతుంది. రక్తనాళాల్లో పేరుకు పోయినకొవ్వును శుద్ధి చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గించడంలో కొత్తిమీర ఉపయోగపడుతుంది. మన దేశంలో ఖరీఫ్ (జూన్-జులై), రబీ (అక్టోబర్ – నవంబర్) పంట కాలాల్లో ధనియాలు పండిస్తారు. మధ్యప్రదేశ్ ఈ పంట ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో ఉండగా గుజరాత్, రాజస్థాన్, అస్సాం తర్వాతి స్థానంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా, మిగిలిన జిల్లాల్లోనూ ఈ పంటను పండిస్తున్నారు. ముఖ్యమైన రకాలు సి.ఒ.1, సి.ఒ.2, సి.ఒ.౩, సి.ఒ.( సి.ఆర్) 4, సి.ఎస్ .287, కరణ్, సి.ఐ.ఎం.ఎస్.33, సి.ఎస్. 2, జీ.ఎ.యు. 1, యు.డి.1, యు.డి.2, యు.డి.20, యు.డి.21 ఆధారం: పాడిపంటలు మాసపత్రిక